Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో..

అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై దానం నాగేందర్ మాట్లాడుతూ.. హీరో అల్లు అర్జున్ మా బంధువని తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బాధాకరం అన్నారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం విచారం వ్యక్తం చేస్తున్నా అని తెలిపారు. బెయిల్ దొరకడం సంతోషకరం అన్నారు. అల్లు అర్జున్ జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ల పేర్లును తీసుకెళ్లి మంచిపేరు తెచ్చారని అన్నారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో అన్నారు. అరెస్ట్ కావడం దురదృష్టకరమైన సంఘటనగా నేను భావిస్తున్న అని ఎమ్మెల్యే దానం తెలిపారు. ప్రభుత్వం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదని దానం అన్నారు. కాగా అల్లు అర్జున్ ఈరోజు ఉదయం 6.40 గంటలకు చంచల్ గూడ జైలు నుంచి విడదలైన విషయం తెలిసిందే.

గ్రీన్ ఛానెల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తాం.. డైట్ మెనూను ప్రారంభించిన మంత్రి

మెస్ ఛార్జీలు గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో భోజనం, వసతి గృహాలను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులు స్వయంగా పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (బాయ్స్) షేక్ పెట్‌లో పర్యటించారు. సంక్షేమ పాఠశాల లో లైబ్రరీ నీ కంప్యూటర్ ల్యాబ్ లో అందుతున్న కోర్స్ లను, డిజిటల్ క్లాస్ రూం సీఓఈ ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేక కోర్సులు తదితర వాటిని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు. కొత్త డైట్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.

కామన్ డైట్ ప్లాన్.. చిలుకూరులో ప్రారంభించిన సీఎం రేవంత్

హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ను చిలుకూరులో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరుకు చేరుకున్నారు. టీజీ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ స్కూల్​లో కామన్ డైట్ ప్లాన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. వారం రోజుల్లో 5 రోజులు కోడిగుడ్డు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు అంటే మల్టీ టాలెంటెడ్ అని సీఎం అన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ అని తెలిపారు.

అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబ సభ్యులు..!

మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.. మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని సతీమణి జయసుధ.. అయితే, పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైన విషయం విదితమే.. రేషన్‌ బియ్యం అక్రమాలపై అధికారుల ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సివిల్ సఫ్లై గోదాంలో బియ్యం అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదైంది.. ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని సతీమణి జయసుధ.. ఆయన పీఏలపై కేసు నమోదు చేశారు పోలీసులు.. మరోవైపు.. గత మూడు రోజుల నుంచి అందుబాటులో లేకుండా పోయిందట పేర్ని నాని కుటుంబం.. మూడు రోజుల నుంచి ఫోన్‌ కూడా స్విచాఫ్ వస్తుందంటున్నారు.. కేసు నమోదు నేపథ్యంలో.. అరెస్ట్‌ భయంతోనే పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటుందని ప్రచారం సాగుతోంది..

పరారీలో లేను.. మోహన్ బాబు కీలక ప్రకటన

హత్యాయత్నం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో పోలీసులు మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే నిన్నటి నుంచి మోహన్ బాబు పోలీసులకు అందుబాటులో లేరని కాబట్టి ఆయన పరారీలో ఉన్నారని ఒకసారి లేదు అజ్ఞాతంలోకి వెళ్లారని మరోసారి వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో మోహన్ బాబు తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతున్నాయని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం వైద్యం పొందుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.

డైట్ చార్జీల పెంపు చారిత్రాత్మక మైన రోజు

డైట్ చార్జీల పెంపు చారిత్రాత్మక మైన రోజు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బొనకల్‌ మండల కేంద్రంలో గురుకుల పాఠశాలలో కామన్‌ డైట్‌ ప్లాన్‌ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మానవ వనరులు అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. విద్యార్థుల వల్లనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం లక్ష్యం అందరి క్షేమమని భట్టి విక్రమార్క అన్నారు. యావత్ మంత్రి మండలి మొత్తం కూర్చొని నిర్ణయం చేశామన్నారు. పోషకాలతో కూడిన మెనూ విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయం చేశామన్నారు.

కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ఇంటిగ్రేట్ పాఠశాలలు

కార్పొరేట్ పాఠశాలకంటే ధీటుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేట్ పాఠశాలలను నిర్మిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం ప్రభుత్వ గిరిజన వసతి గృహాన్ని మంత్రి సందర్శించారు. అనంతరం కామన్ డైట్ మెనూను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇఛ్ఛిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గతంలో పౌల్ట్రీ షెడ్ లలో చదువుకునే పరిస్థితి, గత ప్రభుత్వ హయాంలో ఉందని అన్నారు.

సావర్కార్ గురించి ప్రస్తావిస్తే నన్ను దోషిగా చూస్తున్నారు..

లోక్‌స‌భ‌లో భారత రాజ్యాంగంపై చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సావర్కార్ సిద్ధాంతంపై విమర్శలు గుప్పించారు. సావర్కార్ గురించి ప్రస్తావిస్తే ఈ బీజేపీ నన్ను దోషిగా చూస్తున్నారని ఆరోపించారు. అనేక మంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపం మన రాజ్యాంగం.. దేశంలోని ప్రజలు వివిధ రకాల సిద్ధాంతాలను పాటిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, లోక్ సభలో మహా భారతంలోని కుల వివక్షను ప్రస్తావించారు.. ఏకలవ్యుడు శిక్షణ కోసం ద్రోణాచార్యుడు దగ్గరకు వెళ్తే.. నువ్వు మా జాతివాడిని కాదని వెనక్కి పంపాడు అని చెప్పుకొచ్చారు.. కానీ, ద్రోణుడి ప్రతిరూపంతో ఏకలవ్వుడు విలు విద్య నేర్చుకున్నాడు.. కానీ, ద్రోణాచార్యుడు మాత్రం గురు దక్షిణగా ఏకలవ్వుడి బొటన వేలు ఇవ్వాలని అడిగాడు అని రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రస్తావించారు.

ఎల్‌కే అద్వానీ హెల్త్ బులెటిన్ విడుదల..

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో ఆయన్ను అపోలో హస్పటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా.. ఈరోజు మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆయన ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు తాజా సమాచారం అందించాయి. ‘వార్తా సంస్థ ANI ప్రకారం.. అద్వానీని ICUలో చేర్చారు. డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అపోలో ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.’

ఏడాది కాంగ్రెస్ పాలనలో మీరు సాధించిన ఘనత ఇది

ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ గప్పాలు కొట్టిన సీఎం రేవంత్‌.. ఈనెల 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. 10 నెలలుగా అంగన్వాడి కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి ఉంది ఆయన పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో మీరు సాధించిన ఘనత ఇది అని ఆయన విమర్శించారు. విశ్రాంత ఉపాధ్యాయులను, ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నావని, హైకోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని, వారి కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్నావని ఆయన సీఎం రేవంత్‌ రెడ్డిపై ఆరోపణలు చేశారు. అంగన్వాడి టీచర్లు, ఆయాలు, విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా లక్షల మంది సకాలంలో జీతాలు రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపండన్నారు హరీష్‌ రావు. ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలుపుకోండన్నారు.

 

Exit mobile version