NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

చచ్చేంత వరకు సీఎం జగన్‌ వెంటే.. పార్టీ మారను..

చచ్చేంత వరకు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటా.. పార్టీ మారను.. మారబోను అంటూ స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు రుణ మాఫీ అని మహిళలను మోసం చేశాడు.. బంగారు రుణాలు మాఫీ అని చేతులు ఎత్తే శాడు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు.. అందుకే వై ఎపీ నీడ్స్ జగన్ అని ప్రజల్లోకి వెళ్తున్నాం అన్నారు. ఏ రాష్ట్రాల్లో కూడా అమ్మ ఒడి లాంటి పథకం లేదు .. పేదలకు కోసం అహర్నిశలు కష్ట పడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కావాలి అన్నారు. డ్వాక్రారుణ మాఫీ చేసిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి.. గ్రామానికే పాలన తెచ్చారు.. రైతు భరోసా, సచివాలయం, వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు చేశారు.. భూముల రిజిస్ట్రేషన్ సైతం ఇక్కడే జరుగుతున్నాయి.. మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారని తెలిపారు.

పేర్ని నాని వర్సెస్ కలెక్టర్.. సీఎంవో చెప్పిందా? అంటూ ఫైర్‌

మరోసారి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని వర్సెస్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌గా మారింది పరిస్థితి.. జెడ్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. అయితే, కలెక్టర్ రాకపోవటంతో పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గతంలో కూడా కలెక్టర్ రాక పోవటంతో ధర్నా చేస్తామని అప్పట్లో పేర్ని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రచ్చగా మారాయి.. చివరకు పేర్ని వ్యాఖ్యలతో కలెక్టర్, పేర్ని నానిని సీఎంవోకి పిలిచి సర్దిచెప్పారు.. తాజాగా, మరోసారి కలెక్టర్ టార్గెట్ గా పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. సర్వ సభ్య సమావేశం కన్నా వ్యవసాయ సలహా మండలి సమావేశం ఎక్కువయ్యిందా ? అంటూ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌పై మండిపడ్డారు పేర్నినాని.. ఓట్లు వేసిన ప్రజలకు జవాబుదారీగా ఉండలేని అధికారులు ఎందుకు ? అని నిలదీశారు.. వ్యవసాయ సలహా మండలి సమావేశం కంటే ముందే సర్వ సభ్య సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.. కానీ, జడ్పీ సమావేశానికి రాకూడదు అనే ఈ సమావేశం కలెక్టర్ ఏర్పాటు చేశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ సునామీ.. పువ్వాడ ఓటమి ఖాయం

తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వీస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో పువ్వాడ ఓడిపోతున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భయంతో కార్పొరేటర్‌లపై దాడులు, బైండోవర్ కేసులు పెడుతున్నారన్నారు. అధికార మదంతో చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే నీ ఇంటికి వచ్చి నిలదీస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన తక్షణం.. వలస పోతావు పువ్వాడ అంటూ ఆమె మాట్లాడారు.

నాగు పాముకు పాలు పోసి పెంచినా కాటు వేస్తుందని.. అలాగే పువ్వాడకి ఎంత చేసినా పాము లాగానే వ్యవహరిస్తారని విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మిలాకత్ అయ్యాయని ఆమె ఆరోపించారు. ఐటీ దాడులు కాంగ్రెస్ నేతలకు కొత్త కాదన్నారు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి. ఐటీ వాళ్ళు పిచ్చి వెదవలు అంటూ రేణుక.. ఇళ్లల్లో డబ్బులు పెట్టుకుని ఉంటామా అంటూ వ్యాఖ్యానించారు. పోలీసు కార్లలో డబ్బులు వెళ్తున్నాయని ఆమె ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలలో మా కోవర్టులు ఉన్నారన్నారు. కాంగ్రెస్ పవర్‌లోకి వస్తే.. బీఆర్‌ఎస్‌ వాళ్ళ పవర్ కట్ అవుతోంది కదా అంటూ మాట్లాడారు. కేసీఆర్ నిజమే చెప్తున్నారని రేణుక చౌదరి అన్నారు.

డిగ్రీ కాలేజీ లేదు.. 100 పడకల ఆస్పత్రి లేదు..

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఇందిరను గెలిపించాల్సిన బాధ్యత తన భుజాల పై ఉందన్నారు టీపీసీసీ రేవంత్ రెడ్డి. ఇవాళ కాంగ్రెస్‌ విజయభేరీ సభ స్టేషన్‌ ఘన్‌పూర్‌లో జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఐనా తర్వాత.. రాజయ్య లాంటి వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆడపడుచులకు కాలు బయటపెట్టాలంటే భయపడుతున్నారన్నారు రేవంత్‌ రెడ్డి. ఆడబిడ్డ విషయంలో కడియం శ్రీహరి, రాజయ్య లు మాట్లాడే పద్ధతిలో మాట్లాడాలన్నారు. శ్రీహరి సంగతి రాజయ్య చెప్పిండు, రాజయ్య సంగతి శ్రీహరి చెప్పిండన్నారు రేవంత్‌ రెడ్డి. వారిద్దరి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదని, రాజయ్య గురించి… ఆయన రాజయ్యనా కృష్ణయ్యానా మనం చెప్పాల్సిన పనిలేదన్నారు. సొంత పార్టీ నాయకులకే వారిపై నమ్మకం లేదు అన్నారు రేవంత్‌ రెడ్డి. డిగ్రీ కాలేజీ లేదు, 100 పడకల ఆస్పత్రి లేదని, ఇందిరమ్మ ను గెలిపించండి, డిగ్రీ కాలేజ్ తో పాటు 100 పడకల ఆస్పత్రికి నాది గ్యారంటీ అని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే నిర్మించే బాధ్యత నాది అని ఆయన అన్నారు. రెండు సంవత్సరాలలో కేసీఆర్ హరీష్ రావు, కవితమ్మ, రాజయ్య కడియం శ్రీహరి లు పిచ్చి కుక్కల లెక్క తిరుగుతున్నారని, మొదటిసారి మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదన్నారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఓటమి తప్పదు..

కర్ణాటక నుంచి వచ్చిన డబ్బు సంచులతో ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో సబ్బండ వర్గాలకు ధీమా అని మంత్రి చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ పేర్లు మార్చి కాపీకొట్టి మేనిఫెస్టోలో పెట్టిందని విమర్శించారు. పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అవుతా అంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఓటమి తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డబ్బు మదంతో కాంగ్రెస్ సీనియర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాణ్యతలేని కరెంటు, కాలిపోయే మోటర్లు, ఎరువుల కొరత, విత్తనాల కొరత తప్పదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలే మాకు ధైర్యమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ సీఎం ఎవరు ఉండాలి అనేది ఢిల్లీ పెద్దలు నిర్ణయించే దుస్థితి రావద్దన్నారు.

అయ్యప్ప మాలలో బండ్లన్న అపచారం.. ఆడుకుంటున్న నెటిజన్లు..

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా స్టార్. ఆయనలా ఎంతో మంది ఫేమస్ అయిన నటీనటులు, నిర్మాతలు ఉన్నా బండ్ల రూటే సెపరేటు. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా సినిమాలు మానేసిన ఆయన అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఆయన రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయ్యాడు. గతంలో కాంగ్రెస్ లో చేరి, ఆ తరువాత దూరమై సైలెంట్ అయినా ఇప్పుడు ఎన్నికల ముంగిట మళ్ళీ కాంగ్రెస్ పాట పాడుతున్నారు. ఇక దీపావళి పండుగ సమయంలో బండ్ల గణేష్ ఇంట క్రాకర్స్ ఫోటో కూడా చాలా ఫేమస్. బండ్లన్న కొన్న టపాసులు అన్ని నేలపై అందంగా పరిచి వాటితో ఒక ఫోటో దిగి బండ్ల గణేష్ ప్రతి ఏడాది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హాట్ టాపిక్ అవుతూ ఉంటాడు. ఈ సారి కూడా గట్టిగానే క్రాకర్స్ కొని వాటితో తన తండ్రి, కుమారులతో ఫోటో దిగి పోస్ట్ చేశారు.

రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే… బీఆర్‌ఎస్‌ వాళ్లకు నిద్ర పట్టడం లేదు…

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌ విజయబేరి సభలో అభ్యర్థి సింగపురం ఇందిర మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే… బీఆర్‌ఎస్‌ వాళ్లకు నిద్ర పట్టడం లేదన్నారు. 2018 నిలబడితే.. 5 గురు నాయకులు.. కేటీఆర్ దత్తత తీసుకున్న ఘనపూర్ కు 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ముగ్గు పోయని దుస్థితి అని ఆమె అన్నారు. శ్రీహరి 420 ఎన్‌కౌంటర్ చేపించండి అని హరీష్ రావు అన్నాడని, ఇక్కడ నాకు టికెట్ రాగానే… ఎన్‌కౌంటర్‌ల శ్రీహరి కిడ్నాప్ ల శ్రీహరి గా మారిండన్నారు. కడియం శ్రీహరి నన్ను స్థానికురాలు కాదంటున్నవ్… నీ కూతుళ్లకు అత్త గారిల్లు స్థానికం కాదా అని ఆమె అన్నారు. మతిభ్రమించి మాట్లాడుతున్నాడు కడియం శ్రీహరి అని ఆమె మండిపడ్డారు. ఒక్క ఊరికి డబుల్ బెడ్ రూం, ఒక్క ఉద్యోగం ఉండదు…బెల్టు షాపులు మాత్రం పెట్టిండు కేసీఆర్ అని ఆమె ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని హుజురాబాద్‌కు పంపించిందే కేసీఆర్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో నేడు హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆయన సతీమణి ఈటల జమున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని హుజురాబాద్ కు పంపించిందే కేసీఆర్ అని ఆమె ఆరోపించారు. ప్రణవ్ బాబు ఇంతకు ముందు ఉన్నది బీఆర్ఎస్ పార్టీలోనేనని ఆమె అన్నారు. ఈటల రాజేందర్ ను ఓడించడానికి పాడి కౌశిక్ రెడ్డి తో కాదని తెలుసుకున్న కేసీఆర్ ప్రణవ్ బాబును పంపించాడన్నారు. ప్రణవ్ బాబు, కౌశిక్ రెడ్డి ఇద్దరు పార్టీలు వేరు గాని రేపు ఎవరు గెలిచినా పోయేది ప్రగతిభవన్ కే అని ఆమె అన్నారు. రేపు వాళ్ళు డబ్బులు పంపించిన వీళ్ళు డబ్బులు పంపించిన వారు ఇద్దరు ఒక్కటేనని, అయినా మన హుజురాబాద్ ప్రజలు గొప్పవారు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతారు అనే నమ్మకం నాకుందన్నారు ఈటల జమున.

జగనన్న విద్యా కానుక కిట్లల్లో భారీ కుంభకోణం!.. జనసేన ఆరోపణలు

జగనన్న విద్యా కానుక కిట్లల్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ జనసేన కీలక ఆరోపణ చేసింది. నాసిరకం జగనన్న విద్యా కానుక కిట్లను ప్రెస్ మీట్‌లో నాదెండ్ల మనోహర్ ప్రదర్శించారు. ఇవాళ్టి నుంచి రోజుకో స్కీంలో జరిగిన కుంభకోణాన్ని బయట పెడతామని గతంలోనే జనసేన ప్రకటించింది. జగన్ ప్రభుత్వం స్కాంలపై ఆధారాలతో సహా విమర్శలు చేశామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు

మేం ప్రస్తావించిన అంశాలపై జగన్ సమాధానం చెప్పలేదన్నారు. టోఫెల్, ఐబీ స్కాంలను బయటపెట్టామని.. జగనన్న పాల వెల్లువ పథకం పాపాల వెల్లువ అని ఆధారాలతో సహా వివరించామన్నారు. జగన్ పాల వెల్లువ పథకం అమలుపై క్షేత్ర స్థాయిలో పరిశీలనకు సిద్ధమని చెప్పినా మంత్రి సీదిరి ఏదేదో చెప్పారన్నారు. ఈ నెల 14 నుంచి రోజుకో శాఖలో జరుగుతున్న కుంభకోణం బయట పెట్టనున్నామని ఆయన వ్యాఖ్యానించారు. జగనన్న విద్యా కానుక పేరుతో మరో కుంభకోణం జరిగిందని.. రూ. 1050 కోట్లతో జగనన్న విద్యా కానుక పేరుతో కిట్లు పంచుతున్నామని ఈ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలో ఐదు కంపెనీలపై ఈడీ దాడులు చేశాయని.. ఉత్తర భారత దేశంలో ఈడీ దాడుల తీగ లాగితే ఉత్తరాంధ్ర నుంచి తాడేపల్లి ప్యాలెస్‌లోని డొంక కదిలిందన్నారు. నాసిరకం విద్యా కానుక కిట్లు సరఫరా చేసి.. ముడుపులు దండుకుంటున్నారని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

ఢిల్లీలో 42వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన.. ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్స్‌

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 42వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన జరుగుతోంది. ఈ ట్రేడ్ ఫెయిర్లో ఏపీ పెవిలియన్‌ను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రారంభించారు. 500 స్క్వేర్ మీటర్లలో ఏపీ పెవిలియన్‌ను ఏపీ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో ఏపీ ఉత్పత్తులు, ప్రభుత్వ పథకాలు, ఫుడ్ కోర్టులు, టూరిజం స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏపీలో పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ట్రేడ్ ఫెయిర్ ద్వారా తెలియజేస్తున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. దేశంలో ఎగుమతుల్లో ఆరోస్థానంలో ఏపీ నిలిచిందన్నారు.

ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ 1గా ఏపీ ఉందన్నారు. మూడు ఇండస్ట్రీయల్ కారిడార్లలో 45 వేల ఎకరాల్లో భూమి అందుబాటులో ఉందని.. ఏపీలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఉన్నాయని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. సీ ఫుడ్ ఎగుమతుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. ఏపీలో నాలుగు పోర్టులు అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి అమర్‌నాథ్‌..10 ఫిషింగ్ హార్బర్స్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. కోస్ట్ లైన్‌ను ఉపయోగించుకునేలా ఏపీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏపీలో చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. నేతన్న నేస్తం కింద గడిచిన 5 ఏళ్లలో 900 కోట్ల సహాయం అందించామన్నారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమాన్ని, వ్యాపార అనుకూల పరిస్థితులు ప్రపంచానికి చాటేలా ట్రేడ్‌ ఫెయిర్‌లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశామన్నారు.