NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు..

బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది. బ్యూటిషన్, టైలరింగ్ పేరుతో హైదరాబాద్ వచ్చిన యువతులు.. వివిధ వృత్తుల పేరుతో హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించి వ్యభిచారం చేయించిన ముఠా.. తాజాగా ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ ఘాట్ లో మూడు కేసులు నమోదు చేశారు. ఇక, 20 మంది బంగ్లాదేశ్ యువతులను అరెస్టు చేశారు పోలీసులు.

హైదరాబాద్ పాతబస్తీలో పోలీసుల భారీ భద్రత

హైదరాబాద్ నగరంలో హోలీ పండుగ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా పలు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా చార్మినార్, మక్కా మసీద్, భాగ్య లక్ష్మీ టెంపుల్ దగ్గర పటిష్ట బందోబస్తు కొనసాగిస్తున్నారు. 35 సంవత్సరాల తర్వాత ఒకే రోజు రంజాన్ మాసం రెండో శుక్రవారం జుమ్మ రోజున హోలీ పండుగ వచ్చింది. అతి సున్నితమైన ప్రాంతాలు కావడంతో ఓల్డ్ సిటీలోని పలు చోట్ల పోలీసుల పికేటింగ్ ఏర్పాటు చేశారు.

రాజధాని పనుల ప్రారంభానికి రెడీ.. ప్రధాని మోడీకి ఏపీ సర్కార్ ఆహ్వానం..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గతంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ఫోకస్‌ పెట్టింది.. ఇప్పటికే అన్ని అడ్డంకులను అధిగమించి.. రాజధాని పనుల ప్రారంభానికి సిద్ధం అవుతోంది.. ఈ నేపథ్యంలో అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది ఏపీ సర్కార్.. మొన్న ఢిల్లీ టూర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు.. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఉండడంతో ప్రధాని నరేంద్ర మోడీ చేత మళ్లీ రాజధాని ప్రారంభోత్సవం చేయిచాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు.. దీని కోసం వచ్చే నెలలో రెండు తేదీలను పరిశీలిస్తోంది ఏపీ ప్రభుత్వం.. అయితే, ప్రధాని మోడీ ఇచ్చే అపాయింట్‌మెంట్‌ ప్రకారం.. అందులో ఏదో ఒక డేట్ ఫిక్స్ అవుతుందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు…

జూన్ నాటికల్లా లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు..

వచ్చే జూన్ నాటికల్లా మిగిలిన టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందరికీ అప్పగించేలా పనులు జరుగుతున్నాయన్నారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్టీఆర్ టిడ్కో గృహాల సముదాయ కాలనీ ప్రాంతంలో, నర్సాపురం ప్రధాన కాలువపై రూ. రెండు కోట్లతో వంతెన నిర్మాణానికి మంత్రులు సత్య కుమార్ యాదవ్, రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. వచ్చే జూన్ నాటికల్లా మిగిలిన టిడ్కో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందరికీ అప్పగించేలా పనిచేస్తున్నాం అన్నారు..

ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు చంద్రబాబు కీలక ఆదేశాలు.. పర్యటించాల్సిందే..!

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.. పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయన్న ఆయన.. జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని స్పష్టం చేశారు.. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలి. జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లా కో-ఆర్డినేటర్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందించాలి. గ్రూపు రాజకీయాలకు ఎక్కడా తావు ఇవ్వకూడదు. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో ఫోకస్ పెట్టాలి. పర్యటనల సంఖ్య పెరగాలి. కార్యకర్తలు, నాయకులతో మమేకమవ్వడంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలని ఆదేశించారు.

పిఠాపురం జనసేన సభకు మూడు దారులు.. ఏ దారిలో ఎవరు వెళ్లాలంటే..?

పిఠాపురంలో ఈ రోజు జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభ పైనే అదరి దృష్టి ఉంది. పిఠాపురంలో జరుగుతున్న సభకు వెళ్లడానికి అన్ని దారుల్లో జనసైనికులు బయలు దేరుతున్నారు. అయితే సభ దగ్గర మాత్రం మూడు దారులు పెట్టారు. ఈ మూడు దారుల నుంచే సభకు చేరుకోవాలి. ఒక్కో దారిలో ఒక్కొక్కరికి పర్మిషన్ ఇచ్చారు. ఇందులో చూసుకుంటే రాజావారి ద్వారం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా, వీర మహిళలకు మాత్రమే వెళ్లాలి. వీరు ఇక్కడ పాస్ లు చూపిస్తే వారికి ఎంట్రీ ఉంటుంది.

అలర్ట్.. గ్రూప్ 3 ఫలితాలు విడుదల

గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. డిసెంబర్ 2022 లో 1388 పోస్ట్ భర్తీకి గ్రూప్ -3 నోటిఫికేషన్ విడుదలవగా.. 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) పరీక్ష రాశారు. ఫలితాలతో పాటే ఫైనల్ కీ, అభ్యర్థుల లాగిన్ ఐడీలకు OMR షీట్స్ కూడా పంపించారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ లో అభ్యర్థులు తమ లాగిన్‌ వివరాలతో మార్కులు తెలుసుకోవచ్చు.

వరంగల్‌లో కిలేడీ గ్యాంగ్ అరాచకాలు.. భయాందోళనలో తల్లిదండ్రులు

వరంగల్‌లో ఓ మహిళ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కిలేడీ గ్యాంగ్ అమాయక బాలికలను టార్గెట్ చేస్తూ పాశవిక దుశ్చర్యలకు పాల్పడుతోంది. మత్తుమందులకు బానిసై, ఈజీ మనీ కోసం బలహీన స్థితిలో ఉన్న బాలికలను లొంగదీసే ఈ ముఠా ఘోరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ మహిళ వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసైన ఆమె తనతో పాటు మరికొంత మందితో కలిసి గ్యాంగ్ ఏర్పరచుకుంది. కార్పొరేట్ పాఠశాలలు, సంపన్నుల కాలనీల వద్ద రెక్కీ నిర్వహిస్తూ, అమాయక బాలికలను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయం పెంచుకునేది. ఆపై, నమ్మకం కలిగించిన అనంతరం బయటకు వెళ్దామని చెప్పి కిడ్నాప్ చేసేది.

హోలీ వేడుకల్లో గంజాయి విక్రయాలు.. గంజాయి కలిపిన కుల్ఫీ ఐస్ క్రీమ్, స్వీట్స్ విక్రయం

హైదరాబాద్ నగరంలోని దూల్‌పేట్‌లో హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో గంజాయితో తయారైన కుల్ఫీ, ఐస్ క్రీమ్, బాదాం మిల్క్, స్వీట్స్ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మత్తు పదార్థాల విక్రయంపై నిఘా పెట్టిన ఎక్సైజ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) బృందం దూకుడుగా దాడులు నిర్వహించి అనేక మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. హోలీ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్స్‌లో హానికరమైన మత్తు పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దూల్‌పేట్ ప్రాంతంలోని మల్చిపురా ప్రాంతంలో గంజాయి కలిపిన కుల్ఫీ, ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్స్, సిల్వర్ కోటెడ్ గంజాయి బాల్స్ విక్రయాలు జరుగుతున్నాయి. మామూలుగా కనిపించే ఈ స్వీట్స్, ఐస్ క్రీమ్‌లు తిన్న వారు మత్తులోకి వెళ్లిపోతుండటంతో ఈ అక్రమ కార్యకలాపంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

జనసేనకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలుః సీఎం చంద్రబాబు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురంలో ఘనంగా మొదలయ్యాయి. మరికొద్ది సేపట్లో పవన్ కల్యాణ్‌ అక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ ఎదిగిన తీరును అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. జనసేన ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తో ఉన్న ఫొటోలను పంచుకున్నారు.