హైదరాబాద్ ఉమ్మడి రాజధాని..! మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారయణ.. ఉమ్మడి రాజధానిపై తాజాగా వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన తరుణంలో.. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై దిద్దుబాటు చర్యలకు పూనుకుంది వైసీపీ.. ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ విధానం కాదు అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. అనుభవం వున్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా? 10 ఏళ్ల తర్వాత అది ఎలా సాధ్యం..? అని ప్రశ్నించిన ఆయన.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల ను వక్రీకరించారని పేర్కొన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అది ఏమైనా వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఆస్తియా? అని ప్రశ్నించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. అసలు హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి చంద్రబాబు పారిపోయి వచ్చిన కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది అన్నారు.
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులతో కేటీఆర్, హరీష్‌రావు వాగ్వాదం
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మీడియా పాయింట్ వద్దకు బీఆర్ఎస్ సభ్యులు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడే వున్న పోలీసులు బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నారు.కాగా.. పోలీసులకు బీఆర్ఎస్ సభ్యులకు వాగ్వాదం చోటుచేసుకుంది. మీడియా పాయింట్ వద్దకు ఎందుకు వెళ్లకూడదు అంటూ కేటీఆర్, హరీష్ రావు పోలీసులతో వాదించారు. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధనలు వున్నాయన్నారు పోలీసులు. ఎప్పుడులేని కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో కేటీఆర్, హరీష్‌రావు వాగ్వాదం చేశారు. అయినా బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అనుమతించలేదు. దీంతో బీఆర్ఎస్ సభ్యులకు, పోలీసులకు తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడే బీఆర్ఎస్ సభ్యులు నేలపై కూర్చొని నిరసనలు తెలిపారు.
ఢిల్లీ నుండి జైపూర్ 2 గంటల ప్రయాణం.. 30శాతం తక్కువ చార్జీ.. విమానం లాంటి సౌకర్యం
ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లే వారికి త్వరలో మూడో బహుమతి లభించబోతోంది. రెండు నగరాల మధ్య వందే భారత్ రైలును నడపడం ద్వారా ప్రభుత్వం మొదట విలాసవంతమైన సౌకర్యాలు, హై-స్పీడ్ రైలును ప్రయాణికులకు అందించింది. అప్పుడు ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే కూడా ప్రారంభించబడింది. ఇది ప్రస్తుతం జైపూర్ వరకు వెళుతుంది. ఇప్పుడు ఈ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సులను నడపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది దేశంలోనే మొదటి ప్రాజెక్ట్ అవుతుంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రకటించారు.
త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించవచ్చు. రోడ్డు మీద నడుస్తున్న ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో షాక్‌లు, శబ్దం లేదా కాలుష్యం ఉండవు. ఇది మాత్రమే కాదు, రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కూడా మూడింట రెండు వంతులు తగ్గుతుంది. ప్రస్తుతం రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. మీరు ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణిస్తే, ఈ సమయం కేవలం 2 గంటలకు తగ్గుతుంది. అంటే ఢిల్లీ నుంచి కేవలం 2 గంటల్లో జైపూర్ చేరుకోవచ్చు.
పాత పెన్షన్ ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు..?
పాత పెన్షన్ ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు..? అని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మండలిలో కవిత మాట్లాడుతూ.. మండలి పై ప్రైవేట్ ఛానల్ లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలన్నారు. ఈ ప్రభుత్వ బడ్జెట్ ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా ఉందని అన్నారు. ఆరు గ్యారంటీలకు సంభందించిన పది శాతం కూడా బడ్జెట్ లో కేటాయించడం లేదని తెలిపారు. ప్రజావాణి వినడం లేదు ఢిల్లీ వాణి వింటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ యాత్ర చేస్తే తెలంగాణ నుంచి బస్సులు పోతున్నాయన్నారు. తెలంగాణా ఎఐసిసికి ఏటీఎమ్ గా మారిపోయిందని మండిపడ్డారు.
రాహుల్ యాత్ర బస్సు రేవంత్ వాడిందే.. కవితకు సీతక్క కౌంటర్
గతంలో రేవంత్ రెడ్డి వినియోగించిన బస్సునే రాహుల్ యాత్రకు అప్పగించారని ఎమ్మెల్సీ కవితకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సీతక్క మాట్లాడుతూ.. ఎఐసీసీకి పెట్టిన ఖర్చు ప్రభుత్వ ఖర్చు కాదని అన్నారు. అదంతా పార్టీ ఖర్చు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మహారాష్ట్ర, పంజాబ్ రైతులకు నిధులు ఇచ్చారని స్పష్టం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి వినియోగించిన బస్సునే రాహుల్ యాత్రకు అప్పగించారని సీతక్క తెలిపారు.
కాగా.. మండలిలో ఎమ్మల్సీ కవిత మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ యాత్ర చేస్తే తెలంగాణ నుంచి బస్సులు పోతున్నాయన్నారు. తెలంగాణా ఎఐసిసికి ఏటీఎమ్ గా మారిపోయిందని మండిపడ్డారు. మండలి పై ప్రైవేట్ ఛానల్ లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలన్నారు. ఈ ప్రభుత్వ బడ్జెట్ ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా ఉందని అన్నారు. ఆరు గ్యారంటీలకు సంభందించిన పది శాతం కూడా బడ్జెట్ లో కేటాయించడం లేదని తెలిపారు. ప్రజావాణి వినడం లేదు ఢిల్లీ వాణి వింటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ యాత్ర చేస్తే తెలంగాణ నుంచి బస్సులు పోతున్నాయన్నారు. తెలంగాణా ఎఐసిసికి ఏటీఎమ్ గా మారిపోయిందని మండిపడ్డారు.
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం ఏపీ ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. మే 13 నుంచి 19 వరకు ఈఏపీసెట్, మే 8న ఈసెట్, 6న ఐసెట్, మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్, జూన్ 8న ఎడ్‌సెట్, జూన్ 9న లాసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు పీజీఈసెట్, జూన్ 13న ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పీఈసెట్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేశారు.
ప్రపంచ ప్రభుత్వ సదస్సులో మోడీ కీలకోపన్యాసం
ప్రపంచానికి పచ్చని (Green), స్వచ్ఛమైన (Clean), సాంకేతిక పరిజ్ఞానం (Tech Savvy) ఉన్న ప్రభుత్వాలు అవసరమని ప్రధాని మోడీ (PM Modi) ఆకాంక్షించారు. యూఏఈలో (UAE) రెండ్రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రెండోరోజు మోడీ పర్యటన కొనసాగుతోంది. దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ సదస్సులో మోడీ ప్రసంగించారు. ప్రపంచానికి స్వచ్ఛమైన, ఆకుపచ్చ మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వాలు అవసరమని మోడీ నొక్కి చెప్పారు.
అలాగే ప్రపంచానికి అంటువ్యాధులు లేని ప్రభుత్వాలు అవసరమని స్పష్టం చేశారు. భారతదేశంలోని ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారని చెప్పుకొచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరిగిందని.. బీజేపీ యొక్క ఉద్దేశం.. నిబద్ధతపై ప్రజలకు నమ్మకం ఉందని తెలిపారు. పాలనలో ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందని మోడీ పేర్కొన్నారు.
బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయలేదు.. చేయదు కూడా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే.. ఇవాళ అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయలేదు. చేయదు కూడా అని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పని చేశాయీ, భవిష్యత్ లోనూ పని చేస్తాయి. కలిసి పని చేయమని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీ కోసం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని, గతంలో పీసీసీ అధ్యక్షులుగా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారన్నారు. సీఎం తో పాటు, మేడిగడ్డ పర్యటన పిక్నిక్ వెళ్ళి లంచ్ చేసి వచ్చారని, కాళేశ్వరం పర్యటన గతంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి పర్యటించారన్నారు మహేశ్వర్ రెడ్డి. కేంద్ర డ్యాం సేఫ్టీ అథారిటీ పరిశీలించి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కోరితే..48 గంటల్లో కాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీ కి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు మహేశ్వర్ రెడ్డి.
రాజ్యసభకు అశోక్‌చవాన్, జేపీ నడ్డా.. ఏఏ రాష్ట్రాల నుంచంటే..!
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ (Ashok Chavan) లక్కీ ఛాన్స్ కొట్టేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రెండ్రోజులకే రాజ్యసభ (Rajya Sabha) సీటు దక్కేసింది. రెండ్రోజుల క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కమలం గూటికి చేరారు. తాజాగా ఆయనకు రాజ్యసభ సీటు కూడా దక్కింది. మహారాష్ట్ర (Maharashtra) కోటాలో ఆయనను రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ ప్రకటించింది.
అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) కూడా మరోసారి రాజ్యసభ సీటును దక్కించుకున్నారు. ఈసారి ఆయన గుజరాత్ నుంచి బీజేపీ ఎంపిక చేసింది. తాజాగా బీజేపీ విడుదల చేసిన జాబితాలో మహారాష్ట్ర నుంచి అశోక్‌చవాన్, గుజరాత్ నుంచి జేపీ నడ్డాను నామినేట్ చేసింది.
ప్రతి ఒక్కరు తమ మాతృభాషను రక్షించుకోవాలి
ప్రతి ఒక్కరు తమ మాతృభాషను రక్షించుకోవాలని ఇంగ్లీష్ ఫై మోజు ఉండాలి కానీ తమ మాతృభాషను చంపుకోకూడదని అందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషను విధిగా నేర్పించి మాతృభాషను రక్షించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నేడు వసంత పంచమి( శ్రీ పంచమి) పర్వదినాన్ని పురస్కరించుకొని అంబర్పేట లోని మహంకాళి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి తమ మాతృభాషను రక్షించుకోవాలని ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు మాతృభాషను నేర్పించాలని ఇతర భాషలపై మోజు పెంచుకోవాలి తప్ప తమ మాతృభాషను చంపుకోకూడదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు
ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఒంటరిగా జగన్‌ను ఎదుర్కోలేని చంద్రబాబు అందరిని వెంటబెట్టుకుని ఎన్నికలకు వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వీళ్ళందరూ ఉన్న ధైర్యం సరిపోని చంద్రబాబు ఢిల్లీ పెద్దలను మబ్బులో పెడదామని వెళ్ళాడని ఆరోపించారు. అక్కడ ఉన్నది అమిత్ షా, మోడీ కావడంతో వాళ్లిచ్చిన ఆఫర్ దెబ్బకు.. హైదరాబాద్ వెళ్లి మంచంపై పడి వారం నుంచి ఏపీకి రావడం లేదని ఆయన ఆరోపణలు చేశారు. ఢిల్లీ పెద్దల దెబ్బతో ముందు నుయ్యి, వెనక గొయ్యిలా చంద్రబాబు పరిస్థితి మారిందన్నారు.
రేవంత్ రెడ్డి హుందాతనం మరిచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు
సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల సంక్షేమం గాలికి వదిలేసారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసిఆర్ ను విమర్శించడానికి, దూషిండడమే పనిగా పెట్టుకున్నాడన్నారు కడియం శ్రీహరి. రేవంత్ రెడ్డి హుందాతనం మరిచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం అయ్యారు… ఆయన భాష మారుతుంది అని ఆశించామని కడియం శ్రీహరి అన్నారు. కానీ కేసీఆర్ ను అసభ్య పదజాలం తో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అని ఆయన ధ్వజమెత్తారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, మాకు మైక్ ఇవ్వాలని అడిగాం కానీ ఇవ్వకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
