NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జి షీట్ పై విచారణ

మద్యం పాలసీ కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా గత వారం సెప్టెంబర్ 11 న సిఎం కేజ్రీవాల్‌కు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేశారు. అదే తేదీ వరకు అతని జ్యుడీషియల్ కస్టడీని కూడా పొడిగించారు. అంతకుముందు, ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సిఎం, ఇతర నిందితులపై సిబిఐ ఇక్కడ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

అవినీతి కేసులో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ, బెయిల్‌ను కోరుతూ సీఎం కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇంకా తీర్పు వెలువరించలేదు. సెప్టెంబరు 5న, న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సుప్రీమో తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సిబిఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) ఎస్‌వి రాజు సమర్పించిన మౌఖిక వాదనలను విన్నది. విన్న తర్వాత తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా సిబిఐ సిఎం కేజ్రీవాల్‌ను రెండేళ్లుగా అరెస్టు చేయలేదని సింఘ్వీ వాదించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని కలిగి ఉన్న రాజ్యాంగ కార్యకర్త కేజ్రీవాల్ బెయిల్ మంజూరు కోసం ట్రిపుల్ పరీక్షను నెరవేర్చారని సింఘ్వీ అన్నారు.

గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు..

గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ భద్రాద్రి నాది.. నా సొంతం అని ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖకి ఆదేశించారు.. జిల్లా మొత్తం తుఫాను వరదల ప్రభావంగా జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి.. బాధితులకు వెంటనే డబ్బులు అందే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కి మంత్రి సూచనలు చేశారు. రాముడు కరుణిస్తే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని.. రాజకీయపరంగా అధికారం పరంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాములవారికి సేవ చేసుకోవాలని తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్.. అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌..!

కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను గుంటూరు జైలులో పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందన్నారు.. చంద్రబాబు వైఫల్యంతో వరదల వల్ల 60 మంది చనిపోయారని ఆరోపించారు.. అందుకోసమే ఎప్పుడో జరిగిన ఘటనపై టీడీపీ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది.. అసభ్య పదజాలంతో దూషించినా.. నేను సంయమనం పాటించా.. కానీ, కొందరు కోపంతో రాళ్లువేసి ఉంటే వేయొచ్చు.. కానీ, ఇప్పుడు అరెస్ట్‌ అయినవారంతా.. ఆ రోజు ఘటనా ప్రదేశంలో లేనివారే అన్నారు జగన్..

తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ రెడ్ సెల్యూట్ ర్యాలీ..

హైదరాబాద్ నగరంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ సీపీఐ రెడ్ సెల్యూట్ ర్యాలీ నిర్వహించింది. కవులు, కళాకారులతో కలిసి ముగ్దమ్ స్టాచ్యు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రెడ్ టీ షర్ట్స్ ధరించి ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభాశివరావు, చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే గుర్తించబడిన సాయుధ పోరాటం స్టార్ట్ అయినా రోజు.. నిజం నిరంకుశం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసారు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ అధికారంలోకి వచ్చిన సాయుధా పోరాటం చేసిన వారిని గుర్తించండి, వాళ్ళను ఆదుకోండి అని కోరారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరిపేందుకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంఐఎం పార్టీ బ్లాక్ మెయిల్ కు భయపడుతోంది అని సీపీఐ నారాయణ ఆరోపించారు.

అది మన దెబ్బ..! పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగాడు..

నా దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగే పరిస్థితికి వచ్చారు.. అంటూ వైఎస్‌ జగన్‌పై సెటైర్లు వేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఏలూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల విజయవాడలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిందన్నారు.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.. ఏడాదిలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం విజయవాడలో రెండు రోజుల్లో కురిసింది.. బుడమేరుకు గండ్లు పడితే వాటిని పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వానిది అంటూ మండిపడ్డారు.. టీడీపీ హయాంలో నిధులు కేటాయించిన వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి గత ప్రభుత్వానిది.. రాజకీయ పార్టీ కార్యాలయాల పైన దాడులు చేస్తారు, అరెస్టు చేస్తే నిరసన చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్‌ లలో భూకంప ప్రకంపనలు..

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. అందిన సమాచారం మేరకు భూకంప కేంద్రం పాకిస్థాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు భూకంపం సంభవించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఖైబర్ పఖ్తుంక్వా నుండి పంజాబ్ వరకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం డేరా ఘాజీ ఖాన్ సమీపంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. దీని కారణంగా తీవ్రత తక్కువగా కనిపించింది.

బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను టచ్ చేయలేరు.. రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్..

అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ దేశంలోని రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఈ రోజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందిస్తూ..‘‘దేశాన్ని విభజించే కుట్ర చేసే శక్తుల’’తో నిలబడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని అన్నారు. ‘‘దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలవడం, దేశవ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. అది జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌సీ దేశ వ్యతిరేక, రిజర్వేషన్‌ వ్యతిరేక ఎజెండాకు మద్దతివ్వడం లేదా భారత వ్యతిరేక ప్రకటనలు చేయడం. విదేశీ వేదికలపై రాహుల్ గాంధీ ఎప్పుడూ దేశ భద్రతను బెదిరిస్తూ, మనోభావాలను దెబ్బతీస్తున్నారు’’ అని అమిత్ షా అన్నారు. ప్రాంతీయత, మతం, భాషా విబేధాల తరహాలో చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ.. దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడటం ద్వారా రాహుల్ గాంధీ మరోసారి కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక ముఖాన్ని తెరపైకి తెచ్చారని, అతడి మనసులో ఉన్న ఆలోచనలు బయటకు వచ్చాయని అన్నారు. బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరని, దేశ భద్రతతో ఎవరూ చెలగాలమాడకూడదని రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నానని హోం మంత్రి అన్నారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ మద్దతు..

అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు ఇంటాబయట వివాదాస్పదమవుతున్నాయి. సిక్కులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. మరోవైపు రిజర్వేషన్ల రద్దు వ్యాఖ్యలు కూడా దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా అమెరికా చట్టసభ సభ్యురాలు, భారత వ్యతిరేకి, పాకిస్తాన్ మద్దతురాలిగా పేరున్న ఇల్హాన్ ఒమర్‌తో రాహుల్ గాంధీ భేటీ కావడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, సిక్కుల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మద్దతు తెలిపాడు. ‘‘భారతదేశంలో సిక్కులు తలపాగా లేదా కడాను ధరించడానికి అనుమతిస్తారా, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా అనే పోరాటం జరుగుతోంది’’ అని రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో అన్నారు. రాహుల్ గాంధీవి ‘‘ధైర్యమైన మరియు మార్గదర్శక’’ వ్యాఖ్యలు, ప్రత్యేక ఖలిస్తానీ దేశ డిమాండ్‌ని సమర్థిస్తాయి అని పన్నూ అన్నారు.

అక్కడే కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ కాబోతోంది

రామప్ప దేవాలయానికి గొప్ప చరిత్ర ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. అందుకే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిందని, తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయమన్నారు సీతక్క. అందుకే రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. పనుల్లో అలసత్వం వహిస్తే చరిత్ర, ప్రజలు క్షమించరని, రామప్ప చుట్టుపక్కల ఎన్నో చారిత్రక ప్రాంతాలు, టూరిజం కేంద్రాలున్నాయన్నారు మంత్రి సీతక్క. లక్నవరం, బొగత, సమ్మక్క సారలమ్మ దేవాలయం వంటి ఎన్నో చారిత్రక ప్రాంతాలు ములుగులో ఉన్నాయని, అక్కడ కేంద్రీయ గిరిజ యూనివర్సిటీ కాబోతోందన్నారు మంత్రి సీతక్క.

ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న పడవల తొలగింపు ప్రక్రియ

ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఏపీని వరదలతో ముంచెత్తాయి. ఈ భారీ వరదల సమయంలో ఐదు బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. బోట్లు ఢీకొని మూడు గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై ఇప్పటికే టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ప్రకాశం బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ చేపట్టింది. ప్రస్తుతం పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్ల సాయంతో తీయడం సాధ్యం కాకపోవడంతో ముక్కలు చేసి తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. క్రేన్ల సాయంతో తొలగించేందుకు ప్రయత్నించగా.. ఒక్కొ్క్కటి 40 టన్నుల బరువు ఉండడంతో అది సాధ్యం కాలేదు.