మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి..
మున్నేరు వరద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు అండగా ఉంటాయని అన్నారు. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందని, వరద బాధితులు కష్టాల్లో ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వరద బాధితులను తప్పకుండా ఆదుకుంటుందన్నారు. క్షణాల్లో వచ్చిన భారీ వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని తెలిపారు. స్టేట్ డిజాస్టర్ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం. కలిసికట్టుగా అందరూ నడవాలన్నారు. మరోసారి తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ తరఫున వరద బాధితులకు తాత్కాలికంగా నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి సామాజిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలన్నారు.
మగద్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన రైలు
ఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగద్ ఎక్స్‌ప్రెస్ రైలు బక్సర్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రఘునాథ్‌పూర్, తుడిగంజ్ స్టేషన్ల మధ్య అకస్మాత్తుగా కప్లింగ్ తెగిపోవడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది. దీని కారణంగా ఇంజిన్ వెనుక ఉన్న కొన్ని కోచ్‌లు మినహా మిగిలిన కోచ్‌ల కంటే చాలా ముందుకు వెళ్లింది. అయితే విషయం తెలుసుకున్న లోకో పైలట్ రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని లోపాలను సరిచేసి రైలును ముందుకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బక్సర్-డిడియు పాట్నా రైల్వే సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో డౌన్ మగద్ ఎక్స్‌ప్రెస్ రఘునాథ్‌పూర్ స్టేషన్ నుండి తుడిగంజ్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ రైలు తదుపరి స్టాపే పాట్నా. ఈ ప్రమాదం తర్వాత బోగీలో వదిలి వెళ్లిన ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. ఈ బోగీలు ట్రాక్‌పై కొంత దూరం పరుగెత్తిన తర్వాత కొంతదూరం ముందుకు ఆగిపోవడం విశేషం.
అక్కడ ఒక రూల్.. తెలంగాణ లో మరో రూలా ?
అక్కడ ఒక రూల్.. తెలంగాణలో మరో రూలా ? అంటూమాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ మీడియా సమావేశం ఆవేదన తో పెడుతున్నాను అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీల ఏర్పాటుకు ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. సమావేశాలు ముగిసి 38 రోజులు అవుతున్నా వాటి పై ఈ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేత వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. అక్కడ ఒక రూల్ .. తెలంగాణలో మరో రూలా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు. ఆ రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా ? అని అన్నారు.
విషాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య..
రైలు కింద పడి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఘట్‌కేసర్‌లో చోటుచేసుకుంది. నగరంలోని ట్రాఫిక్ పీఎస్ సికింద్రాబాద్ గోపాలపురంలో నరసింహారాజు ట్రాఫిక్ కానిస్టేబుల్ పీసీ 9782 (2009 బ్యాచ్) విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఘట్‌కేసర్‌లోని ఫోల్‌నెం.216 వద్ద నరసింహారాజు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలం నుంచి నర్సింహరాజు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ నరసింహారాజు అంబర్పేట్ లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నర్సింహరాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పండుగ మరుసటి రోజే నరసింహారాజు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న అందరితోను బాగానే ఉన్నాడని తెలిపారు. విధులకు వెలుతున్నట్లు తెలిపిన కానిస్టేబుల్ ఇవాళ ఉదయం విగతజీవిగా మిగిలాడని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.
ఏపీలో భారీ వర్షాలు కారణంగా 45 మంది మృతి.. ఆ జిల్లాలో ఏకంగా 35 మంది
ఏపీలో భారీ వర్షాలు కారణంగా 45 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35మంది మృత్యువాద పడ్డారు. ఇంకా ఒకరి జాడ దొరకలేదు. గుంటూరు జిల్లాలో ఏడుగురు చనిపోయారు. పల్నాడు, ఏలూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మృత్యువొడికి చేరుకున్నారు. వర్షాలు వల్ల 339 రైళ్లు రద్దయ్యాయి. 181 రైళ్లు దారి మళ్లించారు. 1,81,53870 హెక్టార్ల లో పంట , 19686 హెక్టార్లలో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లింది. 2లక్షల35 వేల మంది రైతులు నష్టపోయారు. 71 వేల కోళ్లు, 478 పశువులు మరణించాయి. వరదల వలన 22 సబ్ స్టేషన్ లు దెబ్బతిన్నాయి. 3913 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. అర్బన్ రోడ్స్ 558 కిలోమీటర్లు మేర దెబ్బతిన్నాయి. 78 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయి. 6,44133 మంది వరదల వల్ల ప్రభావమయ్యారు. 246 రిలీప్ క్యాంపుల్లో 48,528 మంది ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్ డి ఆర్ ఎఫ్ ఎస్ డి ఆర్ ఎఫ్ టీంలు రంగంలో దిగాయి. ఆరు హెలికాఫ్టర్లు పనిచేస్తున్నాయి.208 బోట్లను సిద్ధం చేశారు. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపారు. కృష్ణా నదికి 3లక్షల 82 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. పులిచింతలకు 2 లక్షల 75 వేల క్యూసెక్కుల వరదనీరు చేరింది.
క్రీడాకారులను ప్రోత్సహించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయం
గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో కుంటిబడిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. క్రీడలకు ఆదరణ తగ్గించారని.. క్రీడలు అభివృద్ధికి రాజమండ్రి నుంచి నాంది పలుకుతాని పేర్కొన్నారు. రాజమండ్రిలో సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమన్నారు. జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పేదల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేక అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించలేకపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కందులు దుర్గేష్, రాంప్రసాద్ రెడ్డి, రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి హాజరయ్యారు. ఈ పోటీల్లో ఐదు రాష్ట్రాల నుంచి 150 మంది క్రీడాకారులు పోటిపడుతున్నారు. కాగా.. యోనెక్స్-సన్‌రైజ్ 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ 2024 పోటీలు రాజమండ్రిలో 8వ తేదీ నుంచి 11 సెప్టెంబర్ వరకు జరగనున్నాయి.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నంకి తూర్పున 280 కి.మీ., గోపాల్‌పూర్‌కి తూర్పు-ఆగ్నేయంగా 230 కి.మీ.,పారాదీప్ కి దక్షిణ-ఆగ్నేయంగా 260 కి.మీ , దిఘాకి దక్షిణంగా 390 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు సాయంత్రం లేదా రాత్రి పూరీ- దిఘాల మధ్య వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులలో కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ వెల్లడించారు.
హైడ్రాపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
హైడ్రా పై మాజీ మంత్రి సబితా ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఒక పబ్లిసిటీ స్టంట్. మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేయడం తప్పా హైడ్రాకు ఏమి పని లేదంటూ తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కపూర్ టౌన్ షిఫ్ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సబితా, ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ తొలగించడానికి హైడ్రాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా గత 8 నెలలుగా కేసీఆర్ పై అన్ని విధాలుగా బురదజల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినా కేసీఆర్ మార్క్ మాత్రం చేరిపి వేయడంలో విఫలమయ్యారని ఆమె వ్యాఖ్యానించారు.
కేంద్ర రవాణా చట్టానికి అనుబంధంగా మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నాం
తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్‌తో నిర్వహించిన సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర రవాణా చట్టానికి అనుబంధంగా మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నామన్నారు. 1988 కేంద్ర వాహన చట్టానికి.. సుప్రీం కోర్ట్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, రాష్ట్రంలో యాక్సిడెంట్స్ ను తగ్గించడానికి ప్రత్యేక నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయని ఆయన తెలిపారు. ఉద్యోగుల్లో అసహనం తొలగించడానికి పెండింగ్ సమస్యలు.. ప్రమోషన్స్ చేపడుతామని, చట్టాన్ని కఠినం చేస్తూనే.. రవాణా శాఖ ఆదాయాన్ని పెంచుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 6916 లైసెన్సులు రద్దు చేశామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకువస్తున్నామని, యాక్సిడెంట్స్ నివారణ.. ఉద్యోగుల ఫిట్నెస్ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్ సేఫ్టీ సరిచేస్తూ.. నిబంధనలను కఠినం చేయడానికి ట్రాన్స్పోర్ట్ విజిలెన్స్ స్ట్రిక్ట్ గా పని చేస్తుందని ఆయన తెలిపారు.
ప్రజా ప్రభుత్వం జర్నలిస్టులు సంక్షేమం కార్యక్రమం.. బషీర్‌బాద్‌లో 38 ఎకరాల భూమిపత్రాలు అందజేత
జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. సొసైటీ సభ్యులకు భూమిని కేటాయించడం, వారికి ఇళ్ల స్థలాలు కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టు సంఘాన్ని ఆదుకునేందుకు, వారి శ్రేయస్సుకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను ఈ వేడుకలో ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. సమాజంలో పాత్రికేయులు పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను ఆయన గుర్తించి, వారికి తగిన వనరులు మరియు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జర్నలిస్టుల కృషిని గుర్తించి వారి జీవన స్థితిగతులను మెరుగుపరిచే దిశగా భూ పంపిణీ కార్యక్రమం ఒక అడుగుగా పరిగణించబడుతుంది. మీడియా మరియు ప్రభుత్వ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, మీడియా నిపుణుల కోసం గృహనిర్మాణాన్ని మెరుగుపరచడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలలో ఒక మైలురాయిని సూచిస్తుంది.