Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

నా ప్రత్యర్థి ఎవరో నాకు ఇప్పటికీ తెలియడం లేదు..

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది 5 గ్యారంటీలు కాదు ఐదు మోసాలు, ఐదు అబద్ధాలు అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగతంగా లాభ పడి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఉన్న నిధులను మొత్తం తినేసింది అని ఆయన ఆరోపించారు. అసాధ్యమైన పథకాలను ప్రకటించి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. జరగబోయే ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీకి మధ్య పోటీ మాత్రమే అని కొండా విశ్వేశర్ రెడ్డి వెల్లడించారు.

కొడాలి నాని కౌంటర్‌ ఎటాక్‌.. గుడివాడలో నన్ను.. రాష్ట్రంలో జగన్‌ను ఎవ్వరూ ఓడించలేరు..

కృష్ణా జిల్లా, గుడివాడలో అభిమానులు తన కాళ్లకు పాలాభిషేకం చేయడంపై రాద్ధాంతం చేసిన విపక్షాలు.. ప్రజలు నిరదీశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. నన్ను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోనన్న ఆయన.. గుడివాడలో నన్ను.. రాష్ట్రంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఎవ్వరూ ఓడించలేరన్నారు.. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం.. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. అయినా తనపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల వద్దని చెప్పినా… నా కాళ్లు కడిగారని తెలిపారు.

ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న కాకర్ల సురేష్..

నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన సీతారాంపురం పరిధిలోని చిన్నగంపల్లి నుంచి ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రచార కార్యక్రమం నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న ఆయనకు మహిళలు హారతి ఇచ్చి సాదరంగా ఆహ్వానించా రు. ఉదయగిరి శాసనసభ అభ్యర్థిగా తనను గెలిపించాలని పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కాకర్ల ఈ సందర్భంగా కోరారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ మహిళలు తన వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు అని ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.

అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తాం.. అసెంబ్లీ స్థానాలపై తేడాలు..!

సీపీఎం అరకు ఎంపీ స్ధానానికి పోటీ చేస్తుందని వెల్లడించారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. స్వతంత్రంగా గెలిచే బలం మాకు లేదు, అలాంటి ఆశ కూడా మాకు లేదన్నారు.. అయితే, అసెంబ్లీ స్ధానాలకు సంబంధించి చర్చల్లో కొన్ని తేడాలు ఉన్నాయన్నారు. మేం గొంతెమ్మ కోర్కెలు కోరే వాళ్ళం కాదు.. కాంగ్రెస్ పార్టీకి గతంలో తక్కువ ఓట్లు వచ్చిన స్ధానాల్లో మేం సీటు అడిగాం అని గుర్తుచేశారు. ఇక, వాలంటీర్ల దుర్వినియోగంపై టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోడానికే మాట్లాడుతున్నారని విమర్శించారు. వాలంటీర్ల అంశంలో బీజేపీ సుద్దులకు విలువ లేదన్నారు.

కాంగ్రెస్కి అధికారం ఇచ్చినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు..

బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అశ్వారావుపేట అసెంబ్లీలో బీఆర్ఎస్ కు తిరుగులేదన్నారు.. ఇక్కడ కృష్ణార్జునులలా మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు గొప్పగా పని చేస్తున్నారు అని తెలిపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ అశ్వారావుపేట నుంచే వచ్చింది.. ఇప్పుడు కూడా అదే పునరావృతం కావాలి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వేసవి రాక ముందే నీటి ఎద్దడి నెలకొంది.. రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి కారణంగా సుమారు 15 లక్షల ఎకరాల పంటలు దెబ్బ తిన్నాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఎప్పుడూ గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునే వారు.. ఆ విధంగానే సంక్షేమ పథకాలు కూడా ప్రవేశ పెట్టారు.. దేశంలో ప్రతీ ఇంటికి నల్లా నీరు ఇచ్చిన రాష్ట్రం ఏదని పార్లమెంట్ లో నేను ప్రశ్నిస్తే తెలంగాణ అని సమాధానం వచ్చింది అని నామా నాగేశ్వరరావు అన్నారు.

60 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి.. సీఎం జగన్‌ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే కోర్టుకు వెళ్తాం..

సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించేవారిపై అవసరం అయితే కోర్టులను ఆశ్రయిస్తాం అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండేళ్ల నుంచి వాలంటీర్లపై చంద్రబాబు అండ్ బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా వాలంటీర్ల వ్యవస్థ జగన్ తీసుకువచ్చారు.. ఇంటి దగ్గరకే పథకాలు అందిస్తున్నారు.. ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు ఇస్తే జనం తరుముతారు అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారని దుయ్యబట్టారు. ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చి వాలంటీర్లను తప్పించారని విమర్శించారు. ఇప్పుడు పెన్షన్‌లకు డబ్బులు లేవని ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు తెలియదా? ఏమి జరిగిందో.. వాలంటీర్ల విషయంలో అని ప్రశ్నించారు సజ్జల.. జన్మభూమి కమిటీలు.. టీడీపీ జలగలతో ఉండేది.. ఇవాళ చంద్రబాబుకు పెన్షనర్లు శాపాలు పెడుతున్నారని తెలిపారు. సమాజంలో ఉండే అర్హత చంద్రబాబుకు లేదన్న ఆయన.. ఇప్పుడు 60 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యిందన్నారు. రెండు మూడు రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి అవుతుందన్నారు. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో పెన్షన్ల పంపిణీ వ్యవహరంలో టీడీపీ మాపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. చంద్రబాబు మీద ప్రజలు కోపంగా ఉన్నారు.. వాలంటీర్ల వ్యవస్థను ఎవ్వరూ ఏమి చేయలేరన్నారు. 20 మంది అధికారులు వైసీపీ వాళ్లు అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేశారట.. అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారులు వాళ్ల తోత్తులు అయ్యి ఉండాలి అని దుయ్యబట్టారు సజ్జల.

జనసేనాని పవన్ కల్యాణ్‌పై ముద్రగడ ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. హైదరాబాద్, విజయవాడలో ఉన్న ఆస్తులు అమ్మేసి పిఠాపురం వచ్చేయమనండి.. అప్పుడు గౌరవం ఇస్తామని ఆయన అన్నారు. చంద్రమండలం, సూర్య మండలం నుంచి ప్రజా సమస్యలు పరిష్కరిస్తాడా అంటూ ముద్రగడ ఎద్దేవా చేశారు. పిఠాపురంలో ఎవరి దగ్గరైనా పోటీ చేసే వ్యక్తి ఫోన్ నెంబర్ ఉందా అంటూ ప్రశ్నించారు. పిఠాపురంలో పోటీ చేసే ప్రముఖ నటుల మాటలు వింతగా ఉన్నాయన్నారు.

షూటింగ్‌లో ఉండే పిచ్చి మహారాజుకి ఎమ్మెల్యే పదవి ఎందుకు అని ప్రశ్నించారు. వారికున్న అమ్ముడుపోయే జబ్బు అందరికీ ఉందనుకుంటున్నారని విమర్శించారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నారు. ముఖ్యమంత్రిని పాతేస్తానంటున్నాడు.. ఎవరైనా అయితే కాలు చేయి తీసేస్తారని అంటున్నారని పవన్‌ కల్యాణ్‌పై ముద్రగడ మండిపడ్డారు. పిఠాపురంకు స్వచ్ఛమైన లిక్కర్ సప్లై చేస్తాడా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 20 సీట్లు బిక్ష తీసుకున్నాడు.. అవి కూడా ఇచ్చేస్తే త్యాగరాజు అని పద్మశ్రీ ఇస్తారని విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరిన గౌరవ్ వల్లభ్

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నేతలంతా హస్తం పార్టీని వీడుతున్నారు. బుధవారం బాక్సర్ విజేందర్ సింగ్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి పువ్వు పార్టీలో చేరారు. తాజాగా గురువారం కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కూడా పార్టీకి రాజీనామా చేసి కాషాయ గూటికి చేరారు. ఢిల్లీలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే.. వల్లభ్ మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొద్ది సేపట్లోనే బీహార్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అనిల్ శర్మతో కలిసి వల్లభ్ బీజేపీలో చేరారు. రెండు పేజీల రాజీనామా లేఖను రాస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. కాంగ్రెస్‌లోని పదవులకు.. ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఇక లేఖలో కాంగ్రెస్ తీరును తూర్పారాబట్టారు. కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం లేదని విమర్శించారు. ఈ విధంగా పార్టీ ముందుకు సాగడం తనకు ఇబ్బందికరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు.

డ్రైవర్‌కు టికెట్ ఇస్తే తప్పేంటి?.. లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆయన చేపట్టిన ఈ యాత్ర గురువారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా చిన్నసింగమలకు చేరుకుంది. చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. టిప్పర్‌ డ్రైవర్‌ను చట్టసభలో కూర్చోబెట్టేందుకే టికెట్‌ ఇచ్చానని సీఎం తెలిపారు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్‌, బీఈడీ చదివాడని.. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా బాధపడలేదన్నారు. ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని.. జగన్‌ టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడన్నారు.

ప్రభుత్వం ప్రజలను, పాలనను గాలికి వదిలేసింది..

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ (నందికొండ)లో వానరాలు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలను, పాలనను గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వం సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని, కోతులు చనిపోయిన వాటర్ టాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు జగదీష్‌ రెడ్డి. నాగార్జునసాగర్ ను మున్సిపాలిటీగా చేసి, అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అని, 2014కు ముందు ఉన్న రోజులు పునరావృతం అవుతున్నాయన్నారు. ఇప్పటికి గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. సాగునీటికి నీళ్లు అందించమంటే కూడా ప్రభుత్వానికి చేతకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బయటకి రాగానే ప్రాజెక్టుల నుంచి నీళ్లను వదిలారని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో తాగు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

విచారణ జరుగుతుంటే లీగల్ నోటీసులు పంపిస్తారా..?

కేటీఆర్.. లీగల్ నోటీసులు పంపారని, కేటీఆర్.. నీకు లా.. అడ్మినిస్ట్రేషన్ అవగాహన ఉందా..? అని అన్నారు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటలిజెన్స్ అధికారుల అరెస్ట్ లు జరుగుతున్నాయని, తెలంగాణ వ్యాప్తంగా వార్ రూమ్ లు పెట్టి ఫోన్ ట్యాప్ చేశారు అని అరెస్ట్ చేస్తున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబంకి.. పెయిడ్ జర్నలిజం మాత్రమే తెలుసు అని ఆయన విమర్శించారు. . నా ఫోన్ ట్యాప్ చేశారు.. దీని వెనకాల బాద్యులు ఎవరని తేల్చండి అని ఫిర్యాదు చేయడం తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్‌ రెచ్చిపోయి.. లీగల్ నోటీసులు పంపాడని, విచారణ చేయండి అని అడిగితే లీగల్ నోటీసు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. విచారణ జరుగుతుంటే లీగల్ నోటీసులు పంపిస్తారా..? అని ఆయన మండిపడ్డారు. ఇంత ఇంగిత జ్ఞానం లేదా..? విచారణ చేయండి అంటే పరువు తీసినట్టా..? అని ఆయన ధ్వజమెత్తారు.

పవన్‌ సంచలన నిర్ణయం.. రైల్వేకోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థి మార్పు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైల్వేకోడూరు అసెంబ్లీ అభ్యర్థిని జనసేన అధిష్ఠానం మార్చేసింది. రైల్వే కోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పవన్‌ ఖరారు చేశారు. యనమల భాస్కరరావు స్థానంలో అరవ శ్రీధర్ పేరును రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా పవన్‌ ప్రకటించారు. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాల అనంతరం అనంతరం శ్రీధర్ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇంకా ఒకట్రెండు పెండింగ్‌ స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రటించాల్సి ఉంది. అయితే ఈలోపే ప్రకటించిన స్థానాల్లోనూ మార్పునకు జనసేన దిగడం గమనార్హం.

కుక్కలను నక్కలని కేసీఆర్‌ ఎందుకు టికెట్ లు ఇచ్చారో చెప్పాలి

10 సంవత్సరాలు BRS అధికార దుర్వినియోగం తోకక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీ లో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ లో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. కనీసం సిగ్గు లేకుండా రాజీనామా చేయకుండా మంత్రి పదవులు తీసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఎజెండా పెట్టుకుంది… పిరాయింపులకి ప్రోత్సహిస్తుందన్నారు. కుక్కలను నక్కలని కేసీఆర్‌ ఎందుకు టికెట్ లు ఇచ్చారో చెప్పాలన్నారు కిషన్‌ రెడ్డి. ప్రజా తీర్పు పట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు గౌరవం లేదు…. ప్రజాభిప్రాయాన్ని అవమాన పరుస్తున్నారన్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంటే బీఆర్‌ఎస్‌ పార్టీ మీద గెలిచిన మీరు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక భయంకర అంశాలు తెరపైకి వస్తున్నాయని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం , కేసీఆర్‌ కుటుంబం బరితెగించి వ్యక్తి స్వేచ్ఛను హరించిందన్నారు కిషన్‌ రెడ్డి.

కవితకు లభించని ఊరట.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో కోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రోస్‌ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్‌పై గురువారం న్యాయస్థానం విచారించింది. కవిత, ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

తన కుమారులకు పరీక్షలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కవిత కోరారు. పిటిషన్ విచారించిన కోర్టు.. సోమవారినికి తీర్పును రిజర్వ్ చేసింది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మాత్రం ఏప్రిల్ 20న విచారించనుంది. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా తీహార్ జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీ అనంతరం కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు.

Exit mobile version