NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగం.. సభ నుంచి విపక్షాలు వాకౌట్

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. తన ప్రసంగంలో, ప్రధాని, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, రైతుల రుణమాఫీ, మహిళా సాధికారత గురించి కూడా ప్రస్తావించారు. ప్రధాని మోడీ ప్రసంగం సందర్భంగా విపక్షాలు నినాదాలు చేశాయి. అనంతరం విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే.. భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణంలో, అనేక దశాబ్దాల తర్వాత, దేశ ప్రజలు మూడోసారి దేశానికి సేవ చేసే అవకాశం కల్పించారని ప్రధాని అన్నారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత దేశంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇది సాధారణ విషయం కాదన్న ఆయన.. పదేళ్లుగా ఎన్డీయే సేవాభావంతో ముందుకెళ్తుందన్నారు. ఎన్డీయే పాలనలు ప్రజలు మరో సారి సమర్థించారన్నారు. ఈ సందర్భం కొందరు అసంతృప్తిగా ఉన్నారని పరోక్షంగా కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. దేశ ప్రజల నిర్ణయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుటి నుంచి ఓ కాంగ్రెస్ నేత పదే పదే మమ్మల్ని మూడో వంతు ప్రభుత్వం అంటున్నారని.. అది నిజమే.. మేం పాలనలో పదేళ్లు పూర్తి చేసుకున్నామని.. మరో 20 ఏళ్ల అధికారంలో ఉంటామన్నారు. మూడో వంతు పూర్తయిందని, మూడు వంతుల్లో ఇంకా రెండు వంతులు మిగిలి ఉన్నాయన్నారు ప్రధాని మోడీ. అంచనా చేసిన ఆయన నోటిలో నెయ్యి, పంచదార పోస్తానన్నారు.

బాధితుల ప్లకార్డు చూసి కాన్వాయ్‌ ఆపిన పవన్‌.. న్యాయం చేస్తానని హామీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రూటే వేరు.. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చిన వారిని అక్కున చేర్చుకుని.. వెంటనే వారి సమస్య పరిష్కారానికి పూనుకుంటారు.. తన దగ్గరకు వచ్చేవారికే కాదు.. దారిలో ఎవరైనా కనిపించినా కాన్వాయ్‌ ఆపి మరి పలకరిస్తారు.. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించారు.. అయితే, పవన్ వెళ్తున్న రూట్ లో తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.. కొండెవరంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు.. వెంటనే కాన్వాయ్ ఆపి.. వాళ్లతో మాట్లాడి పవన్.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు..

యువతిపై ఇద్దరు రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ ల అత్యాచార యత్నం..

ప్రభుత్వం మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జేఎస్‌ఆర్‌ సన్‌ సిటీ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిని అదే కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించిన ఘటన మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. కడప జిల్లాకు చెందిన ఓ యువతి గత నెలలో నగరానికి వచ్చి ఉప్పల్ లో స్థిరపడింది. మియాపూర్ లోని జేఎస్ ఆర్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ విభాగంలో ట్రైనీగా చేరింది. అయితే అదే రియల్‌ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు కన్ను ఆమెపై పడింది. అయితే సమయం కోసం వేచి చూసారు. ఆ సమయం రానే వచ్చింది. ఆమెను మాట మాట కలిపి సైట్ విజిట్ కోసం వెళ్లాలని చెప్పారు. అయితే వారి మాటలు నమ్మిన ఆ యువతి వారితో వెళ్లేందుకు కారులో ఎక్కింది. అయితే అప్పటికే వారి మాట్లలో ఏదో తేడాను గమనించింది.

ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై సమీక్ష.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఖరీఫ్ సీజన్ సన్నద్దతపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు అవుతోంది.. నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు.. నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై చర్యలకు వెనుకాడొద్దని ఆదేశించారు. అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్లో వేసే పంటలకు ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేశారు.

మిస్సైన యువతిని ఇంటికి రప్పించిన డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా అయిన భీమవరంలో తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి ఏపీ పోలీసులు రుజువుచేశారాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యణ్ వారిని అభినందించారు. ఇక వివరాలలోకి వెళ్లినట్టు అయితే భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె 9 నెలల క్రితం అదృశ్యం అయ్యిందని, దీనికి సంబంధించి యువతి కనిపించకుండా పోయిన ప్రాంతం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండడంతో మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. గతంలో చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ, మీరే ఎలాగైనా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేశారు. తమ కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఎదుట గుండెలవిసేలా విలపించారు. ఆ తల్లి బాదకు చలించిన పవన్ కళ్యాణ్ తక్షణం ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన మాచవరం సీఐతోనూ, విజయవాడ పోలీస్ కమిషనర్‎తోనూ ఫోన్లో మాట్లాడారు. కేసుపై ప్రత్యేకంగా దృష్టి నిలపాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన ఏపీ పోలీసులు ఆ యువతి ఆచూకిని కునుగొనేందుకు విశ్వా ప్రయత్నాలు చేసారు. చివరకు జమ్మూలో ఉన్నట్లు ఆమె జాడను పోలీసులు కనిపెట్టారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం జమ్ము వెళ్లి యువతిని రాష్ట్రానికి తీసుకురావడంతో కథ సుఖాంతం అయ్యింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త ఇసుక పాలసీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. తిరిగి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుక అందించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం.. కలెక్టర్ల అధ్యక్షతన లోడింగ్, రవాణ ఛార్జీల నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. కాగా.. ఇంతకుముందు ఉచిత ఇసుక విధానాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వ విధానాల వల్ల భవన నిర్మాణ రంగం దారుణంగా నష్టపోయిందని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

ఇచ్చిన హామీల అమలు లోతుగా అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నాం

ఇచ్చిన హామీల అమలు లోతుగా అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నామని తెలిపారు. లక్ష రుణమాఫీ కి ఐదేళ్లు తీసుకుని.. అవి కూడా చేయని బీఆర్‌ఎస్‌ మాపై అరుస్తుందని ఆయన మండిపడ్డారు. మీరు అరిచి గీ పెట్టాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా మొత్తము వ్యవసాయం అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామన్నారు. మేము ఇచ్చే ప్రతి పథకం ప్రజల సొమ్ముతోనే.. ప్రజల సొమ్ముకు మేము కస్టోడీయన్ మాత్రమే అని ఆయన వెల్లడించారు. ప్రజల మధ్య చర్చకు పెట్టి..అందరి అభిప్రయాలు తీసుకుంటామని, బడ్జెట్ సమావేశాల కంటే ముందే రైతు భరోసా పై అభిప్రాయం సేకరిస్తామన్నారు. అసెంబ్లీ లో నివేదిక పెడతామని, ప్రజల ఆలోచన మేరకే సంపద పంచుతామన్నారు భట్టి విక్రమార్క. రైతులు.. ట్యాక్స్ చెల్లించే వారూ.. మేధావులతో మాట్లాడతామని, బీఆర్‌ఎస్‌ వాళ్ళు ఆశ పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎదో ఒకటి చేస్తే బాగుండు.. అని ఆయన వ్యాఖ్యానించారు.

శ్రీవారి ఆలయంలోని అన్నప్రసాదాల తయారీలో మార్పుపై క్లారిటీ

తిరుమల ఆలయంలో అన్నప్రసాదాల తయారీకి ఆర్గానిక్‌ బియ్యాన్ని ఉపయోగిం చాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తేల్చి చెప్పింది. సాధారణ బియ్యంతో పాత పద్ధతిని మార్చే ప్రతిపాదన లేదని బుధవారం టీటీడీ ప్రతినిధి స్పష్టం చేశారు , ఈ అంశంపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు “పూర్తిగా నిజం కాదు” అని అన్నారు. టీటీడీ ఈవో జె.శ్యామలరావు మరుసటి రోజు అర్చకులు, ఆలయ అధికారులతో సమావేశమై అన్నప్రసాదాలు, వాటి ప్రాముఖ్యతపై సుదీర్ఘంగా చర్చించారు. అంతే కాకుండా అన్నప్రసాదాల తయారీ లేదా దిట్టం పెంచడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికార ప్రతినిధి తెలిపారు. అయితే శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేశామని కొందరు సోషల్ మీడియాలో పుకార్లు సృష్టిస్తున్నారని, ఇది పూర్తిగా సరికాదని సోషల్ మీడియా వేదికలపై ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.స

అమరావతిపై శ్వేత పత్రం విడుదల..

రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే వారు అమరావతినే రాజధానిగా అంగీకరిస్తారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. కరుడు గట్టిన తీవ్రవాది కూడా అమరావతికే ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలని అందరూ చెబుతున్నారని.. అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని చంద్రబాబు తెలిపారు. విభజన తర్వాత ఏపీకి రాజధాని లేదన్నారాయన. హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే.. టీడీపీ హయాంలో సైబరాబాద్ నగరం సృష్టించామని చెప్పారు. వాస్తు ప్రకారం సైబరాబాద్ నగర నిర్మాణం సరికాదని అంతా చెప్పారని.. భూమి అక్కడే అందుబాటులో ఉందని సైబరాబాద్ నగర నిర్మాణంపై ముందుకెళ్లామని అన్నారు. కనీసం సైబరాబాద్‌కు అప్పట్లో నీటి సదుపాయం కూడా లేని పరిస్థితి.. కృష్ణా నది నుంచి పైప్ లైన్ వేసి సైబరాబాద్‌కు తెచ్చామని పేర్కొన్నారు. కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత టీడీపీదేనని సీఎం చంద్రబాబు చెప్పారు.

హత్రాస్ తొక్కిసలాటపై రష్యా అధినేత పుతిన్ సంతాపం..

121 మందిని బలితీసుకున్న హత్రాస్ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం హత్రాస్‌లో ఓ సత్సంగ్ కార్యక్రమంలో జనాలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే యోగి సర్కార్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ప్రతిపక్ష నేతలు ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. ఇదిలా ఉంటే, ఈ విషాదకరమైన ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై అత్యంత హృదయపూర్వక సంతాపాన్ని అంగీకరించండి’’ అని పుతిన్ సందేశాన్ని రాయబార కార్యాలయం జోడించింది. ‘‘ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర మనోవేదనకు గురిచేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.