కురుక్షేత్రం జరుగనుంది.. పేదవారంతా ఒక వైపు.. పెత్తందార్లంతా మరోవైపు..!
కురుక్షేత్ర యుద్ధం జరుగనుంది.. పేదల వైపు ఉన్న ప్రభుత్వానికి, పేదలను వంచించిన ప్రత్యర్థులకు మధ్య ఈ యుద్ధం జరగబోతోంది.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా పాదయాత్రలో అందరి కష్టాలు స్వయంగా చూశాను.. అక్కడి నుంచి ఈ సంక్షేమ పథకాలు అన్నీ పుట్టుకు వచ్చాయన్నారు.. మన ప్రభుత్వం వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ గా అభివర్ణించారు.. ఇక, కురుక్షేత్ర యుద్ధం జరుగనుంది.. పేదల వైపు ఉన్న ప్రభుత్వానికి, పేదలను వంచించిన ప్రత్యర్థులకు మధ్య యుద్ధం.. సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం ఉండబోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో 80 శాతం పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీట్లు ఇచ్చాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే పెద్ద పీట వేసిన మన ప్రభుత్వానికి, ఎస్సీగా ఎవరైనా పుట్టాలి అపుకుంటారా? అన్న అహంకారానికి, బీసీల తోకలు కట్ చేస్తా అన్న కండకావరానికి మధ్య యుద్ధం అన్నారు..
ఆధారాలన్నీ పక్కాగా ఉన్నాయి.. చంద్రబాబే అసలు సూత్రధారి
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆధాలన్నీ పక్కాగా ఉన్నాయి.. చంద్రబాబే అసలు సూత్రధారి అంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. ప్రజలకు సంబంధించిన సమస్యల పై కాదు.. అడ్డంగా దొరికిన దొంగను కాపాడటానికి ఒక ముఠా ప్రయత్నాలు చేస్తుంది.. టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ అంటూ విమర్శించారు. మనుషులను నిలువు దోపిడి చేసి మళ్ళీ ఏం చేయలేదని నమ్మించగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లు అంటూ మండిపడ్డారు. ఇక, లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు అని దుయ్యబట్టిన ఆయన.. చంద్రబాబు ఎన్నికల సమయంలో రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాడు.. అదేదో చారిత్రక అవసరం అని బిల్డప్ ఇస్తాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, జైలుకు పంపింది ఎవరు? విచారణ చేస్తున్నది ఎవరు?.. రాష్ట్రపతి దగ్గరకు ఎలా వెళతారో అర్ధం కాదు అంటూ ఎద్దేవా చేశారు సజ్జల.. రాజ్యాంగ వ్యవస్థలో భాగం అయిన కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా తప్పని రాష్ట్రపతికి చెప్పగలిగే నైపుణ్యం ఉన్నవాళ్లు అంటూ సెటైర్లు వేశారు.. దొంగతనం చేసి సానుభూతి కోసం ప్రయత్నించటం ఏంటి? అని నిలదీశారు. ఒకప్పుడు సీబీఐలో పని చేసిన వాళ్ళు కూడా చంద్రబాబు అరెస్టు పై మాట్లాడటం విచిత్రంగా ఉందన్న ఆయన.. ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోతే తర్వాత విచారణలో భాగం కారా? అధికారులుగా పని చేసిన వారు కూడా ఇలా మాట్లాడుతున్నారు.. ఒప్పందం పై సంతకాలు చేసేటప్పుడు కరెంట్ పోయింది అంటారు.. ఏం చెప్పినా నమ్మేస్తారు అనుకుంటారా? ప్రజలు లేని రాజకీయాలకు స్పేస్ ఉండదన్నారు.
నారా లోకేష్‌కు హైకోర్టులో ఊరట..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో పాటు ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు లోకేష్.. హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నారా లోకేష్‌ను ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఇదే సమయంలో.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వచ్చే నెల 4వ తేదీ వరకు వాయిదా వేసింది హైకోర్టు.. శుక్రవారం ఉదయమే బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా పరిశీలించిన అనంతరం ఈ ఆదేశాలిచ్చింది హైకోర్టు. ఇక, ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణను అక్టోబర్ 4వ తేదీ వరకు వాయిదా వేసింది హైకోర్టు.
ఢిల్లీలో ఏపీ సీఐడీ.. నారా లోకేష్ కోసం వెతుకులాట..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోసం ఢిల్లీ వెళ్లారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు.. హస్తినలో మకాం వేసిన లోకేష్ కోసం వెతుకులాట ప్రారంభించారు. లోకేష్ కోసం పలుచోట్ల సీఐడీ అధికారులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.. కావాలనే సీఐడి అధికారుల నుంచి తప్పించుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట అధికారులు. రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్‌కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లారట సీఐడీ అధికారులు.. నోటీసులు తీసుకుని విచారణలో అధికారులకు సహకరించాలని లోకేష్‌కు ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం విదితమే.. అయినా సీఐడీ అధికారులకు అందకుండా లోకేష్ దాగుడు మూతలు ఆడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు అధికారులు.. ఇక స్కిల్ స్కాం, ఫైబర్నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ ప్రయత్నాలు చేయడంతో.. లోకేష్ పిటిషన్లను కోర్టులో వ్యతిరేకించాలని సీఐడీ నిర్ణయించింది..
బీజేపీ ఒత్తిడితోనే చంద్రబాబు అరెస్ట్.. ఏదో ఒకరోజు జగన్‌కూ ఇదే పరిస్థితి..!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. ఈ వ్యవహారంలో కోర్టులో పిటిషన్లు వేయడం.. విచారణ జరపడం సాగుతూనే ఉన్నాయి.. అయితే, చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒత్తిడితోనే చంద్రబాబు అరెస్టు జరిగిందన్న ఆయన.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం భుజంపై బీజేపీ తుపాకీ పెట్టి వ్యవహారాలు నడిపిస్తోందని విమర్శించారు. ఇక, బీజేపీని రెండు పార్టీలు భుజం మీద మోశాయని దుయ్యబట్టారు. మరోవైపు.. టీడీపీ నిరసనలు, ఉద్యమాలు ఎన్ని చేపట్టినా ప్రయోజనం శూన్యం అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి.. కాబట్టి టీడీపీ కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని సూచించారు. ఇక, బీజేపీని బలోపేతం చేయడానికి ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరిని బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా నియమించారని ఆరోపించారు. వీటన్నింటి మూల కారణం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడాలన్నది వారి ముఖ్య ఉద్దేశం అని దుయ్యబట్టారు. ఏదో ఒకరోజు వైఎస్ జగన్ కు కూడా ఇదే పరిస్థితి రాకుండా ఉండదంటూ హెచ్చరించారు రఘువీరారెడ్డి.
జనగామలో పల్లా వర్గమో, మరో వర్గమో లేదు, మనమంతా కేసీఆర్ వర్గం..
కాంగ్రెస్, టీడీపీ లాంటిపార్టీలు పాలించాయి, కానీ ఎవడైనా పథకాలు ఇచ్చాయా అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ టికెట్ ఇంకా ప్రకటన జరగలేదు.. కానీ, నాకే అని చెప్పారు.. ప్రకటన కాగానే వస్తాను అంటూ ఆయన పేర్కొన్నారు. గ్రామల్లో, వార్డుల్లో, మండలల్లో, జనగామ, చేర్యాల పట్టణాల్లో ప్రణాళిక బద్దంగా ముందుకు పోదామని చెప్పారు. సోషల్ మీడియా వారియర్లకు పథకాలపై అవగాహన ఉండాలి.. విమర్శకు ప్రతి విమర్శతో కాకుండా.. బూతుకు బూతుతో కాకుండా సరైన సమాధానం చెప్పాలి అని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో సోషల్ మీడియా ఏ విధంగా పాల్గొనాలనేది మాత్రమే ఈ సమావేశం అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అందరితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటా.. లెక్కలతో సమాధానం చెప్పాలి.. సోషల్ మీడియాలో పని చేయాలనే ఉత్సాహం ఉన్నవారిని తీసుకుంటాం.. జనగామ టికెట్ ప్రకటన వచ్చిన తర్వాత కూడా పార్టీ నిర్ణయం ఏదైనా శిరోధార్యంగా పనిచేయాలి అని ఆయన తెలిపారు. జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గమో, మరో వర్గమో లేదు.. మనం అందరం ముఖ్యమంత్రి కేసీఆర్ వర్గం అని ఆయన పేర్కొన్నారు.
2024లో ఏకకాలంలో ఎన్నికలు ఉండవు..!
2024లో ఏకకాలంలో ఎన్నికలు జరగవని లా కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని లా ప్యానెల్ విశ్వసిస్తోందని వర్గాలు తెలిపాయి. ఏకకాల ఎన్నికలపై లా కమిషన్ నివేదికను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రచురించాలని భావిస్తున్నారు. లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్తీ బుధవారం మాట్లాడుతూ.. “ఇంకా ఏకకాలంలో ఎన్నికలు జరిగేందుకు నివేదికకు కొంత సమయం పడుతుందని” అన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణలను ఈ నివేదిక సూచిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంకా, ఇది ప్రత్యేకంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెడుతుంది. డిసెంబర్ 2022లో, దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనపై జాతీయ రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల సంఘం, బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు, నిపుణులతో సహా వాటాదారుల అభిప్రాయాన్ని కోరుతూ 22వ లా కమిషన్ ఆరు ప్రశ్నల సెట్‌ను రూపొందించింది. కమిషన్ నివేదికను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచురించి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించాలని భావిస్తున్నారు.
“నా గుండె పగిలిపోయింది”.. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే గూగుల్ ఉద్యోగి లేఆఫ్..
ఆర్థిక మందగమనం, ఆర్థికమంద్యం భయాలు టెక్ కంపెనీల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి టెక్ సంస్థల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు స్వస్తి పలికాయి. అయితే ఈ లేఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ప్రసూతి సెలవుల్లో ఉన్న ఉద్యోగిని గూగుల్ కంపెనీ కొలువు నుంచి తీసేసింది. కంపెనీలో 12 ఏళ్లుగా పనిచేస్తున్న సదరు ఉద్యోగి ఉద్యోగం పోయే సమయంలో ఓ బిడ్డకు జన్మనిచ్చి 10 వారాలైంది. ఉద్యోగం పోవడంపై సదరు మహిళ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తనను ఉద్యోగం నుంచి తీసేసిన సమయంలో 10 వారాల పాపతో ఉన్నానని లింక్డ్‌ఇన్ లో పోస్ట్ చేసింది. ఈ వార్త తెలిసిన వెంటనే తన గుండె పగిలిందని ఆమె పోస్టులో తన బాధను వ్యక్త పరిచింది. ఇన్నాళ్లు గూగుల్ సంస్థలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఉద్యోగంలో గుర్తించడం, ఇంటర్వ్యూలకు హాజరవ్వడం కష్టంగా మారిందని మహిళా ఉద్యోగి రాసుకొచ్చారు. పాజిటివ్ మైండ్ సెట్ కొనసాగిస్తూ తదుపరి ఏం జరుగుతోందో చూడటానికి తాను ఉత్సాహంగా ఉన్నట్లు రాసింది. ఏదైనా కంపెనీలో స్టాఫింగ్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్ రోల్స్ ఏమైనా ఉంటే తనను గుర్తుపెట్టుకోవాలని కోరింది.
వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్కు వెళ్లే జట్లు ఇవే..?
మరో వారం రోజుల్లో ఇండియాలో వరల్డ్ కప్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల జట్లు భారత్కు చేరుకోగా.. వార్మప్ మ్యాచ్లు నేటి నుంచి ప్రారంభించాయి. తొలిసారిగా వన్డే ప్రపంచకప్కు ఇండియా ఆతిథ్యమిస్తుండటం విశేషం. అయితే ఈసారి జరగబోయే వన్డే వరల్డ్ కప్లో ఏఏ జట్లు సెమీ ఫైనల్ కు చేరుతాయనే చర్చ కూడా మొదలైంది. కొందరు క్రికెట్ దిగ్గజాలు సెమీస్ కు వెళ్లే టీమ్లను తెలిపారు. అయితే వారందరు ఎంచుకున్న దానిలో టీమిండియా ఉండటం విశేషం. వన్డే ఫార్మాట్‌లో గత కొన్ని నెలలుగా భారత జట్టు బాగా ఆకట్టుకుంది. అటు ఆసియా కప్ 2023 టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత.. ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ కప్ స్వదేశంలో జరుగుతుంది కావున భారత్ కు అనూకూలిస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో సెమీ ఫైనల్‌కు చేరుకోవడంలో భారత జట్టు విజయం సాధిస్తుందని అంటున్నారు.
‘స్టార్ మా’లో సరికొత్తగా “గుండె నిండా గుడిగంటలు” సీరియల్
అమ్మ అంటే దైవం, అమ్మ మన కళ్ళ ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకు దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? అనేదే “గుండె నిండా గుడిగంటలు” సీరియల్ కథ అంటున్నారు మేకర్స్. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోందని అధికారికంగా ప్రకటించింది. తెలుగు లోగిళ్ళలో తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్టార్ మా ఇప్పుడు మరిన్ని భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోందని వెల్లడించింది. అమ్మ-కొడుకుల అనుబంధం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుందని, కన్నీరు ఎంతగా తోడు నిలబడుతుందో ఈ పాత్రలు చెబుతాయని అంటున్నారు. ప్రేమను పంచడం అంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్ సన్నివేశాలు చెబుతాయని, కఠినమైన మనసుని కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుందని ఈ కథనం వివరిస్తుందని వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోందని అధికారికంగా ప్రకటించారు. దారితప్పిన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకునే అమ్మాయి ప్రయత్నం, ఆ తల్లికి కొడుక్కి మధ్య దూరాన్ని తగ్గించాలనుకునే తాపత్రయం, తల్లీ కొడుకుల మధ్య అనూహ్యమైన సంఘటనలతో ఈ సీరియల్ పూర్తిగా కొత్త భావోద్వేగాల్ని అందించబోతోందని అంటున్నారు. ఒక పసివాడు తల్లి కోసం ఎంత ఆరాట పడ్డాడో, తల్లి ఒకసారి కనిపిస్తే బావుణ్ణు అని ఎంతగా కోరుకున్నాడో.. అతని తర్వాత జీవితం ఎలా గడిచిందో తెలియాలంటే “గుండె నిండా గుడిగంటలు” చూడాల్సిందే అంటున్నారు..
పవన్ డైరెక్టర్ తో బన్నీ బాలీవుడ్ సినిమా.. అంత లేదమ్మా.. ఇది మ్యాటర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ ఏడాది జాతీయ అవార్డు కూడా అందుకోవడంతో బన్నీ లైనప్ మరింత పెరిగింది ఇప్పటికే పుష్ప 2 ను ఫినిష్ చేసే పనిలో ఉన్న బన్నీ.. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. దాని తరువాత సందీప్ రెడ్డి వంగా తో ఒక సినిమా ఉంటుందని టాక్ .. ఇక ఇవన్నీ కాకుండా ఇంకోపక్క యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక మహేష్ బాబు తరువాత అల్లు అర్జున్ మాత్రమే ఎక్కువ యాడ్స్ చేస్తున్నాడు. ఆయన చేతిలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇక మొదటి నుంచి రెడ్ బస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇక రెండు రోజులుగా ఒక బాలీవుడ్ మూవీలో బన్నీ నటిస్తున్నాడని, దానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వినిపించాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. అయితే అస్సలు విషయం ఏంటంటే.. రెడ్ బస్ కోసం అల్లు అర్జున్- క్రిష్ జాగర్లమూడి కలిసి పనిచేశారు. ఇందుకు సంబంధించిన యాడ్ నేడు రిలీజ్ అయ్యింది. రెడ్ బస్ కోసం క్రిష్ .. రెండు రకాల యాడ్స్ లో నటించాడు. ఇందులో అల్లు అర్జున్ ఎప్పటిలానే స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ యాడ్స్ రెండు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం క్రిష్.. పవన్ తో హరిహరవీరమల్లు తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా హిట్ అందుకుంటే .. అల్లు అర్జున్ తో ఒక సినిమా తీసే అవకాశముండేమో చూడాలి.
