NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

చంద్రబాబుపై హాట్‌ కామెంట్లు.. బ్రహ్మణికి కౌంటర్‌..
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుపై హాట్‌ కామెంట్లు చేశారు పోసాని కృష్ణ మురళి.. ఇదే సమయంలో.. ఆయన కోడలు నారా బ్రహ్మణి కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు.. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పును ఒప్పుకోవాలి.. చంద్రబాబు ఏడాది పాటు జైలులో ఉండి బయటకు వచ్చే టప్పుడు నిజాయతీగా వస్తే మాకు అభ్యతరం లేదన్నారు. చంద్రబాబు గతంలో 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిందని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని గుర్తుచేశారు. మరోవైపు.. చంద్రబాబుకు దోమ తెరలు, ఏసీ ఏర్పాటుపై చర్చ సాగుతోన్న తరుణంలో.. చంద్రబాబుకు దోమలు కరుస్తుంటే.. దోమల మందు, ఏసీ, దోమల తెరలను నేను కొనిస్తా.. ఇచ్చిరండి అంటూ టీడీపీ నేతలకు సలహా ఇచ్చారు.. ఇక, నారా బ్రహ్మణి మాటలు విని నవ్వుకోవాలంటూ సెటైర్లు వేశారు.. బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమో అని కౌంటర్‌ ఇచ్చారు.. బ్రాహ్మణి నేను అడిగే నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరు? మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరు? మీ తాతయ్యను చంపిందెవరు ? బ్రహ్మణి చెప్పాలి అంటూ సవాల్‌ చేశారు పోసాని కృష్ణమురళి.

ఏవోబీలో ‘పుష్ప’ను మించిన సీన్‌.. పోలీసులకు సెల్యూట్
ఫారెస్ట్‌ అధికారుల కళ్లుగప్పి ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్‌ చేయాలో పుష్ప సినిమాలో చూపించారు.. అయితే, ఆ తర్వాత ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.. తాజాగా.. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో పుష్పసినిమా తరహాలో గంజాయిని తరలించారు స్మగ్లర్లు.. ఆంధ్ర – ఒడిశా స‌రిహ‌ద్దుల్లో పోలీసులు క‌ళ్లు గ‌ప్పి త‌ప్పించుకోవాల‌ని చూశారు.. అయితే స్మగ్లర్లకు చుక్కలు చూపించారు పోలీసులు.. గంజాయిని త‌ర‌లిస్తున్న వ్యాన్‌ను వెంబడించారు.. చేజింగ్‌ చేసి పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దు్ల్లోని చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహింస్తుండ‌గా ఒక బొలోరో వాహనం వేగంగా రావడాన్ని గమనించారు. ఆ వాహనాన్ని ఆప‌డానికి ప్రయత్నించారు పోలీసులు.. అయితే, తప్పించుకుని స్మగ్లర్లు పారిపోయారు. ఇక, గంజాయి వాహ‌నం ఛేజింగ్‌ను వీడియో చిత్రీకరించారు పోలీసులు. ఆ వీడియోలో వ్యాన్‌ను పోలీసులు వెంబడిస్తుండగా.. పోలీసుల నుంచి తప్పుంచుకోవడానికి వ్యాన్‌లో ఉన్న గంజాయి మూఠలను రోడ్డుకు అడ్డంగా వేస్తూ వెళ్లారు స్మగ్లర్లు.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. పోలీసులు వ్యాన్‌ను ఛేజ్‌ చేశారు. వ్యాన్‌ను, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు చిత్రకొండ పోలీసులు.. స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు 980 కేజీలు ఉండగా.. దీని విలువ సూమారు కోటి రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని ఏపీలోకి త‌ర‌లిస్తున్నట్లు పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలగా.. ఈ గంజాయి ర‌వాణాలో పాత్రదారుల‌పై విచార‌ణ జ‌రుపుతున్నట్లు చిత్రకొండ పోలీసులు తెలిపారు.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ.. ముకుల్‌ రోహత్గీ కీలక వాదనలు
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.. అయితే, చంద్రబాబు తరపు లాయర్లు.. అటు ఏసీబీ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేశారు.. ఇక, చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా వర్చువల్‌గా సీఐడీ తరపున వాదనలు వినిపించారు ముకుల్‌ రోహత్గీ.. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌కు అనర్హుడు అని పేర్కొన్న ఆయన.. ఎఫ్‌ఐఆర్‌ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్‌ చేయలేదు.. రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ కొట్టివేయాలని హైకోర్టులో వాదనలు వినిపించారు ముకుల్‌ రోహత్గీ. ఇక, సెక్షన్‌ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయవచ్చు.. ఎంతమంది సాక్షులను అయినా చేర్చొచ్చు అని సీఐడీ తరపు వాదనలు వినిపించారు లాయర్ ముకుల్‌ రోహత్గీ.. రూ.3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సి ఉందన్న ఆయన.. షెల్‌ కంపెనీల జాడ తీస్తున్నాం.. నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్‌ కాంట్రాక్ట్‌కు ఎలా వెళ్లింది? అని ప్రశ్నించారు. అన్ని బోగస్‌ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయని.. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగిందని వాదించారు. మరోవైపు.. ఈ డీల్‌కు కేబినెట్‌ ఆమోదం లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్‌ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని హైకోర్టులో వాదనలు వినిపించారు ముకుల్‌ రోహత్గీ.

ప్రాణం తీసిన చపాతీ గొడవ.. సుత్తితో కొట్టి చంపేశాడు..
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం చెర్లోపల్లి గ్రామం వద్ద గ్రానైట్ కూలీ దారుణ హత్యకు గురయ్యాడు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన లక్కీరామ్ ముర్మా, సతీష్ నిద్రిస్తున్న సమయంలో.. వారితో సుత్తితో దాడి చేశారు బావర్ సింగ్ అనే వ్యక్తి.. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సతీష్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.. అసలు ఎందుకు దాడి చేశాడనే వివరాల్లోకి వెళ్తే.. గ్రానైట్ ఫ్యాక్టరీలో చేసే పని తక్కువ నువ్వు చపాతీలు తినేది ఎక్కువ.. అంటూ భావర్ సింగ్ తో గొడవపడిన సమయంలో లక్కీ రామ్ ముర్మా, సతీష్ హేళన చేశారట.. అయితే, అది మనసులో పెట్టుకున్న బావర్‌ సింగ్.. లక్కీరామ్‌ ముర్మా, సతీష్ నిద్రిస్తున్న సమయంలో దాడి చేశాడు.. ఈ ఘటనలో సతీష్‌ అక్కడికక్కడే మృతిచెందినట్టు తెలుస్తుండగా.. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మొత్తంగా చపాతీ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసేంత వరకు వెళ్లడం కలకలం సృష్టిస్తోంది.

పార్లమెంట్ లో మహిళా బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి సపోర్ట్ ఇస్తుందని బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కే. కేశవరావు అన్నారు. బిల్లుకు మేం 100 శాతం మద్దతు ఇస్తామన్నారు. గతంలో రాజ్యసభలో బిల్లు వచ్చినపుడు నేను మాట్లాడాను.. మహిళా బిల్లులో బీసీ మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ ఉంది అని ఆయన పేర్కొన్నారు. 2010లో కూడా ఇదే సమస్య వచ్చింది.. కొన్ని పార్టీలు బీసీలకు వ్యతిరేఖంగా ఉన్నాయి.. బీసీలను ఆణగదొక్కెందుకు ప్రయత్నం చేస్తున్నారు అని కేవశరావు అన్నారు. ఎక్కడయినా ఏ పార్టీ అయినా.. పెత్తనం ఉన్న చోట బీసీలను అణిచి వేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశాడు. బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో బీఆర్ఎస్ పార్టీ కొంత బెటర్ అని బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కే. కేశవరావు అన్నారు. మహిళ బిల్లు కోసం ఎందరో ఉద్యమం చేశారు.. బీఆర్ఎస్ పార్టీ మహిళా బిల్లు కోసం కొట్లాడింది.. మహిళా నాయకురాలిగా కవిత ఉద్యమం చేస్తోంది అని ఆయన వ్యాఖ్యనించారు. బీసీలు పోరాడాలి మార్చాలి.. చెప్పిందే చెయ్యాలి అని ఆయన అన్నారు. అయితే, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు.. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది అని కేశవరావు అన్నారు.

మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండి పప్పు జీ అంటూ రాహుల్ గాంధీపై సెటైర్
ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ ను తప్పుబడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండి పప్పు జీ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి నెట్టింట ఓ పోస్ట్ చేశాడు. ట్విట్టర్ ( ఎక్స్ )లో పోస్ట్ లో ఉన్న కామెంట్స్.. ఇవే, 1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నాడు. ఒకే ఓటు – రెండు రాష్ట్రాలు అనే పిలుపునిచ్చిన తొలి అటల్ బిహారీ వాజ్‌పేయి.. మీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేసింది అని ఆయన అన్నారు. వందలాది మంది అమరవీరుల మరణానికి కారణమైనందుకు మీరు.. మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. జవహర్‌లాల్ నెహ్రూ – జెంటిల్‌మన్ ఒప్పందం పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేశారు.. ఇందిరా గాంధీ – కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా 1969లో దాదాపు 369 మంది ప్రాణాలు కోల్పోయారు.. 1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని 1985లో రాజీవ్ గాంధీ హామీ ఇచ్చారు.. ఇక, సోనియా గాంధీ – 2009 తెలంగాణా ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గారు.. దీంతో 1400 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని తెలిసి ఆ బిల్లును ప్రవేశపెట్టారు అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.

ఐటీ ఉద్యోగిని మోసం చేసిన నేరగాళ్లు.. రూ.71.82 లక్షలు స్వాహా
దేశంలో సైబర్ క్రైమ్ మోసాలు ఎప్పటికప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ మోసాల గురించి నిత్యం ప్రజలను హెచ్చరించినా.. ప్రతీ రోజు అలాంటి వాటికి బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వం సైబర్ క్రైమ్స్ గురించి హెచ్చరిస్తుంటే.. మోసగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. బహుళజాతి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 35 ఏళ్ల మహిళ సైబర్ మోసానికి గురై రూ.71.82 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన సెప్టెంబర్ 2 నుంచి 15వ తేదీ మధ్య జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
హింజేవాడిలోని కోహిన్నోర్ కోరెల్‌కు చెందిన బాధితురాలు అమ్రపాలి చంద్రశేఖర్ కులతే అనే ఐటీ ఉద్యోగిని ఆన్‌లైన్‌లో టాస్క్‌ పేరుతో సంప్రదించి మోసం చేశారు. ప్రారంభంలో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సందేశాన్ని అందుకుంది. దీనిలో ఒక మోసగాడు రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన రివ్యూలను రాయమని అడిగాడు. ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. టాస్క్ పూర్తయిన తర్వాత ఆమె చెల్లింపు కోసం అడుగుతున్నప్పుడు మంచి రాబడిని సంపాదించడానికి ‘కాయిన్ స్విచ్’ ప్లాట్‌ఫారమ్‌లో సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టమని నిందితుడు ఆమెను ఒప్పించాడు. వారిని నమ్మి, బాధితురాలు సైబర్ నేరగాళ్లతో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. వారు ఆమెను పూర్తిగా నమ్మించారు. రెండు వారాల్లో మోసగాళ్లు అందించిన వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తూ, మొత్తం 21 లావాదేవీలు చేసింది. అనంతరం తన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడగడంతో వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆమె మోసపోయినట్లు గ్రహించింది. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది. మొత్తం ఆమె రూ. 71.82 లక్షలు వారి ఖాతాల్లో జమ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. హింజేవాడి పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భారత జట్టు జెర్సీ ఫస్ట్ లుక్ రివీల్.. ఫొటో వైరల్
ఆసియా క్రీడలు 2023 కోసం భారత జట్టు జెర్సీ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఇప్పుడు ఆ జెర్సీ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో కొంతమంది ఆటగాళ్లు భారత జెర్సీలో కనిపిస్తున్నారు. ఈసారి ఆసియా క్రీడల 19వ ఎడిషన్ చైనాలోని హాంగ్‌జౌలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇండియా జెర్సీ ఫొటోలో.. జెర్సీ ముదురు నీలం రంగులో ఉంది. అంతేకాకుండా.. JWS స్పాన్సర్ కుడి ఎగువ మూలలో వ్రాయబడింది. మధ్యలో ఒక పెద్ద భారతదేశం అని తెలుపు రంగులో రాసి ఉంది. అయితే ఈ జెర్సీపై అప్పుడే అభిమానుల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. చాలా మంది అభిమానులు జెర్సీని ఇష్టపడగా.. మరికొందరు బాగోలేదని చెబుతున్నారు. అయితే ఈసారి జరిగే ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను కూడా చూడొచ్చు. ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు బీసీసీఐ పురుషులు, మహిళల జట్లను పంపుతుంది. ఇప్పటికే పురుషులు, మహిళల జట్లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 5న పురుషుల ODI ప్రపంచ కప్‌తో పాటు ఆసియా క్రీడలు జరుగనున్నాయి. అందుకోసమని BCCI పూర్తిగా భిన్నమైన పురుషుల జట్టును ఎంపిక చేసింది. పురుషుల జట్టు కెప్టెన్సీ బాధ్యతలు యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది.

తగ్గిన డీజిల్ వినియోగం..పెరిగిన పెట్రోల్!
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా బలహీనమైన డిమాండ్, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గిన కారణంగా భారత్‌లో డీజిల్ అమ్మకాలు సెప్టెంబరులో క్షీణించాయి . ఈమేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల ప్రాథమిక డేటా వెల్లడించింది. సెప్టెంబరు మొదటి అర్ధభాగంలో పెట్రోల్ అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి.అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే.. ఈ సెప్టెంబర్ 1-15 మధ్య కాలంలో డీజిల్ వినియోగం 5.8 శాతం తగ్గి 2.72 మిలియన్ టన్నులకు చేరుకుందని డేటా వెల్లడించింది. భారతదేశంలో అత్యధికంగా వినియోగించబడే ఇంధనాల్లో డీజిల్‌ ఒకటి కావడం గమనార్హం. ఆగస్టు ప్రథమార్థంలో డీజిల్‌ వినియోగం ఇదే విధంగా పడిపోయింది. సెప్టెంబరులో డీజిల్ అమ్మకాలు 2.7 మిలియన్ టన్నుల డీజిల్ అమ్మకాలను నివేదించిన ఆగస్టు మొదటి అర్ధభాగంతో పోలిస్తే, నెలవారీగా 0.9 శాతం పెరిగాయి. సాధారణంగా వర్షాకాలంలో వ్యవసాయ రంగంలో డిమాండ్‌ తగ్గిపోవడంతో డీజిల్‌ విక్రయాలు తగ్గుముఖం పట్టాయని నివేదిక పేర్కొంది. ఇంకా, వర్షం కూడా వాహనాల కదలికలను నెమ్మదిస్తుంది. ఇదిలా ఉండగా, ఏప్రిల్, మే నెలల్లో డీజిల్ వినియోగం వరుసగా 6.7 శాతం, 4.3 శాతం పెరిగింది. ఈ పెరుగుదల వ్యవసాయ డిమాండ్‌లో పునరుద్ధరణ, వేసవి వేడిని తట్టుకోవడానికి ఎయిర్ కండిషనింగ్ అవసరమయ్యే వాహనాల కారణంగా చెప్పబడింది. జూన్ ద్వితీయార్థంలో రుతుపవనాలు ప్రారంభం కావడంతో డీజిల్‌కు డిమాండ్‌ బలహీనపడింది. జులై ప్రథమార్థంలో క్షీణించినా నెలాఖరు భాగంలో మళ్లీ పుంజుకుంది.అదే సమయంలో, సెప్టెంబర్ మొదటి అర్ధభాగంలో పెట్రోల్ అమ్మకాలు 1.2 శాతం పెరిగాయని నివేదించింది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 1.3 మిలియన్ టన్నులుగా ఉంది. జూలై మొదటి రెండు వారాల్లో వినియోగం 10.5 శాతం తగ్గినప్పటికీ, నెల చివరి అర్ధభాగంలో పుంజుకుంది. ఆగస్టు ప్రథమార్థంలో వినియోగంలో 8 శాతం క్షీణత నమోదైంది. అయితే, సెప్టెంబర్ ప్రథమార్థంలో అమ్మకాలు నెలవారీగా 8.8 శాతం పెరిగాయని డేటా వెల్లడించింది.

అందుబాటులోకి జియో ఎయిర్‌ఫైబర్‌.. 8 సిటీలు, ఆరు ఫ్లాన్‌లు..!
జియో మరో సంచలనంగా సృష్టిస్తోంది రెడీ అయిపోయింది.. జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలను ప్రారంభించింది.. రిలయన్స్ జియో తన కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన ఎయిర్‌ఫైబర్‌ని ఈరోజు అధికారికంగా పరిచయం చేసింది. గృహ వినోదం, స్మార్ట్ హోమ్ సేవలు మరియు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అవసరాలను తీర్చడానికి ఇది రూపొందించబడింది. హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పాన్ ఇండియాను అందించే లక్ష్యం పెట్టుకుంది.. జియో ఎయిర్‌ఫైబర్ మొదటగా అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై మరియు పుణెలో సహా ఎనిమిది నగరాల్లో తన సేవలను ప్రారంభించింది. ఇక, ఎయిర్‌ఫైబర్‌ లభ్యత, ప్లాన్‌లు, వేగం మరియు ఇతర వివరాలను ఓసారి పరిశీలించినట్లయితే.. జియో తన కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ఎయిర్‌ఫైబర్‌ని ఎనిమిది భారతీయ నగరాల్లో ప్రారంభించింది. ఈ ఎనిమిది నగరాల నుంచి తన కవరేజీని మరింత విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. ఎయిర్‌ఫైబర్‌ ఫాస్ట్-స్పీడ్ ఇంటర్నెట్ మరియు ఓటీటీ ప్రయోజనాలతో ఆరు ప్లాన్‌లను అందిస్తుంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఎయిర్‌ఫైబర్‌ హోమ్ కిట్‌ను అందిస్తోంది. 2022లో ఏజీఎం సందర్భంగా, జియో ఎయిర్‌ఫైబర్‌ని ఆవిష్కరించింది. జియో యొక్క ఆప్టికల్ ఫైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉందని పేర్కొంది.. ఈ విస్తృతమైన ఆప్టికల్-ఫైబర్ నెట్‌వర్క్‌తో, జియో 200 మిలియన్లకు పైగా స్థానాలను చేరుకోగలదు. అయినప్పటికీ, విస్తృతమైన కవరేజీతో కూడా, కంపెనీ తరచుగా కనెక్టివిటీని అందించే సవాలును ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా దేశంలోని అనేక ప్రాంతాలలో దీని సేవలు అందడంలేదు.. జాప్యం కొనసాగుతూనే ఉంది.. దీంతో.. హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌ అందకుండా మిలియన్ల మంది సంభావ్య కస్టమర్‌లు ఉన్నారు. వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

విజయ్ ఆంటోనీ కుమార్తె పోస్టు మార్టం పూర్తి.. రిపోర్టులో ఏముందంటే?
తమిళ కంపోజర్, నటుడు విజయ్ ఆంటోని కుటుంబంలో తీవ్ర విషాదంలో నెలకొంది. విజయ్ ఆంటోని 16 ఏళ్ల కుమార్తె మీరా సెప్టెంబర్ 19 తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒకరకంగా మీరా మరణ వార్తతో తమిళ పరిశ్రమ మేల్కొంది. సోషల్ మీడియాలో ఆమెకు నివాళులర్పించేందుకు నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా 12వ తరగతి చదువుతున్న క్రమంలో ఆమె ఒత్తిడికి గురై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. మీరాకు పోస్టుమార్టం నిర్వహించి, పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె మృతదేహాన్ని చెన్నైలోని అల్వార్‌పేటలోని ఆమె నివాసంలో ఉంచారు, అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన వారు నివాళులర్పించారు. ఇక ప్రస్తుతానికి పోస్టుమార్టం పూర్తి కాగా రిపోర్ట్ వచ్చేందుకు సమయం పట్టనుందని అంటున్నారు. ఇక ప్రాధమికంగా అయితే ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించినట్టు డాక్టర్లు గుర్తించారు. ఇక ఈరోజు సాయంత్రం కావడంతో ఆమె అంత్యక్రియలు రేపు జరపనున్నట్టు సన్నిహితులు వెల్లడించారు. ఇక విజయ్‌ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ నటుడి కుటుంబంలో విషాదం నెలకొంది. చైన్నైలోని అల్వార్‌పేటలోని వారి నివాసంలో మంగళవారం తెల్లవారుజామున మీరా ఉరివేసుకుని కనిపించింది. ఇక ఆమెను గమనించి ఆసుపత్రికి తరలించేలోపు ఆమె తుది శ్వాస విడిచినట్టు డాక్టర్లు వెల్లడించారు. మీరా చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. ఆమె నివాసంలో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ మాత్రం లభించలేదు. ఇక తన కూతురు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని మార్చిలో విజయ్ ఆంటోని భార్య చేసిన పాత ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

జైలర్ లాంటి హిట్ ఇస్తే.. డైరెక్టర్ ను అవమానించడం భావ్యమా తలైవా..?
సక్సెస్ మీట్ లో రజినీ.. డైరెక్టర్ ను అవమానించాడంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏ సినిమాను అయినా ఒక డైరెక్టర్ తన కథను నమ్మి సినిమా తీస్తాడు. సినిమా ముందు ఎలా ఉన్నా.. పూర్తీ అయ్యి.. రిలీజ్ కు వచ్చేసరికి అది హిట్ అవుతుందా.. ? లేదా.. ? అనేది తెలిసిపోతుంది. కథను నమ్మి డైరెక్టర్ ఎలా అయితే తీసాడో.. హీరో కూడా కథను అలాగే నమ్మాలి. కానీ, రజినీ మాత్రం జైలర్ సినిమా హిట్ కాదు అని నమ్మాను అని చెప్పడం ఏం బాలేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. “రీ రికార్డింగ్ పూర్తి కాక ముందు నేను, నెల్సన్ స్నేహితుడు, సన్ పిక్చర్స్ కి చెందిన వ్యక్తి సినిమా ను చూశాం. నెల్సన్‌ స్నేహితుడికి సినిమా బాగా నచ్చింది, సూపర్‌ హిట్ ఖాయం అన్నాడు. నువ్వు నెల్సన్ స్నేహితుడివి కనుక అలా అనిపిస్తుంది. సినిమా ఎబో యావరేజ్ అన్నాను.. సినిమా పూర్తిఅయ్యాక చాలా అద్భుతంగా ఉందని” చెప్పుకొచ్చాడు. అయితే రీ రికార్డింగ్ అయ్యాక.. అంటే అనిరుధ్ మ్యూజిక్ వలనే సినిమా హిట్ అయ్యిందని, డైరెక్టర్ ది ఏమి లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. దీంతో రజినీపై అభిమానులు మండిపడుతున్నారు. సినిమా హిట్ అయ్యాక కూడా ఇలా డైరెక్టర్ గురుంచి తక్కువ చేసి మాట్లాడడం బాగోలేదని, జైలర్ లాంటి హిట్ ఇస్తే.. డైరెక్టర్ ను అవమానించడం భావ్యమా తలైవా..? అంటూ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.