Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఎన్నికలకు సిద్ధం అవుతోన్న జగన్‌.. ఎల్లుండి వైసీపీ ప్రతినిధుల సభ..
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.. అదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలు కూడా ఒకేసారి జరగబోతున్నాయి.. అయితే, ఈ సారి రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది ఆ పార్టీ.. వై నాట్ 175.. సీఎం వైఎస్‌ జగన్ ఎన్నికల నినాదం ఇదే.. ఎవరెవరు కలిసినా.. ఎంత మంది తనకు వ్యతిరేకంగా పోటీ చేసినా.. తనదే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో.. ప్రజాప్రతినిధులను, నేతలను, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.. అందులో భాగంగా.. ఈ నెల 9న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల సభ ఏర్పాటు చేశారు.. సుమారు 8 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రతినిధుల సభకు వేదిక కాబోతోంది.. ఈ సభలోనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జులు, రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు.. ఎంపీపీలు, మున్సిపల్ ఛైర్మన్లు, పార్టీ జిల్లా, మండల స్థాయి నేతలు, అనుబంధ విభాగాల నేతలు కూడా ఈ ప్రతినిధుల సభకు హాజరుకాబోతున్నారు.. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా కసరత్తు ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనేది పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపైన్ ను క్షేత్ర స్థాయిలో తీసుకుని వెళ్లే విధంగా శ్రేణులను సమాయత్తం చేయటమే సమావేశ ఎజెండా ఉందంటున్నారు..

చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ అమ్ముడు పోయాడు.. రూ.1500 కోట్ల డీల్‌ కుదిరింది..!
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అమ్ముడు పోయారు అని సంచలన ఆరోపణలు చేశారు.. దీని కోసం ఇద్దరి మధ్య రూ.1,500 కోట్ల డీల్ జరిగిందని చెప్పుకొచ్చారు.. ఎన్డీఏలో లేనని ఒకరోజు.. చేరుతున్ననని మరో రోజు చెబుతున్నాడు పవన్‌ కల్యాణ్‌ అని దుయ్యబట్టారు.. మరి రేపేమి అంటాడో వేచి చూడాలి అంటూ సెటైర్లు వేశారు.. ఇక, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించాను.. ఢీల్లీలో జరిగిన సమావేశం విజయవంతం అయ్యిందన్నారు కేఏ పాల్. . మరోవైపు.. ఏ తప్పు చేయకపోతే నారా లోకేష్ ఎందుకు ఢిల్లీలో దాక్కున్నారు అని నిలదీశారు పాల్.. కాళ్ల వేళ్ల పడ్డా బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ లోకేష్ కు దొరకలేదన్న విమర్శలు గుప్పించారు.

సీఎం జగన్‌ కేంద్రం పెద్దలను కలిసేది చంద్రబాబుపై కేసుల విషయంలోనే..!
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనపై ఆరోపణలు గుప్పించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్‌ తాజా ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై కేసుల విషయంలోనే సీఎం జగన్‌.. కేంద్ర నాయకులను కలిశారని ఆరోపించారు.. ఢిల్లీలో జగన్ మూడురోజులు ఉన్నారు.. కృష్ణాజలాలు గురించి సీఎం లేఖ ఇచ్చారో లేదో గాని గెజిట్ వచ్చేసిందన్నారు.. కృష్ణా జలాలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఆయన.. ఉమ్మడి ఏపీలో 511, టీఎస్ 216 టీఎంసీలను తిరగదోడదామంటే ఎలా..? అని ప్రశ్నించారు. దీనివలన రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, పోలవరం విషయంలో అంతే, ఎత్తు తగ్గించమన్నారు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో కేంద్రం కోత విధిస్తుందని మండిపడ్డారు రామకృష్ణ.. అన్ని ప్రాంతాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను అభినందించారు సీపీఐ నేత.. ఎన్డీఏలో ఉన్నా బీజేపీ అనుమతి లేకుండానే టీడీపీతో పొత్తు ప్రకటించడం అభినందించాల్సిన విషయం అన్నారు. అయితే, పవన్ కు మాకు అండర్ స్టాండింగ్ లో తేడా ఉందన్నారు. నారా లోకేష్ కు 20 రోజుల్లో 2 నిముషాలు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని విమర్శించారు.. ఇదే సమయంలో.. సీఎం జగన్‌కు గంటల తరబడి మోడీ అపాయింట్‌మెంట్‌ ఇస్తారని మండిపడ్డారు.. ఇక, పవన్‌ కల్యాణ్‌ సరైన సమయంలో బీజేపీని అర్థం చేసుకొంటారని వ్యాఖ్యానించారు సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ.

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే.. ఇవేమీ పట్టించుకోకుండా మీరు సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారు.. చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే స్థితికి మీరు దిగజారారు అని ఆయన అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్‌ పెంచలేదు సరికదా.. మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసి వంట కార్మికులకు ఆర్థిక భారంతో పాటు పనిభారం పెంచారు.. చాలా పాఠశాలల్లో వంట గదులే సక్రమంగా లేవు.. చెట్ల కింద వంటలు కొనసాగుతున్న పరిస్థితి.. దీనివల్ల అక్కడక్కడ మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థకు గురైన సందర్భాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు గత కొన్ని రోజులుగాలు ధర్నాలు చేస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదు మీ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 8 ప్రకారం పెరిగిన వేతనాలను ఏరియర్స్‌ తో సహా వెంటనే చెల్లించాలన్న వారి డిమాండ్లను పట్టించుకోలేదు.. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ ఇంత అధ్వాన్నంగా ఉంటే.. ఆ పరిస్థితులపై ఒక్క సారి కూడా మీరు సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదు అని ఆయన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంలోని సమస్యలతో పాటు కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి.. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

మహిళలపై జరిగే నేరాల విషయంలో కోర్టులు సున్నితంగా వ్యవహరించాలి..
మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు శిక్షను వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి, అతని తల్లి దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. బాధితుడి భార్య విషం కారణంగా మరణించిందని కోర్టు తెలిపింది. అప్పీల్‌ను తోసిపుచ్చుతూ, విధానపరమైన అసంపూర్ణ దర్యాప్తు లేదా సాక్ష్యాధారాలలో లోపాల కారణంగా నేరస్థులు శిక్ష నుండి తప్పించుకోవడానికి కోర్టులు అనుమతించవని భావిస్తున్నట్లు కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇదే జరిగితే నేరస్తులకు శిక్ష తప్పదని బాధితులు పూర్తిగా నిరుత్సాహానికి గురవుతారని, బాధితులు నేరం చేయకుండా ఉంటారని కోర్టు పేర్కొంది.

ఇండియా-కెనడా వివాదంపై స్పందించిన రిషి సునాక్.. ఏమన్నారంటే..?.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య తీవ్ర వివాదాన్ని రాజేసింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంతగా అట్టడుగు స్థానానికి వెళ్లాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ వివాదంపై స్పందించాయి. అమెరికా విచారణకు ఇండియా సహకరించాలని కోరింది. తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఈ వివాదంపై స్పందించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో రిసి సునాక్ మాట్లాడారు. భారత్, కెనడా దౌత్యవివాదం తగ్గుముఖం పడుతుందని తాను భావిస్తున్నట్లు రిషి సునాక్ అన్నారు. ట్రూడో, సునాక్ భారత దౌత్యవివాదంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన తరుణంలో, చట్టాన్ని గౌరవించాలని యూకే పునరుద్ఘాటించింది.

ఫ్లిప్ కార్ట్ వ్యాన్ నుంచి గాల్లోకి రూ.2వేల నోట్లు.. ఎక్కడంటే?
ముంబయిలోని గేట్‌వే వీధులు ఒక ఆశ్చర్యకరమైన సంఘటనకు వేదికగా మారాయి.. ఫ్లిప్‌కార్ట్ ట్రక్ నుంచి గాల్లోకి రూ. 2000 నోట్లు వచ్చాయి.. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నగర జీవితం యొక్క ప్రాపంచిక హడావిడి అకస్మాత్తుగా అంతరాయం కలిగింది. ఒక సినిమాలోని సీన్ లాగా, కరెన్సీ నోట్లు గాలిలో అందంగా ఎగురుతూ కనిపించాయి. మొదట వాటిని చూసి ఆశ్చర్యపోయిన జనాలు , ఊహించని ఆనందంలో త్వరగా మునిగిపోయారు. నగరం యొక్క సాధారణ వేగం నిలిపివేయబడింది మరియు ఉత్సాహం మరియు ఆశ్చర్యకరమైన వాతావరణం ఆక్రమించింది. ఊహించని సంపదల వర్షంతో ఒక్కటయిన చూపరులు, వెలిగిపోయిన ముఖాలతో గుమిగూడారు, ఆశ్చర్యకరమైన గాలులు రొటీన్ నుండి క్షణకాలం తప్పించుకునే అవకాశాన్ని అందిస్తాయి. నగరం యొక్క స్థిరమైన కదలికల మధ్య ఉమ్మడి ఆనందం మరియు ఆశ్చర్యాన్ని పంచుకునే అరుదైన దృశ్యాన్ని సామూహిక ఆనందం యొక్క తరంగం చిత్రీకరించింది.. ఆవిష్కృతమైన దృశ్యాల మధ్య ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఫ్లిప్‌కార్ట్ ట్రక్కులో ఇంత గణనీయమైన నగదు ఎందుకు లోడ్ చేయబడింది? ఇది అసాధారణమైన లోపమా, లేదా కంటికి కనిపించే దానికంటే ఎక్కువ ఉందా? ఈ సంఘటన జరిగిన సమయం, ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు దగ్గరగా ఉండటం, ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

రాళ్లు తీసుకుని కొడతారురా బాబూ.. బోయపాటి లాజిక్కు భలే ఉందే!
బోయపాటి శ్రీను సినిమాలు చూసే వారందరికీ ఆయన సినిమాల్లో లాజిక్ లేని సీన్లు అసలు ఊహకు ఏమాత్రం అందని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన స్కంద సినిమా చూసిన వారైతే అసలు ఇద్దరు ముఖ్యమంత్రులను అసలు ఏ మాత్రం బ్యాగ్రౌండ్ లేని ఒక వ్యక్తి ఎలా ముప్పతిప్పలు పెట్టాడు? అసలు ఆ సీన్లు బోయపాటి శ్రీను ఎలా తెరకెక్కించాడు? ఆ మాత్రం లాజిక్ కూడా లేదా అంటూ పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపించారు. అయితే తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను తన సినిమాల్లో లాజిక్స్ గురించి క్లారిటీ ఇస్తూ తనను తాను కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. నిజానికి ఆయన రామ్ తో చేసిన స్కంద సినిమా అటు సక్సెస్ అని చెప్పలేం ఫెయిల్ అయిందని చెప్పలేము మిక్స్డ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కాస్త వెనకబడే ఉంది. ఇక ఈ సినిమా చూసిన వారందరూ బోయపాటి శ్రీను ముఖ్యమంత్రి అంటే వీధి రౌడీలా భావిస్తున్నాడా ఏంటి? ఒక ట్రాక్టర్ వేసుకుని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి ఇళ్ల మీద పడి విద్వాంసం సృష్టించడం ఏంటి? ఏమాత్రం అయినా నమ్మశక్యంగా ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయం మీద బోయపాటి శ్రీను స్పందిస్తూ ఇప్పుడు సినిమా అనేది ఒక ఊహ, ఒక కల ఏదో పెద్దగానే కందాం, చిన్న కలలు కనడం ఎందుకు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రతిదీ లాజిక్ అని ఆలోచిస్తే కష్టమని సినిమాకి లాజిక్ అవసరం లేదని ఆయన తేల్చి చెప్పేశాడు. సినిమాలో కొన్ని సాంగ్స్ చేస్తాం కదా అవి హీరోలు హీరోయిన్లు రోడ్లమీద డాన్స్ చేస్తున్నట్లు చూపిస్తాం పాటల్లో. నిజంగా అవి అలాగే రోడ్డుమీద చేస్తే జనాలు రాళ్లు తీసుకుని కొడతారు, సినిమాలో కాబట్టి చూస్తూ ఎంజాయ్ చేస్తారు, నిజ జీవితంలో జరగని విషయాలన్నీ సినిమాల్లో జరుగుతున్నట్లుగా చూపిస్తాం, లాజిక్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదని బోయపాటి శ్రీను కామెంట్ చేశారు.

మంత్రి రోజాకు మద్దతుగా నవనీత్ కౌర్.. సిగ్గు లేదా అంటూ బండారుపై ఆగ్రహం!
మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ఈ అంశం మీద కేసులు కూడా అవ్వగా కోర్టుకు వెళ్లి బెయిల్ కూడా తెచ్చుకున్నారు బండారు. ఇక ఇప్పుడు మంత్రి ఆర్కే రోజాకి పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ మంత్రి రోజాకు మద్దతుగా వీడియోలు రిలీజ్ చేయగా ఇప్పుడు మహారాష్ట్ర ఎంపీ, మాజీ సినీ హీరోయిన్ నటి నవనీత్ కౌర్ రాణా కూడా మంత్రి రోజాకు అండగా నిలిచారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. మంత్రి రోజాపై ఇంత దిగజారి మాట్లాడతారా? ఏం మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా? అని అని అంటూ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారు కానీ బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని అన్నారు. మీరు ఏ పార్టీ అనేది నాకు అనవసరం కానీ ఇలా ఒక మహిళను అందునా సినీ రంగంలో సత్తా చాటి మంత్రిగా ఉన్న మహిళను ఇలా మాట్లాడడం ఏమాత్రం బాలేదని అన్నారు. ఎన్నో సినిమాలు ఎంతో మంది హీరోలతో పని చేసిన ఆమెను ఇలా అనడానికి ఎంత ధైర్యం కావాలి ? అని ప్రశ్నించారు. ఒక లీడర్ అయిన మీరు ఇలా ఒక మహిళను గురించి మాట్లాడేప్పుడు ఏమాత్రం ఆలోచన లేకుండా మాట్లాడతారా? ,మీ దగ్గర ఆధారాలు ఉంటె బయటపెట్టండి కానీ ఇలా అనడం సరికాదని అన్నారు. నేను పార్లమెంటులో ఉన్నపుడు మీ ఏపీ తెలంగాణ మంత్రులు నన్ను చాలా గౌరవిస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. ఒక నటిగా, ఎంపీగా, సాధారణ మహిళగా తాను మంత్రి రోజాకు అండగా ఉంటానని ఎంపీ నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. యావత్ మహిళాలోకం రోజాకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Exit mobile version