ఫుడ్ ప్రాసెసెంగ్ యూనిట్లను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. పలు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కార్యరూపం దాల్చనున్నాయి. క్యాంపుకార్యాలయం నుంచి 13 ప్రాజెక్టులకు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో 3 కంపెనీలు ప్రారంభం కాగా.. 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఎంఓయూ ఖరారైంది. మొత్తంగా రాష్ట్రానికి రూ.3008 కోట్ల పెట్టుబడులు రాగా.. 7455 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా సుమారు 91వేలమంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు కాకాణి, గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, సీఎస్ జవహర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల రంగంలో మరో ఏడు ప్రాజెక్టుల పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ 7 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా రూ.2294 కోట్ల పెట్టుబడులు, 4300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరో ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఫుడ్ ప్రాసెసెంగ్ రూ. 714 కోట్ల పెట్టుబడి, 3,155 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ..
దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాసులకు శుభవార్త చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ.. దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించడమే కాదు.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్టు వెల్లడించి గుడ్‌న్యూస్ చెప్పింది.. ఈ నెల 15వ తేదీ నుంచి 2,700 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు పేర్కొంది.. ఇక, ఈ నెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అంటే ఏపీకి వెళ్లినవారి తిరుగు ప్రయాణాల కోసం 2,800 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు వెల్లడించింది.. ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బస్సులు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా తిరుగుతాయని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారుబులు చెబుతున్నారు.. మొత్తంగా 5500 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.. ఇక, స్ధానికంగా జిల్లాల నుంచి విజయవాడకు 880 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది ఏపీఎస్ఆర్టీసీ.. బస్సులకు సంబంధించిన సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా 0866-2570005, 149 నంబర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు.
జగన్ రెడ్డి.. స్కిల్‌ని స్కాం అన్నావు.. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి ప్రధాని పేరు, ఫొటో పెట్టావు..!
జగన్ రెడ్డి.. స్కిల్‌ని స్కాం అన్నావు.. మరి ఈ రోజు ఏయూలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి ప్రధాని పేరు, ఫొటో పెట్టావు.. ఎందుకు అని నిలదీశారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ.. రాష్ట్రం మొత్తం మీద 42 సెంటర్లు లేవన్నావు. ఆ సెంటర్లకు ప్రధాని పేరు, ఫొటో పెట్టావు.. పరికరాలు ఇవ్వలేదన్నావు.. ప్రధాని పేరు, ఫొటో పెట్టావు. మనీ లాండరింగ్ జరిగిందన్నావు.. ప్రధాని పేరు, ఫొటో పెట్టావు.. ఒప్పందాల జీవోలకు పొంతన లేదన్నావు.. ప్రధాని పేరు, ఫొటో పెట్టావు.. బోగస్ ఇన్వాయిస్ లు పెట్టి నిధులు దోచేశారన్నావు.. ప్రధాని పేరు, ఫొటో పెట్టావు… దీంతో.. సీఎం వైఎస్ జగన్ మతలబు ప్రజలకు తెలిసిపోయిందని విమర్శించారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన వైఎస్ జగన్‌కు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదు అని దుయ్యబట్టారు అనురాధ.. చంద్రబాబు నిజాయితీపరులుగా వస్తున్నారని తెలుసుకుని ఈ హడావుడి చేస్తున్నావు అని మండిపడ్డారు. పోలవరానికి ఎన్ని గేట్లు ఉన్నాయో తెలియని వారికి మంత్రి పదవి ఇచ్చారంటూ సెటైర్లు వేసిన ఆమె.. కాపులను ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడిన వారికి మంత్రి పదవి కట్టబెట్టారు.. పూజారులను కొడితే తప్పేంటన్న వారికి మంత్రి పదవి ఇస్తారు.. ఇవేనా? వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గొప్పతనాలు అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ.
టీడీపీ ఆఫీస్‌కు బండారు సత్యనారాయణ.. అందుకే రోజా గురించి మాట్లాడా..!
మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.. దీనిపై సీరియస్ అయిన ఏపీ మహిళా కమిషన్.. బండారుపై కేసులు నమోదు చేయాలంటూ ఏపీ డీజీపీకి లేఖ రాయడం.. ఆ తర్వాత ఆయనపై కేసు.. అరెస్ట్, కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు రావడం అన్ని జరిగిపోయాయి. అయితే, తనకు బెయిల్ వచ్చాక తొలిసారి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు బండారు సత్యనారాయణ.. పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాపై పెట్టిన కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో నిలబడిందన్నారు. ఉరిశిక్ష కైనా సిద్ధం తప్ప దుర్మార్గపు చర్యలతో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మమ్మల్ని భయపెట్ట లేరన్నారు. ఉండే నాలుగు మాసాలైనా బుద్ధి మార్చుకుంటే మంచిదని సీఎం వైఎస్ జగన్‌కు సూచించారు. ఇక, నా సంతకం ఫోర్జరీ జరిగితే నేను చెప్పాలి.. కానీ, హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ అని ప్రభుత్వం చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు బండారు.. మహిళలంటే నాకెంతో గౌరవమన్న ఆయన.. గౌరవంతో బతికే కుటుంబాలపై మంత్రి ఆర్కే రోజా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు కాబట్టే ఆమెకు బుద్ధి చెప్పా అన్నారు. సాటి మహిళల్ని కూడా కించపరిచే మంత్రి రోజాపై నేను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారని చెప్పుకొచ్చారు. మంత్రి ఆర్కే రోజాపై నేను చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా విశ్లేషించుకోవాలని సూచించారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి .
కీలక నిర్ణయాలు.. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ, పసుపు బోర్డుకు ఆమోదం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రూ.889 కోట్లతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యునివర్సిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కృష్ణా వాటర్ వివాదాల పరిష్కారం కోసం కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు కేంద్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి మరో రూ.100 సబ్సిడీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఆగస్టులో ఉజ్వల లబ్ధిదారులకు కేంద్రం రూ. 200 సబ్సిడీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం సబ్సిడీ రూ.300కు చేరింది.
కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ
పీఎం ఉజ్వల పథకం కింద ఎల్‌పీజీ సిలిండర్లు తీసుకుంటున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉజ్వల పథకం కింద లభించే ఎల్‌పీజీ సిలిండర్‌పై ప్రభుత్వం సబ్సిడీని 300 రూపాయలకు పెంచింది. కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉజ్వల పథకం కింద ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ లభించేది. కేంద్ర ప్రభుత్వం నుండి సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ పొందిన తర్వాత, ఢిల్లీలోని ఉజ్వల పథకం లబ్ధిదారులు రూ.603కి 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌ను పొందుతారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ను ముంబైలో రూ.602.50, కోల్‌కతాలో రూ.629, చెన్నైలో రూ.618.50కి పొందుతారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఎల్‌పీజి సిలిండర్‌కు రూ. 200 నుంచి రూ. 300కి పెంచిందని.. కేబినెట్ నిర్ణయాలపై బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
పాక్ వదిలి వెళ్లాలి.. 17 లక్షల మందికి నవంబర్ 1 డెడ్‌లైన్
ఆర్థిక, రాజకీయ అస్థిరత రాజ్యమేలుతున్న పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఇటీవల బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 57 మంది మరణించారు. ఇదిలా ఉంటే ఈ దాడులకు ఆఫ్ఘాన్ జాతీయులు కారణం కావచ్చని పాకిస్తాన్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న ఆఫ్ఘన్ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 1లోగా తమ దేశంలో ఉన్న 17 లక్షల మంది ఆఫ్ఘాన్లు పాకిస్తాస్ వదిలి వెళ్లాలని హుకూం జారీ చేసింది. అనుమతి లేకుండా వచ్చని వారంతా తమ దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. వీరందర్ని పాక్ నుంచి తరిమి వేయడానికి చర్యలు మొదలుపెట్టింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత పాకిస్తాన్‌లోకి ఆఫ్ఘాన్ జాతీయుల వలసలు పెరిగాయి. చాలా మంది పాకిస్తాన్ లోకి శరణార్థులుగా వచ్చారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 13 లక్షల మంది ఆఫ్ఘాన్ పౌరులు శరణార్థులుగా రిజిస్టర్ చేయించుకోగా.. మరో 8.8 లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పత్రాలు పొందారు. వీరితో పాటు మరో 17 లక్షల మంది అక్రమంగా పాకిస్తాన్ లోకి చొరబడ్డారని పాక్ అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగిటి ఇటీవల తెలిపారు.
రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన శాస్త్రవేత్తలు వీరే..
మౌంగి బావెండి, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. “క్వాంటం డాట్‌ల ఆవిష్కరణ, సంశ్లేషణ” కోసం రసాయన శాస్త్రంలో మౌంగి బావెండి, లూయిస్ బ్రూస్ , అలెక్సీ ఎకిమోవ్‌లకు నోబెల్ బహుమతి లభించింది. ఈ ఏడాది నోబెల్ కెమిస్ట్రీ బహుమతి గ్రహీతల పేర్లు లీక్ అయినట్లు, గ్రహీతలను ప్రకటించడానికి కొన్ని గంటల ముందు స్వీడిష్ మీడియా సంస్థలు బుధవారం ప్రచురించాయి. నోబెల్ లీక్‌లు చాలా అరుదు, వివిధ బహుమతులు ప్రదానం చేసే అకాడమీలు విజేతల పేర్లను ప్రకటనల వరకు తెలియకుండా ఉంచడానికి చాలా కష్టపడతాయి. ఆధునిక LED టెలివిజన్ స్క్రీన్‌లు, సోలార్ ప్యానెల్‌లు, వైద్యంలో క్వాంటం డాట్‌లు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి, ఇక్కడ అవి కణితులను తొలగించడంలో సర్జన్లకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడతాయి. నోబెల్ బహుమతి 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ ($1 మిలియన్) నగదు బహుమతిని కలిగి ఉంటుంది. ఈ నోబెల్ అవార్డులను 1901 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. స్వీడెన్కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వీటిని ఇచ్చేవారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ అవార్డులను కొనసాగిస్తున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896 సంవత్సరంలో మరణించారు. వైద్యం, శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక విభాగాల్లో నోబెల్ బహుమతిని ప్రకటిస్తారు. ఈసారి వైద్య రంగంతో ఈ ఈవెంట్ మొదలైంది. గురువారం సాహిత్యానికి నోబెల్ బహుమతిని ప్రకటిస్తారని తెలిసిన విషయమే. అదే సమయంలో శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని, అక్టోబర్ 9న ఆర్థిక శాస్త్ర బహుమతిని ప్రకటించనున్నారు. ఫిజిక్స్, మెడిసిన్ విభాగాల్లో అవార్డులు ప్రకటించిన తర్వాత ఈ వారంలో ప్రదానం చేసిన మూడో నోబెల్ కెమిస్ట్రీ రంగంలో ఉంటుంది. ఫిజిక్స్ విభాగంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఇవ్వనున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2023 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పియరీ అగోస్టినీ, ఫెరెన్క్ క్రౌజ్, అన్నే ఎల్’హుల్లియర్‌లకు అందించాలని నిర్ణయించింది. ఇంతకుముందు కాటలిన్ కారికో, డ్రూ వీస్‌మాన్ వైద్య రంగంలో 2023 నోబెల్ బహుమతిని అందుకున్నారు.
బిగ్ బ్రేకింగ్.. దేవర ఒకటి కాదు రెండు.. కన్ఫర్మ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీఅజిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక మొదటి నుంచి ఈ సినిమా ఒక భాగం కాదు రెండు భాగాలుగా వస్తుందని వార్తలు వినిపించిన విషయం తెల్సిందే. అయితే.. ఈ వార్తపై మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోవడంతో అందరు లైట్ తీసుకున్నారు. కానీ, ఆ వార్త నిజం అని మేకర్స్ అధికారికంగా తెలిపారు. తాజాగా దేవర సినిమా గురించి డైరెక్టర్ శివ కొరటాల ఒక వీడియో ద్వారా మాట్లాడాడు. దేవర సినిమాను మొదట ఒక భాగంగానే ముగించాలని అనుకున్నాం.. కానీ, ఉన్నా కొద్దీ సినిమా నిడివి పెరిగింది.. దీంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. సినిమా షేప్ మారకుండా కథను బట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. “పెద్ద సినిమా.. ఒక బిగ్ కాన్వాస్ లా ఉంటుంది. అంతేకాకుండా ఎంతోమంది స్టార్ క్యాస్టింగ్.. ఎంతో హై వోల్టేజ్ తో ఈ సినిమా మొదలుపెట్టాం.. ముందుకు వెళ్లేకొద్దీ ఇంకా ఇంకా పెరుగుతూ వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఆ తరువాత మాకు, ఎడిటర్ కు ఒక డౌట్ వచ్చింది. సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది.. ఒక్క సీన్ ను కూడా కట్ చేయలేము.. ఒక డైలాగ్ కూడా తీయలేము అని ఫీల్ అయ్యి.. ఆదరాబాదరాగా అన్ని క్యారెక్టర్స్ ను ఒక పార్ట్ లో నే కుదించేయలేం.. ఇంత పెద్ద సినిమాను రెండు భాగాలుగా తీస్తే.. అందరి క్యారెక్టర్స్ ను చాలా డెప్త్ గా చెప్పాలని ఈ డెసిషన్ తీసుకున్నాం. దేవర రెండు భాగాలుగా వస్తుంది” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
రతికతో కిరణ్ అబ్బవరం పెళ్లి.. షాకింగ్ వీడియో రిలీజ్ !
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో మోస్ట్ కాంట్రవర్సీ కంటెస్టెంట్ ఎవరు అంటే దాదాపు అందరూ `రతిక రోజ్` పేరే చెబుతారు. ఆకట్టుకునే అందంతో హౌస్ లోకి వస్తూ వస్తూనే అందర్నీ ఎట్రాక్ట్ చేసిన ఆమె ఆ తరువాత తన బిహేవియర్ తో భారీ నెగెటివిటీని మూటగట్టుకుంది. నాలుగో వారానికే ఇంటి బాట పట్టిన ఆమె ప్రశాంత్, యావర్‌తో ప్రేమ అని చెప్పకుండా టైం పాస్ తరహాలో బిహేవ్ చేయడం వంటి వాటితో ఒక అమ్మాయి ఎలా ఉండకూడదు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఎలిమినేట్ అయ్యాక కూడా రతికపై ట్రోలింగ్ ఆగడం లేదు. ఈ క్రమంలో ఆమెతో పెళ్లి గురించి కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్ చేశారు. కిరణ్ అబ్బవరం మరో రెండు రోజుల్లో `రూల్స్ రంజన్`మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న కిరణ్ సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకు చాలా ఓపిగ్గా కిరణ్ సమాధానాలు ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఒక నెటిజన్ `రూల్స్ రంజన్ హిట్ అయ్యాక నీకు రతిక లాంటి అమ్మాయితో పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నా, ఆల్ ది బెస్ట్` అంటూ ట్వీట్ పెట్టగా ఆ నెటిజన్ ట్వీట్ కు కిరణ్ అబ్బవరం షాకింగ్ రిప్లై ఇచ్చాడు. `ఎందుకమ్మా నామీద నీకంత పగ.. పెళ్లయితే చేసుకుందాం కానీ.. చూద్దాం ఎలాంటి అమ్మాయి వస్తుందో` అంటూ కిరణ్ కామెంట్ చేశాడు. అలా మొత్తానికి రతిక లాంటి అమ్మాయి తనకొద్దని కిరణ్ పరోక్షంగా చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.
బ్రేకింగ్: ‘రణబీర్’కి ఈడీ సమన్లు
నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది. మహదేవ్ గేమింగ్ యాప్ కేసులో విచారణ కోసం ఈడీ ఈ సమన్లు పంపిందని తెలుస్తోంది. అక్టోబర్ 6న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నటుడ్ని ఈడీ కోరింది. రణబీర్ కపూర్ మహాదేవ్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో చాలా మంది బాలీవుడ్ నటులు, గాయకులు దర్యాప్తు సంస్థ ఈడీ స్కానర్‌లో ఉన్నారు. యూఏఈలో జరిగిన ఈ యాప్ ప్రమోటర్ వివాహానికి, సక్సెస్ పార్టీకి ఆయన హాజరు కావడంపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. మహాదేవ్ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కేసులో ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.417 కోట్ల నగదు, ఆస్తులను జప్తు చేసింది. సెంట్రల్ ఏజెన్సీ ఈడీ చెబుతున్న దాని ప్రకారం, దుబాయ్ నుండి రాకెట్ నడుపుతున్న ఇద్దరు కింగ్‌పిన్‌లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ఈ బెట్టింగ్ యాప్ నుంచి రూ. 5,000 కోట్లు సంపాదించారు. ఇక ఈ కంపెనీ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందినవారు. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్ అనేది అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్‌లను ప్రారంభించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేసే ఒక సిండికేట్ అని చెబుతున్నారు. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ UAEలోని సెంట్రల్ హెడ్ ఆఫీస్ నుండి రన్ అవుతుందని ఏజెన్సీ విచారణలో తేలింది. కొత్త వినియోగదారులను, ఫ్రాంచైజీ (ప్యానెల్) అన్వేషకులను ఆకర్షించడానికి బెట్టింగ్ వెబ్‌సైట్‌ల ప్రకటనల కోసం ఇండియాలో కూడా పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేయబడుతుందని గుర్తించారు.
