పవన్ కల్యాణ్‌కు మంత్రి కొట్టు కౌంటర్.. కాపులేమైనా పట్టం కట్టారా..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కౌరవులు అని పవన్ అంటున్నాడు.. కానీ, వైఎస్ జగన్ వెనుక ఎవరున్నారు? అని ప్రశ్నించారు.. కౌరవ సేన అంత చంద్రబాబు నాయుడు వెనుకే ఉందని వ్యాఖ్యానించిన ఆయన.. పవన్ కల్యాణ్‌కు కాపుల గురించి ఏం తెలుసు? అంటూ మండిపడ్డారు.. పవన్ తీసుకునే తింగరి నిర్ణయాలను కాపులు అందరూ సమర్ధించాలని అనుకుంటున్నాడు.. కానీ, కాపులం ఏమైనా పవన్ కల్యాణ్‌కు పట్టం కట్టామా..? అంటూ నిలదీశారు. మరోవైపు.. కాపుల పరువు తీయవద్దు అంటూ పవన్‌కు విజ్ఞప్తి చేశారు.. కాపు పెద్దలను కూర్చో బెట్టి చంద్రబాబుకు మద్దతు ఇద్దాం, అవినీతిపరుడితో పొత్తు పెట్టుకుందాం అని చెప్పాడా? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
నాపై దాడి చేయాలని చూస్తున్నారు.. ఏం జరిగినా డీజీపీదే బాధ్యత
తనపై దాడి చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పెడన కార్యక్రమంలో గుండాలని, క్రిమినల్స్ ని చొప్పించి దాడి చేయాలని చూస్తున్నారు.. పెడన సమావేశంలో గొడవలు సృష్టిస్తే ఊరుకోం అని డీజీపీ, సీఎంలకు చెపుతున్నా.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే డీజీపీదే బాధ్యత అన్నారు. వారాహి యాత్రలో ఏ దాడి జరిగినా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న ఆయన.. పులివెందుల మైండ్ సెట్ ఇక్కడ చూపిస్తే ఊరుకోం అని హెచ్చరించారు. ఎవరు ఏం చేసినా జనసైనికులు ఎదురుదాడికి దిగవద్దు అని సూచించారు. కానీ, ఎవరు జేబులోంచి ఏం తీసినా వారిని కట్టేసి పోలీసు స్టేషన్‌కు కట్టుకెళ్తామని పిలుపునిచ్చారు.. వైఎస్ జగన్ క్రిమినల్ గ్యాంగ్‌లతో ఎటువంటి వేషాలు వేసినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా రేపటి పెడన సభలో దాడి జరిగే అవకాశం అంటూ పవన్ కల్యాణ్ చేసిన సీరియస్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి. మరోవైపు.. 11 అంశాలతో ప్రత్యేకంగా సమస్యల మొరాండం ఇచ్చారు అని వెల్లడించారు పవన్ కల్యాణ్.. జనసేన- టీడీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తాం.. దివ్యాంగుల పట్ల సమాజంలో అందరూ మావతా దృక్పథం చూపించాలని సూచించారు. బధిరులు అని సర్టిఫికేట్ అడిగితే స్పందన సరిగా లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు లాంటిది దివ్యాంగుల పట్ల అమానుషంగా ప్రవర్తించకుండా చట్టం తీసుకురావాలన్నారు. వచ్చే మా ప్రభుత్వంలో దివ్యాంగులకు సంబంధించి ఒక చట్టం తెస్తాం.. రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రణాళికతో దివ్యాంగులకు సహాయపడతాం అని హామీ ఇచ్చారు.
AP లో కొత్త రూల్.. పరీక్షల విధానంలో మార్పులు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల పరీక్షల విధానం లో మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకు పరీక్షలు ఫార్మేటివ్, సమ్మేటివ్ విధానంలో జరిగేవి. కానీ ఇక నుంచి కొత్త విధానంలో పరీక్షలు జరగనున్నాయి. వివరాలలోకి వెళ్తే.. ఇకపై 8వ తరగతి, 9వ తరగతి పరీక్షలు పీరియాడిక్, టర్మ్ విధానములో నిర్వహిణచనున్నట్లు AP ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విధానము కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న 1000 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అవలంభించనున్నారు. 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు పీరియాడిక్ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ)-2 నిర్వహించనున్నారు. నాలుగు పీడబ్ల్యూటీలు పరీక్షలు రెండు టర్మ్ పరీక్షలు ఉంటాయి. నవంబరులో టర్మ్-1 పరీక్షలను నిర్వహించగా టర్మ్-2 పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు అంతర్గత పరీక్షలుంటాయి. పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాత పరీక్ష, 10 మార్కులకు అంతర్గత పరీక్షలుంటాయి. కాగా విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు కచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. కాగా 10వ తరగతిలో 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. 3rd లాంగ్వేజ్ హిందీ ఉండదు. ఇంగ్లిష్ 1st లాంగ్వేజ్ కాగా సెకండ్ లాంగ్వేజ్‌గా తెలుగు ఉంటుంది. 6వ సబ్జెక్టుగా స్కిల్ సబ్జెక్టును అమలు చేయనుండగా 50 మార్కులు థియరీ.. 50 మార్కులు ప్రాక్టికల్స్ ఉంటాయి. విద్యార్థులు ఈ మార్పులు గమనించుకోవాలి.
కారు గ్యారేజీకి పోతోందని నారాజ్ అయితున్నడు.. ‘X’ వేదికగా కేటీఆర్ పై బండి విమర్శలు
మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ‘X’ వేదికగా విమర్శలు గుప్పించారు. పాపం కారు గ్యారేజీకి పోతోందని #TwitterTillu నారాజ్ అయితున్నడని తెలిపారు. నిజామాబాద్‌ల చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నడని పేర్కొన్నారు. కానీ ఏం ఫాయిదా?.. తొమ్మిదేళ్ల మీ దొంగ హామీల దొంగ జపం బట్టబయలైందని ప్రస్తావించారు. అలాగే.. వరంగల్ డల్లాస్ కాలే, కనీసం బస్టాండ్ కూడా రాలే.. వరదలు, బురదలు బోనస్ అన్నారు. నిజామాబాద్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలే.. 100 కుటుంబాలు కూడా బాగుపడలే, 100 ఏళ్లకు సరిపడా దోపిడీ మాత్రం జరిగిందని దుయ్యబట్టారు.
కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిసిన సీపీఎం నేతలు.. ఏం అన్నారంటే..!
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈరోజు నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సీఈసీ బృందం సమీక్షించనుంది. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల బృందాన్ని సీపీఎం నేతలు కలిశారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల తీరుపై వారికి వివరించారు. గత ఎన్నికల్లో బూత్ ఎన్నుకోడానికి ఇబ్బంది అయ్యిందని సీపీఎం నేతలు వారికి తెలిపారు. అంతేకాకుండా.. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. ఓటర్లకి డబ్బు అందిన తరువాతే ఓటు వేశారని అన్నారు. ఆన్లైన్ లో ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం లేదని.. మూడు రోజుల ముందు వరకు అవకాశం కల్పించాలని కోరారు. పోలింగ్ సెంటర్ లో 1000 మంది ఉండకుండా చూడాలని చెప్పామన్నారు. అంతేకాకుండా.. ఎన్నికల్లో డబ్బులు, మందు పంపిణీ కట్టడి చేయాలని కోరినట్లు సీపీఐ నేతలు తెలిపారు. గత ఎన్నికల్లో వందల కోట్ల దొరికాయని.. వాటిపై ఎలాంటి శిక్ష వేశారో చెప్పాలన్నారు. హైదరాబాద్ 59 శాతం పోలింగ్ అవ్వడానికి కారణం.. బూత్ దొరకకనేనని సీపీఐ నేతలు పేర్కొన్నారు.
భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న వారు వీరే..!
2023 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతులను ప్రకటించారు. ఫిజిక్స్ విభాగంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఇవ్వనున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2023 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పియరీ అగోస్టినీ, ఫెరెన్క్ క్రౌజ్, అన్నే ఎల్’హుల్లియర్‌లకు అందించాలని నిర్ణయించింది. ఇంతకుముందు కాటలిన్ కారికో, డ్రూ వీస్‌మాన్ వైద్య రంగంలో 2023 నోబెల్ బహుమతిని అందుకున్నారు. స్ప్లిట్ సెకనులో పరమాణువులను పరిశీలించినందుకు ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. యూఎస్‌లోని ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన పియరీ అగోస్టినీ, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్‌కు చెందిన ఫెరెన్క్ క్రౌజ్, మ్యూనిచ్‌లోని లుడ్విగ్ మాక్సిమిలియన్ యూనివర్శిటీ, స్వీడన్‌లోని లండ్ యూనివర్శిటీకి చెందిన అన్నే ఎల్’హుల్లియర్‌లకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఇంతకుముందు, కాటలిన్ కారికో, డ్రూ వీస్‌మాన్ వైద్య రంగంలో 2023 నోబెల్ బహుమతిని అందుకున్నారు. కొవిడ్-19కి వ్యతిరేకంగా కొవిడా టీకా కోసం నిరంతరంగా కృషి చేసినందుకు గాను ఇద్దరు శాస్త్రవేత్తలకు ఈ అవార్డు లభించింది. మంగళవారం స్టాక్‌హోమ్‌లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ హన్స్ ఎల్‌గ్రెన్ ఈ బహుమతిని ప్రకటించారు. నోబెల్ బహుమతి 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ ($1 మిలియన్) నగదు బహుమతిని కలిగి ఉంటుంది. ఈ నోబెల్ అవార్డులను 1901 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. స్వీడెన్కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వీటిని ఇచ్చేవారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ అవార్డులను కొనసాగిస్తున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896 సంవత్సరంలో మరణించారు. వైద్యం, శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక విభాగాల్లో నోబెల్ బహుమతిని ప్రకటిస్తారు. ఈసారి వైద్య రంగంతో ఈ ఈవెంట్ మొదలైంది. రానున్న రోజుల్లో ఇతర బహుమతులను ప్రకటిస్తారు బుధవారం కెమిస్ట్రీకి, గురువారం సాహిత్యానికి నోబెల్ బహుమతిని ప్రకటిస్తారని తెలిసిన విషయమే. అదే సమయంలో శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని, అక్టోబర్ 9న ఆర్థిక శాస్త్ర బహుమతిని ప్రకటించనున్నారు.
సుమక్క కొడుకు హీరో లుక్.. హిట్ అయితే లక్కే..?
సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చేయననవసరం లేదు. ఆమె లేనిదే ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ జరగవు. ముఖ్యంగా స్టార్ హీరోల ప్రమోషన్స్ అయితే అస్సలు జరగవనే చెప్పాలి. యాంకర్ గా సుమ ఎంతో గుర్తింపును అందుకుంది. ఇక ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే ఇంకోపక్క నటిగా కూడా తన సత్తా చాటుతోంది. గతేడాది జయమ్మ పంచాయితీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల సైతం తనదైన నటనతో మంచి సినిమాల్లో అవకాశాలు అందుకొని మంచి నటుడుగా కొనసాగుతున్నాడు. చిత్ర పరిశ్రమలో నేపోటిజం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ కోవలోకి సుమ కొడుకు రోషన్ కూడా చేరాడు. అవును.. సుమ కొడుకు రోషన్ హీరోగా మారుతున్నాడు. ఇప్పటికే చిన్న చిన్న పాత్రలతో పలు సినిమాల్లో నటించిన రోషన్.. హీరోగా మారుతున్నట్లు సుమ అధికారికంగా ప్రకటించింది.అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ఈ నేపథ్యంలోనే రోషన్ .. తన మేకోవర్ ను తీర్చిదిద్దుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని సమాచారం. ఈ సినిమాను రవికాంత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ముందుతో పోల్చుకొంటే.. రోషన్ లుక్ చాలా మారిందని చెప్పొచ్చు. ఈ సినిమాతో కొడుకు ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని సుమ- రాజీవ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి రోషన్ ఎలాంటి ఎంట్రీ ఇస్తాడో చూడాలి.
కర్ణాటక వెళ్లి ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఎవడ్రా తమిళోడివి గెట్ అవుట్ అన్నారు
హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త తమిళ సినిమా చిత్తా, దానిని చిన్నా పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎమోషనల్‌గా డ్రామాగా రూపొందిన ఈ చిత్రం గురువారం(సెప్టెంబర్ 28)న తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ కర్ణాటకలో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం ప్రారంభం అయిన కాసేపటికే కావేరీ నదీ జలాల విషయంలో ఆందోళన చేస్తున్న కొందరు ఆందోళనకారులు అక్కడికి చేరుకుని ప్రెస్‌మీట్ ఆపేయాలని తమిళ రాష్ట్రంతో నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో ఒక తమిళ నటుడు తమ ప్రాంతంలో ప్రెస్‌మీట్ నిర్వహించడంపై ఆందోళకారులు అసహనం వ్యక్తం చేశారు. సమావేశాన్ని వెంటనే నిలిపివేసి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా సిద్దూ అలానే వెళ్ళిపోయాడు. ఆ తరువాత శివన్న వంటివారు ఆయనకు కన్నడ పరిశ్రమ తరపున క్షమాపణలు చెప్పారు. ఇక తాజాగా హైదరాబాద్ ప్రెస్ మీట్ లో ఈ విషయం గురించి సిద్దార్థ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ కర్ణాటక వెళ్లి ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఎవడ్రా తమిళోడివి గెట్ అవుట్ అన్నారు నన్ను. ఏదో ఒక రోజు ఒక సినిమా నేను తీస్తాను, అమ్మ తోడు ఇంత కన్నా బెటర్ సినిమా నేను తీయలేను అని చెప్పే పరిస్థితి నాకు వస్తుందని సిద్దార్థ్ అన్నారు.
