చంద్రబాబు భద్రతపై కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన.. టీడీపీ అధినేత లేఖపై ఆవేదన
తన ప్రాణాలకు ముప్పు ఉందని చంద్రబాబు రాసిన లేఖ తీవ్రంగా కలచివేస్తోందన్నారు నారా భువనేశ్వరి.. జైల్లో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మేం మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాం… ఆ జైలు గోడల వెనుకున్న నా భర్త భద్రత కోసం ప్రార్థిస్తున్నాను అన్నారు. రాష్ట్ర సోదరీమణులు అంతా నా ప్రార్ధనలో భాగస్వాములు కావాలని కోరుతున్నా.. మన ప్రార్థనలు చంద్రబాబుకి రక్షణ కవచంగా ఏర్పడాలని ఆకాక్షించారు. చంద్రబాబు ఈ కష్టాల నుంచి క్షేమంగా బయటపడేలా మనవంతు ప్రయత్నం చేద్దాం అని పిలుపునిచ్చారు. చంద్రబాబుపై పెట్టినవి ముమ్మాటికీ తప్పుడు కేసులే అన్నారు నారా భువనేశ్వరి.. మరోవైపు.. భద్రతా సమస్యలను వివరిస్తూ చంద్రబాబు రాసిన లేఖ తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు నారా బ్రహ్మణి.. చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. కాగా, నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారు. నా పరువు, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. నాపై కుట్ర పన్నుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఓ లేఖ వచ్చింది. అయితే ఆ లేఖపై ఇప్పటివరకు పోలీసు అధికారులు ఏ విచారణ చేపట్టలేదు’ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.. రాజమండ్రి జైలులో ఎన్నో ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరారు. తోటలో ఉన్న కొందరు ఖైదీలు గంజాయిని తీసుకున్నారు. జైలులో ఉన్న ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడినవారే.. కొంతమంది ఖైదీల వల్ల నా భద్రతకు ముప్పు పొంచి ఉందన్నారు.. అక్టోబర్ 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా ఓ డ్రోన్ ఎగిరింది. ములాఖత్‌లో భాగంగా నన్ను కలుస్తున్న వారి చిత్రాల కోసం డ్రోన్ ఉపయోగిస్తున్నారు. నాతో పాటు నా కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం ఉందంటూ చంద్రబాబు లేఖలో రాసుకురావడం చర్చగా మారింది.
అంబటి రాంబాబుపై దాడికి యత్నం.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి..
ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఖమ్మంలో అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు.. అయితే, ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నన్ను భౌతికంగా లేకుండా చేస్తే రూ. 50 లక్షల బహుమానం ఇస్తామని అప్పుడు ప్రకటించారు.. ఇవాళ భౌతికంగా నా పై దాడి చేయటానికే వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్ కు, ఈ దాడికి మధ్య సంబంధం ఉందేమో అన్న అనుమానం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఒక నిశ్చితార్థం కోసం నిన్న ఖమ్మం వెళ్లాను.. వరుసగా రెండు సంఘటనలు జరిగాయి.. ఇవాళ ఉదయం నేను బస చేసిన హోటల్ దగ్గర కొంత మంది నాపై దౌర్జన్యం చేశారు.. టీడీపీగా చెప్పుకుంటున్న కొంత మంది కర్రలతో వచ్చారు.. నేను వ్యక్తిగత కార్యక్రమంపై వెళ్లాను.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.. ఏయ్.. అంబటి రాంబాబు నిన్ను వేసేస్తాం అని అరిచారు అంటూ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన చూసి తాను ఆశ్చర్య పోయాను అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. గత ఏడాది కూడా ఒక సామాజిక వర్గ సమావేశంలో ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశారు.. నన్ను భౌతికంగా లేకుండా చేస్తే 50 లక్షల బహుమానం ఇస్తామని అప్పుడు ప్రకటించారు, ఇవాళ భౌతికంగా నా పై దాడి చేయటానికే వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ సంఘటనలో కొంతమందిని ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు అని తెలిపారు.. అయితే, ఏమిటి ఈ కులోన్మాదం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కులోన్మాదంతోనే వంగవీటి రంగాను నడిరోడ్డు పై హత్య చేశారని గుర్తుచేశారు.
చంద్రబాబుకు బెయిల్ వచ్చే ఐడియా చెప్పిన అంబటి.. ఆ ఒక్క పని చేస్తే చాలు..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, ఆయన భద్రతపై ఆది నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు.. అయితే, తాజాగా, తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు మరియు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాయడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. కానీ, చంద్రబాబు లేఖపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి అంబటి రాంబాబు.. ఇదే సమయంలో.. చంద్రబాబుకు వెంటనే బెయిల్ వచ్చే ఓ ఐడియా కూడా చెప్పుకొచ్చారు.. ఓవైపు చంద్రబాబుకు ఆరోగ్యం బాగో లేదని అంటున్నారు.. మళ్లీ ప్రాణహాని ఉందని అంటున్నారు.. ఈ రెండు వాదనలు గందరగోళంగా ఉన్నాయన్నారు మంత్రి అంబటి రాంబాబు.. బెయిల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం కోసమే ఈ ఆందోళనలు అని నా అభిప్రాయం అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక, చంద్రబాబుకు అంబటి ఓ ఉచిత సలహా ఇచ్చారు.. ఒక పని చేస్తే చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందన్న ఆయన.. విదేశాలకు పంపించిన తన మాజీ పీఏ శ్రీనివాస్ ను వెనక్కి పిలిపించాలని.. శ్రీనివాస్ వెనక్కి వస్తే.. చంద్రబాబుకు వెంటనే బెయిల్ లభించే అవకాశం ఉందన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అతన్ని విచారించాల్సిన అవసరం ఉందని.. చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు.
ఖమ్మం వేదికగా తుమ్మల, పొంగులేటిపై కేసీఆర్ హాట్ కామెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఖమ్మం నేతలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరిన వాళ్లు చేస్తున్న విమర్శలకు కేసీఆర్ పాలేరు వేదికగానే కౌంటర్ ఎటాక్ చేశారు. నరం లేని నాలుక ఎన్నయినా మాట్లాడుతుంది.. నిన్నటి వరకు కేసీఆర్ వల్లే ఖమ్మంకు మోక్షం కలిగిందని పొగిడిన వాళ్లే.. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని కేసీఆర్ ధ్వజమెత్తారు. అయితే, తుమ్మల నాగేశ్వరరావు పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయాడు.. తుమ్మల ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రి పదవి ఇచ్చా.. మళ్లీ ఉపఎన్నికల్లో గెలిపించుకున్నాం.. 5 ఏళ్లు జిల్లాను ఆయనకు అప్పగిస్తే ఆయన చేసింది గుండు సున్నా అంటూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా.. లేక తుమ్మల బీఆర్ఎస్‌కు అన్యాయం చేశారా?.. అని సీఎం కేసీఆర్ అడిగారు. పదవుల కోసం పార్టీలు మారే మన మధ్యే ఉన్నారని.. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పుకొచ్చారు. డబ్బు, అహంకారంతో వచ్చే వాళ్లకు ఛాన్స్ ఇవ్వొద్దన్నారు. ఆవకాశం ఇస్తే వాళ్లు గెలుస్తారు.. కానీ ప్రజలు ఓడిపోతారని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ఉద్యమాల గడ్డ, ఈ జిల్లా ప్రజలు చైత్యనవంతులు.. మద్యం, డబ్బుతో వచ్చే వారికి ఓటు వేయకుండా.. పార్టీల వైఖరిని పరిశీలించి ఓటు వేయాలని బీఆర్ఎస్ అధినేత సూచించారు.
కేసీఆర్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకం..
సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గంలోని వట్ పల్లి మండలం పోతులబొగూడలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే నయవంచన, ఓ నాటకం.. కేసీఆర్ అంటే నమ్మకం.. విశ్వసనీయతకు మారు పేరు కేసీఆర్.. తెలంగాణను నిలబెట్టుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు ఆగం చేయాలని చూస్తున్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యం పక్కనున్న కర్ణాటక పరిస్థితులే.. కాంగ్రెస్ అంటేనే ఝూటాకోర్ పార్టీ.. 2009లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అంటూ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసోళ్లను నమ్మితే మోసపోతాం.. కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోంది.. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం దండగ చేస్తే.. కేసీఆర్ పండుగ జేసిండు అని ఆయన అన్నారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ మంచి మెజార్టితో గెలుస్తామని అంటున్నాయి.. పనితనం తప్ప, పగతనం తెలియని నాయకుడు కేసీఆర్.. లేదంటే కాంగ్రెస్ వాళ్ళు సగం మంది జైల్లో ఉండేవారు అని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ఇక, నాడు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వెళ్తే.. నేడు వలసలు వాపస్ అయ్యాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం చేస్తుంది.. కళ్ళ ముందు, ఇంటి ముందు కనిపించిన అభివృద్ధిని నమ్మాలి అని ఆయన తెలిపారు. మోసపోతే, గోస పడతాం అని చెప్పుకొచ్చారు.
హిమాచల్ ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా గత శుక్రవారం ఆయన సిమ్లా ఆసుపత్రిలో చేరారు. కానీ రాష్ట్రంలో ఆ రకమైన చికిత్స అందుబాటులో లేకపోవడంతో సీఎంను ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఆయన ఈ రోజు ఉదయం 11.20 గంటలకు అడ్మిట్ అయ్యారు. డాక్టర్ ప్రమోద్ గార్గ్ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. డాక్టర్ గార్గ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి అధిపతి. డాక్టర్ ప్రకారం, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తేలికపాటి నుంచి తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్‌తో బాధపడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ ప్రధాన మీడియా సలహాదారు నరేష్ చౌహాన్ మాట్లాడుతూ.. తాను గత చాలా రోజులుగా ప్రయాణిస్తున్నానని, ఈ సమయంలో బయటి ఆహారాన్ని తిన్నారని చెప్పారు. దీంతో సీఎంకు కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చిందని వెల్లడించారు.
జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సంబంధం లేదు.. యూకే పార్లమెంట్‌లో పీఓకే ప్రొఫెసర్..
జమ్ము కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్‌కి సంబంధమే లేదని, పాక్ చట్టబద్ధమైన పార్టీనే కాదని పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)కి చెందిన రాజకీయ కార్యకర్త, ప్రొఫెసర్ సజ్జాద్ రజా అన్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజల్ని పాకిస్తాన్ జంతువుల్లా చూస్తోందని, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సౌకర్యాలను పొందే హక్కు ఉందని ఆయన అన్నారు. కొంతమంది బ్రిటీష్ ఎంపీలతో సహా పలువురు వక్తలు ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీరీ పండిట్ల పోరాటాలు, జమ్మూ కాశ్మీర్ పురోగతిపై చర్చించారు. 1947 అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్ భారత్ లో చేరి 76 ఏళ్లు అయిన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని జరిపారు. జమ్మూ కాశ్మీర్ పై పాకిస్తాన్ కి హక్కు లేదని సజ్జద్ రజా స్పష్టం చేశారు. రజా పీఓకేలో నేషన్ ఈక్వాలిటీ పార్టీకి చెందిన వారు. జమ్మూ కాశ్మీర్ వివాదంలో రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయని, ఒకటి భారత్ కాగా.. రెండోడి జమ్మూ కాశ్మీర్ అని ఆయన అన్నారు.
బందీలను విడుదలకు హమాస్ సిద్ధమన్న ఇరాన్.. కానీ ఒక కండిషన్ అంటూ మెలిక..
ఇజ్రాయిల్-హమాస్ మధ్య అక్టోబర్ 7న మొదలైన యుద్ధం భీకరంగా సాగుతోంది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1400 మందిని చంపారు, 200 మంది కన్నా ఎక్కువ మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లారు. అయితే బందీలను సురక్షితంగా విడిపించేందుకు ఇజ్రాయిల్ రెస్క్యూ ఆపరేషన్, భూతల దాడులకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో మాట్లాడిని ఇరాన్ విదేశాంగమంత్రి హుస్సేర్ అమిరబ్దల్లాహియాన్.. బందీలను వదిలేందుకు హమాస్ సిద్ధంగా ఉందని, అయితే అందుకు ఇజ్రాయిల్ జైళ్లలో మగ్గుతున్న 6000 మంది పాలస్తీనియన్లను కూడా విడుదల చేయాలంటూ షరతు పెట్టారు. వీరిని విడిపించేందుకు ప్రపంచం మద్దతు ఇవ్వాలని ఆయన గురువారం యూఎన్ జనరల్ అసెంబ్లీలో కోరాడు.
వన్ ప్లస్ ఓపెన్ ఫోన్ కొనాలంటే ఇదే మంచి ఛాన్స్… ఏకంగా 11 వేలు డిస్కౌంట్.. ఎలా అంటే?
చైనాకు చెందిన సుప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను అంటే వన్‌ప్లస్ ఓపెన్‌ను అక్టోబర్ 19న భారతదేశంలో విడుదల చేసింది. తాజాగా ఈ రోజు కంపెనీ ఈ పరికరాన్ని మొదటిసారిగా అమ్మెందుకు అందుబాటులోకి తెస్తోంది. ఈ సేల్ కింద కస్టమర్లకు అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఇది కంపెనీ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ కావడంతో కంపెనీ అనేక మంచి ఫీచర్లు, అప్‌డేట్‌లను ఈ ఫోనులో ప్రవేశపెట్టింది. ఒక రకంగా ఈ ఫోన్ కి ప్రత్యక్ష పోటీ Samsung Z Fold 5తో ఉంది. ఇక ఈ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 48MP ట్రిపుల్ కెమెరా సెటప్, Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంది.
శంకర్ దాదా MBBS రీరిలీజ్ ట్రైలర్.. ఆయన ఇప్పుడు లేరు.. బాధగా ఉంది
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక 2004లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రిలీజ్ అయిన మున్నాభాయ్ MBBS కు రీమేక్ గా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాను ఇప్పుడు మెగా ప్రొడక్షన్స్ ద్వారా నాగబాబు నవంబర్ 4న భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రీరిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాగబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడుతూ.. “ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ప్రతీ 20 ఏళ్లకు ఓ జనరేషన్ మారుతుంటుంది. టీవీ, యూట్యూబ్‌లో పాత సినిమాలను చూడరు. కానీ ఇలాంటి సినిమాలకు రిపీటెడ్ ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు థియేటర్లో రిపీటెడ్ రన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఓటీటీ, చానెళ్లకు సినిమాలు వెళ్లిపోతున్నాయి. ఇలాంటి సినిమాలను థియేటర్లోనే ఎక్స్‌పీరియెన్స్ చేయాలి. మళ్లీ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. అప్పుడు అన్నయ్య గారు ఎంతో అందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏదో అలా వస్తే చిన్న సీన్ చేయించారు. వైష్ణవ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. నా ఫ్రెండ్ ఆహుతి ప్రసాద్ ఇప్పుడు లేరు. ట్రైలర్ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి” అని తెలిపాడు.
36 ఏళ్ళ తరువాత ‘నాయకుడు’.. మళ్లీ వస్తున్నాడు అంటే..
సాధారణంగా ఒక హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే ప్రేక్షకుల చూపు మొత్తం దానిమీదనే ఉంటుంది. అలాంటింది.. 36 ఏళ్ళ తరువాత ఆ హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే.. వేరే లెవెల్ అని చెప్పాలి. లోక నాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో 1987 లో నాయకన్ అనే సినిమా వచ్చింది. తెలుగులో నాయకుడు అనే పేరుతో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత దాదాపు 36 ఏళ్లు ఈ కాంబో రిపీట్ అయ్యింది. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం KH234. విక్రమ్ సినిమా తరువాత జోరు పెంచిన కమల్.. ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక ఈ సినిమాను కూడా కమల్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తో పాటు మద్రాస్ టాకీస్ & రెడ్ జెయింట్ మూవీస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ పూజా కార్యక్రమం వేడుకలో కమల్ లుక్ మాత్రం అభిమానులు తెగ ఆకర్షిస్తుంది. అప్పటికి ఇప్పటికి వయస్సు పెరిగిందే కానీ, కమల్ లో ఉన్న నాయకన్ ఇంకా అలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని టక్ తో నాయకుడును మరోసారి గుర్తుచేశాడు. మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం కావడం, కమల్ తో ఇన్నేళ్ల తరువాత మరో సినిమా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
