భువనేశ్వరి, పురంధేశ్వరికి బొత్స కౌంటర్..
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరిపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓ వైపు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. ‘న్యాయం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి యాత్ర ప్రారంభించగా.. మరోవైపు ఏపీ సర్కార్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు పురంధేశ్వరి.. అయితే, ఒకేసారి ఇద్దరిపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స.. చంద్రబాబు అరెస్ట్‌పై సాక్ష్యాధారాలు ఉన్నాయి అని న్యాయస్థానం చెప్పిందన్న బొత్స.. న్యాయస్థానం చెప్పింది కూడా తప్పు అనడం విడ్డూరం అన్నారు. న్యాయస్థానం మీద పోరాడం చేస్తున్నారా? న్యాయస్థానానికి తప్పు ఆపాదిస్తున్నారా? భువనేశ్వరి చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇక, మద్యం అమ్మకాలపై బీజేపీ అధిష్టానికి, కేంద్ర ప్రభుత్వానికి పురంధేశ్వరి ఫిర్యాదు చేయడంపై స్పందించిన బొత్స.. మద్యం అమ్మకాలపై పురంధేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేశారు.. దానిపై ఎలాంటి దర్యాప్తు చేపట్టినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.. మరోవైపు.. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అన్ని చర్యలు చేపడుతున్నాం అన్నారు. అన్ని విధాలా సామాజిక న్యాయం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. గత ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరగలేదని విమర్శించారు. ఇక, టీడీపీ, జనసేన ప్రజల్లో లేదు, తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఏదో బలం ఉందని చూపించుకునేందుకు టీడీపీ, జనసేన పార్టీలు తాపత్రయ పడుతున్నాయి.. మేం ఏం తప్పు చేశామో, మమ్మల్ని ఎందుకు ఆదరించకూడదో చెప్పాలని సవాల్ చేశారు.. మొత్తంగా.. ఒకే సారి పురంధేశ్వరి, భువనేశ్వరికి కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి అంబటి.. ఇంకా దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు..!
ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు పోలవరంలో పర్యటించారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డి వాటరింగ్ పనులపై ఆరా తీసిన ఆయన.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఉన్న సీ ఫేజ్ నీటి మళ్లింపు పనులను అడిగి తెలుసుకున్నారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు.. ప్రాజెక్టు పనులకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించాం.. లోయర్, అప్పర్ కాఫర్ డ్యాంల మధ్య ఏరియాలో డీ వాటర్ వర్క్స్ జరుగుతోందని వెల్లడించారు.. ఇక, డీ వాటర్ వర్క్ అనంతరం వైబ్రో కాంపాక్ట్ పనులు మొదలవుతాయన్నారు అంబటి.. మరోవైపు.. పోలవరం లోయర్, అప్పర్ కాఫర్ డ్యాంల మధ్య.. సీఫేస్ ఎక్కువ ఉండటంతో పనులకు ఆటంకం కలుగుతుందని తెలిపారు మంత్రి అంబటి.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, దానికి సమాంతరంగా కొత్తది కట్టే అంశంలో కేంద్ర జలశక్తి శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.. కేంద్ర నిర్ణయాన్ని బట్టి.. కొత్త డయాఫ్రమ్ వాల్ విషయంలో ముందుకు వెళ్లనున్నట్టు వెల్లడించారు.. ఇక, నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు.. 41.15 కాంటూరు వరకు గత ప్రభుత్వం హయాంలో వేసిన అంచనాకు నేటికి ఖర్చు పెరిగిపోయిందన్న ఆయన.. 41.15 కాంటూరు వరకు రూ.31,625 కోట్లతో సీడబ్ల్యూసీ రివైజ్డ్ కాస్ట్ కమిటీకి బిల్లు పంపించామని.. 45.72 కాంటూరు వరకు మరో రూ.16 వేలు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు.. 41.15 కాంటూరు వరకు పూర్తియ్యాక మిగిలిన వాటి గురించి చర్యలు తీసుకుంటామన్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్టుకు.. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం వైఎస్ జగన్ కలిసిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి అంబటి రాంబాబు.
ప్రతి నెల 52 జాబ్ మేళాలు.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఆన్‌లైన్ ట్రైనింగ్..!
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 52 జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మాన్ అజయ్ రెడ్డి.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా రెండో సారి అవకాశం దక్కించుకున్నారు అజయ్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండోసారి అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి జిల్లాలో జాబ్ మేళాలు పెడుతున్నాం.. ప్రతి నెల 52 జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.. ఇక, ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఆన్ లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం అని పేర్కొన్నారు. పదో తరగతి నుండి ఇంజనీరింగ్ వరకు డ్రాప్ అవుట్స్ గుర్తించి శిక్షణ ఇస్తున్నాం అని తెలిపారు. అయితే, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే కాలేజ్ లు కొంత ఆలస్యం అయ్యాయి.. సాధ్యమైనంత త్వరగా కాలేజ్ లు ప్రారంభిస్తాం అని తెలిపారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మాన్ అజయ్ రెడ్డి.
రేపటి నుంచి వైసీపీ బస్సు యాత్ర.. పోస్టర్ ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ వరుస యాత్రలతో హోరెత్తిపోతోంది.. ఓ వైపు ఈ రోజు నుంచి నారా భువనేశ్వరి యాత్ర ప్రారంభించగా.. ఇక, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి బస్సు యాత్రలు ప్రారంభించనుంది.. సామాజిక సాధికార యాత్ర పేరుతో.. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా బస్సు యాత్ర సాగించనుంది వైసీపీ.. రేపు ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.. ఈ సందర్భంగా.. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున.. పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో 3 దశల్లో సామాజిక సాధికార యాత్ర సాగుతుందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఏ రకంగా జరిగిందో ప్రజలకు వివరిస్తాం.. సామాజిక ధర్మం పాటించిన ఎకైక నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. పెత్తందార్లకు, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ ఒక తాటిపై నిలిచి సామాజిక భేరి వినిపించనున్నాం అన్నారు. రేపు ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. కేబినెట్ నుంచి అన్ని పోస్టుల్లో సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్ద పీట వేశారని ప్రశంసలు కురిపించారు. ఈ రోజుకు అయినా నిజం గెలిచింది కనుకే చంద్రబాబు జైల్లో ఉన్నాడు అని పేర్కొన్నారు మంత్రి జోగి రమేష్.. సామాజిక సాధికార యాత్ర పోస్టర్ రిలీజ్ చేసిన సందర్భంగా.. భువనేశ్వరికి కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.. భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కాదు పాపపు పరిహార యాత్ర చేస్తే బాగుండేదని సెటైర్లు వేశారు.. ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచినప్పటి నుంచి చేసిన పాపాలకు పరిహారం చేసే విధంగా యాత్ర చేయాల్సిందన్నారు.
అట్టహాసంగా అలయ్-బలయ్ కార్యక్రమం.. హాజరైన ప్రముఖులు
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రతీ ఏడాది దసరా మహోత్సవం అనంతరం బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ఘనంగా నిర్వహించారు. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ లక్ష్మణ్, ఆచార్య కోదండరామ్, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్, కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారికి బండారు దత్తాత్రేయ సాదరంగా స్వాగతం పలికారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథుల కోసం చేసిన వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నర్సాపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి.. బీఫాం అందజేసిన కేసీఆర్
నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…‘‘ మదన్ రెడ్డి నాతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏళ్ల నుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాల మీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుంచి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. వారి సీనియారిటిని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ ముఖ్య కార్యవర్గాన్ని అభినందిస్తున్నాను. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్‌లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాద రహితుడు, సౌమ్యుడు మదన్ రెడ్డి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సి ఉంది. నాతో పాటు కలిసి సునీతకు నర్సాపూర్ నియోజకవర్గ బీఫామ్ ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించింది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు. వారికి నా ధన్యవాదాలు, అభినందనలు ’’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ బీఫాం అందజేసిన సమయంలో మదన్‌రెడ్డితో పాటు మంత్రి హరీశ్ రావు, తదితరులు ఉన్నారు.
పుల్వామా, అదానీ గురించి సత్యపాల్ మాలిక్ నాతో చర్చించారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య జరిగిన సమావేశం గురించి ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. తామిద్దరం పుల్వామా దాడి, జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. అదానీ వ్యవహారం గురించి చర్చించినట్లు వెల్లడించారు. ఇద్దరి మధ్య ఈ భేటీ ఈడీ, సీబీఐల ప్రయేయాన్ని పెంచుతుందా..? అంటూ కేంద్రంపై వ్యంగాస్త్రాలు సంధించారు. పుల్వామా, రైతుల నిరసన, అగ్నివీర్ వంటి అంశాలపై గవర్నర్, మాజీ రైతు నాయకుడు, మాజీ ఎంపీ సత్యపాల్ మాలిక్ తో ఆసక్తికరమైన చర్చ అంటూ రాహుల్ గాంధీ అన్నారు. ఇరువురి మధ్య చర్చల సమయంలో రాహుల్ గాంధీ, సత్యపాల్ మాలిక్ రాజకీయ జీవితం గురించి అడిగి తెలుసుకున్నారు. తాను 1973 నుంచి రాజకీయ జీవితంలో ఉన్నానని మాలిక్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ గురించి అడిగినప్పుడు.. జమ్మూ కాశ్మీర్ ని ఫోర్సెస్, ఆర్మీ కానీ నిర్వహించలేవని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా తక్షణమే ఇవ్వాలని, ఆర్టికల్ 370 రద్దు కన్నా, రాష్ట్ర హోదా తీసేయడం వారిని ఎక్కువగా బాధించిందని సత్యపాల్ మాలిక్ అన్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారు, ప్రతీ చోటా ఉగ్రవాద సంబంధిత సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. తాను పుల్వామా విషయంలో హెచ్చరికలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ గాంధీతో ప్రస్తావించారు. దీనిని వారు ఓట్ల కోసం ఉపయోగించుకున్నారని పరోక్షంగా బీజేపీని నిందించారు.
“హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ కాదట”.. టర్కీ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు..
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటే టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అక్టోబర్ 7న పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది అమయాకు ప్రజలు, పిల్లలు, మహిళలు చనిపోయారు. ఈ దాడి ప్రస్తుతం ఇజ్రాయిల్, హమాస్ మధ్య తీవ్ర యుద్ధానికి కారణంమైమది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇదిలా ఉంటే టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ బుధవారం మాట్లాడుతూ.. హమాస్ ఉగ్రవాద సంస్థ కాదని, తమ భూమిని రక్షించుకోవడానికి పోరాటం చేస్తున్న లిబరేషన్ గ్రూప్(విముక్తి కోసం పోరాడుతున్న)గా అభివర్ణించాడు. దేశ పార్లమెంటులో తన పార్టీ చట్టసభ సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ఎర్డోగాన్ ఇజ్రాయెల్ మరియు హమాస్‌లను తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని కూడా కోరారు. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొనేందుకు ముస్లిం దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాలని ఆయన అన్నారు.
మగాళ్లు భార్యలకు కూడా చెప్పలేని విషయాలేంటో తెలుసా?
ఆడవాళ్లకు మాత్రమె కోరికలు ఉంటాయంటే అది తప్పే.. మగ వాళ్లకు కూడా కొన్ని ఫీలింగ్స్, ఎన్నో చెప్పుకోలేని కోరికలు ఉంటాయి.. అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరు.. వారిలో కూడా చాలా లోతు ఉంటుంది. వారి వ్యక్తిత్వంలో, వ్యక్తిగత జీవితంలో చాలా పొరలు ఉంటాయి. దాని కింద భావోద్వేగాలు, కోరికలను అణిచిపెట్టి ఉంటారు. అబ్బాయిలు కూడా రహస్యాలను దాచిపెట్టగలరని చాలా మంది లేడీస్‌కు తెలియదు. కొందరు మగవాళ్ళు తమ భార్యలకు కూడా చెప్పలేని కొన్ని విషయాలు ఉంటాయట.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఏదైనా జరిగితే నన్ను కాపాడు.. నాకు నీ సపోర్ట్ కావాలని మహిళలు అడిగినట్లుగా పురుషులు అడగరు, అడగలేరు. కానీ వారికి ఆ అవసరం ఉంటుంది. తమను ఎవరైనా ప్రేమించాలని, కష్ట సమయాల్లో వారికి మద్దతు ఇవ్వాలని, ఒత్తిడి నుండి బయటపడటానికి సహాయం చేయాలని వారు కూడా కోరుకుంటారు. కానీ నోరు తెరిచి అడగలేరు. జీవిత భాగస్వామికి కూడా ఈ విషయం చెప్పరు. భయాన్ని, బాధను బలహీనతగా అనుకోవడం వల్ల చాలా మంది పురుషులు వాటిని బహిరంగంగా వ్యక్తపరచడానికి ఇష్టపడరు. భయం గురించి చెప్పినా, బాధ పడుతున్నామని ఎవరికైనా తెలిస్తే చులకన అయిపోతామని, హేలన చేస్తారన్న భయం వారిని భావోద్వేగాల గురించి చెప్పకుండా చేస్తుంది.. ఎవరైనా దగ్గరి వ్యక్తులు, సన్నిహితులు, ప్రియమైన వారు, కుటుంబసభ్యులను కోల్పోతే ఆ బాధను కూడా దిగమింగుకుంటారు.. కానీ బాధను పైకి చెప్పరు.. ముఖ్యంగా ఏడవరు.. లోలోపల దాని గురించి బాధ పడతారు..
దేవరకొండ ‘ఖుషీ’ని వదలట్లేదు!
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం మాత్రమే కాదు కలెక్షన్స్ కూడా తెచ్చి పెట్టింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవి .ఒక జంట ప్రేమకు అడ్డురావనే సందేశాన్నిస్తూ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఖుషిని రూపొందించాడు దర్శకుడు శివ నిర్వాణ. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా థియేటర్స్ లో రిలీజై ఘన విజయాన్ని సాధించిన ఖుషి సినిమా లో విప్లవ్ గా విజయ్, ఆరాధ్యగా సమంత నటన ఆడియెన్స్ ను ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ ఖుషీ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి అక్కడ కూడా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇండియా వైడ్ హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ అయిన చాలా రోజులు టాప్ 1గా ట్రెండ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ కు అమితమైన రెస్పాన్స్ వస్తోందని, నెట్ ఫ్లిక్స్ ఇండియాలో కనుక పరిశీలిస్తే టాప్ 10లో 7 ప్లేస్ లో ట్రెండింగ్ గా ఉందని తాజాగా మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ పరశురామ్ డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమా మీద అంచనాలు ఏర్పరచింది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు టీమ్.
