NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

వల్లభనేని వంశీపై మండిపడ్డ పవన్‌.. ఒక ఓటు అటు.. ఒకటి ఇటు అంటున్నాడట..!
గన్నవరం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్‌లో వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివేకం కలిగిన నాయకుడు అని అనుకున్నాను.. పాలసీ పరంగా విబేధాలు ఉంటే మాట్లాడవచ్చు.. కానీ, దానికి ఒక పరిమితి ఉంటుంది.. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ జనసేనకి, ఎమ్మెల్యే తనకు ఓటు వేయాలని వంశీ కోరుతున్నారట అది సరికాదు అని హితవుపలికారు.. ఇక, ఎన్టీఆర్ కుమార్తెపై వల్లభనేని వంశీ.. అసెంబ్లీలో మాట్లాడటం నాకు బాధ కలిగించిందన్నారు పవన్‌.. నారా భువనేశ్వరిని కించపరచడం బాధ కలిగించిందన్న ఆయన.. వంశీకి జనసేన శ్రేణులు ఓట్లు వేస్తే.. స్త్రీని అగౌరవపరిచే వారిని ప్రోత్సహించటం అవుతుందన్నారు. ఇక, మరో నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రికి ఎన్నికలు ఉన్నాయి.. రాష్ట్ర దిశ, భవిష్యత్ ను నిర్ణయం చేసే ఎన్నికలు ఇవి.. ఆలోచించి ఓటు వేయాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌.. ఆత్మ గౌరవం తాకట్టు పెట్ట లేక వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నేతలు బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా, కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం హనుమాన్‌ జంక్షన్‌లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించింది. భారీ ర్యాలీగా హనుమాన్ జంక్షన్ చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆ తర్వాత సభలో మాట్లాడారు… ఓవైపు సీఎం వైఎస్‌ జగన్‌పై మండిపడుతూనే.. మరోవైపు.. వల్లభనేని వంశీపై విరుచుకుపడ్డారు. బాధ్యతాయుతంగా ఉండే కూటమి ప్రభుత్వం వస్తేనే యువతకు ఉపాధి ఇవ్వగలుగుతుంది అన్నారు పవన్‌ కల్యాణ్‌.

చిరంజీవిపై పోసాని సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలకు అన్‌ఫిట్‌..!
మెగాస్టార్‌ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి.. తాడేపల్లిలోని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిరంజీవికి ప్రజలు అంటే లెక్క లేదు.. ప్రజా సేవ అని పార్టీ పెట్టి మూసేసాడని ఫైర్‌ అయ్యారు.. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదని దుయ్యబట్టిన ఆయన.. సినిమా లానే రాజకీయాల్ని కూడా బిజినెస్ లా చూశాడని ఆరోపించారు. 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కి అమ్మేశాడు.. రాజకీయాలు వద్దని సినిమాలోకి వెళ్లాడు.. ఇప్పుడు మళ్లీ రాజకీయ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు.. ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. చిరంజీవిని నమ్మి చాలా మంది కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారు.. అసలు రాజకీయాలకు చిరంజీవి అన్ ఫిట్ అని వ్యాఖ్యానించారు పోసాని. ఇక, అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు కాదు.. ప్రజల అభివృద్దే రాష్ట్ర అభివృద్ధి అన్నారు పోసాని.. చంద్రబాబు పాలనలో పేదలు జీవచ్ఛవంలా ఉండిపోయారు.. జగన్ సంక్షేమ పాలనలో పేదలు అభివృద్ధిలోకి వచ్చారని తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో ఉండే ధనవంతులకు గ్రామాల్లో ఉండే పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి..? అని ప్రశ్నించారు. ఆ పేదల కష్టాలు చూసి సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారని వివరించారు.. కానీ, చంద్రబాబు అండ్ కో కి పేదలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉంటే రెవెన్యూ లోటు ఉంటుంది.. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏమి సంపద సృష్టించాడు..? అని నిలదీశారు. అర్బన్ ఓటర్లు చంద్రబాబు ఏమీ చేశాడో.. జగన్ ఏమీ చేశాడో ఆలోచించాలి..? అని సూచించిన ఆయన.. అర్బన్ ఓటర్లు గ్రామాల్లోని పేద కుటుంబాల్లో జరిగిన అభివృద్ధి గమనించాలని సలహా ఇచ్చారు పోసాని కృష్ణ మురళి.

సీఎం జగన్ పాలనను మోడీనే ప్రశంసించారు.. కానీ..!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనను ప్రధాని నరేంద్ర మోడీనే ప్రశంసించారు.. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చిందన్నారు లక్ష్మీపార్వతి.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇక, వైఎస్సార్‌ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందన్నారు. నాడు వైఎస్సార్‌ అన్ని రంగాల వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు.. ఇక, ఇప్పుడు కరోనా మహమ్మారి వంటి సంక్షోభంలో కూడా పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ది అని ప్రశంసించారు. వాలంటీర్‌ వ్యవస్థ సీఎం వైఎస్‌ జగన్ మానసపుత్రికగా పేర్కొన్నారు. అయితే, గత ప్రభుత్వంలో ఇసుక అమ్ముకొని నారా లోకేష్ మామూళ్లు తీసుకున్నాడు అని ఆరోపించారు లక్ష్మీపార్వతి.. బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చంద్రబాబు మొదటి సంతకం చేసి.. ఇష్టమొచ్చినట్టు తాగించి దోచుకున్నాడు అని విమర్శించారు. కానీ, ఇసుక విధానంలో కూడా సీఎం వైఎస్‌ జగన్ పారదర్శకత తీసుకొచ్చారని ప్రశంసలు కురిపించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత లక్ష్మీపార్వతి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న లక్ష్మీపార్వతి.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను ఎత్తిచూపుతూ.. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తోన్న విషయం విదితమే.

వెంకట్రామిరెడ్డి ఎన్ని కోట్లు ఇస్తే కేసీఆర్ మెదక్ సీటు ఇచ్చిండు
సిద్దిపేట జిల్లా బీజేపి కార్యాలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్‌ రావు మాట్లాడుతూ.. నిన్న కేసీఆర్ తనపై మాట్లాడిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. రఘునందన్ రావు దుబ్బాక లో ఓడిపోతే కేసీఆర్‌ కామారెడ్డి లో ఓడిపోలేదా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినా కేసీఆర్ కి సిగ్గు ఉండాలని, వెంకట్రామిరెడ్డి ఎన్ని కోట్లు ఇస్తే కేసీఆర్ మెదక్ సీటు ఇచ్చాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కి తెలంగాణ పౌరుషం ఉంటే వేంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చి డబ్బులు పంచలేదని ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కామారెడ్డి ల్లో, కూతురు నిజామాబాద్ లో చెల్లలేదు.. కొడుకు ఎంపీ గా పోటీకి ముందుకు రాలేదని, వెంకట్రామిరెడ్డి కెసిఆర్, హరీష్ రావు కి బినామీ కాదని చెప్పాలన్నారు రఘునందన్‌ రావు. రఘునందన్ రావు మెదక్ ఎంపీ గా గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిమ్మల్ని శ్రీ కృష్ణ జన్మస్థలానికి పంపడం ఖాయమని, రాధా కిషన్ రావు కేసీఆర్‌ డబ్బులు ఇచ్చి గెలిచాడని చెప్పలేదా..? అని ఆయన అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ పౌరుషం ఉంటే డబ్బులు పంచలేదని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్‌లో పనిచేసిన నాయకులకు కేసీఆర్ ఎందుకు టికెట్ ఇవ్వలేదని అడిగారు. కేసీఆర్ కామారెడ్డిలో, కూతురు నిజామాబాద్‌లో చెల్లలేదని.. కొడుకు ఎంపీగా పోటీకి ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్, హరీష్ రావుః‌కు వెంకట్ రాంరెడ్డి బినామీ కాదని చెప్పాలని డిమాండ్ చేవఆరు. కేసీఆర్‌కు వెంకట్ రాంరెడ్డి ముద్దు అయితే శ్రీకాంత్ చారి తల్లికి ఎందుకు సీటు ఇవ్వలేదన్నారు.

కేజ్రీవాల్‌కు స్వల్ప ఊరట.. మధ్యంతర బెయిల్‌పై 10న ఉత్తర్వులు!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందని.. తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. మంగళవారం విచారించిన ధర్మాసనం.. విచారణను వాయిదా వేసింది. తాజాగా న్యాయస్థానం కీలక నోట్ విడుదల చేసింది. మధ్యంతర బెయిల్‌పై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యంతర బెయిల్ ఇస్తే.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచించింది. ఫైల్స్‌పై సంతకాలు చేయొద్దని సూచించింది. ఇది అసాధారణ పరిస్థితి అని.. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించింది. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని.. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి కాబట్టి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

బీజేపీ వివాదాస్పద వీడియో.. జేపీ నడ్డాకు కర్ణాటక పోలీసుల సమన్లు..
కర్ణాటక బీజేపీ వివాదాస్పద పోస్టు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. ఓబీసీ కోటాలో ముస్లిం రిజర్వేషన్ల అనే అంశంపై బీజేపీ ఓ యానిమేటేడ్ వీడియోను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఇందులో రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్య ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయిస్తున్నారని, వారికే ఎక్కువ నిధులు ఇస్తున్నారని చూపించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. మతాల మధ్య చిచ్చుపెట్టాలా ప్రయత్నిస్తోందని మండిపడింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ ఐటీ హెచ్ అమిత్ మాల్వియా, కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై బెంగళూర్ పోలీసులు జేపీ నడ్డాతో పాటు అమిత్ మాల్వియాకు సమన్లు జారీ చేసింది. బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బుధవారం నేతలకు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు జేపీ నడ్డా, అమిత్ మాల్వియాలకు వారం రోజుల గడువు ఇచ్చారు. ఈ పోస్టును తొలగించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎక్స్‌ని కోరింది. కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా ఈ పోస్టును తొలగించాలని బీజేపీని కోరారు. కర్ణాటకలో నిన్నటితో అన్ని లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ముగిసిన ఒక రోజు తర్వాత ఈ నోటీసులు వచ్చాయి.

భారత్‌లో 8 శాతం తగ్గిన హిందూ జనాభా వాటా.. మైనారిటీల సంఖ్యలో పెరుగుదల..
1950-2015 మధ్య భారతదేశంలో మెజారిటీ (హిదువుల) మతాల వాటా 7.8 శాతం తగ్గిందని, అనేక పొరుగు దేశాల్లో మెజారిటీ మతం(ఇస్లాం) వాటా పెరిగిందని ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్(EAC-PM) అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలో హిందూ జనాభా తగ్గిపోగా, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కులతో సహా మైనారిటీ వాటా పెరిగిందని చెప్పింది. అయినప్పటికీ జైనులు, పార్సీల సంఖ్య తగ్గినట్లు వెల్లడించింది. 1950-2015 మధ్య దేశంలో ముస్లిం జనాభా వాటా 43.15 శాతం పెరిగిందని, క్రైస్తవుల్లో 5.38 శాతం, సిక్కులు 6.58 శాతం పెరుగులను చూశారని నివేదికే వెల్లడించింది. EAC-PM ప్రకారం, భారతదేశంలో హిందువుల వాటా 1950లో 84 శాతం ఉంటే 2015లో 78 శాతానికి తగ్గింది. అదే సమయంలో ముస్లింల సంఖ్య 9.84 శాతం నుంచి 14.19 శాతానికి పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. భారత్‌లోనే కాకుండా నేపాల్ లో మెజారిటీ(హిందూ) మతం జనాభా దాని వాటాలో 3.6 శాతం క్షీణతను చూసింది. మే 2024లో విడుదల చేసిన ఈ అధ్యయనం, ప్రపంచవ్యాప్తంగా 167 దేశాలను ట్రెండ్స్‌ని అంచనా వేసింది. డేటాను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా భారత్‌లో మైనారిటీలు కేవలం రక్షించబడటమే కాకుండా, అభివృద్ధి చెందుతున్నారని అధ్యయన రచయితలు చెప్పారు.

కళ్లుమూసి తెరిచేలోపు చిరుతకి ఆహారమైన శునకం.. వైరల్ వీడియో..
సోషల్ మీడియా ప్రపంచంలో అనేక వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని భయానకంగా ఉంటాయి, మరికొన్ని తమాషాగా ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా ఆన్‌లైన్‌లో కనపడుతున్నాయి. కొన్ని వీడియోలు త్వరగా వైరల్ అవుతూ సోషల్ మీడియా వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి వీడియోలలో మరొక వీడియో కొత్తగా జాయిన్ అయ్యింది. ఇకపోతే ఈ ఘటన జైపూర్‌లోని ఝరానాలో చోటుచేసుకుంది. చిరుత కుక్కపై దాడి చేసి వెంబడించింది. ఈ వేట కేవలం 5 సెకన్లలో పూర్తయింది. 28 సెకన్ల నిడివి గల ఆన్‌లైన్ వీడియోలో చిరుతపులి కుక్కను వెంబడించి, మెడ పట్టుకుని అడవిలోకి తీసుకువెళుతున్నట్లు చూపిస్తుంది. ఇక ఈ వీడియోకు శీర్షికగా.. “జలానా అడవి జైపూర్‌తో అనుసంధానించబడి ఉంది. ఇక్కడ వందల సంఖ్యలో చిరుతలు ఉన్నాయి. నగరానికి అనుసంధానం కావడంతో వీధికుక్కలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.” అని పేర్కొన్నారు.

ఈ క్రికెటర్ కోపం చూశారా.. సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని ఏం చేశాడంటే..?
బంగ్లాదేశ్ స్టార్‌ క్రికెటర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ శివాలెత్తాడు. సెల్ఫీ కోసం వచ్చిన ఓ అభిమానిపై చిర్రుబుర్రులాడాడు. అంతేకాకుండా.. అతని మెడపట్టి గెంటేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ప‌లుమార్లు అభిమానుల‌పై చేయిచేసుకున్నాడు ష‌కీబ్. అయితే.. ఈసారి ఏకంగా మెడ పట్టుకుని గెంటేశాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. ధాకా ప్రీమియర్ లీగ్‌లో షేక్ జమాల్ ధన్మోండి క్లబ్ కు షకీబ్ అల్ హసన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో.. టాస్ వేస్తున్న సమయంలో ఓ అభిమాని గ్రౌండ్ లోకి తన దగ్గరికి వచ్చి షకీబ్ ను సెల్ఫీ కావాలని అడిగాడు. దానికి కుదరదు వెళ్లు అంటూ నిరాకరించాడు. అభిమాని పలుమార్లు సెల్ఫీ కావాలని విసిగిస్తుండటంతో కోపంతో మెడపట్టుకుని ఈడ్చాడు. అయితే.. ష‌కీబ్ తీరు ప‌ట్ల క్రికెట్ అభిమానులు, నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులపై ఇలా చేయి చేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల ఈ స్టార్ ప్లేయర్ కు ఇలాంటి కాంట్రవర్సీలు కొత్తేం కాదు.. ఫీల్డ్‌లో అత్యంత కోపిష్టి బంగ్లాదేశ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ముందుగా గుర్తొచ్చే ఈయన పేరే. ఇలాంటి సంఘటనలతో షకీబ్ పలుమార్లు వార్తల్లోకెక్కాడు. దేశవాళీ లీగ్‌లో అంపైర్లు తీసుకున్న నిర్ణయంపై చిర్రెత్తుకుపోవడం, స్టంప్‌లను తన్నేయడం, సెల్ఫీలంటూ వచ్చిన అభిమానుల‌పై చేయెత్తడం వంటి విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు.

క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ చూసే అవకాశం
టీ20 వరల్డ్ కప్కు సరిగ్గా నెల సమయం కూడా లేదు. ఐపీఎల్ అయిపోయిన వెంటనే.. ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అమెరికా, వెస్టిండీస్ ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్.. జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ను ఏంచక్కా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు.. మరో పండగ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మెగా టోర్నీని చూసేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే టీ 20 వరల్డ్ కప్ ను డిస్నీప్లస్ హాట్ స్టార్ ఉచితంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపింది. ఇండియాలోని యూజర్లు మొబైల్ వెర్షన్ లో ఎలాంటి సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ లేకుండా వరల్డ్ కప్ ను వీక్షించొచ్చని డిస్నీ బుధవారం (మే 7) పేర్కొంది. ఎక్కువ మందికి క్రికెట్‌‌‌‌‌‌‌‌ వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. గతంలో భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను సైతం ఉచితంగా ప్రసారం చేసింది. అప్పుడు డిస్నీకి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

అర్జున్ ఇంట పెళ్లి భాజాలు.. పెళ్లి అప్పుడే?
టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు..కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు.. ఆయన వారసురాళ్లుగా ఆయన కూతురు ఎంట్రీ ఇచ్చినా అంతగా సక్సెస్ అవ్వలేక పోయారు.. కూతుర్లంటే ఎంతో ఇష్టం ఉన్న అర్జున్ తన పెద్ద కూతురు ఐశ్వర్య ప్రేమను అంగీకరించాడు. ఇటీవలే ఎంగేజ్మెంట్ అయింది.. ఇప్పుడు పెళ్లి భాజాలు మోగబోతున్నాయి.. నటుడు ఉమాపతితో ప్రేమలో పడింది.. గత ఏడాది అక్టోబర్ 10వ తేదీన వీరి ఎంగేజ్మెంట్ ని తనకు చాలా ఇష్టమైన హనుమాన్ ఆలయంలో గ్రాండ్ గా చేశారు. ఇక ఆ తర్వాత పెళ్లి గురించి మాత్రం ఏ ఒక్క సమాచారాన్ని తెలుపలేదు.. ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ ఇప్పుడు తాజాగా పెళ్లి డేట్ ను అనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది.. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జూన్ 10వ తేదీన చాలా గ్రాండ్గా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహాన్ని కూడా ఎంగేజ్మెంట్ చేసిన హనుమాన్ ఆలయంలోనే పెళ్లి జరగబోతుందని సమాచారం.. త్వరలోనే అనౌన్స్మెంట్ చేయబోతున్నారట.. ఐశ్వర్య కూడా హీరోయిన్గా పలు చిత్రాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. దీంతో సినిమాలకు దూరమైంది.. ఇప్పుడు స్టడీస్ పై ఫోకస్ పెట్టింది. ఇక అర్జున్ సినిమాల విషయానికొస్తే.. విజయ్ దళపతి నటించిన లియో సినిమాలో ఒక అద్భుతమైన పాత్రలో నటించారు.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు..

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటుడు కన్నుమూత
హాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే టైటానిక్ నటుడు కన్నుమూయగా ఇప్పుడు ప్రముఖ హాలీవుడ్ నటుడు, టీవీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ ఇయాన్ గెల్డర్ కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. ఇయాన్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో కెవాన్ లన్నిస్టర్ పాత్రను పోషించాడు. ఇయాన్ జీవిత భాగస్వామి బెన్ డేనియల్స్ తన భర్త మరణాన్ని ధృవీకరించారు. సోషల్ మీడియాలో ఈ హృదయ విదారకమైన విషయానికి సంబంధించిన పోస్ట్‌ను షేర్ చేసారు. ఇక ఇయాన్ మరణానికి కారణం క్యాన్సర్ అని తెలుస్తోంది. ఇక ఆయన మృతి పట్ల పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతుండగా, అభిమానులు కూడా సోషల్ మీడియాలో నటుడికి నివాళులు అర్పిస్తున్నారు. ఇయాన్ గెల్డర్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో సర్ కెవాన్ లన్నిస్టర్ పాత్రను పోషించాడు. ఈ పాత్ర లార్డ్ టైవిన్ లన్నిస్టర్ తమ్ముడు, ఫైవ్ కింగ్స్ యుద్ధంలో లన్నిస్టర్ సైన్యంలో అత్యంత విశ్వసనీయ అధికారులలో ఒకడు. ఇక ఆయన భార్య బెన్ డేనియల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇయాన్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి, ‘హృదయం మిలియన్ల ముక్కలుగా విరిగిపోయింది. ‘చాలా చాలా బరువైన హృదయంతో, నా ప్రియమైన భర్త, జీవిత భాగస్వామి ఇయాన్ గెల్డర్ మరణించారని నేను ప్రకటించాలనుకుంటున్నాను.’ ఇయాన్ గెల్డర్‌కు గత డిసెంబర్‌లో పిత్త వాహిక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు డేనియల్స్ పోస్ట్‌లో వెల్లడించారు. ఇక ఇయాన్ గెల్డర్‌తో తన 30 ఏళ్ల సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ‘నేను అతనిని జాగ్రత్తగా చూసుకోవడానికి నా పనిని ఆపివేసా, కానీ అది ఇంత త్వరగా జరుగుతుందని మా ఇద్దరికీ తెలియదు. అతను నా బలం, మేము 30 సంవత్సరాలకు పైగా ఒకరికొకరు భాగస్వాములుగా ఉన్నాము. మేం కలిసి లేకపోయినా రోజూ మాట్లాడుకునేవాళ్లం. అతను దయగల, అత్యంత ఉదారమైన సోల్, చాలా ప్రేమగల వ్యక్తి.