Site icon NTV Telugu

Top Headlines @ 5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా?

ఏపీలో మరో తొమ్మిది రోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని.. వైసీపీకి ఓటేస్తేనే పథకాల కొనసాగింపు అని.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు అని సీఎం జగన్‌ అన్నారు.చిత్తూరు జిల్లా పలమనేరు ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలపెట్టినట్లేనన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుందని ఎద్దేవా చేశారు. 2 లక్షల 70 వేల కోట్లాది రూపాయలు బటన్ నొక్కి నేరుగా రాష్ట్ర ప్రజలకు అకౌంట్‌లో వేశానని సీఎం చెప్పారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించామని.. 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలు అమలు చేశామన్నారు. నేరుగా ఇంటి వద్దకే పథకాలు ఇచ్చామన్నారు. ఒక్క పేదవాడికైనా చంద్రబాబు ఒక్క మంచిపని అయినా చేశాడా.. చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు అబద్దాలు, మోసాలతో వస్తున్నాడని సీఎం జగన్‌ దుయ్యబట్టారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామన్నారు. పిల్లల చదువులు కోసం అమ్మఒడితో ప్రోత్సహిస్తున్నామని.. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చామన్నారు.. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించామని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతన్నల కోసం ఆర్‌బీకే వ్యవస్థ పనిచేస్తోందన్న సీఎం జగన్‌… ఏ గ్రామానికి వెళ్లిన గ్రామ సచివాలయం కనిపిస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచామన్నారు. ‘రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు.. చేశాడా?. ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?. సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చడా?. మళ్లీ ఈ మోసగాళ్లు సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటున్నారు. కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తాననంటారు.. నమ్ముతారా?’’ అంటూ చంద్రబాబుపై ప్రశ్నలు వర్షం కురిపించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.

 

*కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ వచ్చే అవకాశం ఉంది: హరీశ్ రావు
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ..”బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. దేశవ్యాప్తంగా 157 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇస్తే రాష్ట్రానికి ఒక్కట ఇవ్వలేదు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, నవోదయ స్కూళ్లు ఇవ్వలేదు. కేసీఆర్ తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చితే వడ్లు కొనకుండా వివక్ష చూపారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది.? కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత కరెంటు, మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాలు, కేసీఆర్ కింట్, మంచినీళ్లు, తాగు నీళ్లు ఇచ్చిండు. బీజేపీ ఏం చేసింది. నల్లచట్టాలు తెచ్చి లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించి 700 మంది రైతులను పొట్టనబెట్టుకుంది. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారుగాని బిల్లు పెట్టలేదు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టింది.” ఆధ్యాత్మికంలో బీజేపీకంటే కేసీఆర్ రెండు అడుగులు ముందు ఉన్నారని హరీశ్ రావు అన్నారు. “కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్‌కే ఎక్కువ వస్తాయి. నిశ్శబ్ద విప్లవం రాష్ట్రంలో వస్తుంది. రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో నీళ్లు , కరెంటు పుష్కలంగా ఉండంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. రేవంత్ బీజేపీలో చేరతారని అర్వింద్, మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. దీన్ని రేవత్ ఎందుకు ఖండించడం లేదు. కవిత అరెస్ట్ కాలేదు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటని అబద్ధాలు చెప్పి మైనారిటీ ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు కవిత అరెస్టయ్యారు, కుక్మక్కయితే ఎందుకు అరెస్ట్ అవుతారు. రేవంత్ మైనారిటీలను మోసం చేస్తున్నారు. కేబినెట్లో మైనారిటీని తీసుకోలేదు. రంజాన్ తోఫా నిలిపేశారు. రేవంత్ మోదీని బడే బాయ్ అంటూ ఆశీర్వాదాలు కోరుతున్నారు.” బీజేపీ, కాంగ్రెస్ లు రాజకీయ ప్రయోజనాల కోసం ఏడు మండలాలను ఏపీకి ఇచ్చాయని హరీశ్ రావు ఆరోపించారు.”ఆరు గ్యారంటీలను అమలు చేశాకే కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. కాంగ్రెస్ బాండు పేపర్ బౌన్స్ అయింది. అందుకు శిక్ష వేయాలని ప్రజలను నిర్ణయించారు. అప్పుడు ప్రామిస్‌లు ఇప్పుడు దేవుళ్లపై ప్రామిస్‌లు. హామీలు అమలు కావడడం లేదంటే చెప్పుతో కొట్టాలని దూషిస్తున్నారు. ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమలుపై పరిపాలనపై లేదు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను, ఆయన సీనియారిటీని గౌరవించకుండా రేవంత్ కళ్లు పీకుతా, పేగులు మెడలో వేసుకుంటా అని దుర్భాషలాడుతున్నారు. కేసీఆర్ పరిపాలన వికేంద్రీకణ కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తానంటున్నాడు. ఇది ముందుకు పోవడమా, వెనక్కి పోవడమా?. రాష్ట్రంలో పరిపాలన లేదు, పగ ప్రతీకారాలు కనిపిస్తున్నాయి. ప్రజాపాలనలో 3 లక్షల యాభైవేల దరఖాస్తులు వచ్చాయి. ఎన్ని పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పనిగా పెట్టుకున్నాడు రేవంత్. మా సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ వాటినే ప్రోత్సహిస్తోంది. 8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం చేశాయి. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.”

 

*కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృ వియోగం..
మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తల్లి లక్ష్మీ అనారోగ్యంతో కన్నుమూశారు. హన్మకొండలో ఓ ప్రయివేట్ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. బలరాం నాయక్ స్వస్థలం ములుగు జిల్లా మదనపల్లి గ్రామం. బలరాం నాయక్.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాగా.. గతంలో బలరాం నాయక్ కేంద్రమంత్రిగా పని చేశారు. 2012 అక్టోబరులో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. బలరాం నాయక్ తల్లి మరణం పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్ర సంతాపం తెలుపుతున్నారు.

 

*కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం..
కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీ. కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతలు దళితులను మోసం చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు.. నిన్న పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇస్తూ.. రోహిత్ దళితుడే కాదని చెబుతోందని పేర్కొన్నారు. మనకులాల గురించి మనమే ఆలోచన చేయాలన్నారు. సిరిసిల్లలో ఏమైంది.. నేరెళ్ల ఘటనకు కారకులు ఎవరని ప్రశ్నించారు. రోహిత్ వేముల స్కాలర్ షిప్ రద్దు కావడం, కుల వివక్షతతోనే రోహిత్ చనిపోయారని తెలిపారు. రోహిత్ దళితుడు కాదని పోలీసులు కుల సర్టిఫికేషన్ ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి తల్లిని కూడా కేసీఆర్ అవమానిచ్చారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ , ఓబీసీలు సంఘటితం కావాలని పేర్కొన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో రాజ్యాంగాన్ని రాయాలంటే సమర్థులైన అంబేద్కర్ కి బాధ్యత అప్పగించిందని తెలిపారు. అలాంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ హయాంలో పంజాగుట్ట చౌరస్తాలో రాజశేఖర్ విగ్రహం పక్కన.. అంబేద్కర్ విగ్రహాన్ని దళిత కాంగ్రెస్ పెడితే తొలగించారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే జనగణన చేసి రిజర్వేషన్ అమలు చేస్తామని రాహుల్ గాంధీ ధైర్యంగా చెప్పాడన్నారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తే, మోడీ తనకి ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని మార్చుకుంటాడని తెలిపారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. మరోసారి దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చడంతో పాటు రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు పోతాయని పేర్కొ్న్నారు. మోడీ కుట్రలను సీఎం రేవంత్ ఛేదించాడు.. మోడీకి భయం పట్టుకుందని అన్నారు. సమానత్వం ఉండాలంటే రిజర్వేషన్లు ఉండాలి.. అగ్రకులంలో పుట్టినా నేను.. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు.

 

*జగిత్యాలలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పార్టీ వీడిన కౌన్సిలర్లు
తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి పార్లమెంట్ కు పంపాలని ఓటర్లను కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాల్లోని ప్రధాన నాయకులు వరుసగా పార్టీని వీడుతున్నారు. జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోకు ముందే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జిల్లా కేంద్రంలో ని ఓ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. 6గురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ.. పార్టీ విడడం చాలా బాధగా ఉందన్నారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. పార్టీని వీడిన ఓ కౌన్సిలర్ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీకోసం నిరంతరం శ్రమించాం.. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే తమకు ఎలాంటి న్యాయం చేయలేదని వాపోయారు. మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికలో రెబల్ అభ్యర్థికి ఈ ఆరుగురు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఈ కౌన్సిలర్ల కు ఇదివరకే బీఆర్ఎస్ విప్ జారీ చేసింది. ఇదివరకే రాష్ట్రంలో చాలా చోట్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన కొన్ని నెలలకే రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సైతం అధికారం మారుతూ వచ్చింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్, బీజేపీలకు మారడంతో బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్లు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా వెళ్లిన వారిలో అధికంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చాలా మున్సిపాలిటీలను కూడా సొంతం చేసుకుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వలసలు అధికమయ్యాయి. ఇప్పుడు ఈ ఆరుగురు కౌన్సిలర్లు ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారో అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

 

*నాకు కొడాలి నానిని తిట్టాలని ఏమీ లేదు.. కానీ..!
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానిపై హాట్‌ కామెంట్లు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. కొడాలి నానిని తిట్టాలని నాకు ఏమీ లేదు అన్నారు.. నాకు వ్యక్తిగతంగా కొడాలి నానితో ఏ శత్రుత్వం లేదన్నారు.. అయితే, వంగవీటి రాధా వివాహంలో కొడాలి నాని కనపడితే కలిశాను అని గుర్తుచేసుకున్నారు.. కానీ, కొడాలి నాని నోరు పారేసుకునే ఎమ్మెల్యే అని విమర్శించారు.. నాని నోరు కట్టడి చేయాలి అంటే రాముని గెలిపించాలని గుడివాడ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం దాడులు, దోపిడీ ప్రభుత్వం అని విరుచుకుపడ్డారు పవన్‌ కల్యాణ్‌.. ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగా రాజకీయాల్లో అందరికీ అవ్వదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జనసేన పార్టీని కాపాడటానికి కాదు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాగు కోసం వచ్చాను అన్నారు. రోడ్లు గోతులు.. అడిగితే ఎమ్మెల్యేలు బూతులు అంటూ సెటైర్లు వేశారు.. మరోవైపు.. అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక, ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టి.. ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరును వైయస్సార్ యూనివర్సిటీగా మార్చారు అని విమర్శించారు. ఇది సరైన విధానం కాదని హితవుపలికారు. టీడీపీతో విబేధాలు ఉన్నప్పటికీ.. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టించటం బాధించిందన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

 

*ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం తగదు
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి, వైసీపీ నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రాష్ట్రంలో చర్చ కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ ఈ యాక్ట్ పై పలు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి స్పందించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజల భూములను జగన్ లాగేసుకుంటాడని పవన్ కల్యాణ్ ఊగిపోతూ మాట్లాడుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ కి అసలు ఏమీ తెలుసు, అన్నం తిన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా.? అని ప్రశ్నించారు. ఎవడి భూమి ఎవడు లాక్కుంటారన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం ప్రజల భూములను లాక్కుంటుందా అని అడిగారు. రాజకీయ లబ్ధి కోసం క్రిమినల్ మైండ్ తో చంద్రబాబు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గెలవడానికి చంద్రబాబు ఎంత నీచానికైన దిగజారుతారని మండిపడ్డారు. ఈ యాక్ట్ వల్ల తగాదాలు లేని భూ హక్కు యజమానులకు దక్కుతుందన్నారు. జగన్ ప్రజలకి ఎప్పుడూ మంచే చేస్తారు.. కానీ మోసం చెయ్యరని స్పష్టం చేశారు.

 

*రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే: బీజేపీ
రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి తెలంగాణ పోలీసులు కేసు క్లోజర్ రిపోర్టును ఇచ్చారు. హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్న రోహిత్ వేముల మృతిపై తెలంగాణ పోలీసులు విచారణ ముగించారు. తుది నివేదికను దాఖలు చేశారు. తాను ఎస్సీ కులానికి చెందినవాడిని కాదని గుర్తించడంతో, అసలు కులం బయటపడుతుందనే భయంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. ఇది నిజమైతే తన అకడమిక్ డిగ్రీలను కోల్పోతాననే, విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడి ఉండొచ్చని నివేదిక పేర్కొంది. తాజాగా ఈ రిపోర్టు పొలిటికల్ దుమారానికి కారణమవుతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దళితులను రాజకీయ ప్రయోజనాల కోసం దోపిడి చేస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. రోహిత్ వేముల మరనాన్ని రాజకీయాల కోసం వాడుకున్న రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. తెలంగాణ పోలీసులు రోహిత్ వేము దళితుడు కాదని, ఇది ఆత్మహత్యే అని రిపోర్టు ఇచ్చారని, రాహుల్ గాంధీ దళితులకు క్షమాపణ చెబుతారా..? అని కమలం పార్టీ ప్రశ్నించింది. ఈ సమస్యను రాజకీయం చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. రోహిత్ వేముల మరణాన్ని రాహుల్ గాంధీ తన నీచ రాజకీయాల కోసం ఉపయోగించాడని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ మరియు సో కాల్డ్ ‘సెక్యులర్’ పార్టీలు దళితులను తమ రాజకీయాల కోసం తరచుగా ఉపయోగించుకున్నాయి కానీ వారికి న్యాయం చేయడంలో ఎప్పుడూ విఫలమవుతున్నాయి. ఇది అందుకు మరో ఉదాహరణ’’ అని ఆయన పోస్ట్ చేశారు.

 

*ప్రజ్వల్‌కు మళ్లీ లుకౌట్ నోటీసులు.. నిందితులకు శిక్ష పడాలన్న రాహుల్
కర్ణాటక రాజకీయాలను లైంగిక వేధింపుల కేసు కుదిపేస్తోంది. మాజీ ప్రధాని మనవడు చేసిన దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. ఇప్పటికే సిట్ బృందం జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు నోటీసులు ఇచ్చింది. తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌ లపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కర్ణాటక సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు శనివారం హాసనలోని ప్రజ్వల్‌ ఇంటికి వెళ్లారు. అభ్యంతర వీడియోల దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లోని సిబ్బందిని ప్రశ్నించనున్నారు. మరోవైపు ప్రజ్వల్‌పై రెండోసారి లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు. ఆయన తండ్రి రేవణ్ణ కూడా విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉన్నందున ఆయనకూ ఈ నోటీసులిచ్చినట్లు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం .. ఇటీవల వీరిద్దరినీ విచారణకు పిలిచింది. అయితే తనకు సమయం కావాలని ప్రజ్వల్‌ కోరారు. ఇందుకు తిరస్కరించిన అధికారులు.. ఆయనపై తొలిసారి లుకౌట్‌ నోటీసు జారీ చేశారు. ఈ కేసు వెలుగులోకి రాగానే ప్రజ్వల్‌ దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలు ఉంటుంది. ఇదిలా ఉంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శనివారం లేఖ రాశారు. ఈ దారుణాలకు పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడేలా చేయాలని, బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. ప్రజ్వల్‌ కేసు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ కేసులో పారదర్శక విచారణ జరిగేలా మేం కృషి చేస్తామని తెలిపారు.

 

*జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్
కృష్ణాజిల్లా గుడివాడ సభలో పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ వెళ్లారు. అక్కడ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల రాము తరపున ప్రచారం చేశారు. ఇక ఈ క్రమంలో సభలో పవన్ మాట్లాడుతూ కొడాలి నానిని తిట్టాలని ఏమీ నాకు లేదు, నాకు వ్యక్తిగతంగా ఏ శత్రుత్వం లేదు, వంగవీటి రాధా వివాహంలో కొడాలి నాని కనపడితే కలిశానని అన్నారు. కొడాలి నాని నోరు పారేసుకునే ఎమ్మెల్యే, నాని నోరు కట్టడి చేయాలి అంటే రాముని గెలిపించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం దాడులు, దోపిడీ ప్రభుత్వం అని అన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగా రాజకీయాల్లో అందరికీ అవదని, జనసేనను కాపాడటానికి కాదు ఏపీ బాగు కోసం వచ్చానని అన్నారు. రోడ్లు గోతులు.. అడిగితే ఎమ్మెల్యేలు బూతులు తిడుతున్నారని, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తెచ్చారని అన్నారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ గా మార్చారని, ఇది సరైన విధానం కాదన్నారు. టీడీపీతో విబేధాలు ఉన్నప్పటికీ చంద్రబాబును జైల్లో పెట్టించటం బాధించిందని కూడా పవన్ అన్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ మాట్లాడుతుండగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫొటోలు చూపించడంతో నాకు ఎన్టీఆర్ ఫొటోలు కనిపిస్తున్నాయని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, … రంగా గారి అభిమానులు ఫొటోలు చూపిస్తున్నారు. రంగా గారి అభిమానులకి, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి, అందరు హీరోల అభిమానులకి ధన్యవాదాలు అని అన్నారు. ఇక భగీరధుడి ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని పోలవరం పూర్తి చేస్తానని ఆయన అన్నారు.

Exit mobile version