NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

వంగా గీతపై వర్మ సంచలన వ్యాఖ్యలు.. కేంద్ర ప్రభుత్వం ద్వారా విచారణ..!
కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వంగా గీతపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్ లో ఉద్యోగానికి 10 లక్షల రూపాయలు చొప్పున వంగా గీత తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా వేస్తారు? అని నిలదీశారు. ఈఎస్ఐ హాస్పిటల్ ఉద్యోగాలలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. సుమారు 30 మంది దగ్గర పది నుంచి 15 లక్షల రూపాయల వరకు సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కలెక్ట్ చేశారని పేర్కొన్నారు. అయితే, మా (టీడీపీ-జనసేన-బీజేపీ) ప్రభుత్వం వచ్చిన వెంటనే.. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణ చేయిస్తామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. దీంతో.. ఎన్నికల ఫలితాలకు ముందే.. పిఠాపురంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగినట్టు అయ్యింది.. ఎన్నికల ప్రచార సమయంలో.. విమర్శలు, ఆరోపణల పర్వం జోరుగా సాగగా.. ఫలితాలకు ముందు.. వంగా గీతపై వర్మ చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చగా మారాయి.

వైసీపీ నేత దారుణ హత్య.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో గతవారం జరిగిన వైసీపీ నేత శేషాద్రి హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఇరు వర్గాల ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు పోలీసులు.. నిందితుల్లో బహుజన సేన ప్రజా సంఘంలో పనిచేసిన కొండుపల్లె ఆనంద్, మణికంఠ, బండి మహేష్, రాజశేఖర్, చరణ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, నజీర్ ఖాన్‌ ఉండగా.. వీరిని అరెస్ట్‌ చేసిన రిమాండ్ కు తరలించారు పోలీసులు.. హత్యకు ఉపయోగించిన ఇనోవా కారు, ఆటో, ద్విచక్ర వాహనంతో పాటు మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

చిన్నారులను కిడ్నాప్‌ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు అరెస్ట్
చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ దారుణమైన సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. కర్నూలు ప్రాంతానికి చెందిన చిన్న, లక్ష్మి అనే దంపతులు చిన్న చిన్న పనులు చేస్తూ శంషాబాద్ పట్టణంలోని ఫ్లై ఓవర్ కింద నిద్రిస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే క్రమంలో ఈ నెల 27వ తేదీన తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నిద్రపోతున్న సమయంలో.. ముగ్గురు దండు హనుమంతు, దండు చందన, భంగపతి స్వాతిలు కలిసి చిన్న, లక్ష్మితో నిద్రిస్తున్న ఒక నెల కూతురును తీసుకుని పరారయ్యారు. అయితే ఉదయం లేచి చూసేసరికి చిన్నారి కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ప్రధానిగా పదవిపై మనసులో మాట బయటపెట్టిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే..
రేపటిలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగుస్తోంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ పార్టీ భావిస్తుంటే, ఈ సారి బీజేపీని గద్దె దించుతామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని పదవిపై తన మనసులోని మాట బయటపెట్టాడు. ఇండియా కూటమి, బీజేపీని ఓడించిన తర్వాత, నరేంద్రమోడీ స్థానంలో రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలని ఖర్గే అన్నారు. ప్రియాంకాగాంధీ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను ఒత్తిడి తెచ్చానని చెప్పారు. ఎన్డీటీవీలో మాట్లాడిన ఖర్గే, భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారని, ప్రధాని మోడీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారని అన్నారు. రాహుల్ గాంధీనే ప్రధాని పదవికి పాపులర్ ఛాయిస్‌గా చెప్పారు. రాహుల్ యువత, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడని, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిత్వంపై ప్రశ్నించగా చెప్పారు. ఇదే విధంగా ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై కూటమి నిర్ణయిస్తుందని చెప్పారు.

సమోసా దుకాణంలో పేలిన ఎల్‌పీజీ సిలిండర్.. వీడియో వైరల్..
తమిళనాడులోని తిరునెల్వేలి పట్టణంలోని సమోసా దుకాణంలో గురువారం సాయంత్రం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. నివేదికల ప్రకారం., వడక్కు రథవీధిలోని ఒక దుకాణంలో పేలుడు సంభవించింది. దాంతో ఆ షాప్ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో మంటలు సమీపంలోని వ్యాపారులకు వ్యాపించాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడమే పేలుడుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన కారణాన్ని కనుగొనడానికి దర్యాప్తు కొనసాగుతోంది. గాయపడిన వారిలో ముగ్గురు షేక్ అలీ, మారియప్పన్ (33), చిన్నదురై (23)గా గుర్తించారు. కుర్తాళం రోడ్డులో నివాసముంటున్న అలీ, మారియప్పన్ పనిచేసే టౌన్ ఏరియాలో సమోసా దుకాణం నడుపుతున్నాడు. మరియప్పన్ సమోసాలు వండుతుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో అలీ, మారియప్పన్‌ లు ఎల్‌పీజీ సిలిండర్‌ పేలడంతో క్షణాల్లో షాపు నుంచి పారిపోయారు. ఈ ఘటనలో పక్కనే ఉన్న దుకాణంలో పనిచేస్తున్న చిన్నదురైతో పాటు మరో ఇద్దరికీ గాయాలయ్యాయి.

గూగుల్ కొత్త ఫీచర్‌.. ఇక, వారందరికీ పోటీ..!
సోషల్‌ మీడియా యాప్‌లో రోజుకో కొత్త ఫీచర్‌తో సత్తా చాటుతున్నాయి.. వినియోగదారుల ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.. అయితే, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ తన యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేపనిలో పడిపోయింది.. ఇప్పటికే వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. వంటి యాప్‌లకు ‘ఎడిట్‌’ ఆప్షన్‌ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు గూగుల్‌ కూడా ‘‘ఎడిట్‌’’ ఆప్షన్‌ను తన యాప్‌నకు జోడిస్తోంది.. దీంతో.. ఇకపై RCS చాట్‌ ద్వారా పంపే సందేశాలనూ ఎడిట్‌ చేసే అవకాశాన్ని తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది గుగుల్.. గూగుల్‌ తన సందేశాల యాప్‌లో RCS చాట్‌ల కోసం సవరణ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, ఇది 15 నిమిషాల విండోలో అక్షరదోషాలను (ఎడిట్‌) సరిచేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. RCS సాంప్రదాయ ఎస్ఎంఎస్/ఎంఎంఎస్ టెక్స్టింగ్‌ను మెరుగుపరుస్తుంది.. తెలియని వారికి, RCS అంటే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ మరియు ఇది సాంప్రదాయ SMS/MMS టెక్స్టింగ్‌కి అప్‌గ్రేడ్. WhatsApp లేదా iMessage వంటి యాప్‌లతో వినియోగదారులు ఇప్పటికే పొందుతున్న సేవలకు అనుగుణంగా మెసేజింగ్‌ను మరింత గొప్పగా చేసే అనేక ఫీచర్‌లను ఇది అందిస్తుంది. గూగుల్‌ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్‌ తో RCS ద్వారా పంపే ఏ మెసేజ్‌నైనా ఎడిట్‌ చేసుకోవచ్చు.. అయితే, అందుకోసం మనం పంపిన మెసేజ్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేస్తే.. పాప్‌ అప్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో ‘‘ఎడిట్‌’’ ఆప్షన్‌ను ఎంచుకుని సందేశంలోని తప్పులు సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఇక, ఇలా సవరించిన మెసేజ్‌కు కింద చివరన ఎడిటెడ్‌ అని స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, ఆ సందేశాన్ని పంపిన 15 నిమిషాల్లోనే ఎడిట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎడిట్‌ ఆప్షన్‌ కనిపించకుండా పోతుంది. ఈ ఎడిటింగ్ ఫీచర్ ప్రస్తుతం RCS చాట్‌లకు పరిమితం చేయబడిందని గమనించాలి.. ప్రామాణిక SMS/MMS సందేశాలకు ఇప్పటికీ ఎడిటింగ్ చేసుకునే అవకాశం లేదు..

దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు భారత మహిళల జట్టులను ప్రకటించిన బీసీసీఐ..
దక్షిణాఫ్రికాతో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్‌ కు భారత మహిళల జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా.. డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరిస్తుంది. బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, స్పీడ్‌స్టర్ పూజా వస్త్రాకర్ మూడు స్క్వాడ్‌ లలో భాగంగా ఉన్నారు. అయితే వారు ఆడటం అనేది ఫిట్‌నెస్‌ పై ఆధారపడి ఉంటుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ తో సిరీస్ ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఒక టెస్ట్, ఆపై మూడు మ్యాచ్‌ ల T20 సిరీస్‌ తో ముగుస్తుంది. వన్డే సిరీస్‌కు ముందు, జూన్ 13న బెంగళూరులో బోర్డ్ ప్రెసిడెంట్స్ XI జట్టుతో విజిటింగ్ జట్టు వార్మప్ గేమ్ ఆడుతుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా బెంగళూరులో జరుగుతుంది. మిగిలిన సిరీస్ చెన్నైలో జరగనుంది. వార్మప్ గేమ్ తర్వాత మూడు వన్డేలు వరుసగా జూన్ 16, 19, 23 తేదీల్లో జరుగుతాయి. జూన్ 28 నుంచి జూలై 1 వరకు ఏకైక టెస్టు.. చివరగా మూడు టీ20లు వరుసగా జూలై 5, 7, 9 తేదీల్లో జరుగుతాయి.

ఓటీటీ లో అదరగొడుతున్న సుహాస్ శ్రీరంగ నీతులు..
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్టోరీలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.ఈ ఏడాది సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి విజయం సాధించింది.ఈ సినిమాకు సుహాస్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇదే సంవత్సరం సుహాస్ హీరోగా నటించిన మరో మూవీ శ్రీరంగనీతులు. ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఈ సినిమా విడుదలకు ముందు టీజర్ ,ట్రైలర్ తో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించింది. సినిమా విడుదల అయ్యాక ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ తెరకెక్కించారు.ఈ మూవీలో సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ మరియు కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలు పోషించారు.రాధావి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకటేశ్వరరావు బల్మూరీ ఈ సినిమాను నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మే 29 నుంచి ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆహాతో పాటు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.ఆహా ఓటిటిలో ఈ సినిమా దూసుకుపోతుంది.అదిరిపోయే వ్యూస్ తో సుహాస్ శ్రీరంగ నీతులు సినిమా ఓటిటిలో దూసుకుపోతుంది.