నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్
నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ముఖ్యంగా ఎంతో కాలంగా గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న వారికి గుడ్‌న్యూస్.. ఎందుకంటే.. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఈ రోజు ఉదయం సీఎం జగన్‌కు అధికారులు ఈ పోస్టుల భర్తీపై వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని తెలిపారు.. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని పేర్కొన్నారు.. ఇక, గ్రూప్-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు.. మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్. నోటిఫికేషన్, పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని సూచించారు సీఎం జగన్.
దశాబ్ధి ఉత్సవాల ఖర్చులకు కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల
ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం డా.బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సీఎంవో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డీజీపీ, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం సూచించారు. గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సీఎం వివరించారు.మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్న భోజన కార్యక్రమ విరామం తర్వాత సమావేశం తిరిగి కొనసాగుతోంది.
ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. నైరుతి రుతుపవనాలు తదుపరి 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు అండమాన్ & నికోబార్ దీవులలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉందని.. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో పశ్చిమ / నైరుతి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.. వీటి ప్రభావంతో రాబోవు మూడు రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయన్నదానిపై ప్రకటన చేసింది.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంలో.. ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.. ఈదురు గాలులు గంటకు 30 -50 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముందని పేర్కొంది.. ఇక, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 -50 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవిస్తాయని తెలిపింది.. మరోవైపు.. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం.. ఇలా స్పందించిన చంద్రబాబు..
భారత పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంపై వివాదం నడుస్తోంది.. ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానుండగా.. విపక్షాలు ఈ వేడుకకు దూరంగా ఉన్నాయి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరపాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు.. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.. ఇప్పటికే 21 ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయానికి వచ్చాయి.. ఇక, ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంపై ట్వీట్ చేసిన ఆయన.. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చరిత్రాత్మకమైందని పేర్కొన్నారు.. ఈ చారిత్రాత్మక కట్టడాన్ని నిర్మించడంలో దోహదపడిన ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రానికి అభినందనలు తెలిపారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన మార్పులు చట్టాల రూపకల్పనకు ఈ భవనం వేదిక కావాలని ఆకాక్షించారు. 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి పేదరికం లేని భారతదేశం ఏర్పాటుకు కొత్త పార్లమెంట్ భవనం దిక్సూచి కావాలని ఆకాక్షించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
ప్రేమ పెళ్లి చేసుకుంది.. వెంటనే తాళి తీసి వెళ్లిపోయింది.. అసలేమైంది?
ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం కోసం యువతీ యువకులు ఎంతకైనా తెగిస్తారు. తల్లిదండ్రుల్ని కాదని, నచ్చిన వ్యక్తులతో వెళ్లిపోతారు. ఓ అమ్మాయి కూడా అదే పని చేసింది. తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లికి నిరాకరించడంతో.. ఆ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన ప్రేమికుడ్ని పెళ్లి చేసుకుంది. కొత్త జీవితం మొదలుపెట్టాలని కలలు కంది. కానీ, ఇంతలోనే ప్రియుడికి షాకిస్తూ, ఆమె తాళి తీసి వెళ్లిపోయింది. అసలు ఏమైందంటే.. తిరుపూర్‌పూండి రింగ్‌రోడ్‌కు చెందిన యువతి (23)కి కొంతకాలం క్రితం కోయంబత్తూర్ జిల్లా అన్నూర్ ఒటర్‌పాళయంకు చెందిన 29 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకే అది ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరు కలుసుకోవడం, చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. ఇద్దరి అభిరుచులు కలవడం, మనసులు దగ్గరవ్వడంతో.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. అయితే.. యువతి తరఫు బంధువులు మాత్రం వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కారణం ఏంటో తెలీదు కానీ.. ఆమె తల్లిదండ్రులు సైతం పెళ్లికి నిరాకరించారు. అయితే.. ఆ యువతి మాత్రం తన ప్రియుడి వదిలి ఉండలేకపోయింది. దీంతో.. ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించింది. ప్లాన్ ప్రకారం.. ఏప్రిల్ 17వ తేదీన ఆ అమ్మాయి తన పేరెంట్స్‌కి తెలియకుండా ఇంటి నుంచి పారిపోయింది. ఇంట్లో ఐదున్నర సవర్ల నగలతో పాటు రూ.5 లక్షల నగదు తీసుకుని.. ప్రియుడి వద్దకు వెళ్లింది. అక్కడే వీళ్లిద్దరు ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు.. తమకు భద్రత కల్పించాలని అన్నూర్ పోలీసుల్ని ఆశ్రయించారు. మరోవైపు.. యువతి తల్లిదండ్రులు వెలంపాళయం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వీళ్లు ప్రేమజంటని పిలిపించారు. అక్కడ కుమార్తెను చూసి తల్లిదండ్రులు బోరన విలపించారు. అది చూసి యువతి మనసు కరిగిపోయింది. వెంటనే తన మనసు మార్చుకొని, ప్రియుడిది తప్పు లేదని చెప్పి, తాళి తీసిచ్చి, తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. పోలీసులు ఆ యువకుడికి సర్దిచెప్పి పంపించారు.
భారత్ మాకు సహాయం చేయాలి.. రష్యా అభ్యర్థన..
రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు పాశ్చాత్య దేశాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్( FATF) నుంచి రష్యాను సస్పెండ్ చేశారు. అయితే FATF నిబంధనలతో రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచదేశాలను కోరుతున్నారు. వచ్చే నెలలో దీనికి సంబంధించిన సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని నుంచి బయటపడటానికి రష్యా, భారతదేశ సాయం కోరుతోంది. ఆప్తమిత్ర దేశం అయిన రష్యాతో భారత్ కు అనేక వ్యాపార, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. భారతదేశంలో అనేక ప్రాజెక్టులను రష్యా చేపడుతోంది. ఈ నేపథ్యంలో FATF కింద రష్యాను ఆర్థికంగా ఒంటరి చేస్తే ఆ ప్రభావం భారత్ పై పడుతుంది. రష్యాను బ్లాక్ లిస్టులో చేర్చాలంటూ ఉక్రెయిన్ పాశ్చాత్యదేశాలపై క్రమంగా ఒత్తిడి పెంచుతోంది. భారత్ తన పలుకుబడితో ఈ ప్రమాదం నుంచి బయటపడేయాలని రష్యా అభ్యర్థిస్తోంది. సహజంగా ఉగ్రవాదానికి ఊతం ఇచ్చేలా ఆర్థిక నిధులను సమకూర్చే దేశాలపై FATF నిబంధనలు విధిస్తుంది. అయితే రష్యా నుంచి ఉగ్రవాదులు కానీ, ఉగ్రవాదానికి నిధులు కానీ ఇవ్వడం ఎప్పుడు జరగలేదు. ఈ నేపథ్యంలో FATF ఆంక్షల కిందకు రష్యా ఎలా వస్తుందని ఆ దేశం ప్రశ్నిస్తోంది.
మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణి సస్పెండ్
టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఆమె పేరు నానుతూనే ఉంటుంది. ఇక గత కొన్ని రోజులుగా ఆమె ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై పోరాడుతున్న విషయం తెల్సిందే నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయం తెల్సిందే. మే 28 న ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదని, ఎన్టీఆర్ దేవుడు కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది. కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆమె పలు ఆరోపణలు చేసింది. ” ఎన్టీఆర్ ఎవరికి దేవుడు.. ఏ వర్గానికి దేవుడు.. ఎవరి కోసం ఆయన్ను దైవాన్ని చేస్తూన్నారు…ఎవరిని మెప్పించడానికి ఇదింతా చేస్తున్నారని ప్రశ్నించారు. దైవానికి , మానవునికి తేడా ఉందా లేదా… మానవుడు దేవుడైతే.. ఇంకా మనం దేవుళ్లని పూజించడం ఎందుకని.. మన ఫొటోలను పెట్టుకుని మనకు మనమే పూజించుకోవచ్చు” అని చెప్పుకొచ్చింది. ఆమెకు తోడుగా యాదవ సంఘాలు కూడా ఆ విగ్రహాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ వివాదం ప్రస్తుతం కరాటే కళ్యాణి మెడకు చుట్టుకున్నట్లు అయ్యింది. ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. ఈ నెల 16 వ తేదీన ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ షో కేస్ నోటీసులను జారీచేసింది. అయితే ఆ నోటీసులపై ఇప్పటివరకు కళ్యాణి స్పందించకపోవడంతో మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణిని సస్పెండ్ చేసినట్లు మా సభ్యులు తెలిపారు. ఆదేశాలను జారీ చేస్తూ ప్రకటన రిలీజ్ చేశారు. ” ఈ నెల 16 వ తేదీన మేము పంపిన షోకాజ్ నోటీసుకు నిర్ణీత సమయంలోగా వివరణను ఫైల్ చేయడంలో మీరు విఫలం చెంది, ఆ తరువాత లీగల్ నోటీసులు జారీ చేయగా .. వాటికి కూడా సమాధానం చెప్పకపోవడం MAA సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. దీనిపై మా అసోసియేషన్ నేడు చర్చించి తక్షణమే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది” అంటూ రాసుకొచ్చారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ప్రముఖ సింగర్ కన్నుమూత
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు ప్రేక్షకులను భయబ్రాంతులను చేస్తున్నాయి. భాషా ఏదైనా నటులు మాత్రం ఒక్కరే. తాజాగా హాలీవుడ్ లో లెజెండరీ సింగర్ టీనా టార్నర్ కన్నుమూసింది. ఆమె గురించి, ఆమె సంగీతం గురించి సంగీత ప్రియులకు చెప్పాల్సిన అవసరమే లేదు. పాటల రచయితగా మరియు డాన్సర్ గా కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఆమె తన 83 వ ఏట కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె పూతిగా బెడ్ కే పరిమితమయ్యింది. చికిత్స సైతం బెడ్ మీదనే అందిస్తున్నారని సమాచారం. ఇక చికిత్స పొందుతూనే టీనా నేటి ఉదయం మరణించినట్లు తెలుస్తోంది. శరీర అవయవాలు అన్ని క్షీణించడంతోనే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతి వార్త విని సంగీత ప్రియులు తీవ్ర దిగ్బ్రాంతికి గురి అవుతున్నారు. క్వీన్ ఆఫ్ రాక్ అండ్ రోల్ బిరుదు దక్కించుకోవడంతో పాటు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఆమె ఎన్నో హిట్ సాంగ్స్ ను అందించింది. ఒక్క సినిమాల్లోనే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్, లైవ్ కన్సర్ట్స్ తో అప్పట్లో సంగీత ప్రపంచాన్ని షేక్ ఆడించింది. ఇక టీనా మరణవార్త విన్న ప్రముఖులు, అభిమానులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ట్విట్టర్ వేదికగా పోస్ట్లు పెడుతున్నారు.. రిప్ క్వీన్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.