NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

విద్యార్థులకు శుభవార్త.. రేపే ఆ మొత్తం ఖాతాల్లో జమ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విద్యార్థులకు శుభవార్త చెప్పారు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న సీఎం.. రేపు జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి నగదు జమచేయనున్నారు.. అయితే, ఇప్పుటికే రెండో సార్లు సీఎం జగన్‌ కొవ్వూరు పర్యటన వాయిదా పడింది.. గత నెల 14న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం రోడ్ షో, భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, అనుకోని కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఇక, ఈ నెల 5న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మరోసారి అధికారులు ప్రకటించారు.. దీనికి కూడా ఏర్పాట్లు జరిగాయి.. కానీ, వర్షాల హెచ్చరిక నేపథ్యంలో మరోమారు వాయిదా పడింది.. మొత్తంగా రేపు అనగా ఈ నెల 24న సీఎం కొవ్వూరులో పర్యటించనున్నారు సీఎం జగన్‌. కొవ్వూరు పర్యటన కోసం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి కొవ్వూరు చేరుకుంటారు. అక్కడ సత్యవతినగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి నగదు జమచేయనున్నారు సీఎం జగన్‌.. కార్యక్రమం అనంతరం కొవ్వూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. మరోవైపు.. రేపు కొవ్వూరులో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. రాజమండ్రి – కొవ్వూరు మధ్య వాహనాలను గామన్ వంతెన, ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మళ్లించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు పోలీసులు.

నేనెక్కడా తప్పు చేయలేదు.. డింపుల్ ప్రవర్తన అభ్యంతరకరం
పార్కింగ్ వ్యవహారంలో సినీ నటి డింపుల్ హయాతి, డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే! ఈ వ్యవహారంలో డింపుల్‌పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. అయితే.. డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారని, ఆమెను వేధించడమే డీసీపీ ఉద్దేశమని డింపుల్ తరఫు న్యాయవాది బాంబ్ పేల్చారు. అటు.. డింపుల్ సైతం తనపై తప్పుడు కేసు పెట్టారని, తానెప్పుడూ డీసీపీని ఇబ్బంది పెట్టలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన పట్ల డింపుల్ ప్రవర్తించిన తీరు అభ్యంతకరమైందని ఆయన కుండబద్దలు కొట్టారు. డీసీపీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. ‘‘నేను, డింపుల్ ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. నా కారుకు అడ్డంగా డింపుల్ కారు పెట్టారు. నాకు అర్జెంట్‌గా బయటకు వెళ్లే పని ఏర్పడి, నేనే వ్యక్తిగతంగా వెళ్లి కారు తీయాలని రిక్వెస్ట్ చేశాను. కానీ.. డింపుల్ నా పట్ల దురుసుగా ప్రవర్తించింది. నా కారుని ఢీకొట్టడంతో పాటు కాళ్లతో తన్నింది. నా పట్ల డింపుల్ ప్రవర్తన తీరు తీవ్ర అభ్యంతరకరమైనది. ఈ ఘటనపై నా డ్రైవర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డింపుల్ చేసిన ట్వీట్ పూర్తిగా అభ్యంతరకరం. నేను ఎక్కడా తప్పు చేయలేదు. నిజాలు నిలకడమీద బయటకు వస్తాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. కేవలం కారు తీయమన్న పాపానికి.. డింపుల్ దురుసుగా వ్యవహరించిందని ఆయన ఆరోపణలు చేశారు.

బెంగళూరులో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన రూ. 2 కోట్ల బంగారం
గార్డెన్‌ సిటీగా పిలుచుకునే బెంగళూరులో గత రెండు రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఈ వర్షాల దెబ్బకు జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా వరద నీరు కారణంగా ఓ బంగారు షాపులోని ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ యజమాని తీవ్రంగా నష్టపోయాడు. మల్లీశ్వర్‌లోని 9వ క్రాస్‌లోని ఓ బంగారం దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. కాసేపు తర్వాత షాప్ లోకి భారీగా వరద నీరు రావడంతో అక్కడున్న బంగారు నగలు కొట్టుకుపోయాయి. దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన నగలు కొట్టుకుపోయినట్లు సమాచారం. దుకాణం సమీపంలో జరుగుతున్న పనులే నష్టానికి కారణమని దుకాణం యజమాని ఆరోపిస్తున్నాడు. షాపులోని బంగారు ఆభరణాలు తడిసిపోయాయి.. కార్పొరేషన్‌కు ఫోన్ చేసి సహాయం కోరినా అధికారులు సాయం చేయకపోవడంతో 80 శాతం నగలు మాయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

భారత్-ఆసీస్ సంబంధాలను 3 సీలు ప్రభావితం చేస్తాయి..
భారత్- ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అవి కామన్‌వెల్త్, క్రికెట్, కర్రీ అని ఆయన చెప్పుకొచ్చారు. సిడ్నీలో ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత్ – ఆస్ట్రేలియాను కలిపి వుంచే మరో బంధం యోగా అని తెలిపారు. ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్ కూడా మన రెండు దేశాలను ఏకం చేస్తున్నాయని భారత ప్రధాని చెప్పారు. టర్కీలో భూకంపం వస్తే భారత్ అండగా నిలబడిందని ఆయన గుర్తుచేశారు. భారత్- ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయని ప్రధాని తెలిపారు. రెండు దేశాల మధ్య వలసల ఒప్పందం జరిగిందని.. బ్రిస్బేన్‌లో త్వరలోనే భారత కాన్సులేట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద వున్న భారత్ స్పందిస్తోందని.. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారని మోడీ వెల్లడించారు. కరోనా సమయంలో భారత్‌లో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందని మోడీ గుర్తుచేశారు. తనతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఇస్లామాబాద్ హైకోర్టు
ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఇవాళ (మంగళవారం) జ్యుడిషియల్ కాంప్లెక్స్ వద్ద హింసకు సంబంధించిన ఎనిమిది ఆరోపణలపై PTI నాయకుడు ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. PTI చీఫ్ అభ్యర్థనకు సానూకులంగా స్పందించిన న్యాయమూర్తి జూన్ 8 వరకు బెయిల్ మంజూరు చేశారు. ఈరోజు ముందుగా, అల్-ఖాదిర్ ట్రస్ట్ సమస్యకు సంబంధించి, మాజీ ప్రధాని మరియు అతని భార్య బుష్రా బీబీ కూడా ఇస్లామాబాద్‌లోని అకౌంటబిలిటీ కోర్టు (NAB) నుండి బెయిల్ పొందారు. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి అకౌంటబిలిటీ కోర్టు మే 31 వరకు బెయిల్ మంజూరు చేసింది. NAB తనను అరెస్ట్ చేయకుండా ఆపడానికి బెయిల్ కోసం ఆమె నిన్న కోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది. తను కోర్టుకు హాజరు కావడానికి రాజధానిలో ఉన్నప్పుడు అరెస్టు చేయబడే 80శాతం అవకాశాలు ఉన్నాయని తాను నమ్ముతున్నట్లు ఇమ్రాన్ ఇప్పటికే పేర్కొన్నాడు.

మెటాకు షాక్‌.. రికార్డు స్థాయిలో జరిమానా.. ఎందుకంటే..?
సోషల్‌ మీడియా దిగ్గజం షేక్‌బుక్‌ మాతృసంస్థ మెటాకు భారీ షాక్‌ తగిలింది… యూరప్ యూజర్ డేటాను యూఎస్‌కు బదిలీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ‘మెటా’కు రికార్డు స్థాయిలో జరిమానా విధించింది యూరోపియన్ యూనియన్.. మెటాపై రికార్డు స్థాయిలో అంటే 1.3 బిలియన్‌ యూరోలు జరిమానా విధించింది.. అదే విధంగా అట్లాంటిక్ అంతటా వినియోగదారు డేటాను బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు యూరోపియన్ యూనియన్ మే 22న ఈ నిర్ణయం తీసుకుంది.. 2018 మే 25వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR)ని మెటా ఉల్లంఘించిందని ఐరిష్ వాచ్‌డాగ్ పేర్కొంది.. ఈ నేపథ్యంలో 1.3 బిలియన్ యూరోలు అంటే 130 కోట్ల డాల‌ర్లు లేదా 10 వేల కోట్ల రూపాయలు చెల్లించాల‌ని డీపీసీ ఆదేశించింది. అయితే, ఈ వ్యవహారంపై మెటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్యాయమైన ఈ జరిమానాపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది.. యూరోప్‌లో ఫేస్‌బుక్‌కు తక్షణ అంతరాయం లేదు అని కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయం లోపభూయిష్టమైనది, అసమంజసమైనది. ఈయూ మరియు యూఎస్‌ మధ్య డేటాను బదిలీ చేస్తున్న లెక్కలేనన్ని ఇతర కంపెనీలకు ప్రమాదకరమైన ఉదాహరణగా ఉందని మెటా ప్రతినిధి పేర్కొన్నారు.

జియో బంపరాఫర్‌.. ఈ ప్లాన్‌పై 10 జీబీ డేటా..
అన్నీ ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది రిలయన్స్‌ జియో.. ఇక ఎప్పటికప్పుడు తన యూజర్లకు ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంది.. కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడంతో పాటు.. పాత వినియోగదారులకు కూడా ఆఫర్లు ఇస్తోంది.. టాటా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశకు చేరుకున్న క్రమంలో ఉచితంగా అదనపు డేటా ఆఫర్ ప్రకటించింది. గతంలో ఉన్న ధరకే అదనగా 4 జీబీ డేటా అందిస్తోంది. జియో రూ. 61 డేటా బూస్టర్ రీఛార్జ్ ప్లాన్‌పై ఇప్పటి వరకు 6 జీబీ డేటా ఇస్తుండగా.. ఇప్పుడు 10 జీబీ డేటాను అందిస్తోంది.. అంటే 4 జీబీ డేటా అదనంగా ఇస్తుందన్నమాట.. అయితే, ఈ రోజు క్వాలిఫయర్‌లతో ప్రారంభమయ్యే ఐపీఎల్ చివరి వారంలోపు ఈ డీల్‌ను తీసుకొచ్చింది జియో.. టెలికాం ఆపరేటర్ రూ. 15 నుండి మొత్తం ఐదు డేటా బూస్టర్‌లను అందిస్తుంది. Jio డేటా బూస్టర్ ప్యాక్‌లు ప్రైమరీ ప్యాక్ పైన అదనపు డేటాను అందిస్తాయి, ప్రత్యేకంగా ఎక్కువ డేటా అవసరమైనప్పుడు ఇవి ఉపయోగరకంగా ఉంటాయి.. జియో యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. రూ.61 డేటా బూస్టర్ ప్లాన్ మాత్రమే. అంటే మీరు మీ జియో సిమ్‌పై యాక్టివ్ రీచార్జ్ ప్లాన్ కలిగి ఉంటేనే ఇది వర్తిస్తుంది. అంటే నెల రోజులు లేదా ఆపైన ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన రీచార్జ్ ప్లాన్ ఉండాల్సి ఉంటుంది.

దేవుడి ఫ్రెండ్ మార్కండేయుడు వచ్చేశాడు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో పవన్ దేవుడిగా కనిపిస్తుండగా.. తేజ్.. డాక్టర్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ లుక్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ ను క్రియేట్ చేసిన తెల్సిందే. ఇక తాజాగా కొద్దిసేపటి క్రితమే తేజ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఇందులో తేజ్.. మార్కండేయులు అలియాస్ మార్క్ అనే పాత్రలో కనిపిస్తున్నట్లు తెలిపారు. ఇక మార్క్ లుక్ ఎంతో స్టైలిష్ గా ఉంది. వైట్ అండ్ వైట్ సూట్ లో తేజ్ అదిరిపోయాడు. యాక్సిడెంట్ వలన విరూపాక్షలో బక్కచిక్కి కనిపించిన తేజ్.. ఈ పోస్టర్ లో తన మునుపటి రూపానికి చేరుకున్నట్లు కనిపిస్తుంది. ఇక బ్రో ది అవతార్ ఫ్రెండ్ మార్కండేయులు అని రాసుకొచ్చి మరింత హైప్ పెంచేశారు. మామకు తగ్గట్టు అల్లుడు కూడా అల్ట్రా స్టైలిష్ గా కనిపించి మెప్పించాడు. ఇక పవన్ ఫస్ట్ లుక్ లో వెనుక రుద్రుడు అనగా శివుడును చూపించి ఆయన దేవుడుగా చూపించారు. ఇక ఇప్పుడు తేజ్ పేరు మార్కండేయులు అని చెప్పుకొచ్చారు. అంటే శివుడు- మార్కండేయుడు అని చెప్పకనే చెప్పేశాడు త్రివిక్రమ్.. కాల యముడు పాశం నుంచి మార్కండేయుడును శివుడు ఎలా తప్పించాడో.. ఇప్పుడు ఈ దేవుడు.. మార్క్ ను తన చావు నుంచి తప్పించడానికి వచ్చాడు అనే విధంగా.. పురాణాలతో మిక్స్ చేశాడు త్రివిక్రమ్. మొత్తానికి పోస్టర్ ఓ రేంజ్ లో ఉంది.ఇక ఈ సినిమా జులై 28 న ప్రేక్షకుల ముందు రానుంది. మరి ఈ సినిమాతో మామ అల్లుళ్ళు ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.