NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*ఏపీలో పెరిగిన పోలీసుల నిఘా.. సమస్యాత్మక ప్రాంతాలపై డేగకన్ను
ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను భారీగా పెంచారు. మళ్లీ ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ రోజు జరిగిన హింసతో ఏపీ హై అలర్ట్‌ కొనసాగుతోంది. రాష్ట్రాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో మూలమూలలా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అల్లర్లు సృష్టించిన నిందితుల కోసం గాలిస్తున్నారు. బైండోవర్‌ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. రౌడీ షీట్స్‌ ఉన్నవారిని కౌంటింగ్‌ రోజున పోలీస్‌ స్టేషన్‌కు పిలవాలని పోలీసులు నిర్ణయించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని దూరంగా ఉండే పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని పోలీసులు ప్లాన్‌ చేస్తున్నారు. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. కౌంటింగ్‌ తేదీ దగ్గరపడుతుండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. మరోవైపు పల్నాడు జిల్లాలో ఇంకా టెన్షన్‌ వాతావరణం కొనసాగుతూనే ఉంది. పోలింగ్‌ తర్వాత జరిగిన ఘర్షణ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. గొడవలు జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. మరోవైపు వరుసగా 8వ రోజూ కూడా షాపులను పోలీసులు మూసేయించారు. గొడవల కారణంగా కొందరు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసేస్తుంటే.. మరికొన్ని షాపులను పోలీసులు మూసేయిస్తున్నారు. కౌంటింగ్‌ తేదీ దగ్గర పడుతున్న తరుణంలో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు డేగకన్ను వేశారు. కానీ ఓ వైపు పోలీసులకు కూడా వణుకు పుడుతున్నట్లు తెలుస్తోంది.

 

*కంబోడియాలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్‌పై తిరగబడ్డ బాధితులు
నిరుద్యోగులే లక్ష్యంగా అమాయకులకు కంబోడియాలో ఉద్యోగం పేరుతో వల వేసి, అక్కడకు వెళ్లాక పాస్ పోర్ట్, వీసాలు తీసేసుకుంటారు. ఏడాది పాటు బలవంతంగా ఇండియాలోనే ఆర్థిక నేరాలు చేయిస్తున్న ముఠా దారుణాలు వెలుగు చూశాయి. పక్కా సమాచారంతో విశాఖ పోలీసులు ఈ ముఠాకు చెక్ పెట్టారు. ఉద్యోగం పేరుతో కాంబోడియాకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ల చేత మొబైల్ కాల్స్ ద్వారా రకరకాల సైబర్ నేరాలు చేయిస్తోంది ఆ ముఠా. ఇందుకోసం డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్ర ప్రదేశ్ నుంచి చాలా మంది యువకులను కంబోడియాకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు. వారితో మోసాలు చేయిస్తున్న గ్యాంగ్‌ను విశాఖ పోలీసులు గుర్తించారు. వారితో బలవంతంగా ఫెడ్ ఏక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలను చేయిస్తున్నట్టు నిర్దారించారు. నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరుకు వసూలు చేసి కంబోడియాకు పంపుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కంబోడియాలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్‌పై బాధితులు తిరగబడ్డారు. సిహనౌక్వేల్‌లోని జిన్బో & కాంపౌండ్‌లో వారి నిర్వాహకులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. విశాఖ సిటీ పోలీసుల వాట్సాప్ నంబర్లకు యువకులు వీడియోలు పంపినట్లు తెలిసింది. ఇంటర్నేషనల్ సైబర్ ముఠాల ఆగడాల నుంచి విడిపించాలని యువకులు వీడియోలో విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు తర్వాత వారిలో ఎక్కువ మందిని కంబోడియా లోకల్ అథారిటీస్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జైలులో ఉన్న భారతీయులను విడిపించడానికి బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను వైజాగ్ సిటీ పోలీసులు సంప్రదించారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫక్కీరప్ప సారథ్యంలో 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మానవ అక్రమ రవాణా కేసును విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు.

 

*తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆస్కార్ గ్రహీత సంగీతం!
కొన్నాళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ పాటను ప్రముఖ కవి అందెశ్రీ రాశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందే ఈ పాట రాయగా తెలంగాణ రెండో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేశారు. ఈ పాట రాసిన అందెశ్రీ చదువుకోలేదు. ఆయన జనగామ జిల్లా రేవర్తికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించారు. పశువుల కాపరిగా తాపీ మేస్త్రీగా పనిచేశారు. కవిత్వం ఆయనకు సహజంగానే వచ్చింది, రాయడం నేర్చుకుని విద్యావంతుడయ్యాడు. డిగ్రీ లేదు కానీ అనేక విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు పొందారు అందెశ్రీ. అందెశ్రీ నదులపై కవిత్వం రాస్తూ ప్రపంచమంతా తిరిగాడు. మిస్సిస్సిప్పి, మిస్సోరీ, అమెజాన్, నైల్ లాంటి మహానదుల వెంట ప్రయాణిస్తూ నదులపై పెద్ద కవిత రాసే పనిలో పడ్డారు. ‘నిప్పుల వాగు’ పేరుతో వెయ్యేళ్ల నాటి తెలంగాణ పాటను కూడా ఆయన రికార్డు చేశారు. ఇక ఇప్పుడు అందెశ్రీ రాసిన పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఒక పాటను రికార్డు చేయనున్నారు. ఇక అందుకోసం సీఎం రేవంత్ తో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి భేటీ అయ్యారు. జయ జయహే తెలంగాణ పాట కోసం సీఎంతో కీరవాణి భేటీ అయ్యారు. రాష్ట్ర గీతం కీరవాణితో పాడించేందుకు భేటీ జరుగగా ఈ భేటీలో రచయిత అందెశ్రీ కూడా ఉన్నారు. ఇక పాట పాడి సంగీతం అందించేందుకు కీరవాణి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది.

 

*చేపల కోసం ఎగబడ్డ గ్రామస్తులు.. పుష్కరాన్ని తలపించిన నెరడ పెద్ద చెరువు
మహబూబాబాద్ జిల్లాలో చేపల చెరువు లూటీకి గురైంది. వేల సంఖ్యలో గ్రామస్తులు చెరువు దగ్గరకు వచ్చి చెరువులో చేపలను పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నెరడ పెద్ద చెరువులో మత్స్యకారులు చేపల వేట సాగిస్తుండగా, వేల సంఖ్యలో గ్రామస్తులు చేపలు పట్టేందుకు తరలివచ్చారు. దీంతో ఆ చెరువంతా పుష్కరాన్ని తలపించింది. పెద్ద చెరువు లూటీ పోయిందని తెలువడంతో ఒక్కసారిగా ఎగబడ్డ గ్రామస్తులు… వలలతో చెరువులో దిగిన గ్రామస్తులు లూటీ చేశారు. అయితే అప్పటివరకు ప్రశాంతంగా వున్న పెద్ద చెరువు ఒక్కసారిగా వలలతో, గ్రామస్తులతో నిండిపోయింది. చేపలను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ విషయమై కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో పెద్ద చెరువు వద్దకు హుటా హుటిన పోలీసులు చేరుకున్నారు. అక్కడున్న వారిని చెదర గొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులను కూడా లెక్కచేయకుండా చేపల వేటలో గ్రామస్తులు నిమగ్నమయ్యారు. అయితే పెద్ద చెరువు లూఠీ అవడం ఇది మూడో సారిగా కొందరు గ్రామస్థులు చెబుతున్నారు. మృగ శిర కార్తికి ఇక్కడ గ్రామస్థులకు ఈ చెరువుపై హక్కు వుంటుందని తెలిపారు. అందుకే ఇక్కడ గ్రామస్థులు చేపల వేట పడుతున్నారని అన్నారు. గొడవలు జరగలేదని, లూటీ చేయడానికి గ్రామస్థలకు హక్కు ఉంటుందని తెలిపారు. అయితే పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు విషయం కనుగునేందుకు స్థానికులకు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా మహబూబాబాద్ జిల్లాలో చెరువు దగ్గరకు వచ్చిన వేలాది గ్రామస్తులు చెరువులో ఉన్న చేపలను పట్టుకుపోయారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగా… అక్కడికి తరలివచ్చిన వేలాది గ్రామస్తులు చేపలను పట్టుకోవడానికి చూశారు. దీంతో మత్స్యకారులకు గ్రామస్తులకు ఘర్షన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని శాంతింప చేయాలని చూశారు. పోలీసుల మాటలను గ్రామస్థులు పట్టించుకోకుండా తోసుకుంటూ వెళ్లి చేపలను పట్టుకున్నారు. వేలాదిగా వచ్చిన గ్రామస్తులను పోలీసులు అదుపు చేయలేక చేతులెత్తేశారు.

 

*వామ్మో.. పిత్తాశయంలో 570 రాళ్లు.. చివరకు..
ఓ మహిళ తాజాగా కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది.. ఆమెను క్షుణంగా పరీక్షించిన తదుపరి గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో ఆపరేషన్ చేసి సదరు మహిళ కడుపులోని 570 రాళ్లను తొలగించారు. ఈ ఘటన సంబంధించి ఏపీ లోని అమలాపురంలో ఏఎస్ఏ ఆసుపత్రిలో ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. మే 18న ఆపరేషన్ జరగగా.. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోందని వైద్యులు వివరించారు. ఇక జరిగిన ఆపరేషన్ వివరాలను ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణానికి చెందిన జాలెం నరసవేణి అనే మహిళా గత కొంతకాలంగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా భోజనం చేశాక ఈ నొప్పి ఎక్కువ అవుతుండడంతో భరించలేక వైద్యులను ఆశ్రయించింది. ముందుగా దేవగుప్తం ఆసుపత్రిలో వైద్యుల వద్ద చూపించుకోగా.. అక్కడి వైద్యులు అమలాపురంలోని ఏఎస్ఏ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ నరసవేణిని పరీక్షించిన ఏఎస్ఏ వైద్య బృందం.. స్కానింగ్ లో ఆమె గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దాంతో వెంటనే ఆపరేషన్ చేసి వాటిని తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18న డాక్టర్ నర్రా శ్రీనివాసులు, డాక్టర్ అంజలి నేతృత్వంలో అరుదైన ఆపరేషన్ చేసి నరసవేణి గాల్ బ్లాడర్ లోని నుంచి 570 రాళ్లను తొలిగించారు. సాధారణంగా 10 – 20 రాళ్లు కనిపిస్తాయని, కాకపోతే ఇంత పెద్ద సంఖ్యలో రావడం ఇదే మొదటి సారని డాక్టర్ తెలిపారు. ఇకపోతే సరైన సమయానికి ఆ మహిళను ఆసుపత్రిలో జాయిన్ వల్ల ఆపరేషన్ చేయడంతో ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు వైద్యులు.

 

*కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్‌పై సిరా విసిరిన నిందితుడు అరెస్ట్..
ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరా విసిరిన నిందితుడు అజయ్‌కుమార్‌ (41)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నార్త్ ఈస్ట్ డీసీపీ జాయ్ టిర్కీ సమాచారం అందించారు. కాగా.. మే 17న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కన్హయ్య కుమార్‌పై ఇంక్‌ విసిరి, చెంపదెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు కన్హయ్యకు పూలమాల వేస్తానన్న సాకుతో వచ్చి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ దాడికి పాల్పడింది బీజేపీనేనని కన్హయ్య కుమార్ ఆరోపిస్తూ, సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ తనపై దాడికి పాల్పడ్డారని అన్నారు. కన్హయ్యపై దాడి జరిగినప్పుడు స్థానిక కౌన్సిలర్ ఛాయా శర్మ కూడా ఆయన వెంటే ఉన్నారు. పార్టీ తనను అభ్యర్థిని చేసినప్పటి నుంచి మనోజ్ తివారీ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కన్హయ్య పేర్కొన్నారు. తమ నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించడం లేదన్న భావన తివారీకి మొదలై.. ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాడని కన్హయ్య కుమార్ తెలిపారు. తమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని కన్హయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. సిట్టింగ్ ఎంపీ తివారీ తనకు పెరుగుతున్న ప్రజాదరణతో నిరాశ చెందారని, అందుకే తనపై దాడికి గూండాలను పంపారని కన్హయ్య పేర్కొన్నారు. మే 25న ఓటింగ్ ద్వారా హింసకు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. కాగా.. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బీజేపీ ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి మనోజ్ తివారీని అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ ఈ స్థానం నుంచి కన్హయ్య కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ సీటుపై వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. కన్హయ్య తన రాజకీయాలను JNU నుండి ప్రారంభించాగా.. మనోజ్ తివారీ ప్రసిద్ధ నటుడు, గాయకుడు.. ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి ప్రవేశించారు.

 

*యూపీలో ఐటీ రైడ్స్.. చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు సీజ్
సార్వత్రిక ఎన్నికల వేళ యూపీలో నోట్ల కట్టల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవలే జార్ఖండ్‌లో మంత్రి పీఏ ఇంట్లో భారీగా నగదు ప్రత్యక్షం కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. రెండ్రోజుల నుంచి ఓ చెప్పుల వ్యాపారి ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. వాటిని లెక్కించడానికి మెషీన్లు కూడా మొరాయించాయి. భారీగా నగదుతో పాటు ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారుల ఇళ్లల్లో మంచాలు, అల్మారాలు, బ్యాగులు, షూ బాక్సుల్లో 500 రూపాయల నోట్ల కట్టల్లో లభ్యమయ్యాయి. సోదాల్లో బయటపడ్డ నోట్ల కట్టలను చూసి అధికారులు కూడా కంగుతిన్నారు. చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏ మూలన చూసినా నోట్ల కట్టలే ప్రత్యక్షమయ్యాయి. నోట్లు లెక్కించలేక యంత్రాలే ఇబ్బందిపడ్డాయి. డబ్బుల కట్టలతో పాటు ఆక్రమార్జనకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అధికారులు సీజ్‌ చేశారు. కేవలం 42 గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగిన సోదాల్లో కోట్ల కొద్దీ డబ్బును అధికారులు గుర్తించారు. వ్యాపారుల ఇళ్లల్లో డబ్బుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమాస్తులు లెక్క ఇప్పటివరకూ రూ.100 కోట్లు తేలిందని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వెల్లడించాయి. రెండు రోజుల క్రితం సోదాలు ప్రారంభమవ్వగా.. ఇప్పటికీ నగదును లెక్కిస్తూనే ఉన్నారు. మంచంపై రూ. 500 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. వాషింగ్ మెషీన్, గోడల్లోని రహస్య ప్రదేశాల్లో భారీగా డబ్బులు గుర్తించినట్లు తెలుస్తోంది. నోట్లు లెక్కించే యంత్రాలు వేడెక్కడం వల్ల ఇతర యంత్రాలను తెప్పించారు. చెప్పుల వ్యాపారి రామ్‌నాథ్‌డాంగ్‌ ఇంటి నుంచి ఐటీ బృందం ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు బినామీ ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. కొంతకాలంగా బీకే షూస్, మన్షు ఫుట్‌వేర్‌లో పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారని ఆదాయపు పన్నుశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులతో ఐటీ శాఖ సోదాలు చేసింది. భూమి, బంగారంపై పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నోట్ల కట్టల  వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

*ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి పట్ల సంతాపం తెలిపిన భారత్..
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, అతని విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరాబ్దోల్లాహియాన్, ఇతర అధికారుల మరణానికి భారతదేశం ఒక రోజు సంతాపాన్ని పాటించడంతో మంగళవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జాతీయ జెండాను సగం మాస్ట్ వద్ద ఎగురవేశారు. రైసీ మరణానికి భారతదేశం ఒక రోజు సంతాపాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి సోమవారం ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ లు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ, హోస్సేన్ అమీర్ అబ్దొల్లాహియాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ – ఇరాన్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఇరువురు నాయకులు పోషించిన ముఖ్యమైన పాత్రను వారు తమ సందేశాలలో పేర్కొన్నారు. రైసీ, అమీరాబ్దోల్లాహియాన్, ఇతరులు అజర్బైజాన్ సరిహద్దును సందర్శించిన తరువాత ఇరాన్ కు వెళ్తుండగా., అక్కడ వారు ఆనకట్ట ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు వారి హెలికాప్టర్ వాయువ్య ఇరాన్లోని జోల్ఫాలోని పర్వత ప్రాంతంలో కూలిపోయింది. వర్షం, పొగమంచు మధ్య గంటల తరబడి సెర్చ్ ఆపరేషన్ తరువాత రెస్క్యూ బృందాలు క్రాష్ సైట్ దగ్గరికి వెళ్లి అక్కడ కనిపించకపోవడంతో హెలికాప్టర్లో ఉన్న వారందరూ చనిపోయినట్లు ప్రకటించారు. రైసీ, ఇతరులను కోల్పోయినందుకు సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, వారి విషాదకర మరణంతో తాను బాధపడ్డానని, దిగ్భ్రాంతికి గురయ్యానని, ఈ విషాద సమయంలో భారతదేశం ఇరాన్ కు మద్దతుగా నిలుస్తుందని అన్నారు.

 

*బెంగళూరు రేవ్ పార్టీ.. పోలీసులతో వివాదం.. మరో వీడియో పోస్ట్ చేసిన హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు ప్రయత్నం చేసి రోజులు గడుస్తున్నా ఏదో ఒక వార్త తెరమీదకు వస్తూనే ఉంది. ముఖ్యంగా తెలుగు నటి హేమ ఈ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నదనే విషయాన్ని బెంగళూరు పోలీసులు ఘంటా పధంగా చెబుతున్నారు. నిజానికి ముందు హేమ పేరు ప్రచారం జరిగితే కొద్దిసేపటికి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని ఇక్కడ చిల్ అవుతున్నాను, నేను ఎలాంటి బెంగుళూరు ఫామ్ హౌస్ కి వెళ్లలేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె వీడియో రిలీజ్ చేసిన కొద్దిసేపటికి బెంగళూరు పోలీసులు ఆమె ఫోటో ఒకదాని రిలీజ్ చేయడమే కాదు ఆమె వీడియో చేసి రిలీజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ ని కూడా ఒక ఫోటో తీసి ఆమె తమ అదుపులోనే ఉందని ప్రకటించడం కలకలం రేపింది. ఇక ఈరోజు కూడా బెంగళూరు సిపి పెట్టిన ప్రెస్ మీట్ లో హేమ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమె కూడా ఈ పార్టీలో పాల్గొన్నదని ఆయన వెల్లడించారు. అయితే రేవ్ పార్టీలో పాల్గొన్నందుకు ఒక కేసు, అసలు తన పాల్గొనలేదంటూ వీడియో రిలీజ్ చేసినందుకు మరో కేసు ఆమె మీద ఫైల్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా జరుగుతూ ఉండగానే ఆమె తన సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నానంటూ ఆమె తయారీ విధానాన్ని చూపించడం గమనార్హం. అయితే హేమ పెట్టిన వీడియోకి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. దొరికేశారు ఇంకా కవర్ చేయొద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే మీరు ఎన్ని కవర్ డ్రైవ్ లు వేసినా పోలీసులు మీ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుండా ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేయడంలో అర్థం ఏంటి? మీరు ఇంట్లోనే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.