NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఏపీలో ఇసుక తవ్వకాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ అభయ్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మాసనం ఈ విచారణ జరిపింది.. ఇసుక అక్రమ మైనింగ్ పై కీలక ఆదేశాలు వెలువరించింది సుప్రీంకోర్టు.. అక్రమ మైనింగ్ నిరోధానికి ప్రతి జిల్లాలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. కలెక్టర్, పోలీసులు, అధికారులు ఈ కమిటీలో ఉండాలని.. అక్రమ మైనింగ్ ఆపడానికి చర్యలు తీసుకోవాలని.. అలాగే కమిటీ రెగ్యులర్ గా మైనింగ్ ప్రాంతాలు సందర్శించాలని.. ప్రతి జిల్లాలో ఈ కమిటీ ఉండాలని స్పష్టం చేసింది.. మరోవైపు.. “గ్రీవెన్స్ సెల్” ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణకు “టోల్ ఫ్రీ” నెంబర్, ఈ మెయిల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.. ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా కమిటీ పని చేయాలని.. “టోల్ ఫ్రీ” నెంబర్, ఈ మెయిల్ గురించి విస్తృత పబ్లిసిటీ ఇవ్వాలని పేర్కొంది. ఆదేశాలు అమలు చేయకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరింది.. ఇక, అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో జిల్లా కమిటీ వెంటనే తనిఖీ చేసి నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.

గవర్నర్‌కు చంద్రబాబు లేఖ.. ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు..!
ఏపీ గవర్నర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపేయాలని గవర్నర్‌ను లేఖ ద్వారా కోరారు చంద్రబాబు.. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు చంద్రబాబు.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. పారదర్శకత పాటించని ఈ ప్రభుత్వంలో ఈ-ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక, చంద్రబాబు తన లేఖలో పేర్కొన్న అంశాల విషయానికి వెళ్తే.. ఈ-ఆఫీస్ వెర్షన్ ను అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం షెడ్యూల్ చేసిన ఈ-ఆఫీస్ వెర్షన్ అప్ గ్రేడ్ వల్ల సీఎంవో, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ విభాగాల సేవలకు సంబంధించి ఈ ఆఫీస్ ఈ నెల 17 నుండి 25 వరకు అందుబాటులో ఉండదు. అత్యవసరంగా ఇప్పుడు చేపట్టిన ఈ విధానంపై అధికారులు, రాజకీయ పార్టీలో అనుమానాలు ఉన్నాయన్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన జీవోలను కూడా ప్రభుత్వం వెబ్ సైట్ లో పెట్టడకుండా రహస్యంగా ఉంచుతోందని దుయ్యబట్టిన ఆయన.. అడ్డగోలుగా విడుదల చేసిన జీవోలను, ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం దాడి చేసిందన్నారు.. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఈ-ఆఫీస్ వెర్షన్‌ మార్పు కోసం నిర్ణయం తీసుకోవడం సరికాదు. 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ ఆఫీస్ మూసివేత, అప్ గ్రేడ్ ప్రక్రియను కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేదాకా నిలిపివేయాలని సీఎస్ ను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు చంద్రబాబు.

భాగ్యనగరంలో భారీ వర్షం.. అరగంటలో 5 సెంటిమీటర్ల వాన
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అరగంటలో అత్యధికంగా 5 సెంటిమీటర్ల వాన కురవడంతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. యూసఫ్‌గూడ లో 5.1 సెంటీ మీటర్లు, ఖైరతాబాద్‌లో 4.8, ఆదర్శ నగర్ లో 4.4, శ్రీనగర్ కాలనీలో 4.2, బాలానగర్ ఫిరోజ్ గూడలో 4.2, బంజారాహిల్స్ 4.2, రాయదుర్గంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో కూడా 4 సెంటి మీటర్ల లోపు వర్షం కురిసింది. మరోవైపు.. రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి నగర ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్, ఈవీడీఎం డైరెక్టర్‌తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యం లో చెట్లు విరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.

సంక్షోభ సమయంలో మోడీకి సాయం చేశా.. శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు..
రైతుల కష్టాలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ, ఎన్సీపీ నేత శరద్ పవార్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన ఒక రోజు తర్వాత శరద్ పవార్ ప్రధాని మోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 2004-2014 మధ్య కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీకి సాయం చేశానని అన్నారు. ఆ సమయంలో అతని రాష్ట్రంలో వ్యవసాయం చాలా సంక్షోభంలో ఉందని అన్నారు. ఒకానొక సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి తనకు ఫోన్ చేసి ఇజ్రాయిల్‌లో విశిష్టమైన వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసేందుకు అక్కడికి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాడని శరద్ పవార్ అన్నారు. వ్యవసాయ రంగంలోని సమస్యలపై తన వద్దకు వచ్చే వాడని, నన్ను గుజరాత్ తీసుకెళ్లారని, ఒకసారి ఇజ్రాయిల్‌ని సందర్శించాలని అనుకున్నప్పుడు తనను నా వెంట తీసుకెళ్లానని, ఇప్పుడు నరేంద్రమోడీ ఏం చెప్పినా తాను పట్టించుకోనని శరద్ పవార్ అన్నారు. అంతకుముందు ప్రధాని మాట్లాడుతూ.. రైతుల కోసం శరద్ పవార్ ఏం చేయలేదని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హయాంలో రైతులు భారీగా లబ్ధి పొందారని, శరద్ పవార్ రైతాంగాన్ని విడిచిపెట్టారని, వారి సంక్షేమం కోసం ఆయన ఏం చేయలేదని మోడీ విమర్శలు గుప్పించారు. జూలై 2017లో ఇజ్రాయిల్‌ని సందర్శించిన మొదటి భారత ప్రధానిగా నరేంద్రమోడీ చరిత్ర సృష్టించారు.

భారత ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ పై స్పందించిన క్రీడా ప్రపంచం..
భారత ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి 19 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే, క్రీడా ప్రపంచంలో చాలా మంది భారత ఫుట్బాల్ లెజెండ్ ను గౌరవించడానికి, అభినదించడానికి ముందుకు వచ్చాయి. ఛెత్రి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో 10 నిమిషాల వీడియోతో పదవీ విరమణ ప్రకటించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి తనను మొదటిసారి పిలిచిన సమయంలో తన కెరీర్ సమయం ఇక ఫుట్బాల్ కు కేటాయించాలనే తన నిర్ణయాన్ని గుర్తు చేసుకున్నాడు. భారత ఫుట్బాల్ లెజెండ్, భారత ఫుట్బాల్ ప్రమాణాలను పునర్నిర్వచించిన ఆటగాడుగా సునీల్ ఛెత్రి పేరు పొందాడు. తన దేశానికి మాత్రమే కాకుండా అంతర్జాతీయ సర్క్యూట్లో కూడా ప్రేరణగా నిలిచాడు, జూన్ 6 న కువైట్ తో జరిగబోయే మ్యాచ్ లో చివరిసారిగా జాతీయ జెర్సీని ధరించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్బంగా భారత క్రికెట్ లెజెండ్, ఛెత్రి స్నేహితుడు విరాట్ కోహ్లీ కూడా ఫుట్బాల్ క్రీడాకారుడి ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన “సోదరుడు” పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేశారు. అతను, “నా సోదరుడు, గర్వంగా” అన్నాడు.

ఒక్కసారి వీడ్కోలు పలికితే.. నన్ను చూడలేరు.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు..
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా తన రిటైర్మెంట్ తరువాత తన ప్రణాళికలను వెల్లడించాడు. క్రికెట్ నుండి రిటైర్ అయిన తరువాత తన తదుపరి దశలను ఆలోచించే ముందు సుదీర్ఘ విరామం తీసుకుంటానని తెలిపాడు. విరాట్ కోహ్లీ క్రికెట్లోనే కాకుండా మొత్తం క్రీడా ప్రపంచంలో చెరగని ముద్ర వేశాడు. కోహ్లీ ప్రభావం ఎంత ఉందంటే., 2028 లాస్ ఏంజిల్స్ క్రీడల ఒలింపిక్ కార్యక్రమంలో క్రికెట్ ను చేర్చడంలో ఇది ఒక పాత్ర పోషించింది. సిఎస్కెతో కీలకమైన ఐపిఎల్ మ్యాచ్ కు ముందు మే 18న బెంగళూరులో జరిగిన ఆర్సిబి రాయల్ గాలా డిన్నర్లో కోహ్లీని ఈ ప్రశ్న అడిగారు. ఇది చాలా సులభం అని 35 ఏళ్ల కోహ్లీ అన్నాడు. ఒక క్రీడాకారుడిగా, మన కెరీర్ కు ముగింపు తేదీ ఉందని నేను అనుకుంటున్నాను. ‘ఓహ్, నేను ఆ ప్రత్యేక రోజున ఇలా చేసి ఉంటే ఎలా ఉంటుంది’ అని ఆలోచిస్తూ నా కెరీర్ ను ముగించాలనుకోవడం లేదు. ఎందుకంటే., నేను ఎప్పటికీ కొనసాగించలేను. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత తదుపరి పరిణామాల గురించి ఆలోచించే ముందు సుదీర్ఘ విరామం తీసుకుంటానని కోహ్లీ తెలిపాడు. సాధారణంగా కోహ్లీ తన రిటైర్మెంట్ ప్రణాళికల గురించి మౌనంగా ఉంటాడు. ఏదేమైనా, అతను చివరకు ఒక ముఖ్యమైన వ్యాఖ్యలు చేసాడు. ఎటువంటి విచారం లేకుండా తన కెరీర్ ను ముగించాలని, అతను ఆడటం మానేసే వరకు తన ఉత్తమమైనదాన్ని ఇవ్వాలనే కోరికను వ్యక్తం చేశాడు.

ఇళయరాజా పారితోషికం తీసుకోకుండా మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఏంటో తెలుసా?
సంగీత సామ్రాట్ ఇళయరాజా సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఆయన కమర్షియల్ అంటూ ఎన్ని కామెంట్స్ వచ్చినా ఆయన మాత్రం తన పనికి తగిన ప్రతిఫలం దక్కి తీరాల్సిందే అంటారు. అయితే ఆయన ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా సంగీతం అందించిన సినిమా ఉంది. అదేంటో చూద్దాం పదండి. అన్నక్కిలి సినిమాతో తమిళ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన వరుసగా చేసిన సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈరోజు ఆయన సంగీతం వినకుండా కాలక్షేపం చేయలేని వారు చాలా మంది ఉన్నారు. ఇళయరాజా ఇటీవలే సినిమాల్లోకి వచ్చి 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. పలువురు తమ అభినందనలు తెలిపారు. ఇళయరాజా జీవిత చరిత్ర ప్రస్తుతం సినిమాగా రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒకవైపు ఇళయరాజా గురించి అనేక వివాదాస్పద విషయాలు మాట్లాడుతున్నా, ఆయన గురించి చాలా మందికి తెలియని మంచి విషయాలు ఉన్నాయి. తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుల్లో ఒకరు బి. వాసు. అతని మొదటి చిత్రం పన్నీర్ పుష్పమంగళ్. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఆ కాలంలో ఒక సినిమా రూ. 1 లక్ష వరకు ఇళయరాజా తీసుకునేవారు. అయితే పన్నీర్ పుష్పమంగళం ప్రారంభించి పూర్తయ్యే వరకు తన జీతం గురించి ఏమీ చెప్పలేదు. మీ జీతం ఎంత అని డైరెక్టర్ ఇళయరాజాను అడిగితే దానికి ఇళయరాజా ‘మొదటి సినిమా మంచిగా చేయండి, నాకు జీతం వద్దు’ అన్నారట. ఈ సమాచారం. వాసు ఓ ఇంటర్వ్యూలో పంచుకోవడం గమనార్హం.

వరుణ్ సందేశ్ మీద ‘నింద’ పోయేదెలా.. టీజర్ కట్ అదిరింది!
కాండ్రకోట మిస్టరీ అనే యధార్థ సంఘటన ఆధారంగా ‘నింద’ అనే చిత్రం రాబోతోంది. కొత్తబంగారు లోకం సినిమాతో ఒక్కసారిగా కుర్రకారుని ఆకట్టుకున్న వరుణ్ సందేశ్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాలు అందిస్తూ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేయగా తాజాగా ఈ మూవీ టీజర్‌ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్ ఎంతో న్యాచురల్‌గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతూన్నారు.వరుణ్ సందేశ్, ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్దార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ్ కృష్ణ, రాజ్ కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ తదితరలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.