NTV Telugu Site icon

Top Headlines @ 5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*పల్నాడులో ఇంతటి అరాచకమా.. అక్కడ రీపోలింగ్‌ జరగాల్సిందే..

మంత్రి అంబటి రాంబాబు ఏపీ ఎన్నికల అధికారి(సీఈవో) ఎంకే మీనాను కలిశారు. పల్నాడులో పొలిటికల్ హింస మీద ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని.. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. అభ్యర్థులను తిరగొద్దని చెబితే.. తాను వెళ్లిపోయానని.. కానీ తన ప్రత్యర్థి మాత్రం యథేచ్ఛగా తిరిగారని ఆయన అన్నారు. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమల మర్రి గ్రామాల్లోని ఆరు బూత్‌లలో బూత్ క్యాప్చరింగ్ జరిగిందని.. ఈ ఆరు బూత్‌లలోని వెబ్ కెమెరాలను పరిశీలించాలని.. ఈ ఆరు బూత్‌లలో రీ-పోలింగ్ నిర్వహించాలని కోరామన్నారు. కొత్తగణేశని పాడు గ్రామంలో టీడీపీ దాడులు చేస్తోందని.. మగవాళ్లంతా ఊరు విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. గుళ్లల్లో దాక్కున్న మహిళల మీద దాడులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల వద్దకు వెళ్తోన్న కాసు మహేష్, అనిల్ యాదవ్ వంటి వాళ్ల పైనా దాడులు చేశారని.. పల్నాడంతా అరాచకంగా ఉందన్నారు. పల్నాడులో రఫ్ కల్చర్ ఉంటుందని.. కానీ ఈసారి ఇంత రఫ్‌గా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు. తన రికమెండేషనుతో వేసిన ఎస్ఐ, సీఐలు వేరే వారికి అమ్ముడుపోయారని.. ఎవరేం చేయగలరని ఆయన ఆరోపించారు. పల్నాడు పుట్టిన తర్వాత ఇంతటి అరాచకం ఎప్పుడూ జరగలేదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

 

*పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో మా అంచనా ప్రకారం 81 శాతం మేర పోలింగ్ నమోదు కావచ్చు అని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెటుతో కలుపుకుని ఇప్పటి వరకు సుమారుగా 79. 40 శాతం నమోదైనట్టు చెప్పొచ్చు.. నేటి సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయి.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అర్థ రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగింది అని ఆయన వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైంది.. కానీ, ఈసారి 0.6 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం 79.8 శాతం నమోదు అయింది. ఈ ఎన్నికల్లో అర్థ రాత్రి 12 గంటల వరకూ 78. 25 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా తెలిపారు. ఇక, నిన్న ఏపీలో పలు చోట్ల జరిగిన దాడులపై సీఈఓ ముకేష్ కుమార్ మీనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పలు జిల్లాలో జరిగిన దాడులపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యుతలపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా రీ- పోలింగ్ నిర్వహించే అవకాశం అయితే రాలేదు.. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మరింత సమాచారం అందిస్తామని ఆయన వెల్లడించారు.

 

*పల్నాడు జిల్లాలో మరోసారి ఉద్రిక్తతలు.. గాల్లోకి పోలీసుల కాల్పులు!
ఏపీలో ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. సాయంత్రం వరగ్గా ప్రశాంతంగా జరిగిన పోలింగ్‌.. 5 గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు గ్రూపులుగా విడిపోయిన టీడీపీ, వైసీపీ శ్రేణులు నాటుబాంబులు, పెట్రోల్‌ బాంబులతో దాడులు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అనిపించినా.. కాసేపటికే మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా.. పల్నాడు జిల్లాలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేశుని పాడులో వైసీపీ, టీడీపీ వర్గాలకు మధ్య చెలరేగిన వివాదం రాత్రి నుంచి కొనసాగుతూనే ఉంది. నిన్న పోలింగ్ పూర్తయిన తర్వాత టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో, వైసీపీ శ్రేణులు గ్రామం నుంచి బయటికి వెళ్లిపోయి నరసరావుపేట చేరుకున్నారు. జరిగిన విషయాన్ని చెప్పేందుకు వైసీపీ నాయకులను ఆశ్రయించారు. దీంతో కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు తమ కార్యకర్తను వెంటబెట్టుకొని, కొత్త గణేశుని పాడు తీసుకొని వెళ్లారు. అయితే అక్కడ కూడా వైసీపీ శ్రేణులకు ఎదురుదెబ్బ తగిలింది. గ్రామంలోకి ఎందుకు వచ్చారు అంటూ కొంతమంది, రాళ్లు కర్రలతో వెంబడించడంతో వైసీపీ శ్రేణులు చెల్లా చెదురయ్యారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని, అనిల్ కుమార్ యాదవ్‌ను , కాసు మహేష్ రెడ్డిని ఆ గ్రామం నుంచి పక్కకు తీసుకువెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు.. అదుపుతప్పిన పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు పల్నాడులో ఆంక్షలు కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

 

*కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఆరో అనుబంధ ఛార్జిషీట్ పరిశీలనపై అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించి 8 వేల పేజీల సప్లింమెంటరీ చార్జ్‌షీట్‌ను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కవితను ఈ సారి ఈడీ అధికారులు నేరుగా కోర్టుకు తీసుకురాకుండా వర్చువల్‌గా విచారణకు హాజరుపరిచారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒక్కరని ఒకరని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరఫు న్యాయవాదులు కోరారు. అదేవిధంగా, మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ, దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

 

*లిక్కర్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తులను కేసుల్లో ఇరికించడం సహజం.. అలాంటిది ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీనే నిందితుడిగా చేర్చనున్నట్లు హైకోర్టుకు ఈడీ తెలియజేసింది. ఒక రాజకీయ పార్టీని ఒక కేసులో నిందితుడిగా చేర్చడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మద్యం పాలసీ కేసులో ఆప్‌ను నిందితుడి మారుస్తామని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువుర్ని ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీ అనంతరం కవితను, కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు. అయితే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా ఈడీ.. ఆప్‌కు భారీ షాకిచ్చింది. ఏకంగా పార్టీనే నిందితుడిగా చేర్చుతున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది. దీనిపై ఆప్ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

*తీహార్ జైలుకు బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపుతోంది. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా తీహారు జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. డాగ్ స్వ్వాడ్స్ అణువణువూ తనిఖీలు చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా ఈ మెయిల్స్ బెదిరింపు ఢిల్లీని కలవర పెడుతున్నాయి. ఇటీవలే పలు ఆస్పత్రులతో పాటు ఎయిర్‌పోర్టుకు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టి నకిలీదిగా తేల్చారు. తాజాగా మరోసారి బెదిరింపు పోలీసులను కంగారు పెట్టిస్తోంది. గతంలో పలు స్కూళ్లకు కూడా బెదిరింపులు వచ్చాయి. దీంతో పలు యాజమాన్యాలు భయాందోళనకు గురై విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. వరుస బెదిరింపులు అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తీహార్ జైల్లో పలువురు వీఐపీ ఖైదీలు ఉన్నారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలుకు బెదిరింపు రావడంతో బాంబు స్క్వాడ్స్ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానపు వస్తువులు లభించలేదు.

 

*గుజరాత్లో విషాదం.. నదిలో స్నానానికి దిగి ఏడుగురు గల్లంతు
గుజరాత్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పోయిచా గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆ ఏడుగురిని మృత్యువు వెంటాడింది. మంగళవారం నర్మదా నదిలో ఆరుగురు బాలురుతో పాటు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కాగా.. అది చూసిన స్థానికులు భయంతో అరుపులు, కేకలు వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మదా నదిలో స్నానం చేసేందుకని అందులోకి దిగారని, అయితే లోతు ఎక్కువగా ఉన్నట్లు గమనించకపోవడంతో అందులో మునిగిపోయినట్లు చెబుతున్నారు. కాగా.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిందని పోలీసులు చెప్పారు. గల్లంతైన వారు 7 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు బాలురు, 45 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. వారంతా.. సూరత్ నుంచి వచ్చారని, వారు మొత్తం 17 మందితో కూడిన బృందం ఇక్కడికి వచ్చిందన్నారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం నర్మదా నదిలో పుణ్యస్నానం చేసేందుకు పోయిచా గ్రామానికి వచ్చినట్లు తెలుపుతున్నారు. కాగా.. వారి ఆచూకీ కనుగునేందుకు అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దాదాపు 3 గంటలు అవుతున్న వారి ఆచూకీ తెలియకపోవడంతో.. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

*విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన అంబులెన్స్.. మంటలు చెలరేగి రోగి సజీవదహనం
కేరళలోని కోజికోడ్‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ రోగిని.. అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మంటల్లో కాలిపోయింది. ప్రమాదవశాత్తు అంబులెన్స్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో.. అంబులెన్స్‌లో ఉన్న మహిళా రోగి సజీవ దహనమైంది. మృతి చెందిన రోగి సులోచన (58)గా గుర్తించారు. ఆమెను అత్యవసర శస్త్రచికిత్స కోసం మెడికల్ కాలేజ్ ఆసుపత్రి నుండి కోజికోడ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని స్థానిక పోలీసులు తెలిపారు. కోజికోడ్ మినీ బైపాస్‌లో ఆస్టర్ మిమ్స్ హాస్పిటల్ సమీపంలో తెల్లవారుజామున 3.50 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. కాగా.. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో మహిళా రోగి, డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు, ఓ డాక్టర్, నర్సు ఉన్నారు. వారు స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్నారు. అయితే రోగి మాత్రం కదలలేని పరిస్థితిలో ఉండటం వల్ల అందులోనే ఉండిపోయింది. దీంతో మంటల్లో కాలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మీంచంత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్టర్ మిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

*ఢిల్లీ ఐటీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 21 ఫైరింజన్లు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకున్నాయి. దాదాపు 21 ఫైరింజన్లు మంటలను అదుపుచేస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టాలు ఏమైనా జరిగాయన్న విషయంపై ఎలాంటి సమాచారం లేదు. సంఘటనాస్థలికి పోలీసులు, అధికారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పరిస్థితుల్ని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.