NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

పొత్తులపై టీజీ వెంకటేష్‌ హాట్‌ కామెంట్లు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు, సీఎం పోస్టులపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ కూడా పొత్తుల వ్యవహారంలో హాట్‌ కామెంట్లు చేశారు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై పర్సనల్ అటాక్ చేసి వైసీపీ ఈ పరిస్థితి తెచ్చుకుందన్నారు. ప్రజల మద్దతును వైసీపీ ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేదన్న టీజీ.. వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు అని మండిపడ్డారు. ఇక, కేంద్రం మద్దతు ఇచ్చింది ఏపీ ప్రభుత్వానికే.. కానీ, వైసీపీకి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీజీ వెంకటేష్‌.. ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చింది. అంత వరకే అన్నారు. కానీ, బీజేపీ – వైసీపీకి మద్దకు ఇస్తుందని తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయన్నారు.. మరోవైపు.. ఎన్నికలకు మూడు నెలలు ముందు పొత్తులు ఖరారు అవుతాయన్నారు.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకుంటారని స్పష్టం చేశారు..

పవన్‌ కామెంట్లకు పేర్నినాని కౌంటర్‌.. మాకు అప్పుడే తెలుసు..!
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కామెంట్లకు కౌంటర్‌ ఎటాక్‌ దిగారు వైసీపీ నేతలు.. తాజాగా, పొత్తుల వ్యవహారంలో జనసేనాని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి పేర్నినాని.. జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ.. చంద్రబాబు అవసరాల కోసం పెట్టిన టెంట్ హౌస్ పార్టీ జనసేన అంటూ సెటైర్లు వేశారు. ఓట్ల కోసం మాత్రమే రాజకీయాలు చేయడం పవన కళ్యాణ్ కి చెల్లిందన్న ఆయన.. వారాహి అంటూ హడావిడి చేసిన పవన్ ముందస్తు ఎన్నికలు ఉంటే బయటకు తీస్తా అంటున్నాడు అని ఎద్దేవా చేశారు.. చంద్రబాబుకి అవసరమైన ప్రతిసారీ పవన్ బయటకు వస్తాడన్న ఆయన.. పవన కళ్యాణ్ కి పార్టీ పెట్టిన సమయంలోనే బలం లేదని తెలుసు.. ఇప్పుడు బలం లేదని పవన్ చెబుతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. 2014లో బలం లేదు పోటీ చేయలేదన్న పవన్ కల్యాణ్‌.. 2019లో ఎందుకు పోటీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు పేర్నినాని.. 2019లో చంద్రబాబుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పవన్ గుర్తించాడు.. ప్రజా వ్యతిరేక ఓటు జగన్ కు వెళ్లకుండా పవన్‌ కల్యాణ్‌ 2019లో పోటీకి దిగాడని ఆరోపించారు. ఇక, పవన్ కల్యాణ్‌ను సీఎం చేయాలని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు మాని జన సైనికులు రోడ్లపై తిరుగుతున్నారు.. వాళ్ల గురించే నా బాధ అన్నారు. జన సైనికులు పవన్ కల్యాణ్‌ కోసం త్యాగాలు మాని తల్లిదండ్రుల ఆశలు తీర్చాలని సూచించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్నినాని.

ఆస్కార్ విన్నర్ ను సర్కార్ పట్టించుకోలేదు.. మేము రూ. 10 లక్షలు ఇస్తాం..
ఆస్కార్ అవార్డ్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు 10 లక్షల రూపాయల నగదును ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బోయిన్ పల్లిలో జరిగిన రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ ప్రోగ్రామ్ ప్రారంభానికి రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి చీఫ్ గెస్ట్ గా రాహుల్ వచ్చాడని.. జూన్ 2న జరిగే క్విజ్ ప్రోగ్రాంకి బహుమతులివ్వడానికి ప్రియాంక గాంధీ వస్తారని ఆయన అన్నారు. యూత్ డిక్లరేషన్ కు కొనసాగింపుగానే క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం.. అలాగే జూన్ 2వ తారీఖున రాహుల్ సిప్లిగంజ్ కు పెద్ద ఎత్తున సన్మానం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే అతనికి రూ. 10 లక్షల నగదు బహుమానం కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇవాళ రాహుల్ సిప్లిగంజ్ వచ్చినప్పుడు ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు. పేద కుటుంబం నుంచి ఆస్కార్ స్థాయికి వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్ ను రాష్ట్ర ప్రభుత్వం సన్మానిస్తుందని అనుకున్నాను.. కానీ కేసీఆర్ సర్కార్ నిరాశపరిచింది అని రేవంత్ రెడ్డి అన్నారు.

సుయాశ్ చర్యకు మండిపడ్డ ఫ్యాన్స్.. నెట్టింట్లో ఏకిపారేశారుగా!
మే 11వ తేదీన జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (47 బంతుల్లో 98), సంజూ శాంసన్ (29 బంతుల్లో 48) విధ్వంసం సృష్టించడంతో.. 41 బంతులు మిగిలి ఉండగానే ఆర్ఆర్ లక్ష్యాన్ని చేధించింది. కాకపోతే.. 2 పరుగుల తేడాతో యశస్వీ తన సెంచరీని కోల్పోవడం అందరినీ బాధించింది. అయితే.. అంతకుముందు కేకేఆర్ స్పిన్నర్ సుయాశ్ శర్మ చేసిన చర్య పట్ల క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మూడు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. సుయాశ్ వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించాడు. సుయాశ్ కావాలని వేశాడో లేక అనుకోకుండా వైడ్‌గా వెళ్లిందో తెలీదు కానీ.. క్రీడాభిమానులు మాత్రం కావాలనే సుయాశ్ ఆ వైడ్ వేసేందుకు ప్రయత్నించాడని ఫైర్ అవుతున్నారు. సంజూ అర్థశతకం చేసుకోకూడదని, జైస్వాల్ శతకం చేసుకోకూడదన్న దురుద్దేశంతోనే వైడ్ వేసేందుకు ట్రై చేశాడంటూ విమర్శిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ.. సుయాశ్‌పై మండిపడ్డాడు. సుయాశ్‌ ఉద్దేశపూర్వకంగానే.. జైస్వాల్‌ను సెంచరీ చేయనీయకుండా అడ్డుకున్నాడని మండిపడ్డాడు. అతడి చర్యని తీవ్రంగా వ్యతిరేకించాడు. పాక్‌ బౌలర్‌, కోహ్లిని సెంచరీ చేయనీకుండా అడ్డుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండని అన్నాడు. ఇక్కడ సుయాశ్ సరిగ్గా అదే చేశాడన్నాడు. తన సొంత దేశ ఆటగాడి విషయంలో సుయాశ్‌ ఇలా ప్రవర్తించడం​ నిజంగా సిగ్గుచేటు అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. సుయాశ్‌ చర్యను పూర్‌ టేస్ట్‌గా అభివర్ణించాడు. సుయాశ్ చర్యని సమర్థించిన వాళ్లని సైతం ఆకాశ్ ఏకిపారేశాడు.

డిస్నీ హాట్‌స్టార్‌కి జియో సినిమా దెబ్బ.. 4 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఔట్..
స్ట్రీమింగ్ దిగ్గజంగా ఉన్న డిస్నీ హాట్‌స్టార్‌ వేగంగా తన సబ్‌స్క్రైబర్లను కోల్పోతోంది. ముఖ్యంగా ఇండియాలో జియో సినిమా దెబ్బకు కుదేలవుతోంది. జియోసినిమా IPL స్ట్రీమింగ్ ని ఫ్రీగా అందించడంతో వినియోగదారులు ఎక్కువగా జియోసినిమాకు కనెక్ట్ అవుతున్నారు. తక్కువ సమయంలో జియోసినిమా ఎక్కువ ప్రజాధరణ పొందేందుకు ఇది కారణం అయింది. ఇది డిస్నీ హాట్‌స్టార్‌ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆసియాలో డిస్నీ సబ్‌స్క్రైబర్ బేస్ వేగంగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లో, స్ట్రీమింగ్ దిగ్గజం 4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. అక్టోబర్ 2022 నుంచి ఏకంగా 8.4 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. ఇండియాలో స్ట్రీమింగ్ దిగ్గజంగా జియోసినిమా ఎదగాలని అనుకుంటోంది. అందుకోసం వేగంగా పావులు కదుపుతోంది. 2023 తొలి మూడు నెలల్లోనే జియోసినిమాకు 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను పొందింది. 2023 తొలి త్రైమాసికంలో డిస్నీ హాట్ స్టార్ చందాదారులు 3.8 మిలియన్ల తగ్గి 57.5 మిలియన్లకు చేరింది. వరసగా రెండు త్రైమాసికాల్లో డిస్నీ క్షీణతను ఎదుర్కోవాల్సి వచ్చింది.

మా కెప్టెన్ అందుకే పరుగులు చేయట్లేదు.. ఇషాన్ సెటైరికల్ జవాబు
ఈ ఐపీఎల్ సీజన్‌తో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడో అందరికీ తెలుసు. ఒక్క అర్థశతకం మినహాయించి.. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అతడు ఆడలేదు. దీనికితోడు.. గత ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్స్‌కే పరిమితమై, ఆ చెత్త రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే అతని ఫామ్‌పై ప్రశ్నలే లేవనెత్తుతున్నాయి. అసలు రోహిత్‌కి ఏమైంది? పరుగుల సునామీ సృష్టించే ఆటగాడు ఎందుకిలా ఆడుతున్నాడు? అని క్రీడాభిమానులతో పాటు మాజీలు సైతం ప్రశ్నిస్తున్నారు. కృష్ణమాచారి శ్రీకాంత్ లాంటి మాజీలైతే.. తనే గనుక కెప్టెన్ అయ్యుంటే, రోహిత్ జట్టులోకే తీసుకునేవాడ్ని కాదంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తన కెప్టెన్ ఫామ్‌పై సెటైరికల్‌గా వ్యాఖ్యానించాడు. హర్భజన్ సింగ్, సునీల్ గవాస్కర్‌లో జరిగిన సంభాషణలో.. బహుశా ప్లేఆఫ్స్ కోసం పరుగులు దాచి ఉంచాడేమోనంటూ ఇషాన్ పేర్కొన్నాడు. ‘‘ఫామ్‌లో లేని రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలా ఉంటున్నాడు? అతని ఆలోచనలు ఏంటి? అని ఆ ఇద్దరు ఇషాన్‌ని ప్రశ్నించారు. అందుకు ఇషాన్ కిషన్ బదులిస్తూ.. ‘‘తన ఫామ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ కంగారేమీ పడట్లేదు. ప్రాక్టీస్ సెషన్‌లో తన ప్రాసెస్‌పై ఆయన పూర్తి దృష్టి పెడుతున్నాడు. అయితే.. ఈ సీజన్‌లో రోహిత్ సహా ఇతర పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఇబ్బంది పడటాన్ని మనం చూస్తున్నాం. నాకు తెలిసి.. ప్లేఆఫ్స్‌లో పరుగుల వర్షం కురిపించడం కోసం.. ఆయన ఇప్పుడు పరుగుల్ని దాచి పెట్టుకుంటున్నాడని అనిపిస్తోంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

సినిమాను ఎందుకు బ్యాన్ చేశారు.? బెంగాల్ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ ది కేరళ స్టోరీ’ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. వివిధ రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపినా, వివిధ రాజకీయ పార్టీలు అడ్డంకులు సృష్టించినా సినిమా రూ.80 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. సమాజంలో ఓ వర్గాన్ని ఉద్దేశించి సినిమా తీశారని చెబుతూ ది కేరళ స్టోరీని నిషేధిస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ బ్యాన్ ను ఛాలెంజ్ చేస్తూ సినిమా నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమిళనాడు రాష్ట్రం శాంతిభద్రతల పేరుతో మల్టిప్లెక్స్ థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిపేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను పశ్చిమ బెంగాల్ సర్కార్ నిషేధించడం వెనక ఉన్న కారణాలు తెలపాలని సుప్రీంకోర్టు ఈ రోజు కోరింది. ‘‘ దేశవ్యాప్తంగా ఈ సినిమా నడుస్తోంది, పశ్చిమ బెంగాల్ సర్కార్ ఈ సినిమాను ఎందుకు నిషేధించాలి..?’’ అని కోర్టు బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

కోలీవుడ్ డైరెక్టర్స్.. టాలీవుడ్ కు సెట్ కారా..?
ఒక భాషలో హిట్ అందుకున్న డైరెక్టర్స్ కానీ, హీరోలు కానీ.. మరో భాషలో పాగా వేయాలని చూస్తారు. అయితే ఒకప్పుడు అంటే అదో గొప్ప విషయం కానీ, ఇప్పుడు పాన్ ఇండియా వచ్చాకా.. భాషతో పనిలేకుండా పోయింది. అయితే అందరికి హిట్లు వస్తాయి అన్న నమ్మకం లేదు. ఇక ముఖ్యంగా బైలింగువల్ సినిమాలుగా వచ్చిన చిత్రాలు గురించి మాట్లాడుకోవాలి. ప్రస్తుతం టాలీవుడ్.. అన్ని ఇండస్ట్రీలను ఏలేస్తోంది. టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు.. వేరే భాషల్లో ఎంట్రీ ఇచ్చి హిట్లు అందుకుంటున్నారు. ఇక వేరే భాష హీరోలు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హిట్లు అందుకుంటున్నారు. కానీ, ఒక్క కాంబో మాత్రమే.. తేడా కొట్టేస్తూ వస్తుంది. అదే టాలీవుడ్ హీరో- కోలీవుడ్ డైరెక్టర్. తమిళ దర్శకులు చాలామంది తెలుగులో పాగా వేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.కానీ, అందులో కొద్దిమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇక ఈ మధ్యకాలంలో కోలీవుడ్ డైరెక్టర్స్ లక్ అస్సలు బాగోలేదని తెలుస్తోంది. మొన్నటికి మొన్న.. రామ్ పోతినేనితో కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి.. ది వారియర్ అని ఒక సినిమాను తెరకెక్కించాడు. బై లింగువల్ గా తెరకెక్కిన ఈ సినిమ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. లింగుసామి.. తమిళ్ లో మంచి హిట్ సినిమాలనే అందించాడు. కానీ, తెలుగులోకి వచ్చేసరికి పెద్ద డిజాస్టర్. ఇక ఇప్పుడు ఇదే సీన్ కస్టడీ విషయంలో రిపీట్ అయ్యిందా..? అంటే అవును అని అంటున్నారు అభిమానులు. నాగ చైతన్య హీరోగా.. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కస్టడీ. ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంటుంది. వెంకట్ ప్రభు.. తన పంధాను మార్చుకొని ఈ సినిమా తీసినట్లు చెప్పుకొస్తున్నారు. తీసుకున్న పాయింట్ బాగానే ఉన్నా.. అది పూర్తి స్క్రిప్టుగా మారే క్రమంలో బిగి.. ఉత్కంఠ లోపించాయి అని, సినిమా మొత్తంలో చూసుకుంటే ఎగ్జైటింగ్ గా అనిపించే ఎపిసోడ్ ఏదీ లేదు. టేకింగ్ లోనూ వెంకట్ ప్రభు తన మార్కును చూపించలేకపోయాడు అని చెప్పుకొస్తున్నారు. దీంతో అభిమానులు కోలీవుడ్ డైరెక్టర్స్.. టాలీవుడ్ కు సెట్ కారా..? అని కామెంట్స్ పెడుతున్నారు.