Site icon NTV Telugu

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

దేవినేని ఉమకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కౌంటర్.. నన్ను టార్గెట్‌ చేస్తే..!
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వర రావుపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. రెండున్నర దశాబ్దాలు టీడీపీలో పనిచేసిన ఉమ.. కొద్ది రోజుల తర్వాతైనా పార్టీ లైన్ లోకి వస్తారని భావిస్తున్నాను.. ఉమ పార్టీ కార్యక్రమాలు చేస్తే స్వాగతిస్తాం అన్నారు. అయితే, నా టార్గెట్ గా ఉమ పని చేస్తే తగిన సమయంలో సమాధానం చెబుతాను అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఉమ వ్యవహారాలు అన్నీ అధిష్టానం దృష్టిలో ఉన్నాయన్నారు. ఉమ, బొమ్మసాని కలిసి పనిచేయటం ఎందుకు ?.. నేను కూడా కలిసి ముగ్గురం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం పని చేస్తాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమకు టికెట్ ఇచ్చినా నేను, నా వర్గం పని చేయటానికి సిద్ధం అని ప్రకటించారు వసంత.. అయితే, ఉమ వద్దని చెప్పినా చంద్రబాబు చెబితే చేస్తాం అన్నారు కృష్ణప్రసాద్.. నేను పార్టీలో పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తున్నాను.. ఎవరు ఏం చేసినా చివరికి టీడీపీ గూటికే చేరుకోవాల్సిందే అన్నారు. ఇక, బొమ్మసాని సుబ్బారావు.. నా అన్న, ఆయన్ని ఇవాళ కలిశాను అని తెలిపారు. అంతేకాదు.. నన్ను పక్క నియోజకవర్గం వెళ్లమని పార్టీ చెబితే సిద్ధం అని ప్రకటించారు. విమర్శలపై స్పందిస్తూ.. టీడీపీ శ్రేణులపై ఉద్దేశపూర్వకంగా కేసులు నేను ఎప్పుడు పెట్టించలేదని స్పష్టం చేశారు.. పార్టీ, ప్రభుత్వం నుంచి వచ్చిన లిస్ట్ ప్రకారం కేసులు పెట్టారని తెలిపారు.. నేనేం తప్పు చేయలేదు.. నాకు ఏ కేసులు పెట్టినా భయం లేదు, చట్టపరంగా ఎదుర్కొంటాను అంటూ ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..

ప్రత్యర్థి ఎవరనేది అనవసరం.. 50 వేల మెజార్టీతో గెలుస్తా..!
దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.. ప్రత్యర్థి ఎవరు అనేది అనవసరం.. వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలడమే తన టార్గెట్‌ అంటున్నారు.. పదవుల్లో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరిస్తే ప్రజలకు గౌరవిస్తారని తెలిపారు.. ప్రజలకు ఆశీర్వదించినంత కాలమే ఎవరైనా రాజకీయ నాయకులుగా కొనసాగుతారు.. చింతమనేని ప్రభాకర్‌లా అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు ఎవ్వరినైన పక్కన పెడతారు అంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో దెందులూరులో ప్రత్యర్థి చింతమనేని అయినా? ఇంకా ఎవ్వరైనా? సరే విజయం నాదే అని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సవాల్‌ విసిరారు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ దెందులూరులోనే సిద్ధం సభ పెట్టి ప్రకటించామన్నారు. రాష్ట్రంలోని ప్రజలు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు.. రాసిపెట్టుకొండి.. మే 30వ తేదీన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేస్తాను అనుకోలేదు.. సాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
వైసీపీ తొమ్మిదో జాబితాలో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి పేరును పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం విదితమే.. అయితే, ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సాయిరెడ్డిని అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల బరిలో దింపారు ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన విజయసాయిరెడ్డి.. అసలు తాను ఎన్నికల్లో పోటీ చేస్తాను అనుకోలేదన్నారు. అయితే, నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేశారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. మరోవైపు.. అభ్యర్థుల మార్పులు, చేర్పులపై స్పందిస్తూ.. పనితీరు సరిగ్గా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను వైసీపీ పక్కన బెట్టిందన్నారు. ముందుగా నెల్లూరు లోక్‌సభ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని పోటీకి సిద్ధం చేశామన్న ఆయన.. మారిన రాజకీయ పరిణామాల్లో నేను పోటీలో ఉంటున్నాను అన్నారు. అయితే, తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుకోలేదు.. కానీ, పార్టీ నిర్ణయమే ఫైనల్‌ అని స్పష్టం చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు, నెల్లూరు సమన్వయకర్త విజయసాయిరెడ్డి.

రోజాపై సంచలన ఆరోపణలు.. వ్యతిరేకవర్గం బహిరంగ సవాల్..!
ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆర్కే రోజాపై మరోసారి ఫైర్ అయ్యారు నగరి నియోజకవర్గానికి చెంది ఐదు మండలాల వ్యతిరేక వర్గం నేతలు.. రోజా, అమె అన్నల దోపిడీకి అడ్డుగా ఉన్నామని మమ్మల్ని దూరం పెట్టి వేధించిందన్నారు వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, లక్ష్మీపతిరాజు, పుత్తూరు నేత అమ్ములు, సహా ఇతర మండలాల నేతలు.. మా వ్యతిరేకవర్గం నేతలు ఎవరైనా సరే అవినీతి పాల్పడి ఉంటే దానిపై రోజాతో చర్చకు సిద్దమని సవాల్‌ విసిరారు. గత ఎన్నికల వరకు అప్పుల్లో కూరుకుపోయి రోజా.. ఇప్పుడు మంత్రి అయ్యాక ఎంత సంపాదించిందో అందరికీ తెలుసన్నారు. ఐరన్ లెగ్ గా పేరున్న రోజాను మేం గోల్డెన్ లెగ్ గా మార్చామని.. అలాంటిది ఇప్పుడు పుత్తూరు, నగరిలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతూన్నాయాని సంచలన ఆరోపణలు చేశారు. రోజా కాకుండా సీటును మాలో ఎవరికైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా మళ్లీ మంత్రి ఆర్కే రోజాకే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీటు ఇస్తే మేం పనిచేయామని స్పష్టం చేశారు.

టీడీపీలో ఎంతమంది చేరినా వైసీపీదే విజయం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమీపిస్తోన్న సమయంలో.. పొలిటికల్‌ లీడర్ల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి.. కొందరు విపక్ష పార్టీల కండువాలు కప్పుకుంటుంటే.. టీడీపీపై అసంతృప్తితో ఉన్న మరికొందరు లీడర్లు.. ఫ్యాన్‌ కిందకు చేరుతున్నారు.. అయితే, తెలుగుదేశం పార్టీలో ఎంతమంది చేరినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు నగరంలోని సంతపేటలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన.. అనంతరం మాట్లాడుతూ సింహాలు సింగిల్‌గానే వస్తాయని.. అలాగే రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. చిత్తూరులో విజయానంద రెడ్డి సింగిల్‌గా పోటీ చేసి గెలుస్తారని పేర్కొన్నారు. టీడీపీలో ఎంతమంది చేరినా వైసీపీదే విజయమన్న ఆయన.. ఇటీవల సీకే బాబు.. టీడీపీకి మద్దతు తెలపడంపై సెటైర్లు వేశారు. ఇక, చిత్తూరులో వైసీపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

తెలంగాణలో కొత్త పొత్తు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసి పోటీ
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో నంది నగర్ నివాసంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ప్రతినిధుల బృందంతో కలిసి జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇందుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించారు. ఈ పొత్తుకు సంబంచిన విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో BRS- BSP కలిసి పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. చాలా అంశాల్లో కలిసి పని చేశాం.. ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేది రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు. మాయావతితో ఇంకా మాట్లాడలేదు.. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే మాట్లాడారు అని ఆయన చెప్పుకొచ్చారు.

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలి..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ లో దోబిఘాట్ ప్రాంగణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. అనంతరం మడ్ ఫోర్డ్ దోబిఘాట్ ఫేజ్ -2లో మోడర్న్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇంఛార్జ్ వెన్నెల గద్దర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలన్నారు. మనలో మనకు ఐక్యత వచ్చి సంఘా జీవులుగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేసినపుడే ప్రభుత్వాలు స్పందిస్తాయన్నారు. హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదం పార్టీలో 30 సంవత్సరాలుగా ఉండడంతో మంత్రిని చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నన్ను హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా నియమించారు అని చెప్పుకొచ్చారు. కుల వృత్తులు మారుతున్నాయి.. అందుకే సాంకేతికతకు అనుగుణంగా మారాలన్నారు. బలహీన వర్గాల శాఖ తరపున 119 మంది ఎమ్మెల్యేలు, మండలి సభ్యులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యుల నిధులతో ఒక్కొక్కరు ఒక్కో మండలంలో దోబిఘాట్ నిర్మించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పెద్దలకు బాంబు బెదిరింపులు.. పోలీసుల అప్రమత్తం
కర్ణాటక ప్రభుత్వ (Karnataka Goverment) పెద్దలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు ఘటన మరువక ముందే.. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు బాంబు బెదిరింపులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి, పలువురు ఎమ్మెల్యేలకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar), రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర సహా పలువురి ప్రముఖులకు ప్రత్యేకంగా బెదిరింపులు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలతో బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Shahidkhan10786@protonmail.com అనే ఈ-మెయిల్ చిరునామా నుంచి బాంబు బెదిరింపులొచ్చాయి. కర్ణాటక వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటళ్లు మరియు బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున పేలుళ్లు జరుపుతామని మెయిల్‌లో ఉంది.

ఎవరీ జిమ్మి చెరిజియర్.. గ్యాంగ్‌స్టర్‌కి వణుకుతున్న హైతీ దేశం..
కరేబియన్ ప్రాంతంలో అత్యంత పేదదేశంగా ఉన్న హైతీ ప్రస్తుతం ప్రమాదం అంచున ఉంది. ఆ దేశంలో ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం పొంచిఉంది. జిమ్మి చెరిజియర్, ‘‘బార్బెక్యూ’’గా పిలువబడే క్రూరమైన గ్యాంగ్ లీడర్, ఇటీవల 3700 మంది ఖైదీలను విడిపించడంతో ఒక్కసారిగా ఆ దేశం ఉలిక్కిపడింది. ఆ దేశ అధినేత కెన్యా పర్యటనలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీంతో హైతీ దేశానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. మాజీ పోలీస్ అధికారి నుంచి గ్యాంగ్ స్టర్‌గా మారిన జిమ్మీ చెరిజియన్ చాలా కాలంగా ఆ దేశంలో భయంకరమైన హింసకు పాల్పడుతున్నాడని అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ప్రత్యర్థులను క్రూరంగా సజీవ దహనం చేసి చంపడం వంటి చేస్తుంటాడు. G9 ఫ్యామిలీ అండ్ మిల్లీస్ అనే శక్తివంతమైన ముఠా కూటమికి నాయకత్వం వహిస్తున్న చెరిజియర్, 2018లో లా సెలైన్‌లో జరిగి మారణకాండకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలో ఏకంగా 70 మందికి పైగా మరణించారు. మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. తాను పేదల రక్షకుడిగా చెప్పుకోవడంతో ప్రజల మద్దతు పొందుతున్నారు.

డిఫెన్స్ బడ్జెట్‌ని భారీగా పెంచిన చైనా..
డ్రాగన్ కంట్రీ చైనా రక్షణ బడ్జెట్‌ని పెంచింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, 2024 రక్షణ వ్యయాన్ని పెంచుతామని చైనా మంగళవారం ప్రకటించింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) వార్షిక సమావేశ ప్రారంభంలో గత ఏడాది కన్నా 7.2 శాతం పెరుగుదలను ప్రకటించింది. 2024లో రక్షణ బడ్జెట్‌ని 1.665 ట్రిలియన్ యువాన్లు ($231.4 బిలియన్లు) ఖర్చు చేయనుంది. పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సంఖ్యలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్మీగా ఉన్నప్పటికీ.. రక్షణ బడ్జెట్ విషయంలో అమెరికా తర్వాతి స్థానంలో ఉంది. అయినప్పటీకీ, చైనా సైనిక వ్యయం ఇటీవల కాలంలో అమెరికా కన్నా మూడు రెట్లు తక్కువగా ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా తన భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను రక్షించుకోవడానికి రక్షణ బడ్జెట్ పెంచుతుందని ఎన్పీసీ ప్రతినిధి లౌ కిన్జియాన్ సోమవారం తెలిపారు.

ముకేశ్ అంబానీ ఇప్పుడు చేశాడు.. కానీ, చిరు ఎప్పుడో చేశాడు.. అది మెగాస్టార్ అంటే..
గత కొన్నిరోజులుగా దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న విషయం అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి. దాదాపు రూ. 1000 కోట్లతో ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. జూలై లో పెళ్లి జరగనుంది. పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో అనేది ఊహకు అందని విషయం. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా స్టార్లు, క్రికెటర్స్, మిలియనీర్స్, బిలియనీర్లు.. ఇలా అందరూ ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఎవరిని చూడాలో తెలియమి పరిస్థితి అభిమానులది. ముఖ్యంగా.. ఒకే స్టేజిపై అంతమంది స్టార్ హీరోలతో డ్యాన్స్ చేయించిన ఘనత ముకేశ్ అంబానీకే చెందుతుందని కొంతమంది నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే .. ఇంతకన్నా గొప్పగా .. టాలీవుడ్ స్టార్ హీరోస్ మొత్తాన్ని ఒకే స్టేజిపై డ్యాన్స్ చేయించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడంటే.. ఇద్దరు స్టార్ హీరోలు ఒక స్టేజిపై డ్యాన్స్ చేస్తే.. వావ్.. సూపర్ అని పొగిడేస్తున్నారు. కానీ, మెగాస్టార్ తన కూతురు పెళ్ళికి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. స్టార్ హీరోలందరూ ఆ పెళ్ళిలో డ్యాన్స్ వేశారు. వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ, శ్రీకాంత్, లారెన్స్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగబాబు, ఆలీ.. ఇలా టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నారో అంతమంది ఆ పెళ్ళిలో డ్యాన్స్ వేసి అలరించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంబానీ పెళ్ళిలో ఈ స్టార్ హీరోలందరూ పనులు మానుకొని ఎందుకు వచ్చారంటే.. డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. ఏంటి నిజమా అంటే నిజమే. పెద్ద పెద్ద కోటీశ్వరులు తమ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కు సెలబ్రిటీలను డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు. ఇక అంబానీ పెళ్ళిలో కూడా బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా అలా వచ్చినవారే అని టాక్ నడుస్తోంది. వీరి రెమ్యూనిరేషన్ కూడా కోట్లలో ఉంటుందని సమాచారం.

పాన్ ఇండియా లెవ‌ల్‌ రియల్ లవ్ స్టోరీ.. షీఈజ్ రియ‌ల్ అంటున్న ల‌వ్ మౌళి
సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, స‌రికొత్త‌గా న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్ మౌళి. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన సినిమాగా ఈ సినిమాను అవ‌నీంద్ర డైరెక్ట్ చేశారు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో క‌లిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ బాధ్యతలు తీసుకుంది. ఈ సినిమా నుంచి వ‌చ్చిన ప్ర‌తి అప్‌డేట్ వినూత్నంగా అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి షీ ఈజ్ రియ‌ల్ అనే లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేసింది సినిమా యూనిట్‌. గోవింద్ వ‌సంత్ స్వ‌రాలు అందించిన ఈ సాంగ్ కి అనంత్ శ్రీ‌రామ్ సాహిత్యాన్ని అందించారు. శ‌ర‌త్ సంతోష్‌, జిబా టామీ ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు విడుద‌లైన ద ఏంత‌మ్ ఆఫ్ ల‌వ్ మౌళి సాంగ్‌కు, హీరో టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చిందని, ఈ చిత్రంలోచాలా డిఫ‌రెంట్‌గా నవదీప్ కనిపించడంతో ఈ సినిమా న‌వ‌దీప్ 2.Oగా అభిమానులంతాఒక ఢిఫరెంట్ కాన్నెప్ట్ తొ వుంటుంద‌ని మంచి అంచ‌నాల‌తో ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారని అన్నారు. న‌వ‌దీప్‌ను స‌రికొత్త‌గా చూసిన వాళ్లంతా ఈసినిమాతో ఆయ‌న కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్య‌బోతున్నాడ‌ని అంటున్నారు, నా లైఫ్ లో జ‌రిగిన ప్రేమ‌క‌థ‌ల‌కు ఫ‌లిత‌మే ఈ సినిమా క‌థ‌. నేను పాన్ ఇండియా లెవ‌ల్‌లో ప్రేమించేవాడ్నని అన్నారు.. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేష‌న్స్ ఉన్నాయి. నా స్వీయ అనుభ‌వాలే ఈ సినిమా క‌థ అన్నారు

Exit mobile version