NTV Telugu Site icon

Top Headlines@5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు.. షెడ్యూల్ ఇదే..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది. అయితే, రేపు ( మార్చ్ 5) సంగారెడ్డిలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే మీటింగ్ కు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఆ తర్వాత ఈనెల 6న మహబూబ్ నగర్ పర్యటనలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంను ఆయన ప్రారంభించనున్నారు. ఇక, 7వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. అలాగే, కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక, మార్చ్ 7వ తేదీన వేములవాడ రాజరాజేశ్వరి ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఈనెల 8న ఓల్డ్ సిటీలో రెండో దశ మెట్రో పనులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే, మార్చ్ 9వ తేదీన ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఈనెల 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.. అక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక, ఈనెల 12న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

 

*రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు చక చక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పటేల్ గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ లో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, సంగారెడ్డి వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ఆయన చేయనున్నారు. ఇక, సంగారెడ్డి జిల్లాలో 1409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, మెదక్ జిల్లాలో 399 కోట్ల రూపాయలతో చేపడుతున్న NH- 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణను 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే ప్రధాని బహిరంగ సభతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు.

 

*ఇద్దరు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్..
తెలంగాణలో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన గులాబీ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని రెడీ అయింది. ఈ క్రమంలోనే స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ సారి ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా గెలుపు గుర్రాలనే ఎన్నికల బరిలోకి దింపాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఇవాళ గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ వరుసగా రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ సెగ్మెంట్ల నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు పేరుని ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర రావును తొలి లోక్‌సభ అభ్యర్థిగా కేసీఆర్ అనౌన్స్ చేయగా.. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత మరోసారి పోటీ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, కాంగ్రెస్ మీద వ్యతిరేకత మొదలైంది కాబట్టి.. మనకే గెలిచే అవకాశాలు ఉన్నాయని క్యాడర్ కు కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది.

 

*బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కేసీఆర్ మీటింగ్ కు ఖమ్మం ఎమ్మెల్యే డుమ్మా..
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఇక, తాజాగా బీఆర్ఎస్ పార్టీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గట్టి షాక్ ఇచ్చారు. ఈ రోజు తెలంగాణ భనవ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ఆయన డుమ్మా కొట్టాడు. నిన్న కుటుంబ సమేతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలిశారు. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావు.. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక, తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ రోజు ఉదయం భద్రాచలం బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం అయ్యారు. అయితే, ఇప్పటికే ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సన్నహాక సమావేశం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతుంది.

 

*రేపు మంగళగిరిలో టీడీపీ జయహో బీసీ బహిరంగ సభ
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రేపు మంగళగిరిలో టీడీపీ ‘జయహో బీసీ’ బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభలో టీడీపీ- జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది. బీసీ డిక్లరేషన్ బహిరంగ సభకు చంద్రబాబు, పవన్, బాలయ్య సహా రెండు పార్టీల బీసీ నేతలు హాజరు కానున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రేపు బీసీ డిక్లరేషన్‌ను చంద్రబాబు – పవన్ ప్రకటించబోతున్నారని చెప్పారు. టీడీపీ – జనసేన అధికారంలోకి రాగానే ఏం చేస్తామనేది రేపటి సభ ద్వారా తెలియజేస్తామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీలకతీతంగా రేపు బీసీలు తరలి రాబోతున్నారని.. బీసీ డిక్లరేషన్ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో బీసీలు హాజరు కాబోతున్నారని వెల్లడించారు. రేపటి బీసీ సభ ఫెయిల్ చేయాలని ప్రభుత్వం అన్ని ఆటంకాలు సృష్టిస్తోందని.. ఆర్టీసీ బస్సులు అద్దెకు అడిగినా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. రేపు సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే.. కాలి నడకనైనా బీసీలు సభకు తరలి వస్తారన్నారు. ఐదుగురు రెడ్లకు రాష్ట్రాన్ని జగన్ పంచాడని అచ్చెన్నాయుడు విమర్శించారు. మంగళగిరిలో రేపు నిర్వహించే జయహో బీసీ కార్యక్రమం విజయవంతం చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ బీసీలను కోరారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. బీసీ వర్గాల ఆబ్యున్నితికి కోసం టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయన్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు జయహో బీసీ సమావేశం ప్రారంభమవుతుందన్నారు.

 

*టెట్‌, టీఆర్టీ పరీక్ష షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన టెట్‌, టీఆర్టీ(టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్) నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని పేర్కొంది. రాతపరీక్ష పై అభ్యంతరాలు స్వీకరణకు సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌), ఏపీ టీచర్‌ నియామక పరీక్ష (ఏపీ టీఆర్‌టీ)ల మధ్య సముచిత సమయం ఉండేలా షెడ్యూల్‌ మార్చాలని ఏపీ హైకోర్టుప్రభుత్వానికి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. టెట్‌, ఏపీ టీఆర్‌టీ ల మధ్య సముచిత సమయం ఉండేలా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గత బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ తీర్పును రిజర్వ్‌ చేశారు. టెట్‌, టీఆర్‌టీల మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం. పెద్దిరాజు, మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత నోటిఫికేషన్‌ రద్దుచేసి ఈ పరీక్షల నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టెట్‌ ముగిసిన తర్వాత టీఆర్‌టీ రాయడానికి సిద్ధమయ్యేందుకు తగిన సమయం లేదని, అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని ఆయన న్యాయస్థానానికి విన్నవించారు.

 

*మైలవరంలో దేవినేని ఉమాకి షాక్
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. మైలవరంలో దేవినేని ఉమాకి షాక్ తగిలింది. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్‌, దేవినేని ఉమా, బొమ్మ సాని సుబ్బారావులు టీడీపీ టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం బొమ్మసాని సుబ్బారావును కలిసి ఇకపై కలిసి పని చేస్తున్నట్టు దేవినేని ఉమా ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో దేవినేని ఉమా తీరును తప్పుబట్టారు బొమ్మసాని సుబ్బారావు. యాదృచ్ఛికంగా జరిగిన దాన్ని కూడా ఇలా రాజకీయం చేయటం తగదని ఉమాకి సూచన చేశారు బొమ్మసాని. పార్టీ కోసం స్థానికంగా పని చేసిన తనకు చంద్రబాబు టికెట్ ఇస్తారని నమ్మకం ఉందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బా రావు పేర్కొన్నారు. వసంతకు ఇక్కడ టికెట్ ఇస్తారనే సమాచారం తనకు లేదన్నారు. వసంత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీ నేతలతో తలెత్తిన ఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం ఆలోచన చేయాలన్నారు. వసంతకు పెనమలూరు ఆప్షన్ ఉందన్నారు. దేవినేని ఉమా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా ఉమా ఎన్నో ట్రిక్స్‌ ప్లే చేస్తున్నారని.. తనతో కలుస్తున్నా అనటం అందులో భాగమేనన్నారు. టికెట్ కోసం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసినా అధిష్టానం టికెట్ ఫైనల్ చేస్తుందన్నారు. ఉమా అంతా నేనే పొందాలి అనుకోవడం వల్లే జిల్లాకు ఈ పరిస్థితి అని ఆయన విమర్శించారు. పార్టీలో మిగతా వారిని కూడా ఉమా ఎదగ నివ్వాలని ఆయన అన్నారు. సర్వేలు చేసిన తర్వాత చంద్రబాబు టికెట్ తనకే ఇస్తారని నమ్ముతున్నానని బొమ్మసాని సుబ్బారావు తెలిపారు. అంతిమంగా పార్టీ నిర్ణయం పాటిస్తానన్నారు.

 

 

*మహిళలకు ఢిల్లీ ప్రభుత్వ కానుక.. ప్రతి నెల అకౌంట్లో రూ.1000
ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి సోమవారం (మార్చి 4) కేజ్రీవాల్ ప్రభుత్వ 10వ బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌లో విద్యకు రూ.16,396 కోట్లు కేటాయించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇకపై ఢిల్లీలోని ప్రతి మహిళకు కేజ్రీవాల్ ప్రభుత్వం రూ.1000 ఇస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతినెలా రూ.1000 ఇస్తారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద కేజ్రీవాల్ ప్రభుత్వం 1000 రూపాయల మొత్తాన్ని ఇస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం ఆరోగ్య బడ్జెట్‌ను రూ.8685 కోట్లుగా ఉంచింది. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, సౌకర్యాల కోసం 6215 కోట్లు ఇవ్వబడుతుంది. అదే సమయంలో మొహల్లా క్లినిక్ కోసం రూ.212 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి అతిషి బడ్జెట్ ప్రసంగంలో మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సభలో సత్యేందర్ జైన్ జిందాబాద్ నినాదాలు లేవనెత్తారు. తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో, అతిషి ఇప్పటివరకు కేజ్రీవాల్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. గత 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజల జీవితాల్లో చాలా మార్పు వచ్చిందని ఆర్థిక మంత్రి అతిషి అన్నారు. ఢిల్లీ ప్రజలు నిరాశ నుంచి ఆశల వైపు ప్రయాణించారు. ఈ రోజుల్లో ఢిల్లీలో పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు మారుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. ఢిల్లీ తన కలల రామరాజ్యం వైపు పయనిస్తోంది. అతిషి తలసరి ఆదాయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. దేశంలో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఢిల్లీ ముందంజలో ఉందన్నారు. ఢిల్లీ తలసరి ఆదాయం ఇప్పుడు 4.62 లక్షలకు చేరుకుంది. బడ్జెట్‌కు ముందు ఢిల్లీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి అతిషి మాట్లాడుతూ రామరాజ్య కలను సాకారం చేస్తామని చెప్పారు. ఢిల్లీలోని ప్రతి విభాగాన్ని తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేశామన్నారు. పేద కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందుతోందని తెలిపారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తల్లి ఆశీస్సులు తీసుకున్నారు.

 

*ఈ రాష్ట్రాలకు భారీ వర్ష ముప్పు.. వాతావరణశాఖ హెచ్చరికలు
దేశంలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ (Weather Alert) హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఏఏ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయో తెలియజేస్తూ వివరాలు వెల్లడించింది. అనేక రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో రాబోయే మూడు రోజుల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక మంగళవారమే అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌లో భారీ వర్షాలకు సూచనగా ఉండనున్నాయని తెలిపింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాల అధికారులకు ఐఎండీ సూచించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంగలు పొంగిపొర్లుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో మరింతగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

 

*బిందెలో ఇరుక్కున్న చిరుతపులి తల.. 5 గంటలపాటు నరకయాతన
ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతపులి తల ప్రమాదవశాత్తూ బిందెలో ఇరుక్కుపోయింది. దీంతో 5 గంటల పాటు నరకయాతన పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. ఓ పశువుల పాకలోకి ఆహారం కోసమని వచ్చిన చిరుత.. ప్రమాదవశాత్తు తల బిందెలో ఇరుక్కు పోయింది. కాగా.. ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశు వైద్యులు చిరుతకు మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి పంపించారు. అనంతరం మెటల్‌ కట్టర్‌తో బిందెను తొలగించారు. ఐదు గంటలపాటు శ్రమించి చిరుతను సురక్షితంగా రక్షించారు. చిరుతను బోనులో బంధించి స్థానిక అడవిలో వదిలేసినట్లు కొండైబారి అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సవితా సోనావానే తెలిపారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2022 విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ‘భారతదేశంలో 13,874 చిరుతలు ఉన్నట్లు అంచనా వేశారు. 2018లో 12,852 చిరుతలు ఉంటే.. 2022 నాటికి 8 శాతం అంటే 13,874కి పెరిగాయని అంచనా వేశారు.

 

 

Show comments