NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

రీజినల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ.. ఎన్నికల ప్రచారంపై చర్చ..
YSRCP: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రీజినల్ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బస్సు యాత్ర, మేనిఫెస్టోతో పాటు ఎన్నికల ప్రచారంపై కీలకంగా చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం 50 రోజుల పాటు నిర్వహించాల్సిన పార్టీ ప్రచార కార్యక్రమాలపై ప్రధానంగా ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. ఇక, సీఎం తన ఎన్నికల ప్రచార వ్యూహం మార్చారు. పోలింగ్కు 54 రోజుల సమయం ఉండటంతో ప్రచారం షెడ్యూల్ ను వైఎస్ జగన్ మార్చేశారు. టీడీపీ ఒత్తిడితోనే పోలింగ్ నాలుగో విడతకు వెళ్లిందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఎక్కువ సమయం తీసుకుని వైసీపీ మీద ఒత్తిడి పెంచేందుకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్లాన్ చేస్తుందని తెలుసుకున్నా వైసీపీ చీఫ్.. కూటమి ఎత్తుగడకు జగన్ రివర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక, 120 నియోజకవర్గాల్లో నిర్వహించాలనుకున్న సభలను బస్సు యాత్రలుగా మార్పు చేశారు. అలాగే, పోలింగ్ రోజు వరకు జనంలోనే ఉండాలని సీఎం జగన్ చూస్తున్నారు. అలాగే, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక బహిరంగ సభ నిర్వహణతో పాటు స్థానికులతో కూడా జగన్ మాటమంతి చేయనున్నారు.

త్వరలో ప్రజల్లోకి చంద్రబాబు.. ప్రజాగళం పేరుతో విస్తృత పర్యటనలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ప్రజల్లోకి వెళ్ళనున్నారు. ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి విస్తృత పర్యటనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభకు పెట్టిన పేరుతోనే ప్రజల్లోకి టీడీపీ అధినేత వెళ్లనున్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలంటే ప్రజా గళం పేరే సరైందని చంద్రబాబు భావించారు. ఒకట్రెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, పెండింగులో ఉన్న 16 అసెంబ్లీ స్థానాల పైనా ఆయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇక, ఎంపీ అభ్యర్థులతో పాటు మిగిలిన అసెంబ్లీ అభ్యర్థుల పేర్ల ప్రకటన తర్వాత ప్రజల్లోకి చంద్రబాబు వెళ్లనున్నారు. చంద్రబాబు చేపట్టే ప్రజా గళం రోడ్ మ్యాప్ ను టీడీపీ సిద్దం చేస్తోంది.

ఈ మూడు పార్టీల కలయిక చాలా మందికి నచ్చదు..
ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమైంది.. మెజార్టీల గురించే చర్చించుకుంటున్నారు అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రధాని సభకు పేర్లు లేకుండా పాసులు బ్లాంకుగా ఇచ్చారు.. ప్రధాని హాజరయ్యే సభకు ఈ తరహా పాసులు జారీ చేయడం ఎప్పుడూ చూడలేదు.. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరపాలి.. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంలో పోలీసుల పాత్రపై ఏపీ సీఈఓకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. నాలుగేళ్లుగా పవన్ చేసిన కృషి నిన్నటి ప్రజాగళం వేదిక మీద కన్పించింది.. ఈ మూడు పార్టీల కలయిక చాలా మందికి నచ్చదు.. మూడు పార్టీల మధ్య అపోహలు సృష్టించేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు.. దుష్ప్రచారాలకు ఎవ్వరూ లొంగొద్దు.. తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది.. పొత్తుల విషయంలో కొందరికి నిరాశ ఎదురైంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు. మా పార్టీ సీనియర్ నేతలను మేం కాపాడుకుంటామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మేమేం ఏం చేస్తామో.. తొందరెందుకు.. ఇంకా సమయం ఉంది.. దూషణలకు మేం దూరంగా ఉంటాం.. దీని వల్ల ఏం ఉపయోగం?.. ప్రజాగళం సభ సక్సెస్ అయింది.. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ గురించి, మౌళిక సదుపాయాల కల్పన కోసం తాము చేస్తున్న కృషిని ప్రధాని వివరించారు అని ఆయన తెలిపారు.

ముంబై నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నిన్న రాహుల్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. అటు నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ, సీఈసీ మీటింగ్ లో పాల్గొననున్నారు. కాగా.. ఈ సమావేశంలో లోక్ సభ అభ్యర్థుల ఎంపిక.. తదుపరి అంశాలపై చర్చించనుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి తొలి జాబితాలో కాంగ్రెస్ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 13 మంది అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది. అయితే.. రేపటి సీఈసీ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమోదించనున్నారు. అలాగే.. ఎన్నికల ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

పెద్ద పదవులు అనుభవించి.. పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతారా..?
జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించి… పార్టీకి సిద్దాంతం లేదని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కొడుక్కి సీటు ఇస్తే సిద్దాంతం ఉన్న పార్టీ.. నీకు సీటు ఇవ్వక పోతే సిద్దాంతం లేదా అని ప్రశ్నించారు. ఏ ఆర్థిక ప్రయోజనాలు కోసం మీరు పార్టీ మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బంధువులు కంపెనీ అమ్ముతున్న ఫ్లాట్స్ ఏమీ.. చేవెళ్ల పార్లమెంట్ ఎంపీతో కలిసి ఏమీ మాట్లాడారు.. ఈస్టర్న్ కన్స్ట్రక్షన్ ఎవరిది.. భూములను ఆక్రమించింది ఎంత.. సర్వే నంబర్ 343, 403 లో ఏమీ జరుగుతుందని ప్రశ్నించారు. అడ్డగోలు కన్స్ట్రక్షన్ మీద ఈడీ, ఐటీకి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ రావు అన్నారు. తమ దగ్గర పూర్తి సమాచారం ఉంది.. మీరు ఎందుకు పార్టీ మారారో ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. మీరు బీజేపీకి కొత్తగా సిద్దాంతాలు నేర్పించాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. వ్యక్తిగత, ఆర్థిక లబ్ది కోసం మీరు పార్టీ మారారని పేర్కొన్నారు. పాలమూరులో మీరు మీ కొడుకు కోసం పని చేశారా… ఇప్పుడు అధికారంలోకి ఉన్న పార్టీకి మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. కన్స్ట్రక్షన్ కంపెనీల నుండి డబ్బులు వందల కోట్లు చేతులు మారాయి.. కాంగ్రెస్ అభ్యర్థులకు ఆ డబ్బులు పంపబోతున్నారని రఘునందన్ రావు తెలిపారు.

తెలంగాణ ప్రజలను వదిలి వెళ్తునందుకు బాధగా ఉంది.. ఎప్పటికీ మరువను
ఇవాళ ఉదయం తెలంగాణ గవర్నర్‌ గా తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపారు. తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై కొనసాగిన విషయం తెలిసిందే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి చెన్నైకు బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మాజీ గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తునందుకు బాధగా ఉంది.. కానీ తప్పడం లేదన్నారు. తెలంగాణ ప్రజలందరు నా అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ళు అని పేర్కొన్నారు. ఎప్పుడు తెలంగాణ ప్రజలను మరువను.. అందరితో కలుస్తూ ఉంటానని తెలిపారు. మరోవైపు.. తమిళనాడులో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమో దాటవేస్తూ వెళ్ళిపోయారు.

సోనియాతో భేటీపై అశోక్‌ చవాన్ ఏమన్నారంటే..!
ఆదివారం ముంబై వేదికగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన సీనియర్ నేత అమ్మ సోనియాను కలిసి కన్నీటిపర్యంతం అయ్యారని.. బీజేపీ నేతల వేధింపులు తాళలేకే పార్టీని వీడుతున్నట్లు ఆ నేత చెప్పుకొచ్చారంటూ బహిరంగ సభలో రాహుల్ గుర్తుచేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కాంగ్రెస్ నేత అశోక్‌చవాన్ స్పందించారు. రాహుల్‌ గాంధీ ప్రస్తావించిన సీనియర్ లీడర్‌ను తాను కాదని అశోక్ చవాన్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా తర్వాత తాను సోనియాగాంధీనే కలవలేదని ఆయన స్పష్టం చేశారు. పొలిటికల్ స్టంట్‌లో భాగంగానే రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశారని కొట్టిపారేశారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు సభను ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమిలో ఉన్న పార్టీల ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ సభలో రాహుల్ మాట్లాడుతూ.. తాను పేర్లు ప్రస్తావించదల్చుకోలేదు గానీ.. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నేత కాంగ్రెస్‌ను వీడారని.. అమ్మ సోనియాతో ఆయన మాట్లాడుతూ.. వారితో పోరాడే శక్తి తనకు లేదని.. జైలుకు వెళ్లాలనుకోవడం లేదని చెప్పారన్నారు. ఇలా చెబుతున్నందుకు సిగ్గుగా ఉందని ఆయన కన్నీటిపర్యంతమయ్యారని రాహుల్ తెలిపారు.

బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల్లో అధికారులపై వేటు
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న పోలింగ్ ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం చాలా పగడ్బందిగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగిలే ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. పలు రాష్ట్రాల్లో అధికారులపై యాక్షన్ మొదలు పెట్టింది. 6 రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జార్ఖండ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్‌లో హోంశాఖ కార్యదర్శులను తొలగించింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఎన్నికల కమిషన్ తొలగించింది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల్లోనే ఎన్నికల కమిషన్ తీసుకున్న తొలి యాక్షన్ ఇదే. దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో పాటు అదనంగా మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శులను కూడా తొలగించింది. ఇక పశ్చిమ బెంగాల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)పై చర్యలు తీసుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా తొలగించింది.

చిరు కోసం రాసిన కథే కానీ సందీప్ కి వచ్చేసరికి..
సందీప్ కిషన్ హీరోగా ఊరి పేరు భైరవకోన అనే సినిమా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ అందుకుంది. అయితే నిర్మాతలు మాత్రం తమకు రికవరీ జరిగిపోయిందని వెల్లడించారు. అంతేకాక తమ సినిమా సూపర్ హిట్ సినిమా అని చెప్పుకొచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అదే నిర్మాతతో సందీప్ కిషన్ ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ధమాకా తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకుడిగా కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు సందీప్ కిషన్ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా నిర్మాత రాజేష్ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ చేయాల్సిన సినిమానే కదా ఈ మేరకు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది అని ప్రశ్నిస్తే ఆ విషయం నిజం కాదని చెప్పుకొచ్చాడు.