ఏలూరు బీజేపీలో ముసలం.. ఇండిపెండెంట్‌గా బరిలోకి..!
ఏలూరు బీజేపీలో ముసలం ముదిరింది. ఏలూరు పార్లమెంట్ సీటు బీజేపీ నుంచి కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి.. వచ్చే ఎన్నికల్లో స్వయం సేవకుడిగా ఏలూరు పార్లమెంటు నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. రాజకీయాలు అంటే కొన్ని కుటుంబాలు మాత్రమేనా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిస్వార్థంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో.. రాజకీయాల్లోకి రాకముందే నిశ్చయించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు.. బీజేపీ నుంచి టికెట్ వచ్చినా? రాకపోయినా.. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు. ఏలూరు వేదికగా నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఏలూరు జిల్లా నలుమూలల నుంచి బీజేపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ.. బీజేపీ తరఫున ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని గారపాటికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
టికెట్ రాకపోతే చంద్రబాబును అడగాలి.. నేనేమీ సోమిరెడ్డికి టికెట్ ఇవ్వలేను కదా..?
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డిపై సెటైర్లు వేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సోమిరెడ్డికి రెండో జాబితాలో కూడా టికెట్ రాలేదు.. టికెట్ రాకపోతే చంద్రబాబును తిట్టాలి. ఆయన మీద బాధపడాలి.. కానీ, నామీద పోరాడానని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, నా మీద పోరాడేందుకు సోమిరెడ్డి సరిపోడు.. ప్రజల కోసం.. పార్టీ కోసం బతికానని చెబుతున్నారు. ప్రజలను ఆయన దోచుకున్నారని దుయ్యబట్టారు. సోమిరెడ్డి పట్ల చంద్రబాబు చాలా ఉదారంగా వ్యవహరించారు.. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారన్న ఆయన.. సర్వేపల్లి ప్రజలు సోమిరెడ్డిని వదిలించుకున్నారని.. కానీ, పార్టీ నాలుగు సార్లు అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రజలు వదిలించుకున్న నేతను తాము కూడా వదిలించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందన్నారు మంత్రి కాకాణి.. సోమిరెడ్డికి టికెట్ రాకపోతే నామీద బాధపడి బురద చెల్లుతున్నారు.. నేనేమీ సోమిరెడ్డికి టికెట్ ఇవ్వలేను కదా..? అని ప్రశ్నించారు. నన్ను విమర్శించడం సమంజసం కాదు అని సోమిరెడ్డికి హితవుపలికారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
మంత్రాలయం టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీడీపీ టికెట్ల కేటాయింపు కొన్ని నియోజకవర్గాల్లో చిచ్చుపెడుతోంది.. కర్నూలు జిల్లా మంత్రాలయంల టీడీపీలో అసమ్మతి భగ్గుమంది.. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న తిక్కారెడ్డికి టికెట్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ.. ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు, తిక్కారెడ్డి అభిమానులు.. రోడ్లపై బైఠాయించి నిరసనలు చేపట్టారు. రహదారులపై టైర్లు దగ్ధం చేసి నిరసనకు దిగారు. మరోవైపు.. మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న పి తిక్కారెడ్డికి టికెట్ కేటాయించక పోవడంతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తిక్కారెడ్డి.. చంద్రబాబు మంత్రాలయం టీడీపీ టికెట్ విషయంలో పునరాలోచించాలని సూచించారు. టికెట్ ఇవ్వక పోతే ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఇక, చంద్రబాబు కార్యాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బ్రోకర్లు ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు డబ్బులకు అమ్ముడు పోయి.. వైఎస్ జగన్ కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. త్వరలో 500 వాహనాలలో చంద్రబాబు దగ్గరకు బల ప్రదర్శనకు సిద్ధమన్నారు. టికెట్ కేటాయించిన బీసీ నేత రాఘవేంద్ర రెడ్డికి ఓటు వేస్తే బాలనాగిరెడ్డికి వేసినట్లే అని విమర్శించారు. బాలనాగిరెడ్డికి కోవర్టుగా రాఘవేంద్ర రెడ్డి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. మూడు నెలలు ముందుగానే మా ప్రత్యర్థి బాలనాగిరెడ్డి.. టీడీపీ టికెట్ బీసీలకే కేటాయించారని ఉపన్యాసంలో చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ మంత్రాలయం ఇంచార్జ్ తిక్కారెడ్డి.
తొలిరోజు ప్రచారంలోనే టీడీపీ అభ్యర్థికి అస్వస్థత..
ఇప్పటికే టికెట్ దక్కించుకున్న నేతలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.. తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. టీడీపీ రెండు జాబితాలో విడుదల చేయగా.. రెండో జాబితాలో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్‌ను పల్లె సింధూర రెడ్డి దక్కించుకున్నారు. అయితే, మొదటి రోజు ఎన్నికల ప్రచారంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారు.. తొలిరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొత్తచెరువు మండల కేంద్రానికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి చేరుకున్నారు పల్లె సింధూర.. ప్రచారానికి ఈ రోజు శ్రీకారం చుట్టడంతో.. పల్లె సింధూరకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు.. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చాయి టీడీపీ శ్రేణులు.. అలాగే తమ పార్టీ అభ్యర్థి సింధూరకు పూల మాలలు వేసి.. దారి పొడవునా పూలు జల్లారు. అయితే, ఓ వైపు టీడీపీ శ్రేణుల హడావుడి.. మరోవైపు.. బాణసంచా హోరు.. దీనికి తోడు ఎండ తీవ్రత కూడా ఉండడంతో.. పల్లె సింధూర అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీలోనే ఆమె సొమ్మసిల్లి పడిపోయారు.. ఆమె పరిస్థితి గమనించిన భర్త కృష్ణ కిషోర్ రెడ్డి.. ఇతర మహిళా కార్యకర్తలు ఆమెకు తోడుగా నిలిచారు.. ఆమెకు శీతలపానియాలు అందజేశారు.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారా రథం నుంచి కిందకు దించి.. కారులో ఆస్పత్రికి తరలించారు.. ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
వైసీపీకి షాక్.. పార్టీకి గుడ్‌బై చెప్పిన కావలి మాజీ ఎమ్మెల్యే
ఎన్నికల తరుణంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గానిక చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వైసీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు వేణుగోపాల్ రెడ్డి.. పది సంవత్సరాలు వైసీపీలో ఉంటే కార్యకర్త కన్నా హీనంగా చూశారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.. కావలి, ఉదయగిరిలో వైసీపీ అభ్యర్ధుల గెలుపుకోసం గతంలో శక్తివంచన లేకుండా పనిచేశా.. కానీ, ఆ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు మాకు దూరం అయ్యారని తెలిపారు. ఇక, నన్ను పార్టీ పట్టించుకోవడం లేదు.. కార్యకర్త కంటే హీనంగా చూశారు.. దీంతో, ఆత్మాభిమానం చంపుకుని ఉండలేకే వైసీపీ రాజీనామా చేసినట్టు వెల్లడించారు. అంతేకాదు.. తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.. అయితే, ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తాను అన్నారు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి.
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు..
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ సోదాలు చేపట్టింది. కవిత నివాసంలో నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. ఏడాదిన్నరగా ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ జరుగుతుంది. అందులో భాగంగానే.. ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. ఇప్పటికే కీలక నిందితులంతా అఫ్రూవల్ గా మారారు. కవిత ఢిల్లీ పీఏ సైతం అఫ్రూవల్ గా మారాడు. పీఏ అశోక్ కౌశిక్ అఫ్రూవల్ గా మారడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అశోక్ జడ్జి ముందు సంచలన విషయాలు బయటపెట్టాడు. లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్లుగా అంగీకరించారు. దీంతో అశోక్ ను కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిద్ధమైన సీబీఐ ఫిబ్రవరి 26న విచారణకు రావాలని గత నెల నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో.. కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కవిత ఇంట్లో ఐటీ సోదాలు.. మంత్రి హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కవితపై ఈడీ రైడ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారు. తాము రెండు సంవత్సరాల క్రితమే కవిత అరెస్టు అవుతుందని చెప్పామని తెలిపారు. మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడే కవిత అరెస్టు కావాలి.. కానీ అప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కవిత అరెస్టుతో వచ్చే సానుభూతితో మూడు నాలుగు సీట్లు సంపాదించవచ్చని బీజేపీ ఆశపడుతుంది.. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చని ఆరోపించారు. గల్లీలో కొట్లాడుకొని ఢిల్లీలో కలిసిపోతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని కవిత నివాసానికి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది అధికారులు శుక్రవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాల సందర్భంగా కవితతోపాటు ఆమె భర్తకు సంబంధించిన వ్యాపారాలపై వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సోదాల నేపథ్యంలో కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విషయమై ఈ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. సోదాల నేపథ్యంలో కవిత ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరో మూడు, నాలుగు గంటల పాటు సోదాలు జరిగే అవకాశం ఉంది.
ఎలక్టోరల్ బాండ్లను మొదటి నుంచి వ్యతిరేకించాం.. నారాయణ కీలక వ్యాఖ్యలు
ఎలక్టోరల్ బాండ్లను మొదటి నుంచి తాము వ్యతిరేకించినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ తెలిపారు. రాజకీయాలను ధ్వంసం చేసేందుకే ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఎస్బీఐ వ్యవహారశైలి సరిగా లేదు.. ఎస్బీఐ దగ్గర వివరాలు అందించే టెక్నాలజీ లేదా ? అని ప్రశ్నించారు. సమయం లేదు అని దొంగలను కాపాడేందుకే ఎస్బీఐ వివరాలు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. ఏ పార్టీకి ఇచ్చారో సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఎవరెవరికి, పార్టీలకు ఎంత ఇచ్చారో లెక్క తేలాలని నారాయణ పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన లెక్కలు చెప్పాల్సిందే.. పారదర్శకత ఉండాల్సిందేనని నారాయణ తెలిపారు. దొంగలను, రాజకీయ పార్టీలను కాపాడేందుకు చేసే ప్రయత్నం సరికాదని నారాయణ ఆరోపించారు. లెక్కలు ఇవ్వని అధికారులను విచారణ చేసి జైల్లో వేయాలని పేర్కొన్నారు. అధికారుల వెనుక కేంద్ర పెద్దలున్నారు.. ప్రధాని, కేంద్ర హోంమంత్రి బాధ్యత వహించాలని తెలిపారు. రాజకీయాలను ధ్వంసం చేసేందుకే ఎలక్ట్రోరల్ బాండ్లను తీసుకొచ్చారు.. క్విడ్ ప్రో కో లాభపడిన అందరి వివరాలు బయటకు రావాలని ఆయన కోరారు.
కాంగ్రెస్‌కు మరో షాక్.. హస్తంను వీడి ఆప్‌లో చేరిన ఎమ్మెల్యే
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ చబ్బేవాల్ తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అనంతరం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పంజాబ్‌లో ఆప్ కుటుంబం బలపడిందని ఆ పార్టీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పేర్కొంది. హోషియార్‌పూర్ జిల్లాలోని చబ్బేవాల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్‌కుమార్ చబ్బే వాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా అనుకూల విధానాలకు ప్రభావితమై ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారని, ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతం తెలిపింది. అంతకుముందు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఉద్దేశించి తన సంక్షిప్త రాజీనామా లేఖలో.. “తక్షణమే అమలులోకి వచ్చేలా నేను భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను” అని పేర్కొన్నారు. చబ్బేవాల్ తన రాజీనామాకు గల కారణాలను ప్రస్తావించలేదు. 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాజ్‌కుమార్ చబ్బేవాల్ చబ్బేవాల్ నుంచి తిరిగి ఎన్నికయ్యారు.
ఒంటరిగా నిద్రపోవడం లేదా బెడ్‌ను పంచుకోవడం.. ఏది మంచిదో తెలుసా?
అరిజోనా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఒంటరిగా నిద్రించే వారి కంటే తమ భాగస్వామి లేదా జీవిత భాగస్వామితో బెడ్‌ను పంచుకునే వ్యక్తులు బాగా నిద్రపోతారని తేలింది. అధ్యయనం ప్రకారం, ఒంటరిగా నిద్రపోయే వారితో పోలిస్తే, భాగస్వామితో బెడ్‌ను పంచుకునే వారికి నిద్రలేమి, అలసట, అతిగా నిద్రపోవడం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. ఇది మాత్రమే కాదు, మీ భాగస్వామితో కలిసి నిద్రించడం మీ మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని అధ్యయనం వెల్లడించింది, ఎందుకంటే కలిసి నిద్రించే జంటలు తక్కువ నిరాశ, ఆందోళన, ఒత్తిడిని కలిగి ఉంటారు. జీవితం, సంబంధాలపై ఎక్కువ సానుకూలంగా ఉంటారు. సంతృప్తి పొందుతారు. అయితే కొంతమంది నిపుణులు బెడ్ షేరింగ్ కూడా ప్రజల నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా తమ భాగస్వామి గురక పెట్టడం లేదా తరచుగా ఎగరడం, తిరగడం వల్ల గాఢంగా నిద్రపోలేరు. ఈ క్రమంలో కొంచెం మీ నిద్రకు భంగం కలగవచ్చు. మీ భాగస్వామి నిద్ర సంబంధిత సమస్యలతో పోరాడుతున్నట్లయితే, అతను తరచుగా అటు ఇటు కదిలే సమస్యను కలిగి ఉంటాడు. ఇది ఇతర భాగస్వామి నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. దీనికి విరుద్ధంగా, మీరు ఒంటరిగా నిద్రపోతే ఏసీ ఉష్ణోగ్రత, ఫ్యాన్ వేగం మొదలైన వాటికి సంబంధించి మీ భాగస్వామితో గొడవలను నివారించడంలో ఇది మీకు సహాయపడుతుంది. ‘స్లీప్ డివోర్స్’ (దీనిలో జంటలు విడివిడిగా నిద్రపోతారు) నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే రాత్రి వేళల్లో దూరంగా ఉండటం కమ్యూనికేషన్, సాన్నిహిత్యంపై ప్రభావం చూపుతుంది. ఇది సంబంధాల నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
టైటానిక్ షిప్‌ను మించి టైటానిక్ 2.. ఎవరీ క్లైవ్ పామర్?
టైటానిక్.. ఇప్పటి తరాలు ఆ షిప్‌ను చూడకపోయినా అందరికీ తెలిసిన పదమే.. టైటానిక్ చిత్రాన్ని చూసి ఎంతో మంది ఆ పడవ వృత్తాంతం గురంచి తెలుసుకున్న వాళ్లు ఉంటారు. సముద్రంలో మునిగి దశాబ్దాలవుతున్నా అందరికీ ఇంకా గుర్తే. కారణం టైటానిక్ నేపధ్యంలో తీసిన సినిమా. పదేళ్ల క్రితం ఓ కోటీశ్వరుడు టైటానిక్ 2 దింపుతానని ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. లండన్‌లో రిట్జ్ హోటల్‌లో అపర కోటీశ్వరుడు క్లైవ్ పామర్ చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు మరోసారి టైటానిక్ 2 నిర్మాణం వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచంలో 732వ అత్యంత సంపన్నుడైన క్లైవ్ పామర్ ఈ వారం సిడ్నీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ టైటానిక్-2 నిర్మాణ కల ఇప్పటికీ చెక్కుచెదరలేదని.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఓడ నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. టైటానిక్ II షిప్ ప్రాజెక్ట్ రెండుసార్లు రద్దు చేయబడింది. ఎక్కువ డబ్బుతో, ప్రణాళిక మునుపటి కంటే సురక్షితంగా ఉంటుందని క్లైవ్ అభిప్రాయపడ్డాడు.
టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా రష్మిక మందన్న ఒనిట్సుక టైగర్!
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పలు సినిమాల్లో నటిస్తూనే మరో పక్కపలు బ్రాండ్స్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. ఇక ఇప్పుడు రష్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుక టైగర్ మిలాన్ ఫ్యాషన్ వీక్ లో టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది. ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ఈ లిస్టు తయారు చేసింది. ఫ్యాషన్ బ్రాండ్ విలువ డాలర్స్ తో చూసినప్పుడు రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఒనిట్సుక టైగర్ బ్రాండ్ టాప్ 10లో 9వ స్థానంలో నిలిచింది. ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ప్రకారం ఒనిట్సుక టైగర్ ఫ్యాషన్ బ్రాండ్ 75 లక్షల డాలర్ల వర్త్ కలిగి ఉంది. గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఇటలీలోని మిలాన్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో రష్మిక మందన్న ర్యాంప్ పై నడిచింది. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొని ఒనిట్సుక టైగర్ బ్రాండ్ ను రష్మిక ప్రమోట్ చేసింది. పుష్ప , యానిమల్ మూవీస్ తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకుంది రష్మిక మందన్న. ఈ క్రమంలో ఆమెకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్ దక్కుతున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు మరింత ప్రచారం కల్పిస్తోంది రష్మిక మందన్న.
