పవన్ కల్యాణ్ పోటీ చేసేది అక్కడి నుంచే.. అధికారిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. అయితే, కీలక నేతలైన సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుంచి, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి అనేది ఎప్పుడో ఫైనల్ అయినా.. ఈ సారి జనసేనాని పవన్ కల్యాణ్ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారు? అనే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన ఆయన.. రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. అయితే, ఈ సారి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తారా..? ఈ సారి పిఠాపురంపై గురిపెట్టారా? అనే ప్రచారం జరుగుతూ వచ్చింది.. అనే ఉత్కంఠకు జనసేన పార్టీ తెరదించింది.. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖరారు అయ్యింది.. జనసేన సోషల్ మీడియా సమావేశంలో అధికారికంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో.. పవన్ కల్యాణ్ అసెంబ్లీ స్థానంపై క్లారిటీ వచ్చినట్టు అయ్యింది. కాగా, గతంలో కమ్యూనిస్టులతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికలకు వెళ్లారు.. కానీ, ఈ సారి టీడీపీ, బీజేపీ పొత్తులో ఎన్నికలకు వెళ్తున్న విషయం విదితమే. ఈ సారి అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించితీరుతామని నమ్మకంగా చెబుతున్నారు మిత్రపక్షాల నేతలు.
ఎంపీగా.. ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ పోటీ..! క్లారిటీ ఇచ్చిన జనసేనాని
ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అటు లోక్‌సభ స్థానంతో పాటు.. అసెంబ్లీ స్థానంలోనూ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది.. ఈ దశలో ఆయన ఎంపీగా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి.. అయితే, మొత్తంగా ఈ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఫైనల్ అయ్యింది.. స్వయంగా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అంతే కాదు.. నన్ను ఎంపీగా పోటీచేయాలని అంటున్నారు.. కానీ, నాకు ఎమ్మెల్యేగానే పోటీచేయాలని ఉంది.. ప్రస్తుతానికి ఎంపీగా పోటీచేయాలనే ఆలోచనలేదు అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. మధ్య తరగతి వ్యక్తికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అనేదే జనసేన.. మధ్య తరగతి వర్గానికి వచ్చే కోపం నాతో జనసేన పార్టీ పెట్టించిందన్నారు. ఇక, అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తుల వల్ల నాలో ఆలోచన రేపాయి అన్నారు పవన్.. నేను డిగ్రీ పూర్తి చేయలేదు.. చిరంజీవికి బాడీగార్డ్ గా బ్రతికేయాలి అనుకున్నా.. నాకు కష్టాలు లేవు నేనే కష్టాలు కొనితెచ్చుకున్నాను అన్నారు. చిరంజీవి పార్టీ పెడితే మీ కుటుంబం మీద దాడులు చేస్తామని 2006లో నాకు చెప్పారు.. వాళ్లంతా పదవుల్లో ఉన్నారని పేర్కొన్నారు. నేను ఏం చేసినా అన్నీ ఆలోచన చేసే చేస్తాను.. ఆశయం కోసం వచ్చిన నేను ఓడిపోతే శూన్యం అనిపించింది అన్నారు. కానీ, నేను అధికారం కోసం కాదు మార్పు కోసం వచ్చాను అన్నారు. వైఎస్ జగన్ మీద, ఆయన పార్టీ మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదు.. వారి విధానాలు మాత్రమే నాకు నచ్చవు అన్నారు. రౌడీలు, రాజకీయ నాయకులు నాలాంటి వారిని చూడలేదు.. నన్ను కొట్టే ప్రతి దెబ్బను వాడుకుని నేను ఎదుగుతాను అన్నారు. వైసీపీ రోడ్లు వేయకపోతే నా కారు మాత్రమే కాదు అందరి కార్లు పనిచేయవు అన్నారు జనసేనాని.. నా అభిమానులు ఎక్కువ మంది వైసీపీకి ఓటు వేశారు అని గుర్తు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
బీజేపీకి సీట్ల వ్యవహారంలో మేం నష్టపోయాం..! పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య సీట్ల వ్యవహారం తేలిపోయింది.. బీజేపీ కోసం జనసేన మూడు అసెంబ్లీ స్థానాలు త్యాగం చేయాల్సి వచ్చింది.. టీడీపీ కూడా మరోస్థానాన్ని వదులుకుంది.. అయితే, బీజేపీకి సీట్లు ఇచ్చే వ్యవహారంలో జనసేన పార్టీ నష్టపోయిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. పొత్తుల వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేస్తే ఏమవుద్దో నాకు ఇప్పుడు అర్థం అయ్యిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమం కోసం నేను ఈ పని చేస్తున్నాను అని స్పష్టం చేశారు. పెద్ద మనసు చేసుకుంటే చిన్న పోవాల్సి వచ్చిందన్నారు. మా అన్న నాగబాబు టికెట్ కోసం త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. టికెట్ల రానివాళ్లు ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడతారు అన్నారు. వ్యక్తిగతంగా తిట్టినా పర్లేదు.. కానీ, పొత్తుకు ఇబ్బంది కలిగితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు పవన్ కల్యాణ్.
చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్.. ప్రత్యేక హోదా ఇచ్చిందని బీజేపీతో పొత్తా..?
ఏపీ ఎన్నికల్లో పొత్తులు ఖరారు అయ్యాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తున్నాయి.. అయితే, ఈ పొత్తులపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఎన్నికలకు వస్తున్నారు. బీజేపీని గతంలో చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని దుయ్యబట్టారు. అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్ప బీజేపీ అన్ని ఇచ్చిందని చంద్రబాబు అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చిందని ఆ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందా…? అని సెటైర్లు వేశారు. ఇక, బీజేపీ.. సీఏఏ తీసుకొచ్చి మైనార్టీలను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
గొల్లపల్లి, రాపాక మధ్య సమసిన విభేదాలు.. జగన్ గెలుపుకోసం కలిపి పనిచేస్తాం..
రాజోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మధ్య తలెత్తిన విభేదాలు సమసిపోయాయి.. ఈ రోజు నిన్నటివరకు గొల్లపల్లి అంటేనే విభేదిస్తూ వచ్చిన ఎమ్మెల్యే రాపాక.. ఈ రోజు స్వయంగా తనకు తానే గొల్లపల్లి సూర్యారావు ఇంటికి వెళ్లి కలిశారు.. ఇక, గొల్లపల్లి సూర్యారావు గెలుపుకోసం పనిచేస్తానంటూ ప్రకటించారు రాపాక.. ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు అంతా కలిసిపనిచేద్దాం అన్నారు. అయితే, నిన్నటి వరకు గొల్లపల్లి సూర్యారావు రాకను వ్యతిరేకించారు రాపాక వరప్రసాద్.. కానీ, వైసీపీ అధిష్టానం ఆదేశాలతో వెనక్కి తగ్గిన రాపాక.. ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు.. గొల్లపల్లి గెలుపుకోసం కృషి చేస్తానని ప్రకటించారు.. రాజోలు నియోజకవర్గంలో గొల్లపల్లి గెలుపుకోసం తో పాటు అమలాపురం పార్లమెంట్ స్థానంలో నా గెలుపు కోసం.. కలిసి పనిచేస్తామన్నారు. ఇద్దరూ కలిసి వెళ్లాలి.. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు రాపాక. ఇక, ఐదేళ్లు రాజోలు నియోజకవర్గంలో రాపాక చేసిన కృషికి ప్రమోషన్‌గా పార్లమెంట్ సీటు వచ్చిందన్నారు గొల్లపల్లి సూర్యారావు.. ఇది మన నియోజకవర్గానికి అదృష్టింగా భావిస్తున్నాను అని తెలిపారు. గత 30 ఏళ్లుగా కోనసీమ ప్రాంతంలో ప్రజల కోసం పనిచేశాం.. మంచి పేరు తెచ్చుకున్నాం.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు గొల్లపల్లి సూర్యారావు..
రేపటి నుండి టీజీ పేరుతో వాహన రిజిస్ట్రేషన్..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టీజీ అని రిజిస్ట్రేషన్ అవుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలన్నీ.. ఏపీ అని ఉంటే టీజీ అని మార్చుకున్న సందర్భం ఉందని పేర్కొన్నారు. జూన్ 2న రాష్ట్రం విడిపోయే సమయంలో టీజీ అని గెజిట్ ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. టీజీని విమర్శించే వాళ్ళు.. ముందు టీఎస్ ఎందుకు పెట్టారో చెప్పండని మంత్రి ప్రశ్నించారు. ఆ తర్వాత టీజీ ఎందుకు మారిందో చెబుతామన్నారు. ఉద్యమ సమయంలో ప్రజలు తీసుకున్న ఆకాంక్షలను గౌరవిస్తూ టీజీగా మార్చినట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ మధ్య జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని.. ఎక్కువగా ప్రయాణం చేసే డ్రైవర్లకు మరోసారి ఫిట్ నెస్ టెస్టులు చేస్తామని మంత్రి తెలిపారు.
రవీంద్ర భారతిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.. స్టెప్పులేసిన మంత్రి
తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని.. అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ శిశు సంక్షేమ , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాటు పలువురు మహిళ అధికారిణిలు పాల్గొన్నారు. 90 రోజుల్లో తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుందని… రాబోయే రోజుల్లో మరిన్ని పధకాలను అమలు చేసి, ప్రజలకు చేరువవుతామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదివాసీ బిడ్డగా విప్లవ ఉద్యమంలోకి వెళ్లి గన్ను పట్టానని.. ఉద్యమం నుండి బయటకు వచ్చాక ప్రజాసేవ చేసేందుకు తనకు ఈ అవకాశం దక్కడం గర్వంగా ఉందన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించిన మంత్రి… వారికి లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకంతో సత్కరించారు. ఈ సందర్భంగా డప్పు కళాకారిణి వేసిన దరువుకు దివ్యంగురాలు అయిన భాగ్య అనే విద్యార్థితో కలిసి మంత్రి డ్యాన్స్ చేశారు.
పంజాబ్‌లో 8 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన ఆప్
పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ తన మొదటి జాబితాను గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో ఐదుగురు కేబినెట్ మంత్రులు ఉన్నారు. భటిండా నుంచి గుర్మీత్ సింగ్ ఖుడియాన్, అమృత్‌సర్ నుంచి కుల్దీప్ సింగ్ ధాలివాల్, ఖండూర్ సాహిబ్ నుంచి లల్జిత్ సింగ్ భుల్లార్, సంగ్రూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీత్ హయర్, పాటియాలా నుంచి డాక్టర్ బల్బీర్ సింగ్ ఉన్నారు. వీరితో పాటు జలంధర్ నుంచి సిట్టింగ్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ పేరును ప్రకటించారు. ఫతేఘర్ సాహిబ్ నుంచి మాజీ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్‌కు టికెట్ ఇవ్వగా, ఫరీద్‌కోట్ నుంచి పోటీ చేసేందుకు కరమ్‌జీత్ అన్మోల్ పేరును ప్రకటించారు. ఫిబ్రవరి 27న, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని నాలుగు లోక్‌సభ స్థానాలకు, హర్యానాలోని కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి తన అభ్యర్థులను ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి కుల్దీప్ కుమార్‌ను నిలబెట్టింది, అయితే ఢిల్లీ మాజీ మంత్రి, సీనియర్ ఆప్ నాయకుడు సోమనాథ్ భారతి ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.పార్టీ దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి సహిరామ్ పహల్వాన్‌ను పోటీకి దించగా, మహాబల్ మిశ్రా పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేయనున్నారు. హర్యానాలో కురుక్షేత్ర నుంచి సుశీల్ గుప్తాను పోటీకి దించాలని ఆప్ నిర్ణయించింది.
భారత్-చైనా మధ్య సాయుధ ఘర్షణ!.. అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
భారత్‌పై ప్రమాదకర ప్రణాళికలు రచిస్తున్న చైనా.. ఇప్పుడు భారత్ చుట్టూ పక్క దేశాల్లో సైనిక స్థావరాలను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. భారత్‌కు పొరుగున ఉన్న శ్రీలంక, పాకిస్థాన్, మయన్మార్, చైనా, క్యూబా, స్నేహపూర్వక దేశమైన యూఏఈ, సీషెల్స్, తజికిస్థాన్, టాంజానియా వంటి దేశాలు కూడా సైనిక స్థావరాలను నిర్మించే అవకాశాలపై కసరత్తు చేస్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తాజా నివేదిక వెల్లడించింది. భారత్-చైనా మధ్య సాయుధ ఘర్షణ జరిగే అవకాశం ఉంది అమెరికా నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. చైనా సైనిక స్థావరాల నిర్మాణ చర్య యొక్క ఉద్దేశ్యం దాని బలాన్ని ప్రదర్శించడం, దాని జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం. ఇప్పటికే హిమాలయాల్లో చైనా నుంచి ముప్పును ఎదుర్కొంటున్న భారత్‌కు అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక టెన్షన్‌ను పెంచింది.
పిఠాపురం నుంచి పవన్‌పై రామ్ గోపాల్ వర్మ పోటీ?
గత కొద్దిరోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొనసాగుతున్న సందిగ్ధతకు తెరదించుతూ పవన్ కళ్యాణ్ తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని ఒకసారి తిరుపతి నుంచి పోటీ చేస్తారని ఒకసారి. లేదు కాకినాడ ఎంపీ బరిలో దిగుతున్నారని మరోసారి కాదు కాదు మచిలీపట్నం అభ్యర్థిగా బరిలో దిగుతున్నారని ఇంకోసారి ఇలా రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తూ వచ్చాయి. వాటన్నింటికీ బ్రేకులు వేస్తూ పిఠాపురంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు సోషల్ మీడియా మీటింగ్ లో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ అలా ప్రకటించారో లేదో వెంటనే రాంగోపాల్ వర్మ కూడా తాను ఒక సడన్ డెసిషన్ తీసుకున్నానని దాని ప్రకారం పిఠాపురం నుంచి తాను అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ మీద రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. కొంత మంది ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడేమో అని కామెంట్ చేస్తుంటే మరికొంతమంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడేమోనని కామెంట్ చేస్తున్నారు. మరి కొంత మంది ట్విట్టర్లో రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇది ప్రాంక్ అయి కూడా ఉండవచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే వైసీపీకి ఇప్పటికే అక్కడ సమన్వయకర్తలు ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు అలాగే రిస్క్ తీసుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఒకవేళ డిపాజిట్లు కూడా రాకుండా ఉంటే పరువు పోతుంది కాబట్టి అంత సాహసానికి కూడా ఆయన పూనుకోడు అనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.
నేను ఓడిపోతాను అని నాకు తెలుసు.. నా కోసం ఆలోచించేది ఆ ఒక్కడే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఎలాంటి స్నేహ బంధం ఉందో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా కూడా వీరి స్నేహానికి ఉండే ఫ్యాన్ బేస్ వేరు అని చెప్పాలి. ఇక మాటల మాంత్రికుడు.. పవన్ కు రాజకీయంగా కూడా హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో త్రివిక్రమ్ ను గుర్తుచేసుకున్నాడు. సమాజం గురించి తాను ఆలోచిస్తే.. తన గురించి ఆలోచించే ఒకే ఒక్కడు త్రివిక్రమ్ అని చెప్పుకొచ్చాడు. అసలు త్రివిక్రమ్ కు తాను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని, తన పోరు వలనే ఏం చేయలేక తన వెంట ఉంటున్నట్లు తెలిపాడు. ” 2014 నుంచి 2019 వరకు అంచలంచలుగా పెంచుదామనుకున్న పార్టీ.. ఈపాటికీ రికగ్నైజేడ్ పార్టీ అయిపోయేది. 18 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చాయి. అదే కనుక 10 నియోజక వర్గాలు ఉండి ఉంటె దాదాపు 2 ఎంపీలు, 10, 12 ఎమ్మెల్యే సీట్లు వచ్చేవి. ఆరోజున నా వ్యూహాన్ని ఎవరు అమలు చేయనివ్వలేదు. నేను వెళ్తే జనాలు వచ్చేస్తారు. నాకు చాలా స్పష్టత ఉంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగా నాకు అవగాహన ఉంది.. అతను పొలిటికల్ లీడర్ గా కూడా నాకు అవగాహన ఉంది. అందుకే నాకు వ్యూహం నాకు వదిలేయండి అని చెప్తాను.. నా దగ్గర అరమరికలు ఉండవు.. పవన్ కళ్యాణ్ ను బ్లాక్ అండ్ వైట్ లో చూస్తాను నేను.. కానీ, మీకు పవన్ కళ్యాణ్ తగ్గకుండా ఉండాలి. అయితే తగ్గడం అనేది చాలా అవసరం. తనను తానూ తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని చిన్నప్పుడు మా టీచర్ చెప్పింది. పరిస్థితిలు ముందుకు తీసుకెళ్లనప్పుడు మీకు మీరే తగ్గించుకోవాలి. అప్పట్లో ఒక 30 స్థానాల్లో పోటీ చేద్దామనుకున్నాను. కానీ అందరూ నన్ను కూర్చోపెట్టి ఒత్తిడి పెడితే నిస్సహాయంగా వదిలేశాను. దారుణం ఏంటంటే.. నేను ఓడిపోతాను అని కూడా నాకు తెలుసు. కానీ, యుద్ధం చేసేటప్పుడు జయాపజయాలను చూడకూడదు. యుద్ధమే చేయాలి. భీమవరంలో కూడా నేను ఓడిపోతాను అని తెలుసు.. ప్రచారంలోనే అర్ధమయ్యింది. గాజువాకలో ఆల్రెడీ ఓడిపోయాను. సినిమాలు అన్ని ఆపేసుకొని, డబ్బులు లేక, నేషనల్ వైడ్ సినిమాలు తీసే క్యాపబిలిటీ ఉండి, ఇంతమంది అభిమాన బలం ఉండి.. నేను ఒకటే అనుకున్నాను ఓడిపోయాకా.. సమాజం మీద, దేశం మీద ఒకడికి ఇంత పిచ్చి మంచిదా.. ? అని అనుకున్నాను.కానీ, దేవుడు నాకు ఒకటే చెప్పాడు.. అది నీ బాధ్యత.. నువ్వు నిర్వర్తించు.. కర్మయోగివి నువ్వు. ఫలితం నీకు అనవసరం.
