*రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా.. చంద్రబాబు కీలక ప్రకటన
టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ, వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. జనసేన, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఆ రెండు పార్టీల వారికి స్పష్టత ఉందన్నారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు కూడా వారి అభ్యర్థులను ప్రకటిస్తాయని స్పష్టం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని స్పష్టం చేశారు.”పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి అని ప్రతివాళ్లు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పదేళ్లుగా కేంద్రంలో ఉంది. రేపటి ఎన్నికల్లోనూ బీజేపీనే వస్తుందని అందరూ చెబుతున్నారు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు రాకపోయినా, ఉత్తరాదిలో వారిదే ప్రభంజనం అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన విధ్వంసంతో 30 ఏళ్లు వెనక్కివెళ్లిపోయాం. రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలంటే… నిధులు, అనుమతులు, క్లియరెన్సులు ఇలా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర పునర్ నిర్మాణం చేయలేం. కొందరు… టీడీపీ-జనసేన పొత్తును ప్రశ్నిస్తున్నారు. మేం జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే ఓట్లు చీలిపోయి మళ్లీ వీళ్లే గెలుస్తారు… రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. సీట్ల పంపకం అయిపోయిన తర్వాత కూడా… ఎప్పుడు లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారంటూ జనసేన పార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ జాతీయ పార్టీ… మీకు ఇన్ని సీట్లేనా అంటూ బీజేపీ వాళ్లను రెచ్చగొడుతున్నారు. ఆరోజు పవన్ కల్యాణ్ కూడా చెప్పింది… ఓటు చీలకూడదు అని స్పష్టం చేశాడు. నేను కూడా గర్వానికి పోలేదు. నేను 14 ఏళ్లు సీఎంగా చేశాను, కేంద్రంలోనూ చక్రం తిప్పాం. నేను ఎక్కడికీ పోను, ఎవరితోనూ సర్దుబాటు చేసుకోను అని భీష్మించుకు కూచుంటే ఎవరికి లాభం? అందుకే ప్రజాహితం కోసం, ప్రజల భవిష్యత్ కోసం అందరం రాజీపడ్డాం. ఇది రాష్ట్ర హితం కోసం కుదుర్చుకున్న పొత్తు తప్ప, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, రాజ్యాధికారం కోసమో కుదుర్చుకున్న పొత్తు కాదు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
*బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆరూరి రమేష్ భేటీ
వరంగల్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఇవాళ వరంగల్ నియోజకర్గం పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారతున్నారనే వార్తల నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై ఉదయం నుంచి వరంగల్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆరూరి రమేష్‌ను బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు బుజ్జగించినట్లు సమాచారం. అనంతరం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్ వచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆరూరి రమేష్ చెప్పారు. “నేను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నాను. ఈరోజు నన్ను ఎవరూ అడ్డుకోలేదు. నేను ఏ బీజేపీ నేతలను కలవలేదు. మా పార్టీ నేతలే నన్ను తీసుకుని వచ్చారు. నన్ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయలేదు. మా పార్టీ నేతలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేస్తారు?’ అని ఆరూరి రమేష్ తెలిపారు. హనుమకొండ పట్టణంలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర ఇవాళ ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తల నేపథ్యంలో ఆరూరి బుధవారం ప్రెస్ మీట్పెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఇతర బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వెళ్లారని తెలిసింది. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన మెత్తబడలేదు. ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునే ముందు ఆరూరి రమేష్‌ను బీఆర్ఎస్ నేతలు ఇంట్లోకి తీసుకెళ్లారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే తాము వచ్చామని నేతలు చెప్పారు. సాయంత్రం హరీష్ రావు వస్తారని, పార్టీ మారొద్దని బీఆర్ఎస్ నేతలు ఆరూరికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో ‘జై ఆరూరి’ అంటూ మద్దతుదారులు నినాదాలు చేశారు.
*గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన ఏపీ హైకోర్టు!
తాజాగా ఏపీ హైకోర్టు 2018 లో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ ను రద్దు చేసింది. ఈ పరీక్షలకి సంబంధించి ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్ పై కొందరు అభ్యర్థులు పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జులై 22, 2022లో 2018 గ్రూప్-1 పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అయితే ఇందులో అనుమానాలున్నాయని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను నిలిపి వేయడం జరిగింది. ఈ ప్రక్రియకి సంబంధించి జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనానికి తిరిగి రావాలని ఏపీపీఎస్సిని కోర్టు ఆదేశించింది. తాజాగా ఈ పరీక్షను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాబోయే 6 నెలల లోపై ఎగ్జామ్ తిరిగి పెట్టాలని చెప్పింది. ఇక మరోవైపు చూస్తే.. ప్రస్తుతం జరగబోయే గ్రూప్-1 ఎగ్జామ్స్ కు సర్వం సిద్ధమైంది. ఏపీపీఎస్సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను మార్చి 17న నిర్వహించబోతుంది. ఆఫ్‌లైన్ లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష పేపర్ 1, ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్ 2 ను రెండు షిఫ్టులలో జరుపనున్నారు. ఈ పరిక్షలు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 18 జిల్లా కేంద్రాల్లో రాత పరీక్ష జరగబోతుంది. జరగబోయే ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత అయినవారు మాత్రమే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఈ నోటిఫ్కేషన్ లో మొత్తం 81 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరిక్ష నిర్వహిస్తోంది. ఇక ఈ పరీక్ష అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం.. ముందుగా APPSC అధికారిక పోర్టల్ psc.ap.gov.in ని సంప్రదిందించాలి. ఆపై హోమ్‌పేజీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్ – 2024 డౌన్‌లోడ్ లింక్ ను వెతకాలి. ఆపై వచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఇచ్చి లాగిన్ అవ్వాలి. దాంతో మీ ఏపీపీఎస్సీ హాల్ టిక్కెట్ 2024 స్క్రీన్ పై కనపడుతుంది.
*నేను పోటీచేయడంలేదు.. కేఏ పాల్ ఎంపీ అయితే రాష్ట్రానికి, దేశానికి మేలు..!
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ సారి విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు. అయితే, కేఏ పాల్ ఎంపీ అయితే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందన్నారు మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ నాకు సీటు ఇస్తానని మోసం చేసింది.. అందుకే నేను రాజకీయాలకు దూరం అయ్యాను అన్నారు. ఇక, నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. కానీ, కేఏ పాల్‌కి ప్రచారం చేస్తాను అన్నారు. కేఏ పాల్ ఆహ్వానం మేరకు ప్రజాశాంతి పార్టీలో చేరాను… వైజాగ్ ఎంపీగా పాల్ పోటీ చేస్తున్నారు, ఆయనకు ప్రచారం చేస్తాను అని స్పష్టం చేశారు. పాల్ ఎంపీ అయితే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బాబుమోహన్. కేఏ పాల్ ఎంపీ అయితే ఇతర దేశాల నుంచి డొనేషన్స్ తెచ్చి మన రాష్ట్ర, దేశ అప్పులు తీర్చుతారు అని వెల్లడించారు బాబుమోహన్.. ఎలక్షన్ లో చిన్న, పెద్ద వారికి సారాయి పోస్తున్నారు.. ఎన్నికల తర్వాత వారికి అదే వ్యసనంగా మారుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పాల్ ఎంపీ అయితే మందు పొయ్యరు, ఆయన దేవుని దూత అని పేర్కొన్నారు. కేఏ పాల్ ఎంపీగా బ్రహ్మాండంగా పని చేస్తారు.. కాబట్టి ఆయనను ఎంపీగా గెలిపించండి అని పిలుపునిచ్చారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో నన్ను గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కేఏ పాల్ కోరారు.. కానీ, నేను వద్దు అన్నాను. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్..
*వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ గెలవడం ఖాయం..
తిరుపతి జిల్లాలోని వాకాడులో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి అయినా తరువాత ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలవడం ఖాయం అని పేర్కొన్నారు. చాలా మంది ముఖ్యమంత్తులుగా పని చేశారు. ఇచ్చిన హామీలను పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అంటూ ఆయన కొనియాడారు. మ్యానిఫెస్టోతో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం తథ్యం.. చంద్రబాబు దొంగ హామీలు ఇస్తున్నాడు.. కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి వెల్లడించారు. ఏదో రకంగా అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పాకులాడుతున్నాడు అని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. రాజకీయం చేయలేని స్థితిలో ఉత కర్రల కోసం జనసేన- బీజేపీలతో దోస్తీ కట్టాడు అంటూ ఆరోపించారు. పనికి మాలిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా.. రాష్ట్రంలో మరోసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వం మే అని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు.
*కేంద్ర కేబినెట్ చివరి భేటీ.. ఎన్టీఆర్కు భారతరత్న?
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మార్చి 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ టర్మ్‌కు ఇదే చివరి కేబినెట్ కావడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు భారతరత్న ఇచ్చే అంశంపై చర్చ జరగనున్నట్లు సమాచారం. సినీ రంగంలో మాత్రమే కాకుండా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ప్రకటించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ అంశంపై కేంద్రానికి ఇప్పటికే చాలా విజ్ఞప్తులు అందాయి. సామాన్య ప్రజలతో పాటు పలువురు రాజకీయ నాయకులు భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పొత్తులపై చర్చల సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ నేతలు ప్రతిపాదనలు పెట్టారు. దీంతో మోడీ అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
*సెప్టెంబర్ 17న ‘‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’’.. అమిత్ షా ప్రకటన..
ప్రతీ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీని ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’’గా జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదారాబాద్ సంస్థానానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగి ఇండియన్ యూనియన్‌లో చేరిందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్ 17, 1948న ‘ఆపరేషన్ పోలో’ అనే పోలీసు చర్య తర్వాత ఈ ప్రాంతం నిజాం పాలన నుండి విముక్తి పొందింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపాలని ఈ ప్రాంతం నుంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్ విముక్తిలో అమరవీరులను స్మరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని జరపాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘హైదరాబాద్ విమోచన ఉద్యమంలో అమరవీరులయిన వారికి గౌరవసూచకంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినందున ఇది చారిత్రాత్మకమైన రోజు’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. హైదరాబాద్ ప్రాంతాన్ని దారుణమైన నిజాం పాలన నుంచి విముక్తి చేయడం ద్వారా భారత దేశంలో భాగంగా ఉండటానికి అత్యున్నత త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులకు ఈ నిర్ణయం సముచిత నివాళి అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నాని, ఇది యువతలో దేశభక్తిని పెంపొందిస్తుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోని పలు జిల్లాలు నిజాం సంస్థానం ఆధీనం ఉండేవి. అప్పటి ప్రజలు రజాకార్ల అరాచకాలతో విసిగిపోయారు. నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు. ఇదిలా ఉంటే మరోవైపు కాసింరిజ్వీ నేతృత్వంలోని రజాకార్లు మాత్రం హైదరాబాద్‌ని పాకిస్తాన్‌లో విలీనం చేయాలని భావించారు. ఇది తెలిసిన భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య ప్రారంభించింది. సెప్టెంబరు 17, 1948న అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో సైనిక చర్యతో నిజాంల పాలనలో ఉన్న అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైంది.
*బీహార్లో 11లోక్ సభ స్థానాల్లో పోటీచేయనున్న అసదుద్దీన్ ఒవైసీ పార్టీ
లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఓ కీలక ప్రకటన చేశారు. బీహార్‌లోని 11 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఒవైసీ ప్రకటించారు. బీహార్‌లోని కిషన్‌గంజ్, కతిహార్, అరారియా, పూర్నియా, దర్భంగా, భాగల్‌పూర్, కరకత్, బక్సర్, గయా, ముజఫర్‌పూర్, ఉజియార్‌పూర్ స్థానాల నుంచి AIMIM తన అభ్యర్థులను బరిలోకి దించనుంది. బీహార్‌లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే, బీహార్‌లోని కిషన్‌గంజ్ స్థానం నుంచి మాత్రమే తాను అభ్యర్థిని బరిలోకి దింపుతానని అప్పట్లో ఆయన ధృవీకరించారు. నిజానికి గత లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో కాంగ్రెస్ నేత మహ్మద్ జావేద్ విజయం సాధించారు. ఇది మాత్రమే కాదు, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ బీహార్‌లో ఈ స్థానంలో మాత్రమే విజయం సాధించింది. బీహార్‌లోని కిషన్‌గంజ్ లోక్‌సభ స్థానం దేశంలో అటువంటి ఎంపిక చేసిన సీటు. ఇక్కడ హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కిషన్‌గంజ్ లోక్‌సభ స్థానం 1957లో సృష్టించబడింది. 1967లో ప్రజా సోషలిస్ట్ పార్టీకి చెందిన ఏకైక హిందూ అభ్యర్థి LL కపూర్ ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. కిషన్‌గంజ్‌లో 68 శాతం మంది ముస్లింలు కాగా, 32 శాతం మంది హిందువులు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఈ సీటుపై కేవలం ముస్లిం అభ్యర్థులనే బరిలోకి దింపుతున్నాయి. ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 119 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో, హైదరాబాద్ చుట్టుపక్కల 9 స్థానాల్లో మాత్రమే ఒవైసీ తన అభ్యర్థులను నిలబెట్టారు. ఈ 9 సీట్లలో ఏడు హైదరాబాద్‌కు చెందినవే. చార్మినార్, బహదూర్‌పురా, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, యాకుత్‌పురా, కార్వాన్, రాజేందర్ నగర్, జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టింది. వీటిలో చార్మినార్, బహదూర్‌పురా, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, యాకుత్‌పురా, కారవాన్ 7 స్థానాలను ఎఐఎంఐఎం గెలుచుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM)ని మజ్లిస్ అని కూడా అంటారు. ఇది హైదరాబాద్‌లో సామాజిక-మతపరమైన సంస్థగా ప్రారంభమైంది. నవాబ్ మహమూద్ నవాజ్ ఖాన్ 1928లో మజ్లిస్‌ను స్థాపించారు. అతను 1948 వరకు ఈ సంస్థను కొనసాగించాడు. స్వాతంత్య్రానంతరం 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైనప్పుడు భారత ప్రభుత్వం దానిని నిషేధించింది. అప్పటి రాష్ట్రపతి ఖాసిం రజ్వీని అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రజ్వీ పాకిస్థాన్ వెళ్లాడు. ఈ సంస్థ బాధ్యతలను అప్పటి ప్రముఖ న్యాయవాది అబ్దుల్ వహాద్ ఒవైసీకి అప్పగించారు. అబ్దుల్ వహాద్ ఒవైసీ ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి తాత. 1957లో అబ్దుల్ వహాద్ ఒవైసీ మజ్లిస్‌ను రాజకీయ పార్టీగా చేసి దాని పేరుకు ‘ఆల్ ఇండియా’ని చేర్చారు. 1976లో అబ్దుల్ వహాద్ ఒవైసీ కుమారుడు సలావుద్దీన్ ఒవైసీకి పార్టీ బాధ్యతలు అప్పగించారు. 2004 వరకు వరుసగా ఆరు సార్లు హైదరాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు సలావుద్దీన్ ఒవైసీ తనయుడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ.
*ఫ్లోర్ టెస్ట్‌లో సైనీ సర్కార్ విజయం
హర్యానా అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం విజయం సాధించింది. మంగళవారం అనూహ్యంగా సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. అనంతరం కొన్ని గంటల్లోనే నయాబ్ సింగ్ సైనీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనీ చేత ప్రమాణం చేయించారు. తిరిగి మరికొన్ని గంటల్లోనే హర్యానా శాసనసభలో నయాబ్ సింగ్ సైనీ విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. ఈ ఫోర్ట్ టెస్టులో సైనీ సర్కార్ విక్టరీ సాధించింది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మెజారిటీ మార్క్‌కు 46 మంది ఎమ్మెల్యేల అవసరం. JJPకి 10, INLDకి 1, కాంగ్రెస్‌కు 30, ఇండిపెండెంట్‌కి 7, HLPకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ విశ్వాస పరీక్షలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా కూడా మద్దతు తెలిపినట్లుగా తెలుస్తోంది. తాను సామాన్యమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చానని.. మా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని సైనీ తెలిపారు. తాను కేవలం బీజేపీ పార్టీ కార్యకర్త మాత్రమేనని.. కానీ ఈ రోజు తనకు ఇంత పెద్ద అవకాశం లభించిందన్నారు. ఇలాంటి అవకాశం బీజేపీ పార్టీలో మాత్రమే సాధ్యమవుతుందని అసెంబ్లీలో సైనీ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గుర్తుచేశారు. అలాగే ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో కూడా ఖట్టర్ సలహాల మేరకు ముందుకు సాగుతానని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు కొన్ని వర్గాల ఓట్లు కొల్లగొట్టేందుకే హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను మార్చి సైనీకి బాధ్యతలు అప్పగించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా స్థానాలు సాధిస్తుందని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే బుధవారం బీజేపీ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాలో దాదాపుగా 90 మంది అభ్యర్థులను ప్రకటించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
*వరల్డ్‌లో బెస్ట్ ఫుడ్‌గా వడాపావ్.. దీని స్పెషల్ ఇదే!
‘వడాపావ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్స్ లో చాలా ఫేమస్. ముంబై, మహారాష్ట్రలకు ఎక్కువగా గుర్తింపు పొందిన ఈ స్నాక్ నెమ్మనెమ్మదిగా ఇండియా మొత్తం విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచంలోని ఫుడ్ లవర్స్‌ను కూడా మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వడాపావ్ అంతర్జాతీయ గుర్తింపును పొందింది. దీనికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యుత్తమ శాండ్‌విచ్‌లలో ఒకటిగా నిలిచింది. ‘టేస్ట్ అట్లాస్’ ప్రపంచంలో అత్యుత్తమ శాండ్‌విచ్‌లతో ఓ జాబితా రూపొందించింది. దీంట్లో వడాపావ్ 19వ స్థానంలో నిలిచింది. టేస్ట్ అట్లాస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో 50 విజేత శాండ్‌విచ్‌ల జాబితాను పోస్ట్ చేసింది. ఇది ప్రపంచంలోని 50 అత్యుత్తమ శాండ్‌విచ్‌ల జాబితాకు సంబంధించి లింక్ షేర్ చేసింది. వడాపావ్ గురించి మాట్లాడితే.. ఈ ఐకానికి స్ట్రీట్ ఫుడ్ ముందుగా ముంబై దాదార్ రైల్వే స్టేషన్‌లో అశోక్ వైద్య అనే వీధి వ్యాపారి నుంచి ఉద్భవించింది. ఆకలితో ఉన్న కార్మికులకు తక్కువ ధరతో, ఎక్కవ శక్తినిచ్చే వంటకాన్ని సులభంగా తయారుచేయాలని అనుకున్న సమయంలో ఈ వడాపావ్ తయారు చేశారు. ఆ తర్వాత ముంబై వ్యాప్తంగా వడాపావ్ విస్తరించి.. ఇప్పుడు దేశం, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఒక మృదువైన బన్ (పావ్). లోపల క్రిస్పీ బంగాళాదుంప ప్యాటీ (వడ)తో తయారు చేయబడిన సరళమైన.. సువాసనగల వంటకం. స్పైసీ, టాంగీ, క్రీము సాస్‌లు రుచిని జోడిస్తాయి. వడ పావ్‌ను భారతదేశంలోని అన్ని వయసుల వారు తినే సరసమైన అల్పాహారం. ఇది పూర్తిగా శాకాహార వంటకం. ఉడకబెట్టి.. ముద్ద చేసిన బంగాళాదుంపను పిండిలో కూరి వేయించి వడా తయారు చేస్తారు. సగానికి చీల్చిన పావ్ లోపల ఆ వేయించిన వడను పెట్టి వడాపావ్ తయారు చేస్తారు. దీనిలో నంజుకోడానికి ఒకటి రెండు రకాల పచ్చళ్ళు, పచ్చి మిరపకాయ ఇస్తారు. ఇది ముంబైలో సరసమైన స్ట్రీట్ ఫుడ్‌గా ఉద్భవించినప్పటికీ.. ఇప్పుడు భారతదేశమంతటా ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లలో లభిస్తోంది. దీనిని బాంబే బర్గర్‌గా కూడా పిలుస్తుంటారు. ఇలాంటిది ప్రపంచ గుర్తింపు తెచ్చుకుంది.
*ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే వరలక్ష్మీకి షాక్… ఆ కేసులో అరెస్ట్ తప్పదా..?
నటుడు శరత్‌కుమార్ అకస్మాత్తుగా తన పాలిటికల్ పార్టీని బిజెపిలో ఎందుకు విలీనం చేశారు? అని రాజకీయ వర్గాలు చురుగ్గా విశ్లేషిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోనని, మతతత్వ రాజకీయాలకు ఎప్పటికీ మద్దతివ్వబోనని చెబుతూ వచ్చిన శరత్‌కుమార్ గత కొన్ని నెలలుగా బీజేపీతో పొత్తుపై చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇటీవల ఆయనతో సమావేశమై.. పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీతో పొత్తు ఖాయమైందని ప్రకటించారు. మరోపక్క ఆ వార్తలు మరువక ముందే మరికొద్ది రోజుల్లో తన సమత్వ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేసినట్లు ప్రకటించారు. దీనిపై శరత్‌కుమార్ వివరణ ఇస్తూ.. పార్టీ కార్యవర్గంతో చర్చించి దేశాభివృద్ధికి, భావి యువతకు మేలు జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నామని అంటూనే ప్రధాని మోదీ పాలనపై కూడా ప్రశంసలు కురిపించారు. అయితే దీని వెనుక వేరే కారణం ఉందనే వాదన వినిపిస్తోంది. శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ఎన్‌ఐఏ నోటీసులు పంపింది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్ మాజీ అసిస్టెంట్ ఆదిలింగం అరెస్టయ్యాడు. అతనికి డ్రగ్స్, ఆయుధాల సరఫరాలో అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికర్లతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఆదిలింగం నుంచి రూ.300 కేజీల హెరాయిన్, ఏకే 47 రైఫిల్, 9 ఎంఎం తుపాకులు, రూ.2,100 కోట్ల విలువైన మందు గుండు సామగ్రిని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదిలింగం సినీ పరిశ్రమలో పెట్టుబడిగా పెడుతున్నారని గుర్తించారు. అందుకే ఆదిలింగం గతంలో పీఏగా పనిచేసిన నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ను కూడా విచారించాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది. ఈ విచారణకు వరలక్ష్మి శరత్‌కుమార్‌కు కూడా సమన్లు అందాయని, ఎన్‌ఐఏ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని ఆమె కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నటుడు శరత్‌కుమార్ తన పార్టీని బీజేపీలో విలీనం చేశారని అంటున్నారు. ఈ విషయంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు చిక్కులు వచ్చే అవకాశం ఉందని భావించి శరత్‌కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి.. తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బి ఎల్, క్రాక్, నాంది, వీర సింహారెడ్డి, హనుమాన్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించగా తమిళ్ ఇండస్ట్రీలో కూడా నటిగా సత్తా చాటుతోంది. ఆమె ఈ మధ్యనే రీసెంట్గా ఆమె ఎంగేజ్మెంట్ జరగగా త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న క్రమంలో వరలక్ష్మికి ఇలా నోటీసులు అందడం హాట్ టాపిక్ అవుతోంది. కేసులో ఆమె పాత్ర ఉందని తెలిస్తే ఆమె అరెస్ట్ కి కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ విలీనం జరిగిందని అంటున్నారు.
