NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త సబ్ డిస్ట్రిక్టుల ఏర్పాటు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త సబ్ డిస్ట్రిక్టులను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రీ-సర్వే అనంతరం పాలనా పరమైన వెసులుబాట్లు నిమిత్తం సబ్ డిస్ట్రిక్టులు ఏర్పాటు చేశారు.. పాలనా, పౌర సేవలు అందించంటంలో భాగంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగంగా జరిగేలా చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఈ నిర్ణయానికి వచ్చింది.. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో కొత్త సబ్ డిస్ట్రిక్టులను ఏర్పాటు చేశారు.. ఇక, పార్వతీపురం మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో కొత్త సబ్ డిస్ట్రిక్టుల నోటిఫికేషన్ జారీ చేశారు.. విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్టులు ఏర్పాటు చేయగా.. కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ డిస్ట్రిక్టులలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నట్టు వెల్లడించారు. కొత్త సబ్ డిస్ట్రిక్టులలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం.. ఏపీ సర్కార్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న గ్రామాలు ఇక నుంచి కొత్త సబ్ డిస్ట్రిక్టుల పరిధిలోకి వస్తాయని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.. రిజిస్ట్రేషన్ల సేవల కోసం గ్రామ సచివాలయాల పరిధిని ఫిక్స్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.. తక్షణమే ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మా సోదరుడే.. స్పష్టం చేసిన మాజీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల హీట్‌ కనిపిస్తోంది.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. మరోవైపు.. అభ్యర్థులు ఎవరు అనేదానిపై కూడా కొంత క్లారిటీ వస్తుంది.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడిన ఎమ్మెల్యేలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. పనితీరు మెరుగుపర్చుకోకపోతే నో సీటు అని స్పష్టం చేశారు.. ఇక, నెల్లూరు జిల్లా రాజకీయాలు కాకరేపుతుండగా.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జరిగిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్తగా తన సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు మేకపాటి రాజమోహన్‌రెడ్డి.. ఇక, మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది, త్వరలోనే ప్రకటన కూడా వస్తుందన్న ఆయన.. జలదంకి నుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాజగోపాల్ రెడ్డి త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. మరోవైపు.. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా.. త్వరలోనే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తా.. ఉదయగిరి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలకు అండగా ఉంటానని వెల్లడించారు.

పవన్‌ వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్‌ లేదు.. ఎమ్మెల్యే కాకుండా సీఎం ఎలా..?
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు.. ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు.. ఇక, పవన్‌ కల్యాణ్‌ ఈ సారి ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తాడో ముందుగా చెప్పాలని సెటైర్లు వేశారు.. ముఖ్యమంత్రి కావాలంటే 88 మంది ఎమ్మెల్యేలు గెలవాలి.. అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయలేనప్పుడు సీఎం ఎలా అవుతాడు? అని ప్రశ్నించారు. ఏదో కార్యకర్తలను ఉత్సాహ పరచడానికే సీఎం అవుతానని ఆయనే చెప్పుకుంటున్నారని.. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యల వెనుక సీరియస్‌నెస్‌ లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ మాటలకు చేతులకు పొంతన ఉండదు.. నిలకడ లేని నేత పవన్ అని దుయ్యబట్టారు మంత్రి అప్పలరాజు.. అసలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రహిత ఆంద్రప్రదేశ్ ఎందుకు చేయాలో పవన్ చెప్పాలని డిమాండ్‌ చేశారు.. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకా? గతంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి సాగుతున్నందుకా? చరిత్రలో నిలిచిపోయేలా పథకాలు అమలు చేస్తున్నందుకా? ఎందుకు వైసీపీ రహిత ఏపీ చేయాలో చెప్పాలంటూ మండిపడ్డారు. చంద్రబాబుకి వంత పాడటమే పవన్ చేసిన మొదటి తప్పగా పేర్కొన్నారు.. చంద్రబాబు వెనుక వెళ్లే ముఖ్యమంత్రి కాదు కదా.. ఎమ్మెల్యే కూడా కాలేడు అని జోస్యం చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ని తిట్టడమే పవన్‌ కల్యాణ్‌ అజెండా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.

ఆ అర్హత లేదంటూ.. మంత్రి ప్రశాంత్ రెడ్డిపై మాజీ విప్ ఈరవత్రి ఫైర్
తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై మాజీ విప్ ఈరవత్రి అనిల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పీసీసీపై మాట్లాడే నైతిక అర్హత ప్రశాంత్‌కు లేదని ధ్వజమెత్తారు. ప్రశాంత్ రెడ్డికి మంత్రి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ పదవులు రావడానికి కారణం.. కేసీఆర్‌కి మందు, సోడా పోయడం వల్లేనని ఆరోపించారు. బాల్కొండ ప్రజలు ప్రశాంత్ రెడ్డిని కేసీఆర్‌కి పెద్ద జీతగాడు అని కామెంట్లు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉండి, ప్రశాంత్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టారో కూడా ప్రశాంత్ రెడ్డికి తెలియదని దుయ్యబట్టారు. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. చివరికి అమరవీరుల స్థూపంలోనూ భారీ అవినీతి జరిగిందని ఈరవత్రి అనిల్ ఆరోపణలు చేశారు. అమరవీరుల స్థూపంలో అవినీతి విషయంపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. అందులో అవినీతి జరిగిందని తాము నిరూపిస్తామని ఛాలెంజ్ చేశారు. ఆ స్థూపం నిర్మాణంలో అవినీతి జరగడం వల్ల.. అమరవీరుల ఆత్మగౌష విలపిస్తోందని చెప్పారు. తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. అమరవీరుల స్థూపంపై విచారణ జరిపిస్తామన్నారు. అవినీతిపరుల్ని చర్లపల్లి జైలుకు పంపించి, అక్కడ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామన్నారు. బాల్కొండ నియోజకవర్గ యువతకి గంజాయి అలవాటు కూడా చేస్తున్నారంటూ ఈరవత్రి అనిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

హిమాచల్‌, జార్ఖండ్, యూపీలోకి రుతుపవనాలు ప్రవేశం.. భారీ వర్షసూచన
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్‌తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రోజంతా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈ సమయంలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దీంతో పాటు రానున్న మూడు రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 28 నాటికి రుతుపవనాలు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోకి ప్రవేశిస్తాయని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం యూపీలో రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని అనేక నగరాల్లో గత కొన్ని గంటలుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా ప్రజలు తేమతో కూడిన వేడి నుంచి ఉపశమనం పొందారు. వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు ఉత్తరాఖండ్‌లో ఒకటి లేదా రెండు రోజుల్లో ఎప్పుడైనా తాకవచ్చు.

మీరు తప్పు ఖాతాకు డబ్బులు పంపారా.. SBI ఏం చెబుతోంది
ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో డబ్బు లావాదేవీల ట్రెండ్ చాలా వేగంగా పెరిగింది. దీనివల్ల ప్రజలకు సౌకర్యాలు బాగా పెరిగాయి. అలాగే చాలా సార్లు పొరపాటున ప్రజలు తమ డబ్బును మరొక ఖాతాకు బదిలీ చేయడం కూడా జరుగుతోంది. అయితే, తప్పుడు ఖాతాకు డబ్బును బదిలీ చేసిన తర్వాత, మన మదిలో మెదిలే పెద్ద ప్రశ్న.. మన డబ్బు తిరిగి వస్తుందా అని… ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ విషయంలో కస్టమర్లకు సలహా ఇచ్చింది. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారుడు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు. అనంతరం ఎస్‌బీఐ అధికారిక ట్విటర్‌లో దీనిపై ఫిర్యాదు చేశాడు. SBIని ట్యాగ్ చేస్తూ.. TheOfficialSBI నేను పొరపాటున నా డబ్బును తప్పు ఖాతా నంబర్‌కు పంపాను అని కస్టమర్ రాశారు. హెల్ప్‌లైన్ ద్వారా చెప్పబడిన వివరాలన్నీ నా శాఖకు ఇచ్చాను. ఇప్పటికీ నా శాఖ రివర్సల్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.

పెళ్లికి ముందు కాబోయేవారిని ముఖ్యంగా అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే?
భారతీయ సంప్రదాయాల్లో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఒక వ్యక్తితో ఒకేసారి పెళ్లి జరుగుతుంది.. ఇది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. నా ఇష్టం నా పెళ్లి అంటున్నారు జనాలు. పెళ్లి ఎన్ని సార్లు ఎంతమందితో చేసుకున్నా కూడా పెళ్లికి ముందు తమకు కాబోయేవారి గురించి తప్పక తెలుసుకోవాలని అంటున్నారు.. అప్పుడే ఎటువంటి గొడవలు పెళ్లి తర్వాత రావని పెద్దలు అంటున్నారు.. మరి పెళ్లికి ముందే తమ కాబోయే వారిని ఎటువంటి ప్రశ్నలు అడగాలో, ఎటువంటి ప్రశ్నలు అడగ కూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా, పెద్దలు కుదర్చిన పెళ్లి అయిన తమ పార్ట్నర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను అడిగి తెలుసుకోవాలి.. పెళ్లికి ముందే ఇద్దరి మధ్య ఉండే కమ్యూనికేషన్ మంచిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ బాధ్యత ఇద్దరిపై ఉంటుంది. కమ్యూనికేషన్ బాగుంటే చిన్న చిన్న వివాదాలు రేకెత్తినా వెంటనే సర్దుకుంటాయి. బంధం నిలబడాలి అంటే పునాది పటిష్ఠంగా ఉండాలి. ఆర్థిక స్థితిగతులతోపాటు పొదుపు గురించి, లేదంటే డబ్బు ఖర్చు గురించి మొత్తం విషయాలు మాట్లాడుకోవాలి.ఇద్దరు సంపాదించిన కూడా సరిపోదు.. ఖర్చులు అలా అవుతున్నాయి.. అలాగే ఫుడ్ విషయాల్లో కూడా ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి.. భవిష్యత్ లో కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఇద్దరూ ముందే మాట్లాడుకోవాలి. కెరీర్ కి సంబంధించి, భవిష్యత్ లక్ష్యాల గురించి ఒకర్నొకరు పంచుకోవాలి. ప్లానింగ్ ఎలా ఉంటుంది? ఎలా అమలు చేయాలి? తదితర విషయాలను చర్చించుకోవాలి. పెళ్లికి ముందు బ్రేకప్స్ ఉంటే ముందే చెప్పుకోవాలి. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?.. అలాగే ఖాళీ సమయం ఎక్కువ ఏం చేస్తారు..హాబీల గురించి కూడా మాట్లాడుకోవాలి. అంతేకాదు.. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే మాట్లాడుకోవాలి.. వెయ్యి అబద్దాలు ఆడి పెళ్లి చెయ్యమన్నారు.. కానీ ఒకప్పుడు ఆ పప్పులు ఉడికేవి.. ఇప్పుడు అలా కాదు తేడా జరిగితే డివోర్స్ అంటున్నారు.. ఇది గుర్తుంచుకోండి.. పెళ్లికి ముందే ఇవి క్లియర్ చేసుకోవడం మంచిది..

నన్ను డ్రగ్స్ తీసుకోమ్మని ఆఫర్ చేశారు.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు
చాలా సార్లు తనని డ్రగ్స్ తీసుకోమ్మని ఆఫర్ చేశారని, కానీ తాను తీసుకోలేదని యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ దుర్వినియోగం & డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఓ కార్యక్రమం నిర్వహించింది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనపై ప్రచారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిఖిల్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కి అందరూ దూరంగా ఉండాలని సూచించాడు. నార్కోటిక్స్‌కి అలవాటు పడితే, అదే డెత్ సెంటన్స్ అని హెచ్చరించాడు. స్టూడెంట్స్‌కు అందమైన జీవితం ఉందని, ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, కానీ డ్రగ్స్‌కి మాత్రం నో చెప్పండని సలహా ఇచ్చాడు. పార్టీస్‌కి వెళ్లినా, అక్కడ డ్రగ్స్ మాత్రం తీసుకోవద్దన్నాడు. కొందరు చేస్తున్న తప్పిదం వల్ల సినిమా ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని, దాని కారణంగా కొందరు నిందితులుగా మారుతుందే, మరికొందరు బాధితులుగా మిగులుతున్నారని చెప్పాడు. ఇలాంటి పరిణామాలు సమాజానికి మంచిది కాదన్నాడు. త్వరలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ అవ్వాలని తాను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

కొత్త హీరో… కొత్త కథ… కొత్త టీజర్
నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసులుగా ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య మూడున్నర దశాబ్దాలుగా TFIకి మెయిన్ పిల్లర్స్ లో ఒకడిగా ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ మనవడిగా టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నందమూరి వంశానికి సరైన వారసుడిగా, నందమూరి అనే ఇంటి పేరుతో పాటు తాత తారకరామారావు పేరుని కూడా పాన్ వరల్డ్ వరకూ తీసుకోని వెళ్లాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని కూడా ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడిప్పుడే ఫ్లాప్స్ నుంచి బయటకి వచ్చి మినిమం గ్యారెంటీ సినిమాలని చేస్తున్నాడు. బింబిసార సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ‘డెవిల్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇలా ముగ్గురు హీరోలు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో లాంచ్ అవుతున్నాడు. నందమూరి జయకృష్ణ కొడుకు అయిన నందమూరి చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బసవ తారకరామా క్రియేషన్స్ పేరుతో సొంత బ్యానర్ ని స్థాపించి చైతన్య కృష్ణ హీరోగా డెబ్యు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గతేడాది మే నెలలో చైతన్య కృష్ణ హీరోగా వంశీ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. బాలయ్య లాంచ్ చేసిన ఈ మూవీకి బ్రీత్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ని మేకర్స్ లాంచ్ చేసారు. ఇంటెన్స్ మెడికల్ మాఫియా డ్రామాగా బ్రీత్ సినిమా రూపొందుతున్నట్లు ఉంది. మేకింగ్ చాలా బాగుంది, మార్క్ రాబిన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెస్ చేసింది. కథ ఏంటి అనే విషయంలో ఎలాంటి హింట్ ఇవ్వకుండా బ్రీత్ టీజర్ ని కట్ చేసిన విధానం బాగుంది. మరి నందమూరి కుటుంబం నుంచి వస్తున్న ఈ కొత్త హీరో ఎంతవరకూ ప్రేక్షకులని మెప్పిస్తాడు అనేది చూడాలి.

నటుడి ఇంట తీవ్ర విషాదం.. హార్ట్ ఎటాక్ తో సోదరి మృతదేహం మీదనే కన్నుమూత!
ఈ మధ్య కాలంలో ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకుండానే గుండె ఆగిపోయి యుక్త వయసు వారు కూడా ప్రాణాలు కోల్పోతుండటం అందరినీ టెన్షన్ పెడుతోంది. పదేళ్ళ బాలుడు కూడా ఈ మహమ్మారికి బలయ్యాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ గుండె పోటు తమిళ నటుడి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ఇంకెవరో కాదు తమిళ నటుడు బోస్ వెంకట్. తమిళ సినిమాలు, సీరియల్స్‌లో ప్రముఖ నటుడుగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వ్యవహరిస్తున్న ఆయన ఈ మధ్యనే సినిమా దర్శకుడిగా మారారు. 2020లో ఆయన చేసిన తొలి చిత్రం ‘కన్నీ మాదం’ మంచి టాక్ కూడా తెచ్చుకుంది. ఇక ‘మెట్టి ఓలి’ సీరియల్ ద్వారా బ్రేక్‌ సంపాదించిన బోస్ ఇప్పుడు తమిళ బుల్లితెర నటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే నిన్న, బోస్ వెంకట్ సోదరి వలర్మతి చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఈ క్రమంలో వారి కుటుంబం శోకసంద్రంలో ఉండగా, తన సోదరి మరణాన్ని చూసి తట్టుకోలేక వెంకట్ సోదరుడు రంగనాథన్ కూడా గుండెపోటుకు గురయ్యాడు. ఆ వెంటనే ఆమె మృతదేహంపై కుప్పకూలి మరణించాడు. తమ సోదరి అంత్యక్రియల సమయంలో రంగనాథన్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న సమయంలో ఇది జరిగిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఇక వీరి అంత్యక్రియలు అరంతంగిలో నిర్వహించనున్నట్లు సమాచారం. రెండు వరుస మరణాలు బోస్ వెంకట్ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తాయి. ఈ ఘటన తమిళ సినీ, టీవీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ వర్గాల వారు బోస్ వెంకట్ అభిమానులు ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.