NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రాత్రికే ఏపీకి అమిత్‌షా.. చంద్రబాబుతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సిద్ధం అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. కొత్త రికార్డు సృష్టించబోతున్నారు.. అయితే, ఈ రోజు రాత్రికే విజయవాడ చేరుకోబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. రాత్రి 10:20 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు.. దాదాపు గంట పాటు చర్చల అనంతరం రాత్రికి 11:20కి నోవోటెల్ కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు అమిత్ షా.. ఇక, రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే, రేపు ప్రమాణస్వీకారం అయితే, ఈ రోజు చంద్రబాబుతో అమిత్‌షా భేటీ ఏంటంటే..? కేబినెట్‌ కూర్పు.. కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా చేరేది ఎవరు? జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి రోల్‌ ఉండనుంది.. బీజేపీ పాత్ర ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు కాన్వాయ్‌ వెంట మహిళ పరుగులు.. కారు ఆపి ఆయన ఏం చేశారంటే..?
ఈ రోజు ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి తిరుగు ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి.. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ.. చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది. తనను చూసి ఎమోషనల్‌ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు.. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి.. మా కోరిక మేరకు మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది సదరు మహిళ.. ఒక్క సారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా.. చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడాలని వచ్చాను అని నందిని చెప్పగా.. ముందు ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని.. అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సిద్ధం అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రేపు గన్నవరం ఐటీ పార్క్‌ దగ్గర.. నాల్గో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. ఇక, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తుది దశకు చేరుకున్నాయి ఏర్పాట్లు.. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనేతలు హాజరుకానున్నారు.. రేపు ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు విజయవాడలో ఉండనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. వీఐపీల తాకిడి నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టారు అధికారులు.. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ నీరభ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్, డీజీపీతో నిన్నే సమీక్ష జరిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక, వీఐపీల కోసం నాలుగు గ్యాలరీలు, ప్రజల కోసం ఒక గ్యాలరి మొత్తం 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు.. జాతీయ రహదారి పక్కనే ఉన్న కేశరపల్లిలో కార్యక్రమం కావటంతో హైవే పై ఆంక్షలు విధించారు పోలీసులు.. ఇవాళ్లి సాయంత్రం నుంచే ట్రాఫిక్ మళ్లింపులు, ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.. మరోవైపు.. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి 2 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు.. సభా ప్రాంగణంలో ఎక్కడ ఉన్నా.. సభా వేదికపై జరిగే కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా భారీ LED తెరలు ఏర్పాటు చేశారు.. పారిశుధ్యం, భద్రత, బారికేడింగ్, వైద్య శిబిరాలు, మజ్జిగ, తాగునీరు, భోజనం వంటి ఏర్పాట్లను చేస్తున్నారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో.. 7 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఈఏపీసెట్-2024 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్తో మీ రిజల్ట్స్ తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఫలితాలు రిలీజ్ చేశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియట్‌ వెయిటేజీ మార్కులు రెండింటి ఆధారంగా తుది ర్యాంకులు ప్రకటిస్తారు. అయితే, ఈ ఏడాది ఈఏపీసెట్‌ 2024 పరీక్షను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా మే 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈఏపీసెట్‌ పరీక్షలు జరిగాయి. మొత్తం 3, 62, 851 మంది స్టూడెంట్స్ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే, ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది విద్యార్థులు, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80, 766 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాశారు. ఇంజనీరింగ్ లో 1,95,092 మంది విద్యార్ధులు అర్హత సాధించారు. మొత్తం 75.51 % ఉత్తీర్ణత పొందారు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లో 70,352 మంది విద్యార్ధులు అర్హత సాధించగా.. 87.11% ఉత్తీర్ణతులయ్యారు. ఇక, ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఒక్క క్లిక్ తో తమ ఫలితాలను https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు అని ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది.

తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..
తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు రిజల్ట్స్ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజీ వర్సిటీ ఇంఛార్జి విసి నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం టీజీ ఎడ్‌సెట్‌(TGEDSET) పరీక్షను మే 23న నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 29, 463 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా.. ఈసారి ఎడ్‌సెట్‌ పరీక్షలను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ నిర్వహించింది. రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో మొత్తం 14, 285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

కాంగ్రెస్, శరద్ పవార్‌పై విమర్శలు.. ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ ప్రశంసలు..
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న మహారాష్ట్రలో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. మొత్తం 48 ఎంపీ స్థానాల్లో బీజేపీ కేవలం 09 స్థానాలు, దాని మిత్రపక్షాలైన శివసేన(షిండే) 07, ఎన్సీపీ(అజిత్ పవార్) 01 స్థానాలను మాత్రమే సాధించాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఇండియా కూటమి ఏకంగా ఏకంగా 30 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్ 13, ఎన్సీపీ(శరద్ పవార్) 08, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) 09 స్థానాల్లో గెలిచారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై ఇండియా కూటమి పైచేయి సాధించింది. ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ ఠాక్రే ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, మిత్రపక్షాలైన కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీలే ఎక్కువగా లాభపడ్డాయని, శివసేన అనుకున్న సీట్లను సాధించలేదని బీజేపీ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ మంగళవారం అన్నారు. ఠాక్రే ఆరోగ్యం బాగా లేకుండాన్న గట్టిగా ప్రచారం చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఠాక్రే పార్టీ 21 సీట్లలో పోటీ చేస్తే 09 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి 13 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ 10 స్థానాల్లో పోటీ చేసి 08 స్థానాల్లో గెలిచింది.

ఈనెల 24 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఎన్నిక!
ఈనెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజుల పాటు ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది. 24, 25 తేదీల్లో ఎంపీలంతా ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే కొత్త స్పీకర్ ఎంపిక జరిగేంత వరకు ప్రొటెం స్పీకర్ ఉండనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్‌ను నియమించనున్నారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఎంపీలంతా ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఈనెల 26న కొత్త స్పీకర్ ఎంపిక జరగనుంది. అటు తర్వాత సమావేశాలు జూలై 3 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే లోక్‌సభ స్పీకర్ పోస్టుపై ఎన్డీఏ కూటమిలో గట్టి పోటీ నెలకొంది. ఈ పోస్టుపై జేడీయూ కన్నేసింది. స్పీకర్ పోస్టు తమకు ఇవ్వాలంటూ నితీష్ కుమార్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అదే బాటలో తెలుగు దేశం అధినేత చంద్రబాబు కూడా ఉన్నట్లు సమాచారం. స్పీకర్ పోస్టు టీడీపీకి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే స్పీకర్ పోస్టు మాత్రం తమ దగ్గరే ఉంచుకోవాలని బీజేపీ కూడా భావిస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్యంతో మోడీ సర్కార్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ స్పీకర్ పోస్టు ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

మలావీ వైస్ ప్రెసిడెంట్‌తో సహా 9 మంది మృతి
మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మలావి అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మీడియాకు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం దట్టమైన అడవిలో కూలిపోయిందని.. ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పేర్కొన్నారు. ఈ విషాదకర వార్త తెలియజేయడానికి బాధపడుతున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడు చిలిమా(51) సహా మరో తొమ్మిది మంది సైనిక విమానంలో ప్రయాణిస్తుండగా సోమవారం అదృశ్యమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తర నగరమైన జుజులో ల్యాండ్ కావడం విఫలమైంది. దీంతో రాజధాని లిలాంగ్వేకి తిరిగి రావాలని సందేశం అందింది. కానీ తిరిగి రాకుండానే దట్టమైన అటవీ ప్రాంతంలో అదృశ్యమైంది. దీంతో అప్పట్నుంచి జల్లెడ పట్టగా.. మంగళవారం దట్టమైన అడవిలో విమానం జాడను కనుగొన్నారు. తిరిగి క్షేమంగా రావాలని అందరూ ప్రార్థించారు. కానీ చివరికి విషాదంగా ప్రయాణం ముగిసింది.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న యూట్యూబర్.. కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు
టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా.. భారత్ – పాకిస్థాన్‌ మ్యాచ్ ఈ నెల 9న న్యూయార్క్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత పాక్ అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హృదయ విదారక వార్త బయటకు వచ్చింది. పాకిస్థాన్ లోని కరాచీలో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు ఒక యూట్యూబర్‌ను కాల్చాడు.

దర్శకుడితో ప్రేమలో హీరోయిన్.. ఎట్టకేలకు ఓపెన్ అయిపొయింది!
నటి అమ్ము అభిరామి టీవీ సెలబ్రిటీ విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అతని అభిమానులకు తన ప్రేమను తెలియజేస్తూ క్యాప్షన్‌ను పోస్ట్ చేసింది. దీంతో ఆమె తన సీక్రెట్ లవ్ ను బయట పెట్టిందని చెబుతూ ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తలపతి విజయ్ – కీర్తి సురేష్ జంటగా నటించిన ‘భైరవ సినిమాలో అమ్ము అభిరామి, జనంతో వచ్చి వెళ్లే మెడికల్ కాలేజీ విద్యార్థిని పాత్రలో నటించింది. మెల్లమెల్లగా తనని నిలబెట్టే పాత్రలను ఎంచుకుంటూ నటించడం మొదలు పెట్టి నటుడు కార్తీ నటించిన సూపర్ హిట్ మూవీ ‘తీరన్ అకాహమీర్ ఉడు’లో కార్తీకి చెల్లెలుగా నటించి అభిమానులను ఆకట్టుకుంది. ఆ తరువాత ‘రాక్షసన్‌’ సినిమాలో అమ్ము అభిరామి స్కూల్‌ విద్యార్థినిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ‘అసురన్’లో ధనుష్ మాజీ ప్రియురాలు.. మరియమ్మ పాత్ర పోషించింది. అమ్ము అభిరామికి ఈ సినిమా పెద్ద సక్సెస్. కుక్ విత్ కోమలి షో ద్వారా అమ్ము అభిరామి వెండితెరపైనే కాకుండా స్మాల్ స్క్రీన్ అభిమానులకు కూడా ఫేమస్. కుక్ విత్ కోమలి షోలో దర్శకుడు పార్తీబన్ మణితో ప్రేమలో ఉన్నానని ఇదివరకే చెప్పగా, ఇప్పుడు.. మణి బర్త్ డే సందర్బంగా ఆ సమాచారాన్ని కన్ఫర్మ్ చేసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు, పుట్టినందుకు ధన్యవాదాలు, జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు అని ఆమె కామెంట్ చేసింది. ఇక దీని ద్వారా అమ్ము అభిరామి తన రహస్య ప్రేమను బయటపెట్టింది. మణితో దిగిన కొన్ని ఫొటోలను కూడా అమ్ము అభిరామి షేర్ చేయడం గమనార్హం.