NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

లేపాక్షిలో ఉత్సవాలను మళ్లీ ప్రారంభిస్తాం.. అభివృద్ధి చేసి చూపిస్తాం..
లేపాక్షిలో ఉత్సవాలను మళ్లీ పునః ప్రారంభిస్తాం… అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ.. వరుసగా మూడోసారి గెలిచి హిందూపురంలో హ్యాట్రిక్‌ కొట్టిన బాలయ్య.. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలోని తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడోసారి ముచ్చటగా గెలిపించినందుకు హిందూపురం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, గత ప్రభుత్వ హయాంలో రోడ్లు దెబ్బతింటే గోతులు పడినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అని విమర్శించారు.. రవాణా వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుపడుతుందని గతంలో స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చెప్పి చేసి చూపించారని గుర్తు చేశారు.. ఏ ఉద్యమం చేసిన ప్రజల్లోంచి స్పందన రావాలి.. మేం చేసిన ఉద్యమానికి ప్రజలు తోడయ్యారని తెలిపారు.. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.. ఎదురు తిరిగిన వారి పైన ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం.. హత్యలు చేయడం, మానసికంగా శోభకు గురి చేయటం చేశారని ఆరోపించారు. ప్రజల నుంచి స్పందన నిశ్శబ్ద సునామీ లాగా వచ్చింది.. రాష్ట్రం నలుమూలల నుంచి అలలు ఎగిరినట్టు ప్రజలు భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించారు.. నాకు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో టీడీపీ కూటమిని గెలిపించారు. మూడోసారి ముచ్చటగా గెలిపించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు.. ఇక, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం అన్నారు నందమూరి బాలకృష్ణ.

పేర్ని నాని, కొడాలి నానిపై టీడీపీ కౌంటర్‌ ఎటాక్‌.. అంతా మీ వల్లే..!
మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ, జనసేన నేతలు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు టీడీపీ సీనియర్ నేత, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ తదితరులు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాడులకు తెగబడే సంస్కృతి పేర్ని నాని, కొడాలి నానిదే అని విమర్శించారు. బందర్‌లో గంజాయి బ్యాచ్‌ని ప్రోత్సహించి దాడులకు పురుకోల్పిందే పేర్ని కిట్టు అనే విషయాన్ని అప్పుడే ప్రజలు మర్చిపోతారా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు తెలుగుదేశం, జనసేన నాయకులు కార్యకర్తలపై దాడులకు తెగబడింది ఎవరో మచిలీపట్నంలో ప్రతి ఒక్కరికి తెలుసు..? మండిపడ్డారు. ఇక, పేర్ని నాని, కొడాలి నానిలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఫైర్‌ అయ్యారు టీడీపీ, జనసేన నేతలు.. దాడులకు తెగబడే సంస్కృతి మాది కాదు.. మీది అనే విషయాన్ని పేర్ని నాని, కొడాలి నాని గుర్తు పెట్టుకుంటే మంచిదనీ హెచ్చరించారు. గత ఐదేళ్లలో మీరు చేసిన అరాచకాలను మీడియా ముఖంగా బయటపెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా ఏ విధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసిన అరాచకాలకు, అక్రమాలకు ప్రజలు చెప్పు దెబ్బలాంటి 50వేల మెజారిటీతో సమాధానం చెప్పిన ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు ప్రజా సమస్యలపై పోరాడుతూ.. కరోనాలో సైతం ప్రజలకు సేవ చేస్తుంటే కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెట్టారో, ఎంత మందిపై దాడులు చేశారో మర్చిపోయారా..!? అని నిలదీశారు. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ శ్రేణులు అక్కస్సుతో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు.. మా కార్యకర్తలపై దాడులకు పాల్పడటమే గాక తమపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

మాజీ మంత్రి బొత్సపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. దీనిపై మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. మేం ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్టు ఏసీబీ ఎస్పీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారని తెలిపారు.. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు. ఉపాధ్యాయుల వద్ద నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకూ.. ఇలా దాదాపు 65 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.. బొత్స హయాంలోం జరిగినంత మోసం ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. ఎన్నికల కోడ్‌ వచ్చాక బదిలీలు చేశారని మండిపడ్డారు. దళారులు, బొత్స పేషీలలో వారిపై 1600 నుంచి 2500 మంది టీచర్లు దాడికి సిద్ధంగా ఉన్నారని వార్నింగ్ ఇచ్చారు.. బొత్స, ఆయన పేషీలో ఘనాపాటీలపై దాడి చేస్తారని తెలుస్తోందన్నారు. ఏసీబీ డీజీ అందుబాటులో లేరు‌.. ఎస్పీ ఉన్నారు.. కంప్లైంట్ ఇచ్చామని.. అంతా శ్రీకృష్ణ జన్మస్ధానంలో కూచుంటారని ఎద్దేవా చేశారు. మీ అవినీతి భాగోతం అంతా బయటకు వస్తుందని హెచ్చరించారు వర్ల రామయ్య.

నా పాత్రను పార్టీ నిర్ణయిస్తుంది
తెలంగాణలోని మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్ తన పాత్ర , బాధ్యతపై పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ , ఆయన మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవం గురించి మీడియాతో మాట్లాడుతూ , “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేడుక ఘనంగా జరిగింది. భారతదేశం వివిధ రాష్ట్రాలు, సంస్కృతులు, కులాలు , మతాలతో సహా అనేక భిన్నత్వంతో కూడిన భారీ దేశం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చే ఐదేళ్లు దేశానికి విజయాన్ని అందిస్తాయి. తెలంగాణ బిజెపి నుండి ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులుగా చేరారు, ఎనిమిది మంది ఎంపీలతో పార్టీ జాతీయ స్థాయిని పెంచిన జి కిషన్ రెడ్డి (సికింద్రాబాద్) మళ్లీ క్యాబినెట్ మంత్రిగా నామినేట్ కాగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర మంత్రిగా అరంగేట్రం చేశారు. మోడీ 3.0 క్యాబినెట్‌లో భాగం కాలేదనే ప్రశ్నకు రాజేందర్ స్పందిస్తూ, “ప్రతి ఎంపీ క్యాబినెట్ మంత్రి కాలేరు కాబట్టి నేను దాని గురించి ఏమీ ఆశించలేదు లేదా కోరుకోలేదు. ఒక్కో రాష్ట్రానికి వేర్వేరు డిమాండ్లు ఉన్నాయి, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రతి సభ్యునికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ నిర్ణయిస్తుందన్నారు.

డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లకు నియామక పత్రాలను అందజేసిన మంత్రి దామోదర రాజనర్సింహ
డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లకు నియామక పత్రాలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారుల పై ఉక్కుపాదంతో అణిచివేయడానికి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాన్ని చేపట్టింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ను బలోపేతానికి చర్యలు చేపట్టామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపికైనా (జోన్ – I నుండి – 5 గురు) జోన్ – II నుండి – 12 మంది) 17 మంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారుల పై ఉక్కుపాదంతో అణిచివేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. నూతనంగా ఎంపికైన 17 మంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు శాఖ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాన్ని చేపట్టిందన్నారు. ఎంతో బాధ్యతగా సమాజ హితం కోసం ఉద్యోగ విధులను నిర్వహించాలని నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశ నిర్దేశం చేశారు.

సోనియాతో బంగ్లాదేశ్ ప్రధాని భేటీ.. ఆత్మీయ ఆలింగనం
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. మోడీ ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందుగానే శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మోడీ ప్రమాణస్వీకారానికి షేక్ హసీనా పాల్గొన్నారు. సోమవారం కూడా ఆమె పర్యటన ఢిల్లీలో కొనసాగుతోంది. భారత్‌ పర్యటనలో భాగంగా షేక్ హసీనా సోమవారం మధ్యాహ్నం… కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను బంగ్లాదేశ్ ప్రధాని ఢిల్లీలో కలిశారు. సోనియా నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా పలకరించారు. అంతేకాదు సోనియా, ప్రియాంక, రాహుల్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం తాజా పరిణామాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే యోగక్షేమాలు గురించి కూడా ఒకరినొకరు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఆదివారం కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. 72 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానాలు గెలుచుకుంది. ఇక బీజేపీ సొంతంగా 240 సీట్లు దక్కించుకుంది. మ్యాజిక్ ఫిగర్ మాత్రం చేరుకోలేకపోయింది. మోడీ ప్రమాణస్వీకారానికి విదేశీ ప్రముఖులు హాజరయ్యారు.

కొత్త ప్లాన్ వచ్చేసింది.. ఇకపై 35 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్!
ఎయిర్‌టెల్‌ నుంచి మరో సరికొత్త ప్లాన్‌ వచ్చేసింది. మిగతా రంగాలకు ధీటుగా కొత్త ప్లాన్‌ను అమల్లోకి తెచ్చింది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. దీని వ్యాలిటిడీ ఏకంగా 35 రోజులు కావడం విశేషం. తన కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్‌టెల్‌ సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఎయిర్‌టెల్‌ 35 వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా ఇప్పుడు రీఛార్జ్‌ ప్లాన్స్‌ వ్యాలిడిటీ ఏవైనా 28 రోజులు మాత్రమే ఉంటున్నాయి. కానీ ఎయిర్‌టెల్‌ దీనికి భిన్నంగా 35 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ ద్వారా తక్కువ ధరతో.. ఎక్కువ వ్యాలిడిటీ ఉండే రీఛార్జ్‌ ప్లాన్స్‌ను పొందుకోవచ్చు.ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన 35 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ధర రూ.289. దీనిలో కస్టమర్లు ఎస్‌ఎంఎస్‌, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్‌ సేవతో వస్తుంది. ఇందులో కస్టమర్లు 4 జీబీ డేటా ప్రయోజనం కూడా పొందుతారు. అంటే ఈ కొత్త రూ. 289 రీఛార్జ్ ప్లాన్ ఎక్కువ డేటాను ఉపయోగించాల్సిన అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఎయిర్‌టెల్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన మరో చౌకైన ప్లాన్ ధర రూ.19. ధర పరంగా ఇది ఎయిర్‌టెల్‌ చౌకైన ప్లాన్. ఎయిర్‌టెల్‌ రూ. 19 టాప్ అప్ ప్లాన్‌లో 1 జీబీ డేటా ఒక రోజు అందుబాటులో ఉంటుంది. తక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమం.

పవన్ కళ్యాణ్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే చాలా మంది సినీరంగానికి చెందినవారు ఈ విషయం మీద మాట్లాడగా తాజాగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి సైతం పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ సేతుపతి నటించిన ‘మహారాజా’ అనే సినిమాఈ నెల 14న తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదలవుతుండడంతో హైదరాబాద్‌లో ప్రెస్‌ మీట్‌లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు పవన్‌ కళ్యాణ్‌ విజయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనకి నా బెస్ట్‌ విషెస్‌, పవన్ కష్టాన్ని గౌరవిస్తా, ఆయన గెలవడం నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు చాలా ట్రోల్స్‌ వచ్చాయని విన్నా, అంతేకాదు ఆయన తొడకొట్టే వీడియో ఒకటి నేను చూశాను. పవన్‌ కళ్యాణ్‌ చాలా మాస్‌, ఆ స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. వేరేవాళ్ల కథలో ఆయన హీరో కాదు, ఆయన కథలో ఆయనే హీరో. మనిషికి అలాంటి మానసిక బలం చాలా అవసరం అని సేతుపతి అన్నారు. నాకు పవన్‌ కళ్యాణ్‌ గురించి ఏమీ తెలియదు కానీ నా వాట్సాప్‌లో కొందరు తెలుగు వ్యక్తులు పెట్టే పవర్‌ స్టార్‌ వీడియోల స్టేటస్‌లు చూసి అసలు ఏమైంది, ఏంటి అని వాళ్లను అడిగా. నిజానికి నాకు అసలు ఏం జరిగిందో తెలియదు. వాళ్లు నాకు చాలా విషయాలు చెప్పారు, పవన్‌ కళ్యాణ్‌ కేవలం సినిమాల్లో మాత్రమే మాస్‌ కాదు, రియల్‌ లైఫ్‌లో కూడా మాస్‌ అని అప్పుడే తెలిసింది. ఎవరైతే ఇలాంటి ట్రోల్స్‌, మీమ్స్‌ ఎదుర్కొని మానసికంగా ధృడంగా ఉండడం మామూలు విషయం కాదని అన్నారు.

తీవ్ర విషాదంలో నందిని రెడ్డి.. ఏమైందంటే?
తెలుగులో విలక్షణమైన సినిమాలు చేస్తారనే పేరు ఉన్న దర్శకురాలు నందిని రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు. మన దగ్గర వాళ్ళని కోల్పోవడం అంత ఈజీ ఏమీ కాదు. నాతో కలిసి పెరిగిన వాళ్ళలో ఒకరిని దూరం చేసుకోవడం ఇదే మొదటిసారి. నన్ను మొట్టమొదటిసారిగా అక్క అని పిలిచింది శాంతినే. శాంతి నాకు తెలిసినంతలో చాలా దయ కలిగిన వ్యక్తి, ఎలాంటి కల్మషం లేని ఆమె నవ్వు ఆమెకు అత్యంత బలమైన విషయం అని నమ్ముతాను. అదే బలంతో అదే చిరునవ్వుతో ఒక పెద్ద యుద్ధంలో ఆమె పాల్గొన్నది. గత నాలుగు నెలల నుంచి ఎంతో కష్టపడి పోరాడుతోంది. ఈరోజు ఆమెకు సమయం వచ్చేసింది. ఆమె ఒక బెస్ట్ కుమార్తె, ఒక బెస్ట్ సోదరి, ఒక బెస్ట్ వైఫ్ అలాగే ఒక బెస్ట్ తల్లి ఒక బెస్ట్ ఫ్రెండ్. నా డార్లింగ్ చెల్లెలా నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం, మరొకపక్క మనం కలిసే వరకు అంటూ ఆమె తన సోషల్ మీడియా వేదికగా తన సోదరి ఫోటో షేర్ చేసింది. అయితే ఆమె ఎలా చనిపోయారు అనే విషయం మీద పూర్తిగా క్లారిటీ లేదు. బహుశా నందిని రెడ్డి చెబుతున్నదాని ప్రకారం ఆమె క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద నందిని రెడ్డి క్లారిటీ ఇస్తే తప్ప అసలు ఏం జరిగిందనే విషయం మీద అవగాహన వచ్చే అవకాశం లేదు. అయితే ఈ విషయం తెలిసి ఆమె పడుతున్న ఆవేదనను అభిమానులు అర్థం చేసుకుంటూ ఆమెకు అండగా ఉంటామంటూ కామెంట్స్ చేస్తున్నారు