వెంటనే క్షమాపణలు చెప్పాలి.. లేదంటే చర్యలు తప్పవ్.. పవన్ భార్య విషయంలో జనసేన లీగల్ సెల్ వార్నింగ్
పవన్ కళ్యాణ్ తన భార్య అనాతో విడిపోతున్నారని, ఆమె ఇప్పటికే పిల్లల్ని తీసుకుని సొంత ప్రదేశం అయిన రష్యాకు వెళ్ళిపోయిందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ విషయం మీద జనసేన తెలివిగా స్పందిస్తూ ఫొటో షేర్ అలాంటిదేమీ లేదనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా సరే ఆ ప్రచారానికి బ్రేకులు పడకపోవడంతో జనసేన లీగల్ టీం ఇప్పుడు రంగంలోకి దిగింది. తాజాగా ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక హెచ్చరిక జారీ చేస్తూ స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆయన భార్య విడిపోతున్నారని తప్పుగా ప్రచారం చేస్తూ పవన్ అభిమానుల్లో కలకలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందంటూ జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రకటనలో పేర్కొంది. కావాలనే కొంతమంది వ్యక్తులు తప్పుడు ఉద్దేశాలతో ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. వారి దరిద్రపు కోరికలు తీర్చుకునేందుకు కొంతమంది కుట్ర దారులు కలిసి ఇదంతా చేస్తున్నట్లు జనసేన దృష్టికి వచ్చిందని హెచ్చరించారు. ట్విట్టర్లో కొన్ని ట్విట్టర్ అకౌంట్లను ట్యాగ్ చేస్తూ వెంటనే బేషరతుగా పవన్ కళ్యాణ్ దంపతులకు క్షమాపణలు చెప్పాలని తాము తప్పుడు ప్రచారం చేయబోయినట్టు ఒప్పుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ అలా క్షమాపణ చెప్పకపోతే వారి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఇలాంటి ఫాల్స్ న్యూస్ సర్కులేట్ చేస్తున్నావారందరి మీద చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని హెచ్చరించారు.
సింగిల్ గానే పోటీ.. ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తులు..!
రాబోయే ఎన్నికలలో వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇక, ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తుల కోసం పాకులాడుతాయంటూ సెటైర్లు వేశారు.. ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టం చేసిన ఆయన.. మార్చిలోనే సాధారణం ఎన్నికలు జరుగుతాయన్నారు. మా నాయుకుడు ప్రతి సభలోనూ చెప్పునట్టు అభివృద్ధి, సంక్షేమ పథకాలే మా అజెండా.. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీలతో మాకు పొత్తు అవసరం లేదన్నారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపుగా అన్ని పూర్తి చేశాం.. సంక్షేమ పథకాలతో మా ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందన్నారు. గత ఎన్నికల్లో సాధించిన స్థానాల కంటే.. వచ్చే ఎన్నికల్లో అధిక సీట్లనే గెలిచుకుంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యానారాయణ.
వరంగల్‌లో మోడీ పర్యటన.. బహిష్కరించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
ప్రధాని నరేంద్ర మోడీ రేపు (08-07-23) వరంగల్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్త చేశారు. అటు.. బీజేపీ రాష్ట్ర నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, దీనిని విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు, గందరగోళ వాతావరణ పరిస్థితులు చోటు చేసుకోకుండా.. భారీస్థాయిలో పోలీసుల్ని మోహరిస్తున్నారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల నుండి రాకపోకలు కొనసాగిస్తున్న ప్రయాణికుల వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ సభ సందర్భంగా మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం స్పష్టం చేశారు. అంతేకాదు.. మోడీ సభా ఏర్పాట్లనూ పరిశీలిస్తున్నారు. అయితే.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రం మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చని కారణంగానే.. తాము మోడీ పర్యటనకు దూరంగా ఉంటున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రధాని మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నట్టు వెల్లడించారు.
రూ.7,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో దాదాపు రూ.7,600 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలోని అంతఘర్, రాయ్‌పూర్ మధ్య కొత్త రైలును కూడా ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని లబ్ధిదారులకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ కొత్త ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజలకు విస్తారమైన ఉపాధి అవకాశాలను తెరిపిస్తాయని, వారి జీవితాలను తేలికపరుస్తాయని అన్నారు. ఈ ప్రాజెక్టులు గిరిజనుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సౌకర్యాలు, అభివృద్ధికి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాయని ఆయన అన్నారు. గత 9 ఏళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో 3,500 కి.మీ మేర జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందని, అందులో 3,000 కి.మీ పొడవు ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పారు. అభివృద్ధి రేసులో వెనుకబడిన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాన మంత్రి తెలిపారు. గత అనేక దశాబ్దాలుగా అన్యాయం, సౌకర్యాల కొరతను ఎదుర్కొంటున్న వారికి కేంద్రం ఆధునిక సౌకర్యాలను కల్పిస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు.
ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా.. ‘ఎస్టేట్ దేఖో’తో మీ కలల ఇంటిని కొనుగోలు చేయండి..
‘ఎస్టేట్ దేఖో’ ప్రాపర్టీస్ చెక్ చేసుకునేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది. ఇది వినియోగదారులకు వారు ఇష్టపడే ప్రాంతంలో, బడ్జెట్, సౌకర్యాలు, అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని వారికి రియల్ ఎస్టేట్ సూచనలను అందిస్తుంది. ‘ఎస్టేట్ దేఖో’ కొనుగోలుదారులను, విక్రేతలను కలిపే అగ్రిగేటర్‌గా వ్యవహరిస్తుంది. ఎక్కువ మంది ప్రాపర్టీ అన్వేషకులను నిలుపుకోవడానికి వారికి ప్రాపర్టీ వివరాలను ఖచ్చిత ధరలతో అందిస్తారు. ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను మార్కెట్‌లోని వివిధ ధరల శ్రేణి గృహాలను పోల్చడానికి అనుమతిస్తుంది. పాత ఆస్తి ప్రకటనలు, సంబంధిత ఆస్తుల ఫోటోలు లేదా విస్తీర్ణం, ఫ్లోర్ ప్లాన్‌లతో విక్రయించిన ధరలను సరిపోల్చడానికి సిస్టమ్ వినియోగదారులకు సహాయపడుతుంది. ఎస్టేట్ దేఖో క్లయింట్‌లు తమకు సరైన ప్రాపర్టీని ఎంచుకోవడానికి హెచ్‌ఎండీఏ లేదా హుడా ప్లాట్‌లతో సహా వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు వాణిజ్య, నివాస ఆస్తులకు సంబంధించిన వివరాలను అందిస్తుంది. ప్రస్తుతం ‘ఎస్టేట్ ధేఖో’ హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వినియోగదారులకు తమ సేవలను అందిస్తోంది. త్వరలోనే ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు ‘ఎస్టేట్ దేఖో’ సహ వ్యవస్థాపకులు రంజిత్ రెడ్డి వాసిరెడ్డి తెలిపారు.
మహీ భాయ్.. నా జర్నీ ఎప్పటికీ నీతోనే..!
నేడు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు.. నేటితో మిస్టర్ కూల్ 42వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా మహేంద్రుడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా మహేంద్ర సింగ్ ధోనితో రవీంద్ర జడేజాకు ప్రత్యేక అనుబంధం ఉంది. 2009 నుంచి ఇప్పటి వరకూ.. ఈ ప్రయాణం ఎప్పటికీ నీతోనే కొనసాగుతుంది.. మహీ భాయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు.. త్వరలో యెల్లో జెర్సీలో కలుద్దాం అంటూ జడ్డూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్2023 ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించిన తర్వాత ధోనీని కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో, జడ్డూ ట్వీట్ వైరల్ గా మారింది.
మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌లో కనిపించని టొమాటో.. ఆర్డర్లను తీసుకోవడానికి నిరాకరించిన కస్టమర్ కేర్..!
దేశంలో రుతుపవనాల ప్రారంభంతో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా టమోటాల ధరలు చాలా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధర కిలో రూ.150 దాటింది. దీని ప్రభావం సామాన్యులపైనే కాదు రెస్టారెంట్లపైనా పడుతోంది. దీంతో మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. బర్గర్ లో టమోటాలు పెట్టడం లేదని.. దీనివల్ల రుచిలో మార్పు ఉంటుందని తెలిపింది. తాము అందించే ప్రొడక్ట్స్ లో టొమాటోలాకు సంబంధించి ఆహార పదార్థాలు ఉండవని మెక్ డొనాల్డ్ పేర్కొంది. ఈ పరిస్థితి ఎప్పటికీ ఉండదని.. టమాట ధరలు ఎక్కువగా ఉండటం వలన భారతదేశంలోని కొన్ని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో టొమాటో మెను ఉండదని తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగా మార్కెట్‌లో నాణ్యమైన టమోటాలు దొరకడం లేదని.. అందుకే టమోటాలు వాడటం మానేసినట్లు కంపెనీ చెబుతుంది. ఓ కస్టమర్ మెక్‌డొనాల్డ్స్ కి ఫోన్ చేసి టొమాటో బర్గర్‌ని ఆర్డర్ చేయగా.. బర్గర్లలో టమాటాలు వాడడం లేదని మెక్ డొనాల్డ్ తెలిపింది. ప్రస్తుతం టమోటో లేని బర్గర్లు మాత్రమే ఆర్డర్లు డెలివరీ అవుతున్నాయని పేర్కొంది.
రానా నాయుడు తో సీత.. పార్ట్ 2 లో అయితే లేదుగా
దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడ. ఇక ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో మెప్పించిన ఈ హీరో ప్రస్తుతం రానా నాయుడు 2 తో బిజీగా ఉన్నాడు. ఇక ఈవెంట్స్, పార్టీలకు రానా ఎప్పుడు ముందే ఉంటాడు. తాజాగా ఒక ఈవెంట్ లో రానాను బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కలిసింది. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఇద్దరు చాలా అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఒక రాయల్ ప్యాలెస్ లా కనిపిస్తున్న ఒక భవనంలోని మెట్ల మీద వీరిద్దరూ కలిసి ఫోజ్ ఇచ్చారు. వైట్ సూట్, దానిపై క్యాప్ పెట్టుకొని రానా నిలబడగా.. స్టైలిష్ బ్లూ సూట్ వేసుకొని మృణాల్ అద్భుతంగా కనిపించింది. అయితే ఈ ఫోటో వెనుక ఉన్న స్టోరీ ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. వీరిద్దరూ కలిసి యాడ్ చేస్తున్నారా..? కొత్త సినిమా ఏదైనా చేస్తున్నారా..? అనేది మిస్టరీగా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. రానా, మృణాల్ కలిసింది.. సైమా అవార్డ్స్ కోసమని తెలుస్తోంది. టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిన ఈ అమ్మడికి సైమా అవార్డ్స్ 2023 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ఆహ్వానం అందింది అంట . దానికోసమే అమ్మడు ఇలా రానాతో ఫోటోలకు ఫోజులిచ్చింది అని అంటున్నారు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు కొంపతీసి రానా నాయుడు 2 లో అయితే మృణాల్ లేదు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
విజయ్ అతని ఫ్యాన్స్ తో నన్ను బూతులు తిట్టిస్తున్నాడు.. రాజేశ్వరి ప్రియ సంచలన వ్యాఖ్యలు
ఒక సినిమా అన్నాకా మద్యపానం, ధూమపానం లేకుండా ఉండదు. కేవలం సినిమాను సినిమాల చూస్తే ఎవరికి ప్రాబ్లెమ్ ఉండదు. కానీ, కావాలని కొంతమంది సినిమాలో లేనిపోని వాటిని వెతికి వివాదాలు పేరుతో ఫేమస్ కావాలని చూస్తూ ఉంటారు. ప్రస్తుతం లియో సినిమా ఇలాంటి వివాదాస్పద ఆరోపణలనే ఎదుర్కొంటుంది. విషయంలోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న చిత్రం లియో. ఇక ఈ మధ్యనే విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. నా రెడీనా అంటూ సాగిన ఈ సాంగ్ మొత్తంలో విజయ్ సిగరెట్ తోనే కనిపిస్తాడు. దీంతో యూత్ ను తప్పుదోవ పట్టించే విధంగా ఈ పాట ఉందని, ఈ మధ్యనే విద్యార్థులకు మంచి మాటలు చెప్పిన విజయ్.. ఇప్పుడు ఇలా సిగరెట్ తాగి, వారిని చెడగొడుతున్నాడు అంటూ చెప్పుకొస్తూ కొంతమంది విజయ్ పై, లోకేష్ పై పోలీస్ కేసు పెట్టారు. వెంటనే ఆ సాంగ్ ను డిలీట్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అందులో ఆల్ పీపుల్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా ఉంది ఆమె కూడా చిత్ర బృందంపై కేసు పెట్టింది. ఇక ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు.. సోషల్ మీడియాలో ఆమెను ఏకిపారేస్తున్నారు. మా హీరోపైనే కేసు పెడతావా అంటూ అసభ్యకరమైన పదజాలంతో తిట్టిపోస్తున్నారు. ఇక వాటిని తట్టుకోలేని ఆమె.. మీడియా ముందుకు వచ్చి విజయ్ పియా సంచలనం ఆరోపణలు చేసింది. విజయ్ కావాలనే ఇలా చేస్తున్నాడని, అతని ఫ్యాన్స్ ను రెచ్చగొట్టి తనను బూతులు తిట్టిస్తున్నాడని తెలిపింది. యువతను చెడగొడుతున్నాడు అని అడిగినందుకు విజయ్ తనను బెదిరిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. అతన్ని అరెస్ట్ చేయాలనీ ఆమె డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.