NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

యూనిఫాం సివిల్ కోడ్‌పై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. ఎవరి వైఖరి ఏంటి..?
యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి)పై సీనియర్‌ పొలిటీషన్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం యూనిఫాం సివిల్ కోడ్ గురించి దేశం అంతటా చర్చ జరుగుతోంది.. కానీ, యూనిఫాం సివిల్ కోడ్ ను మొదటగా తీసుకుని వచ్చింది బీజేపీ కాదన్నారు. రాజ్యాంగంలోనే డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్ లో యూనిఫాం సివిల్ కోడ్ ఉందని గుర్తుచేశారు. ఇక, వెనుకబడిన వర్గాల్లోనే జనాభా ఎక్కువగా ఉంటుంది.. కానీ, ముస్లింల్లో జనాభా ఎక్కువ అని ప్రచారం చేస్తున్నారని.. దీని ద్వారా విద్వేషాన్ని పెంచుతున్నారని దుయ్యబట్టారు. 2018లో ప్రధాని నరేంద్ర మోడీ 21వ లా కమిషన్ ను వేశారు.. ఈ కమిషన్ తన నివేదికలో యూనిఫాం సివిల్ కోడ్ ఈ సమయంలో తీసుకుని రావాల్సిన అవసరం లేదని చెప్పిందని గుర్తుచేశారు ఉండవల్లి.. రెండు వారాల కిందట వచ్చిన 22వ లా కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు యూనిఫాం సివిల్ కోడ్ పై తమ విధానం ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు ఉండవల్లి.. రేపు పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీలు తమ వైఖరిని ప్రజలకు వెల్లడించాలన్నారు.

తెలంగాణలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ప్రాజెక్ట్ అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే, తాజాగా రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ లక్ష్యం సాకారమవుతుందని వైద్యారోగ్యమంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అరుదైన రికార్డును తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకుంటుంది. 9 ఏండ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు.. రాష్ట్రంలో పది వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు చేరువ కానున్నాయి.

ఏపీ అష్ట దరిద్రాలకు కేంద్రమే కారణం..! అధికార, ప్రతిపక్షాలకు నోరు రావటం లేదు..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అష్ట దరిద్రాలకు కేంద్ర ప్రభుత్వమే కారణం అంటూ విమర్శలు గుప్పించారు సీనియర్‌ పొలిటీషియన్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించిన ఆయన.. కేంద్రానికి రాష్ట్రం నుంచి 100 రూపాయలు వెళ్తే.. వాళ్లు తిరిగి రాష్ట్రానికి ఇస్తున్నది 64 రూపాయలు మాత్రమేనని దుయ్యబట్టారు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని కోరుకోవటం మినహా నాలాంటి వారు ఏమీ చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రభుత్వం ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు ఉండవల్లి.. కేంద్ర ప్రభుత్వం.. కోటి 64 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది.. కానీ, కేంద్రంపై నోరు ఎత్తటానికి అధికార, ప్రతిపక్ష పార్టీలకు నోరు రావటం లేదని విమర్శించారు. ఇక, కాంగ్రెస్ మరింత బలపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఉండవల్లి.. మరోవైపు వైఎస్‌
షర్మిల వస్తే కాంగ్రెస్ పార్టీకి బాగానే ఉంటుందన్నారు. బెంగుళూరులో ప్రతిపక్షాల సమావేశం వల్ల ప్రయోజనం ఉంటుంది.. కాంగ్రెస్‌కు బెంగుళూరుతో సెంటిమెంట్ ఉందన్నారు.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్న ఆయన.. బీజేపీ నిర్ణయాలను అంచనా వేయలేం అన్నారు. ఇక, బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకంపై స్పందిస్తూ.. పురంధరేశ్వరి స్వతాహాగా మంచి స్వభావంతో ఉండే వ్యక్తి.. మార్పు మంచికే అని భావిస్తున్నాం అని పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.

ఎట్టకేలకు మౌనం వీడిన కిషన్‌రెడ్డి.. అధిష్టానం నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు జేపీ నడ్డా ఫోన్ చేశారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే.. నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అధ్యక్షునిగా పని చేసిన అనుభవం ఉందన్నారు. అలాగే.. తెలంగాణకు అధ్యక్షులుగా పని చేశాను.. అయితే పార్టీ మరోసారి నాపై ఈ బాధ్యత పెట్టింది.. బీజేపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచా.. పార్టీని ఎదీ ఎపుడు అడగలేదు అని కిషన్ రెడ్డి అన్నారు. 1980 నుంచి బీజేపీ పార్టీలో సైనికుడిగా పనిచేశాను.. పార్టీకి మించింది లేదు.. పార్టీనే నా శ్వాస.. వచ్చే శాసన సభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడమే మా లక్ష్యం అని కిషన్ రెడ్డి చెప్పారు. ఎలాగైనా గెలుస్తాం.. పార్టీ ముఖ్య నాయకులతో ఇవాళ రాత్రి మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నాడు. జూలై 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది.. వరంగల్ సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. వరంగల్ లో రైల్వే కోచ్ ల తయారీ కోసం యూనిట్ కావాలనే డిమాండ్ ఉంది.. నూట యాభై ఎకరాల్లో పరిశ్రమ రానుంది అని తెలిపారు.

భూమిపైనే అత్యంత వేడి రోజు.. ఉష్ణోగ్రత ఎంతో తెలుసా?
భూమిపైనే అత్యంత వేడి రోజుగా జులై 3 రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ శాఖ తెలిపింది. జులై 3వ తేదీన భూఉపరితలానికి 2 మీటర్ల ఎత్తులోని గాలి సగటు ఉష్ణోగ్రత 62.62 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 17.01 సెల్సియస్‌కు చేరుకుందని వెల్లడించింది. ఈ వివరాలు మైనే యూనివర్సిటీ అధ్యయనంలో తెలిసినట్లు చెప్పింది. ఫలితంగా 2022 జులై, 2016 ఆగస్టులో నమోదైన 62.46 డిగ్రీల ఫారెన్‌హీట్ రికార్డు బద్దలైందని వివరించింది. వాయవ్య కెనడా, పెరూ, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. దక్షిణ అమెరికా ఇటీవల ఎండల్లో మగ్గిపోతోంది. ఎండల వేడిని తట్టుకోలేక ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. చైనాలో 35C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో తీవ్రమైన ఎండలు కొనసాగాయి. ఉత్తర ఆఫ్రికాలో 50C సమీపంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే అంటార్కిటికాలో ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. అయినప్పటికీ.. అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసింది. శ్వేత ఖండంలోని అర్జెంటీనా దీవులలో, ఉక్రెయిన్ వెర్నాడ్‌స్కీ రీసెర్చ్ బేస్ ఇటీవల 8.7C (47.6F)తో జూలై ఉష్ణోగ్రత రికార్డును బద్దలు కొట్టింది.

భారత–’A’ జట్టులో తెలుగు కుర్రాడు..
ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో పాల్గొనే భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్న ఆంధ్ర పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నితీశ్ కుమార్‌ రెడ్డికి చోటు దక్కింది. నితీశ్ గత ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఒకే మ్యాచ్ లో అతనికి అవకాశం వచ్చింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా జులై 13 నుంచి 23 వరకు వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ జరనుంది. ఇప్పటి వరకు 10 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి 27 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండటంతో జూనిల్ సెలెక్షన్ కమిటీ నితీశ్ కుమార్‌కు అవకాశం కల్పించింది. మరోవైపు భారత్‌-ఏ జట్టుకు యశ్‌ ధూల్‌ కెప్టెన్‌‌గా వ్యవహరించనుండగా.. అభిషేక్‌శర్మ వైస్‌ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. నితీశ్ కుమార్‌ రెడ్డితో పాటు ఐపీఎల్ ప్లేయర్లు సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, ఆకాశ్ సింగ్, రాజ్యవర్థన్‌లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

పెళ్లి పీటలు ఎక్కనున్న సుశాంత్.. ఎంగేజ్మెంట్ పిక్ వైరల్
ఈ నగరానికి ఏమైంది సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయినప్పుడు కన్నా.. రీరిలీజ్ అయ్యినప్పుడు మరింత హైప్ తెచ్చుకున్న ఈ సినిమాలో ప్రతి ఒక్క హీరో గురించి, వారి పాత్రల గురించి పూస గుచ్చినట్లు చెప్పుకొస్తారు అభిమానులు. ఇక అందులో మెయిన్ హీరోగా నటించిన సాయి సుశాంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత విశ్వక్ సేన్ వరుస సినిమాలు తీసి స్టార్ హీరోగా మారాడు. సుశాంత్ సైతం హీరోగా మంచి అవకాశాలను అందుకున్నా.. అంత స్టార్ డమ్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ఇక సుశాంత్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. నిన్న సుశాంత్ ఎంగేజ్ మెంట్.. గ్రాండ్ గా జరిగింది. తన నిశ్చితార్థపు ఫోటోలను సుశాంత్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ అభిమానులను ఆశీర్వదించమని కోరాడు. అయితే వధువు ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సుశాంత్ ది ప్రేమ పెళ్లి అని సమాచారం. ప్రేమించిన అమ్మాయిని కుటుంబానికి పరిచయం చేసి.. ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాకనే వీరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని టాక్. ఇక నిశ్చితార్థపు వేడుకలో సుశాంత్ ఎంతో అందంగా కనిపించాడు. ప్రేమించిన అమ్మాయికి రింగ్ తొడుగుతూ నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక అభిమానులు.. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీరి పెళ్లి డేట్ ను ఖరారు చేయనున్నారు. మరి పెళ్లి తరువాత సుశాంత్ కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాల్సి ఉంది.

ఎవడేమన్నా నాకు దాంతో సమానం.. నిహారిక వీడియో వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల డివోర్స్ గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మూడేళ్ళ క్రితం చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది నిహారిక. ఇక రెండేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య అనుకోని విబేధాలు తలెత్తాయి. ఇక ఆ విబేధాలు చిలికి చిలికే గాలివానగా మారి విడాకుల వరకు వచ్చాయి. 6 నెలల క్రితమే ఈ జంట విడాకులకు పిటిషన్ పెట్టుకోగా.. ఈ మధ్యనే కోర్ట్ వీరికి విడాకులు మంజూరు చేసింది. ఇక విడాకులు వచ్చాయి అని తెలిసినాక.. నిహారిక.. తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అధికారికంగా తెలిపింది. ” చైతన్య, నేను ఎంతో మ్యూచువల్ గా విడిపోయాం. మా దారులు వేరు అయ్యాయి. ఇక నుంచి మేముకొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. దయచేసి మా ప్రైవసీకి ఇబ్బంది కలిగించవద్దని మనవి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన ట్రోలర్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నీ వలనే విడాకులు అయ్యి ఉంటాయి అని కొందరు.. మూడేళ్లకే విడాకులు ఏంటి..? అని మరికొందరు కామెంట్స్ పెడుతూ నెగెటివీటి నిక్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ కు మెగా అభిమానులు నిహారిక ఓల్డ్ వీడియోను సమాధానంగా షేర్ చేస్తున్నారు. డెడ్ ఫిక్సల్స్ వెబ్ సిరీస్ రిలీజ్ సమయంలో నిహారిక ఒక ఇంటర్వ్యూలో ట్రోలర్స్ గురించి కామెంట్స్ చేసిన వీడియోను షేర్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ అంటూ చెప్పుకొస్తున్నారు. అందులో నిహారిక మాట్లాడుతూ.. ” ట్రోలర్స్ గురించి నేను పట్టించుకోను. నేను దేన్నీ ఎక్కువగా తీసుకోలేదు.. అది ప్రశంస అయినా.. విమర్శ అయినా.. నన్ను చాలా పొగిడితే .. ఓహో.. అది ఇది అని నేను అనుకోను. నా కుటుంబంలో నా తల్లిదండ్రులు, అన్నయ్య చాలా టైట్.. నాకున్న ఫ్రెండ్స్ కూడా టైట్.. వారే నా ప్రపంచం. వారు తప్ప ఎవడేమన్నా నాకు వెంట్రుకతో సమానం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.