Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం.. ఏపీ చీఫ్‌గా పురంధేశ్వరి
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చేస్తోంది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మార్చేసింది.. స్వర్గీయ ఎన్టీఆర్‌ కూతురు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది.. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న సోము వీర్రాజు బాధ్యతల నుంచి తప్పుకున్నారు.. మరోవైపు ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్‌.. జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. పార్టీకి ఇప్పటి వరకు అందించిన సేవలకు నడ్డా ధన్యవాదాలు చెప్పారు. బండి సంజయ్‌తో పాటు.. ఏపీ బీజేపీ చీఫ్‌గా పనిచేసిన సోము వీర్రాజు.. ఇతర రాష్ట్రాల చీఫ్‌లకు ధన్యవాదులు తెలియజేశారు నడ్డా.. ఇక, ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రకటించింది.. మరోవైపు తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించారు.. జార్ఖండ్‌ బీజేపీ చీఫ్‌గా మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీకి బాధ్యతలు అప్పగించగా.. పంజాబ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జాఖర్‌ను నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.. మొత్తంగా ఒకేసారి నాలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చేసింది కేంద్ర నాయకత్వం. కాగా, సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చిన తర్వాత.. కాపు సామాజిక వర్గానికే ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగింది.. అందుకు అనుగుణంగానే.. కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం.

షాక్‌లో ఏపీ బీజేపీ నేతలు.. పురంధేశ్వరికి బాధ్యతల వెనుక అసలు కారణం ఇదేనా..?
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని ఖరారు చేయడంతో ఏపీ బీజేపీ నేతలు షాక్‌ తిన్నారట. టీడీపీ ముద్ర ఉండడంతో అధ్యక్ష స్థానాన్ని సత్య కుమార్ దక్కించుకోలేక పోయారనే చర్చ నడుస్తోంది.. బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అనుంగు అనుచరుడిగా బీజేపీలో సత్యకుమార్‌కు గుర్తింపు ఉంది.. కానీ, అధ్యక్ష పదవి మాత్రం అందకుండా పోయింది.. అయితే, న్యూట్రల్ లుక్ కోసమే పురంధేశ్వరిని బీజేపీ హైకమాండ్ ఎంచుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.. మరోవైపు.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారి శైలి నచ్చకే గతంలో తెలుగుదేశం పార్టీని వీడారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులు. దాంతోనే ఆమెను ఎంచుకున్నారనే చర్చ కూడా సాగుతోంది.. అంతేకాదు.. గతంలో అవసరం అయినప్పుడు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్న జూనియర్‌ ఎన్టీఆర్.. చాలా కాలం నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.. ఇప్పుడు పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించడంతో.. జూనియర్ ఎన్టీఆర్‌ను దువ్వేందుకు కూడా ఆమె ఉపయోగపడతారనే యోచనలో బీజేపీ హైకమాండ్‌ ఉందట.. పార్టీకి సినీ గ్లామర్ అద్దెందుకు జూనియర్ ఎన్టీఆర్‌ అవసరమని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.. గతంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కూడా జరిగింది.. ఇప్పుడు మేనత్త (పురంధేశ్వరి)కి బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఎన్టీఆర్‌ను బీజేపీకి దగ్గర చేసే ప్లాన్‌ కూడా ఉందనే ప్రచారం సాగుతోంది.

బండి సంజయ్ రాజీనామా.. కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి అధ్యక్ష పదవిపై జరుగుతున్న ప్రచారాలు నిజమే అయ్యాయి. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియమించారు. దీంతో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన అనంతరం.. బండి సంజయ్ తన రాజీనామాను ప్రకటించారు. మరికొన్ని నెలల్లోనే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో.. అధ్యక్ష పదవికి సంబంధించి మార్పులు చేయడం వెనుక గల కారణాలేంటో బండి సంజయ్‌కి జేపీ నడ్డా వివరించారు. ఇకపై ఆయన సేవల్ని పార్టీ పెద్దలు కేంద్రంలో వినియోగించుకోనున్నట్టు తెలిసింది. ఒక్క తెలంగాణలోనే కాదు.. పలు రాష్ట్రాల అధ్యక్షులను సైతం బీజేపీ అధిష్టానం మార్చింది. ఏపీలో సోము వీర్రాజుని తొలగించి, ఆయన స్థానంలో మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. దీంతో.. జులై 4వ తేదీన మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేశారు సోము వీర్రాజు. మీ టర్మ్ అయిపోయిందని, అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని జేపీ నడ్డా తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారని సోము వీర్రాజు అన్నారు. కొత్త బాధ్యతల్ని అప్పగిస్తామని తనకు హామీ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా.. 2020 జులై 27వ తేదీ సోము వీర్రాజు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, 2023 జులై 4వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు.

కొన్ని అధ్యాయాలు మూతపడకుండానే మూసుకుపోవాల్సి వస్తుంది
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం బండి సంజయ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన ట్వీట్ పోస్ట్ చేశారు. తనలాంటి సాధారణ కార్యకర్తకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే గొప్ప అవకాశం ఇచ్చినందుకు గాను పార్టీ జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాను బీజేపీ హైకమాండ్ అంచనాలకు అనుగుణంగానే పని చేశానని భావిస్తున్నానని చెప్పారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. తనకు అందించిన మద్దతు, ప్రేమ, ప్రోత్సాహానికి గాను సెంట్రల్ పార్టీకి, రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే.. అన్ని మోర్చాల నాయకులు, సభ్యులకు, సంగ్రామ సేన, రాష్ట్ర పార్టీ కార్యాలయ ఉద్యోగులు, సోషల్ మీడియా యోధులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. ప్రజా సంగ్రామ యాత్రలో అడుగడుగునా తనని ముక్తకంఠంతో స్వాగతించిన తెలంగాణ ప్రజలకు కూడా బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు తనని తీర్చిదిద్దిన కరీంనగర్ ఓటర్లకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. మన జీవితంలోని కొన్ని అధ్యాయాలు మూతపడకుండానే మూసుకుపోవాల్సి వస్తుందని.. తన పదవీకాలంలో తాను అనుకోకుండా ఎవరినైనా బాధపెట్టినట్లయితే, తనని మీ ఆశీర్వాదాల్లో ఉంచాలని కోరారు. తాను విచారకరమైన కథను కానందుకు సంతోషిస్తున్నానన్నారు. అరెస్టుల సమయంలో తనతో ఉండటం, దాడి జరిగినప్పుడు పక్కన నిలబడటం, సంతోషకరమైన క్షణాల్లో నవ్వుతూ.. అందరూ తనకు మరపురాని క్షణాలను అందించారన్నారు. కేసీఆర్ పాలనపై తాను చేసిన పోరాటంలో అరెస్టులు, దాడులు ఎదుర్కొన్నప్పటికీ అండగా నిలిచిన బీజేపీ కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పారు. తాను మీలో ఒకడినని, ఎల్లప్పుడూ అలాగే ఉంటానని అన్నారు. కిషన్ రెడ్డి సమర్ధవంతమైన నాయకత్వంలో తాను నూతనోత్సాహంతో పార్టీ కోసం పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లో “అనుమానాస్పద పౌడర్”..
అమెరికా అధ్యక్ష భవనంలో వైట్‌హౌజ్‌లో అనుమానాస్పదంగా వైట్ పౌడర్ వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఆదివారం సాయంత్రం వైట్ హౌస్ వద్ద అనుమానాస్పద పదార్థాన్ని కనుగొంది. ఈ పదార్థాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో వైట్ హౌజును ఖాళీ చేయించి అధికారులు తనిఖీలు చేపట్టారు. వైట్‌హౌస్‌లోకి తెల్లటి పొడి ఎలా వచ్చిందో అధికారులు అర్థం చేసుకుంటున్నారని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మీ పేర్కొన్నారు. ప్రాథమిక పరీక్షల్లో ఈ పౌడర్, కొకైన్ పాజిటివ్ అని తేలింది. అయితే ఇది ఖచ్చితంగా ఎలాంటి పదార్థమో తెలుసుకునేందుకు పరీక్ష్లు జరుపుతున్నామని ఆంథనీ గుగ్లీల్మీ తెలిపారు. ఈ పదార్థం వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లలేదని చెప్పారు. ఆ సమయంలో అధ్యక్షుడు జో బిడెన్ వైట్ హౌస్‌లో లేరని తెలిపారు. ఈ పదార్థం అధ్యక్ష భవనంలోకి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ పదార్థాన్ని కనుగొన్నట్లు తెలిసింది.

కియా సిల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. క్రెటాకు తిప్పలు తప్పవా.. బుకింగ్స్ ఎప్పటినుంచంటే..?
సౌత్ కొరియన్ ఆటో మేకర్ కియా తన కొత్త సెల్టోస్ ను ఈ రోజు ఆవిష్కరించింది. కియా సిల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఈ నెల 14 నుంచి బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు తెలిపింది. కొత్త సెల్టోస్ 18 వేరియంట్లతో అందుబాటులో ఉండనుంది. కియా సిల్టోస్ ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ క్రెటాకు డైరెక్ట్ కాంపిటీషన్ కాబోతోంది. గత సెల్టోస్ తో పోలిస్తే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో ఇంటీరియర్, ఎక్స్ టీరియర్లోలో భారీ మార్పులు చేసింది. మిడ్-సైజ్ SUV విభాగంలో ఉన్న అన్ని కార్లకు పోటీ ఇవ్వనుంది. 2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 11 లక్షల నుండి రూ. 22 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండవచ్చని అంచనా. కొత్త కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కియా సిగ్నేచర్ స్టార్ మ్యాప్ LED లైటింగ్ కాన్సెప్ట్‌తో ‘ఆపోజిట్స్ యునైటెడ్’ డిజైన్ తో రాబోతోంది. కొత్త క్రౌన్ జ్యువెల్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఐస్-క్యూబ్ LED ఫాగ్ ల్యాంప్స్, సీక్వెన్షియల్ LED టర్న్ ఇండికేటర్‌లు, రీడిజైన్ చేయబడిన LED లైట్ గైడ్ మరియు LED DRLలు ఉన్నాయి. బంపర్ రీడిజైన్, కొత్త స్కిడ్ ప్లేట్, పెద్ద టైగర్ నోస్ గ్రిల్ ఉన్నాయి. గత సెల్టోస్ తో పోలిస్తే మొత్తం పొడవు 50 మిమీ పెరిగింది.

నిన్న విషెస్.. ఇవాళ ట్రోల్స్.. ఏంటీ భజ్జీ ఇలా చేశావు..!
జూలై 3న టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ (జూలై 4)న అదే అభిమానులు బీభత్సంగా ట్రోల్స్ తో ఆడుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో భజ్జీ చేసిన ట్వీట్ పై స్పందించడం.. కష్టాన్ని తీసుకొచ్చింది. భజ్జీ టాప్-5 ఆటగాళ్ల పేర్లను తప్పుగా రాయడంతో.. అతన్ని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ల గురించి అభిమానులు తరచుగా ట్వీట్ చేస్తుంటారు. క్రికెట్ వల్లా అనే ట్విట్టర్ వినియోగదారు కూడా ఒక ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ లో ప్రపంచంలోని టాప్- 5 టెస్ట్ క్రికెటర్లు ఎవరు అని ప్రశ్నించాడు. కేవలం ప్రతిభ ఆధారంగానే కాదు, పెద్ద టోర్నీల్లో గేమ్ ఛేంజర్‌గా, మ్యాచ్ విన్నర్‌గా చెప్పాలి. నేను బెన్ స్టోక్స్, పాట్ కమిన్స్ అనే ఇద్దరి పేర్లను ఎంచుకుంటాను. మీరు మిగిలిన ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకుంటారా? అని ట్వీట్ చేశారు. అయితే ట్వీట్‌పై స్పందించిన హర్భజన్ సింగ్.. ఐదుగురు ఆటగాళ్ల పేర్లను తెలిపాడు. ప్రపంచంలోని అత్యుత్తమ టాప్- 5 టెస్ట్ ఆటగాళ్లు నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్ పేర్లను పేర్కొ్న్నాడు. అయితే ఈ ట్వీట్ చేయడ‌మే హర్భజన్‌కు స‌మ‌స్యలు తెచ్చిపెట్టింది. భజ్జీ ఇంగ్లీషులో ఆటగాళ్ల పేర్ల స్పెల్లింగ్‌ను తప్పుగా రాశాడు. ఒక్క నాథన్ లియాన్ స్పెల్లింగ్‌ను తప్ప.. మిగతా నలుగురి పేర్లను తప్పుగా పేర్కొన్నాడు. దీంతో భజ్జీపై ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్న మాస్ మహా రాజ్..?
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాల తో ఎంతో బిజీ గా వున్నాడు.గతం లో ప్రకటించిన అన్ని సినిమాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయడం జరిగింది. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నట్లు సమాచారం.వంశీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా స్థాయి లో రూపొందుతుంది.ఈ సినిమా గ్లింప్స్ ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమాను అక్టోబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.దీని తర్వాత దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో ఈగల్ సినిమాను కూడా ఇటీవలే ప్రకటించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా విడుదల కాబోతుంది. అలాగే దీంతో పాటు రవితేజ తనకు క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేని తో ఒక సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కనుందని సమాచారం.ఈ సినిమా మాత్రమే కాదు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమాను చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.అలాగే ధమాకా వంటి భారీ హిట్ ఇచ్చిన త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో కూడా మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.. ఇలా వరుస సినిమాలు లైన్లో పెడుతూనే తనకు మిరపకాయ్ వంటి మంచి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ తో కూడా రవితేజ ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది.దర్శకుడు హరీష్ శంకర్ సన్నిహితులు ఈ వార్త ను లీక్ చేసినట్టు సమాచారం… ఈ నెలలోనే ఈ సినిమా అఫిషియల్ అప్డేట్ వస్తుందని తెలుస్తుంది.. రవితేజ రానున్న రెండు సంవత్సరాలలో చేసే సినిమాలను ఇప్పటికే లైన్ లో పెట్టేసాడు.

‘సర్కిల్’ ఎమోషనల్ థ్రిల్లర్‌..అసలు విషయం బయటపెట్టిన నీలకంఠ
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా “సర్కిల్” జూలై 7న ఆడియన్స్ ముందుకు రానుంది. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా, రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ శరత్ చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ దగ్గరపడ్డ క్రమంలో ఈ క్రమంలో చిత్ర దర్శకుడు నీలకంఠ మీడియాతో ముచ్చటించారు. నీలకంఠ మాట్లాడుతూ మాయ సినిమా తర్వాత తొమ్మిదేళ్ల గ్యాప్ అనంతరం తెలుగులో సినిమా తీస్తున్నానని, తెలుగులో మళ్లీ సినిమా తీయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని, ఫేట్ (విధి) అనే కాన్సెప్ట్ ఓ వందమందిని ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి.. ఎట్లా వారి జీవితాలను అల్లకల్లోలం చేసిందని మెయిన్ థీమ్‌గా తీసుకున్నామని అన్నారు. ఇది రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ కాదు. ఇన్వెస్టిగేషనల్ టైప్‌లో కాకుండా.. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రన్ చేశానాకు నీలకంఠ అన్నారు. ఈ సినిమాలో సాయి రోనక్ ఫొటో గ్రాఫర్‌గా కనిపిస్తాడని, అన్‌హ్యూమన్ సర్కిల్‌లోకి అతన్ని ఎలా లాగబడ్డాడు..? అనేది అక్కడి నుంచి కథ రివీల్ అవుతుందని అన్నారు. సినిమాకి రొమాంటిక్ యాంగిల్ కూడా జత చేశామన్న ఆయన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారని అన్నారు.. నా గత సినిమాల్లో మాదిరే హీరోయిన్స్‌కు ఈ మూవీలో కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానని, ముగ్గురు హీరోయిన్లు మూడు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారని, సినిమాలో వాళ్ల లైఫ్‌ను వాళ్లే డిసైడ్ చేసుకుని ముందుకు సాగుతారని నీలకంఠ అన్నారు. ఈ ఇనిమలో బాబా భాస్కర్ గారి క్యారెక్టర్‌ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, ఆయన అందరికీ ఓ కొరియోగ్రాఫర్‌గానే తెలుసని అన్నారు. బాబా భాస్కర్ ఫస్ట్ టైమ్ ఓ కీలక పాత్రలో నటించాడని, తనదైన శైలిలో కామెడీని టచ్ చేస్తూనే విలన్‌గా మెప్పించాడని అన్నారు.

నంది అవార్డులపై పోసాని కీలక ప్రకటన.. ఉత్తములు, అర్హులకు ఇస్తాం!
ఏపీ సచివాలయంలో ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై కీలక ప్రకటన చేశారు. నిజాయితీగా నంది అవార్డుల ఎంపిక ప్రక్రియ చేయమని ముఖ్యమంత్రి నాకు చెప్పారని పేర్కొన్న ఆయన డ్రామా, టీవీ, సినిమా ఈ మూడు రంగాలకు ఒకేసారి సాధ్యం కాదని చెప్పానని అన్నారు. ఇక ఈ క్రమంలో పద్య నాటకాలకు ఊపిరి పోయాల్సిన అవసరం ఉందని, అందుకే ముందు నాటక రంగానికి నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ నంది అవార్డులు అంటేనే భయం వేస్తోందని, నేను నంది తీసుకుంటే..కమ్మనైనది అవుద్ది అని చెప్పా, ఒక్కొక్కరికి రెండు, మూడు ఇచ్చారని అన్నారు. గతంలో అంబికా కృష్ణని చంద్రబాబు తిట్టారు, అంబికా కృష్ణ తనకి స్వేచ్ఛ ఇవ్వలేదని చంద్రబాబుకి చెప్పేశాడని అన్నారు. మేము నంది అవార్డులను ఉత్తములు, అర్హులకు ఇస్తాం, రాష్ట్రంలో ఎవ్వరు షూటింగ్ లు చేసినా ఉచితంగా చేసుకోవచ్చని, స్టూడియోలు కడితే సహకరిస్తాం అని సీఎం జగన్ చెప్పారని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కూడా సహకారం కోసం మాట్లాడుతానన్న ఆయన రూల్ ప్రకారం, జీవోల ప్రకారం కొన్ని పనులు చేయలేమని, కొన్ని ప్రాక్టికాలిటీతో అవుతాయని అన్నారు.

Exit mobile version