NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

విద్యను సమాజ హితం కోసం వినియోగించాలి..
ప్రతి విద్యార్థి తాము సమర్జించిన విద్యను సమాజ హితం కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్ నజీర్.. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన.. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రపంచంలోనే యువ శక్తి ఉన్న దేశం భారత్.. సహజ వనరుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వ్యవసాయం ప్రధానంగా పాడి పరిశ్రమతో మొదలైంది.. కాలుష్య నివారణతో కూడిన సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ఎమ్మార్ శిశిథర్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, పరిశోధన విభాగంలో ముందు భాగంలో నిలిచిందని యూనివర్సిటీపై ప్రశంసలు కురిపించారు.. ఎస్వీయూ 42 కేంద్రాలలో మంచి సేవలు అందిస్తోందన్నారు. రైతులకు పూర్తి స్థాయి సేవలు అందించి దేశ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్న ఆయన.. 183 రకాల ఆవులు దేశంలో వున్నాయి.. డెయిరీ రంగంలో దేశం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు. పౌల్ట్రీ రంగంలో కూడా ఆంధ్ర పురోగతి సాధించింది.. 62 శాతం ప్రజలు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడ్డారని వెల్లడించారు కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ఎమ్మార్ శిశిథర్.

ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి కీలక నిర్ణయం.. రేపటి నుంచి జోనల్‌ సమావేశాలు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి.. ఇక, పనిలోకి దిగిపోయారు.. బాధ్యతలు స్వీకరించిన రోజే ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డా ఆమె.. మరోవైపు పార్టీ పటిష్టతపై ఫోకస్‌ పెట్టారు.. అందులో భాగంగా రేపటి నుంచి బీజేపీ జోనల్ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.. జోనల్ సమావేశాలకు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి హాజరుకానున్నారు.. పార్టీలో కొత్త కమిటీల రూపకల్పన ముందు జోనల్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు పురంధేశ్వరి.. జోనల్ సమావేశాలు ముగిశాక కొత్త కమిటీలు ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.. రాయలసీమ జోనల్ సమావేశం ప్రొద్దుటూరులో నిర్వహించేందుకు సిద్ధమైంది బీజేపీ.. ఈ నెల 25వ తేదీన గుంటూరులో కోస్తాంధ్ర జోన్ సమావేశం జరగనుండగా.. 26వ తేదీన రాజమండ్రిలో గోదావరి జోన్ సమావేశం నిర్వహించనున్నారు.. ఇక, 27వ తేదీన విశాఖలో ఉత్తరాంధ్ర జోన్ సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.

కుటిల రాజకీయాలు అవసరం లేదు.. వాళ్ల నాన్న ఏమైనా టాటా నా, బిర్లా నా..?
పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆస్తులను వేలం వేయనున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన జారీ చేయడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. మెసర్స్‌ ఏఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (మెసర్స్‌ సాయిసుధీర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌) కంపెనీకి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భార్య అపర్ణరెడ్డి, ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి డైరెక్టర్లు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి షూరిటీగా కంపెనీ రుణాలు తీసుకుంది. ఆ లోన్లు సకాలంలో చెల్లించకపోవడంతో ఆగస్టు 18న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు ఓ ప్రటనలో పేర్కొంది.. అయితే, దీనిపై రాజకీయ దుమారం రేగింది.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలకు దారితీసింది.. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి.. తనపై తప్పుడు ప్రచారం సాగుతోందని.. కావాలనే కొందరు పనిగట్టుకొని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి.. కుటిల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.. మా పార్టీలోని కురవృద్దుడు అయిన ఓ నాయకుడు నీచ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు.. బ్యాంకు నోటీసు నా వ్యక్తిగత అంశంగా పేర్కొన్న ఆయన.. నోటీసు ఎలా సమాధానం ఇవ్వాలో మా కంపెనీ చూసుకుంటుంది. రాజకీయంగా ఎదుర్కోలేక నాపై కుట్రలు పనుతున్నారని విమర్శించారు. మరోవైపు.. పల్లె రఘునాథరెడ్డి ఆస్తులను నేను ఏమీ తనఖా పెట్టలేదన్నారు శ్రీధర్‌రెడ్డి.. రఘునాథరెడ్డి వాళ్ల నాన్న ఏమైనా టా,టా బిర్లా నా? లేక అదానీనా..? లేకపోతే రిలయన్స్ బంధువులా..? అని ఎద్దేవా చేశారు. ఇక, రఘునాథరెడ్డి కాలేజీలో విద్యార్థులు లేక పోయినా ఎలాంటి మాయలు చేశాడో అందరికీ తెలుసన్నారు.. నేను అనుంటే పల్లె అక్రమాలపై విచారణ డిమాండ్ చేయవచ్చు.. కానీ, నేను అలాంటి రాజకీయాలు చేయబోన్నారు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి.

పెరిగిన వరద ఉధృతి.. ఆరు గేట్లు ఎత్తివేత
తెలంగాణ‌ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మోస్తారు నుంచి భ‌రీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హిమాయత్ సాగర్ ప్రాజెక్టులోని ఆరు గేట్లను అధికారులు ఎత్తేశారు. అయితే, ఇప్పటికే వ‌ర‌ద నీరు భారీగా వ‌స్తుండ‌టంతో శుక్రవారం ఈ ప్రాజెక్ట్ లోని రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు కొనసాగుతుండటంతో హిమాయత్ సాగర్ ఆరు గేట్లను ఎత్తి అదనపు నీటిని విడుదల చేసిన‌ట్టు సంబంధిత అధికార వ‌ర్గాలు వెల్లడించాయి. గేట్లు ఎత్తి 4120 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో.. హిమాయత్ సాగర్ జలాశయంకు భారీగా నీరు చేరుతుంది. వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో మరో రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు అధికారులు రిలీజ్ చేశారు. అయినా.. హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో తగ్గకపోవడంతో మరో ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు జల మండలి అధికారులు విడుదల చేశారు. హిమాయత్ నగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును అధికారులు మూసి వేశారు. ఇరువైపుల బారీ‌ కేడ్స్ ను రాజేంద్రనగర్ పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో కింద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మీదకు భారీగా నీటి ప్రవాహం వచ్చింది. సర్వీస్ రోడ్డు మీద ఫుల్ ఫోర్స్ తో నీరు వెళ్తుంది. సర్వీస్ రోడ్డు మీద రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేసి.. వాహనాలు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మణిపూర్‌ పర్యటనకు మోడీ ఎందుకు దూరంగా ఉంటున్నారు?
ప్రధాని నరేంద్ర మోడీపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ తీవ్రంగా విమర్శించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోసం కర్ణాటక, రాజస్థాన్‌, ఇతర ప్రాంతాల్లో పర్యటనలు చేసిన మోడీ.. మణిపూర్‌కు మాత్రం వెళ్లడం లేదని నిలదీశారు. ఇలాంటి ప్రధానిని చూడటం తనకు ఇదే మొదటిసారని అన్నారు. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉందని.. కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆయన ఏం మాట్లాడుతారో ఒక్కసారి ఊహించుకోవాలని విమర్శలు గుప్పించారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు వెలుగుచూసిన వీడియోపై మోడీ ఇటీవల వ్యాఖ్యానిస్తూ.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన సంఘటనలను ప్రధాని మోడీ ప్రస్తావించారని, మోడీ వ్యాఖ్యలు రాజస్థాన్ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని అశోక్‌ గెహ్లాట్ అన్నారు. మణిపూర్‌‌లో ప్రధాని మోడీ పర్యటించలేకపోతే కనీసం ఒక సమావేశమైనా ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు.

రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్
శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లాహిరు తిరిమన్నె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు శనివారం వీడ్కోలు పలికాడు. అతను సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశం కోసం ఆడటం ఎంతో గౌరవముందని రాసుకొచ్చాడు. అంతేకాకుండా క్రికెట్ తనకు చాలా ఇచ్చిందని తెలిపాడు. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా కష్టంగా ఉందని లాహిరు తెలిపాడు. ఒక ఆటగాడిగా అతను తన అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నించినట్ల పేర్కొన్నాడు. రిటైర్మెంట్ తీసుకోవడం కష్టమైనప్పటికీ.. తప్పలేదన్నాడు. మరోవైపు రిటైర్మెంట్ కు ప్రభావం చూపిన కారణాలను తాను చెప్పలేనని చెప్పాడు. అంతేకాకుండా తన రిటైర్మెంట్ తో మరొక యువ ఆటగాడికి అవకాశం దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. దేశం కోసం క్రికెట్ ఆడటం తన జీవితంలో మరిచిపోనని తెలిపాడు.

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే జీఎస్టీ
పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ బ్యాటరీలకు ఛార్జింగ్ చేస్తే 18 శాతం చొప్పున జీఎస్టీ వర్తిస్తుందని కర్ణాటక అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ సంస్థ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసే విషయాన్ని ఓ విద్యుత్‌ పంపిణీ సంస్థ అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ సంస్థ ముందుకు తీసుకు వెళ్లింది. ఇందు కోసం వాహనదారుల నుంచి పన్ను తోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫీజును కూడా వసూలు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో ఎనర్జీ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు అనే రెండు భాగాలు ఉంటాయని వెల్లడించారు. ఎనర్జీ ఛార్జ్ అనేది వాహనదారులు వినియోగించే ఎనర్జీ యూనిట్ల సంఖ్యను ఇది సూచిస్తుంది.

ఇక శ్రీలంకపై ఫోకస్‌ పెట్టిన గౌతమ్ అదానీ..
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రపంచ బిలియనీర్లలో ఒకరైన గౌతమ్‌ అదానీ చూపు ఇప్పుడు శ్రీలంకపై పడింది.. భారత్‌లో అనేక వ్యాపారాల్లో దూసుకుపోతున్న ఆయన.. పొరుగు దేశం శ్రీలంకపై దృష్టి పెట్టారు. ఇప్పటికే అక్కడ పలు ప్రాజెక్టులతో పాగా వేసిన అదానీ.. మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లంకలో ఓ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. ఇక, భారత్‌లో పర్యటించిన శ్రీలంక అధ్యక్షుడు రణీల్‌ విక్రమసింఘేతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు అదానీ.. ప్రస్తుత ప్రాజెక్టులతోపాటు కొత్త వెంచర్‌పై శ్రీలంక అధ్యక్షుడితో చర్చించినట్టు సోషల్‌ మీడియా వేదికగా అదానీ వెల్లడించారు.. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిని అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ లక్ష్యంగా పెట్టుకుంటున్నట్టు పేర్కొన్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమై ద్వీప దేశంలోని పలు ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా కొలంబో పోర్ట్‌ వేస్ట్‌ కంటైనర్‌ టెర్మినల్‌ (డబ్ల్యూసీటీ) అభివృద్ధిపై కూడా చర్చ జరిగినట్లు పారిశ్రామికవేత్త తెలిపారు. విశేషమేమిటంటే, విక్రమసింఘే రెండు రోజుల భారత పర్యటనలో ఉన్నారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ), డైవర్సిఫైడ్ అదానీ గ్రూప్ యొక్క ప్రధాన అనుబంధ సంస్థ, మార్చి 2021 నాటికి కొలంబోలోని వేస్ట్ కంటైనర్ టెర్మినల్ (WCT) అభివృద్ధి మరియు నిర్వహణ కోసం శ్రీలంక అధికారుల నుండి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI)ని అందుకుంది.

హాస్పిటల్ లో ‘నాగిని’.. ఏమైంది.. ?
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ ఆసుపత్రి పాలైంది. 9 రోజులుగా ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందింది. ఇక నేడు డిశ్చార్జ్ అవుతూ ఆమె అభిమానులకు తన హెల్త్ కండీషన్ గురించి చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు ఆమెకు ఏమైంది.. ? అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కొన్నిరోజుల క్రితం మౌని రాయ్ కు సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్ రావడంతో ఆమెను ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తోందో. దాదాపు 9 రోజులు ఆమెకు చికిత్స చేసిన వైద్యులు.. నేడు ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్స్టాగామ్ లో ఈ 9 రోజులు తాను హాస్పిటల్ లో ఎలా గడిపింది అనేది ఫోటోల ద్వారా చూపించింది. అంతేకాకుండా ఇలాంటి సమయంలో తనకు అండగా ఉన్న భర్తకు, స్నేహితులకు థాంక్స్ చెప్పుకొచ్చింది. “9 రోజులు ఆసుపత్రిలో ఉన్నాను. నాకు తెలిసిన దానికంటే లోతైన నిశ్చలతతో నేను మునిగిపోయాను. ఇప్పుడు నేను ఇంటికి తిరిగి వచ్చాను.. నెమ్మదిగా కోలుకుంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇక నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడానికి తన విలువైన సమయాన్ని వెచ్చించిన వైద్యులు, నర్సులు, నా స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఐ లవ్ యూ అబ్బాయిలు.. ఇక నా భర్త నంబియార్.. మీలాంటి వారు ఎవరు లేరు.. నేను మీకెప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే మౌని ఎదుర్కుంటున్న ఆ ఆరోగ్య సమస్య ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మౌని రాయ్ గురించి చెప్పాలంటే.. నాగిని అనే సీరియల్ ద్వారా అమ్మడు తెలుగు వారికి కూడా దగ్గర అయ్యింది. ఆ తరువాత గతేడాది రిలీజ్ అయిన బ్రహ్మాస్త్రలో విలన్ గా నటించి మెప్పించింది. ఇక అమ్మడి బికినీకి బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం తెల్సిందే.

మనలో మన మాట.. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటారా మాస్టరూ..?
కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. అతడు, ఖలేజా సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ, అప్పటి నుంచి ఆటంకాలే.. ఆటంకాలు. సజావుగా షూటింగ్ సాగింది లేదు. ఒకదాని తరువాత ఒకటి ఈ సినిమాకు అడ్డుగోడలుగా నిలుస్తూ వచ్చాయి. ఇక మధ్యలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి కొద్దిగా అభిమానులకు ఉపశమనం అందించారు. సరే ఇకనుంచి అయినా షూటింగ్ పూర్తిచేస్తారు అనుకుంటే..సినిమా నుంచి ఒక్కొక్కరిగా వెళ్లిపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. మొదట మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అవుట్ అన్నారు.. లేదు ఆ తరువాత పూజా హెగ్డే అవుట్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక థమన్ ఇన్ అని పూజా మాత్రమే అవుట్ అని చెప్పుకొచ్చారు.