NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఏపీలో ముందస్తు ఎన్నికలు..? మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి
ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు మంత్రి విశ్వరూప్‌.. ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని ఐదేళ్లు పరిపాలన చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. యథావిథిగా ఏప్రిల్‌లోనే.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. మరోవైపు.. పొత్తుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం మాకు లేదని అన్నారు మంత్రి.. గెలవలేమని ధైర్యంలేని వాళ్లే పొత్తులకు వెళతారని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీపై మండిపడ్డారు. సంక్షేమ పథకాలు రుచి చూసిన తర్వాత ప్రభుత్వం మారాలని ఎవరూ కోరుకోరని అభిప్రాయపడ్డారు మంత్రి విశ్వరూప్‌. కాగా, హస్తిన పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత ముందస్తు ఎన్నికలకు కోసమే ఢిల్లీకి వెళ్లారంటూ ప్రచారం జరిగిన విషయం విదితమే.

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఐదు రోజులు ఇదే పరిస్థితి..!
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఇక, రానున్న 24 గంటల్లో అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్రా, తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.. ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, అల్లూరి సీతారామరాజులలో అతి భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు.. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ సమయంలో తీరం వెంబడి గంటకి 40 నుండి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. రానున్న ఐదు రోజులు వర్షాల ప్రభావం కొనసాగుతుందని పేర్కొన్నారు.. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది.. కావును.. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.. లోతట్టు ప్రాంతాల్లో అదే విధంగా కొండ ప్రక్కన నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద.

మాజీ మంత్రి, కలెక్టర్ మధ్య మరింత ముదిరిన వివాదం.. సీఎం వద్దకు పంచాయతీ..!
మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మధ్య వివాదం మరింత ముదిరింది.. ఈ వ్యవహారం సీఎస్‌, సీఎం వరకు వెళ్లింది.. సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసిన పేర్ని నాని.. ప్రసన్న వెంకటేష్ ఫిర్యాదు చేయగా.. మరోవైపు.. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌.. ఈ ఎపిసోడ్‌పై సీఎం వైఎస్‌ జగన్‌కు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఈ రోజు సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు మాజీ మంత్రి పేర్ని నాని.. జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జరుగుతోన్న జెడ్పీ సమావేశాలకు పలువురు కలెక్టర్లు హాజరు కావడం లేదంటూ ఫిర్యాదు చేశారు.. ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాకపోవడంపై పేర్ని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏలూరు కలెక్టర్ తీరు మీద సీఎం ఇంటి వద్ద ధర్నా చేస్తానన్న వార్నింగ్‌ ఇచ్చారు.. నిన్న ఏలూరు కలెక్టరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్నినాని.. ఇవాళ సీఎస్ కు ఫిర్యాదు చేస్తుండడంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. 2019 ఎన్నికల్లో జిల్లాల విభజన చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో భాగంగా విభజన చేశారు. అయితే అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోవడంతో జెడ్పీ సర్వ సభ్య సమావేశాలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరుగుతున్నాయి. రాష్ట్రానికి సీఎంకు సర్వాధికారం ఎలా ఉందో.. జిల్లాల్లో కలెక్టర్లకి అలాగే సర్వాధికారాలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రెండు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిసాయి.. ఏలూరు జిల్లా నుంచి వ్యవసాయ జెడీఈ తప్ప హోదా ఉన్న అధికారులెవ్వరూ రాలేదు. ఏలూరు జిల్లా నుంచి చిన్న అధికారులనో.. గుమాస్తాలనో పంపారు. ఇలాగైతే ప్రజల సమస్యల పరిష్కారం అయ్యేది ఎలా..? ప్రజలు ఓట్లేయడం దేనికి..? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పేర్ని నాని..

తొమ్మిదేళ్లలోనే 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు.. 30 లక్షల ఉద్యోగాలు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల రంగంలో దూసుకెళ్తున్నామని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నా కూడా ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. పరిశ్రమల శాఖ పారదర్శకమైన విధానం వల్ల దేశం ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పెట్టుబడులు జరిగాయని కవిత పేర్కొన్నారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన మఠం భిక్షపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితుడైన భిక్షపతికి అభినందనలు తెలియజేశారు. గ్రామస్థాయి కార్యకర్తను గుర్తించి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. కష్టపడి పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో భిక్షపతియే నిదర్శనమన్నారు. ఈ పదవి ఇవ్వడం సామాన్యమైన విషయం కాదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను పెద్ద మెజారిటీతో గెలిపించడానికి భిక్షపతి చేయూత, పదవి ఉపయోగపడుతుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానాల వల్ల గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రానికి 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దానితో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల రంగంలో దూసుకెళ్తున్నామని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నా కూడా ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన చేస్తున్నామని వివరించారు. పరిశ్రమల శాఖ పారదర్శకమైన విధానం వల్ల దేశం ఎక్కడా లేని విధంగా గత 9 ఏళ్లలో 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని, దాని వల్ల 30 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. కాబట్టి పరిశ్రమల శాఖలోని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ముఖ్యమైనదని స్పష్టం చేశారు. ఉత్పత్తులను ఎగుమతులు చేసుకోడానికి పారిశ్రామికవేత్తలకు ఈ కార్పొరేషన్ వెన్నుదన్నుగా పనిచేస్తుందని అన్నారు. కరోనా కన్నా ముందు రూ. 30 కోట్ల ఆదాయం ఉన్న కార్పొరేషన్ ప్రస్తుతం రూ. 130 కోట్ల లాభాల్లో ఉందని, ఈ మొత్తం రూ. 1500 కోట్లకు చేరుకుంటుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు బాగుండాలనే సిద్ధాంతంతో పనిచేసే విధానం తమదని, ఈ కార్పొరేషన్‌ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని భిక్షపతికి కవిత సూచించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి
ఇటీవల తెలంగాణలో బీజేపీలో అధిష్ఠానం భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డిని నియమించింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కిషన్‌ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది. ఇదిలా ఉండగా.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఉదయం 11గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ సీనియర్‌ నేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నారు. ఉదయం 7:30 గంటలకు కిషన్‌రెడ్డి పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 8:20 గంటలకు అంబర్ పేట మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాల వద్ద నివాళులు అర్పించనున్నారు. 8:50గంటలకు బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం 9:25 గంటలకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం, 9:30కి గన్ పార్క్ అమర వీరుల స్థూపం వద్ద కిషన్‌ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. తర్వాత అమరవీరుల స్థూపం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కిషన్‌ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీ శ్రేణులు తరలిరానున్నాయి.

సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్టులు.. విచారిస్తున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్
సచిన్ తో ప్రేమలో పడి.. నేపాల్ మీదుగా ఇండియాలోకి వచ్చిన సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. సీమా ప్రేమికురాలేనా.. లేదా పాకిస్థాన్ గూఢచారా అనే అనుమానాలు తావెత్తుతున్నాయి. సీమా హైదర్ ని ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీమా.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ ఏమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు ఆమె సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో చేరాడని.. కానీ అతను మిలటరీలో కొనసాగుతున్నాడో లేదో తనకు తెలియదని సీమా వెల్లడించింది. సీమా స్టేట్మెంట్లు నిర్ధారించుకునేందుకు అధికారులు.. ఆమె భర్త గులాం హైదర్ ను విచారించారు. మరోవైపు సచిన్ తో ప్రేమ విషయాలకు సంబంధించి.. సీమా హైదర్ అన్నీ చెప్పింది. 2019లో తన భర్త గులాం హైదర్ నుండి దూరంగా ఉన్నప్పుడు.. అదే సమయంలో సచిన్ మీనాతో స్నేహం ఏర్పడిందని చెప్పింది. తనకు సచిన్ అంటే చాలా ఇష్టమని, అందుకే పాకిస్థాన్ నుంచి దుబాయ్, అక్కడి నుంచి నేపాల్, ఇప్పుడు నోయిడాకు వచ్చానని సీమా హైదర్ చెప్పింది. యూపీ ఏటీఎస్‌ విచారణలో సీమా హైదర్‌ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. పాకిస్థాన్‌ సైన్యంలో తన బంధువులు ఉండడం.. అంతగా చదువుకోకపోయినా హిందీ, ఇంగ్లీష్‌ లో మాట్లాడడం.. నేపాల్‌ నుంచి అక్రమంగా భారత్‌ రావడం ఇలా అన్ని ప్రశ్నలపై సీమా తప్పించుకునే సమాధానాలు చెప్పింది. అంతేకాకుండా సచిన్ సీమకు చెందిన నకిలీ ఆధార్ కార్డులను తయారు చేశాడని.. వారిద్దరూ బస చేసిన నేపాల్‌లోని హోటల్‌లో తప్పుడు పేరు మరియు చిరునామాను ఇచ్చాడని కూడా తేలింది. దీంతో విచారణలో ఇరువురు విషయాలు దాచిపెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పచ్చని కాపురానికి పనికొచ్చే సూత్రాలు.. అవేంటంటే?
సంసారం ఒక సాగరం ఎన్నో ఆటు పోట్లు ఉంటాయి.. ఎన్ని తుఫాన్ లు వచ్చిన, వరదలు వచ్చినా అలజడి ఉంటుంది తప్ప సముద్రం అక్కడే ఉంటుంది.. అంటే భార్యాభర్తల బంధం కూడా అలాంటిదే.. సముద్రం లాగే గొడవలు వచ్చినా కూడా మళ్లీ సర్దుమనుగుతుంది.. అయితే పచ్చని సంసారం పది కాలాల పాటు చల్లగా ఉండటానికి పంచ సూత్రాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. భార్యాభర్తల ఇద్దరి మధ్యన ఒకరి మీద ఒకరికి నమ్మకం ఖచ్చితంగా ఉండి తీరాలి ఏం చేసినా ఒకరికి తెలియకుండా ఒకరు చేయకూడదు. ఇద్దరూ కూర్చొని చర్చించుకోండి. ఉద్యోగమైన వ్యాపారమైన ఒకరికి ఒకరు సహకరించుకోవడం వల్ల మీ బంధం బలపడుతుంది. అలాగే భార్యాభర్తలిద్దరూ ఒకరి పై ఒకరు డామినేట్ చేయకూడదు ఇది చక్కని బంధాన్ని పాడు చేస్తుంది. భర్తని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని, భార్యను తన కంట్రోల్ లో పెట్టుకోవాలని అస్సలు అనుకోకూడదు.. మీరు ఎంత పెద్ద ఉద్యోగి అయినా మీ భార్య ఎంత వంటింటి కుందేలు అయినా ఆవిడ సహకారం లేకపోతే మీరు జీవితంలో ఎదగలేరని గుర్తుంచుకోండి. అలాగే మీరు మీ భాగస్వామిని ఎంత ప్రేమించినప్పటికీ తనకంటూ పర్సనల్ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లోకి మీరు వెళ్లకండి.. వారి సొంత ప్రపంచంలో స్నేహితులతో కానీ బంధువులతో కానీ గడిపినప్పుడు వారికి రిఫ్రెష్ గా అనిపిస్తుంది అంతేకాకుండా అంతటి స్వేచ్ఛని ఇచ్చిన మీపై గౌరవం రెట్టింపు అవుతుంది. అలాగే అతి ముఖ్యమైన సూత్రం ప్రేమ, నమ్మకం. మీ భాగస్వామి పై ఈ రెండు ఉంటే ఎంతటి తప్పునైనా క్షమించగలుగుతారు.. ఇకపోతే ఈరోజుల్లో మగవాళ్లు ఎక్కువగా ఫోన్ లో మునిగిపోతున్నారు.. అందుకే గొడవలు కూడా అవుతున్నాయని తెలుసుకోవాలి.. టైం దొరికినప్పుడు భార్యతో గడపడం వల్ల గొడవలు పూర్తిగా తగ్గుతాయి.. సంసారం సాఫిగా సాగుతుంది..

‘ప్రాజెక్ట్ కె’ కామిక్ ఆర్ట్ పోస్టర్స్ లీక్.. స్టోరీ తెలిసిపోయింది.. ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ ను నేడు అమెరికాలోని శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్న విషయం తెల్సిందే. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా స్టోరీకి సంబంధించిన కామిక్ పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కామిక్ ఆర్ట్స్ రూపంలో రిలీజ్ అయిన ఈ పోస్టర్స్ లో ప్రాజెక్ట్ కె స్టోరీని చెప్పేశారు. ఒకానొక కాలంలో కొంతమంది రాక్షసులు.. వారి దేవుడిని గౌరవించాలని, అతడినే దేవుడిగా కొలవాలి అని ప్రజలను హింసిస్తారు. ప్రజలు ఎన్ని బాధలు పెట్టినా వారి దేవుడిని.. దేవుడుగా ఒప్పుకోరు. ఇక రాక్షసులు రెచ్చిపోయి ప్రజలను.. ఒప్పుకొంటే తమ దేవుడినే ఒప్పుకోవాలని, మీ కోసం ఏ దేవుడు దిగిరాడని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక దేవుడి రూపంలో ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడ నుంచి దేవుడుకు రాక్షసులకు జరిగే యుద్ధమే ఈ ప్రాజెక్ట్ కె అని తెలుస్తోంది. ఇక రాక్షస దేవుడిగా కమల్ కనిపిస్తుండగా.. ప్రజల కోసం పోరాడే దేవుడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. అందరు అంటున్నట్లే కల్కిగా ప్రభాస్ కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ఇదే కనుక నిజమైతే.. బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.అంతేకాకుండా రేపు రిలీజ్ అయ్యే ఫస్ట్ గ్లింప్స్ లో కూడా ఇదే చూపించనున్నారని టాక్. మరి ఫస్ట్ గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలనుంటే రేపటి వరకు ఆగాల్సిందే.

నేచురల్ స్టార్ తో మరో దసరా…
అసలు న్యాచురల్ స్టార్ నాని బాడీ ట్రాన్సఫర్మేషన్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవాల్సిందే. సినిమా సినిమాకు నాని చూపించే వేరియేషన్ మామూలుగా ఉండదు. దసరా సినిమాలో ధరణిగా, బొగ్గు గనుల్లో మసి పూసుకొని చేసిన మాస్ జాతర మామూలుగా లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోవడమే లేట్.. వెంటనే సాఫ్ట్ లుక్‌లోకి వచ్చేశాడు నాని. జెర్సీ రేంజ్‌లో మరో అదిరిపోయే ఎమోషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాని న‌టిస్తున్న 30వ ప్రాజెక్ట్ హాయ్ నాన్న. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. తండ్రీ కూతుళ్ల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ నేప‌థ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ‘అంటే సుందరానికి’ మూవీకి దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది కూడా నాని స్టైల్ ఆఫ్ ఎంటర్టైనర్ సినిమానే అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి దసరా డైరెక్టర్‌తో ‘రా’ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట నాని. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. నానిని సరికొత్త లుక్‌లో ప్రజెంట్ చేసి సక్సెస్ అయ్యాడు శ్రీకాంత్. కమర్షియల్‌గా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అందుకే మరోసారి శ్రీకాంత్ ఓదెలతో కలిసి భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట నాని. ఈ సినిమా కథ కూడా తెలంగాణ నేపథ్యంలోనే ఉంటుందని అంటున్నారు. దాంతో మరోసారి ధరణిలా చాలా రఫ్‌గా కనిపించబోతున్నాడట నాని. మరి ఈసారి ఈ ‘రా’ కాంబినేషన్ ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తారో చూడాలి.

ఈ సినిమా హిట్ అవుతుందని ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా
చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మస్ కా దాస్ విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాత రాజ్ కందుకూరి, సింగర్ రఘు కుంచె, రచయిత లక్ష్మీభూపాల కార్యక్రమంలో పాల్గొని సినిమా టీమ్ కు విశెస్ తెలియజేశారు. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహించారు. “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రీ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – అన్నపూర్ణ ఫొటో స్టూడియో ఇచట అందంగా సినిమాలు తీయబడును అని పెట్టాల్సింది. ఎందుకంటే ఇది ఒక బ్యూటిఫుల్ ఫిలిం. రెట్రో బ్యాక్ డ్రాప్, కెమెరా పనితనం, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. దర్శకుడు చెందూ ఓ పిట్ట కథను ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపించాడో…ఈ సినిమాను అంతకంటే బాగా తెరకెక్కించాడు. హీరో చైతన్య, హీరోయిన్స్ లావణ్య, మిహిర,ఉత్తర అందరూ స్క్రీన్ మీద ఆకట్టుకునేలా ఉన్నారు. యష్ గారితో కలిసి త్వరలో ఓ సినిమా చేస్తాను అన్నారు. హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమా ప్రారంభించిన రోజే చెప్పాను ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. ఇప్పుడూ అదే నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన నిర్మాత యష్ గారికి, దర్శకుడు చెందు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. విశ్వక్ గారికి చిన్న సినిమాల ఇబ్బంది తెలుసు. అందుకే ఆయన వచ్చి మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మా సినిమా చూస్తున్నంత సేపు మీ లైఫ్ లోని మెమొరీస్ గుర్తొస్తాయి. ఎక్కడా అసభ్యత ఉండదు. క్లీన్ యు సర్టిఫికెట్ సెన్సార్ నుంచి వచ్చింది. రెండు గంటలు ఆహ్లాదకరంగా సాగే చిత్రమిది. అన్నారు.