Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఏ ఏ టికెట్లు విడుదలంటే..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఓ రోజుతో సంబంధం లేకుండా తిరుమల గిరులు భక్తులతో కళకళలాడుతూనే ఉంటాయి.. ఇక, ఏదైనా ప్రత్యేకమైన రోజు.. సెలవులు వచ్చాయంటే చాలు ఏడు కొండలు కిక్కిరిసిపోతాయి.. ఇక, శ్రీవారి భక్తులు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఎందుకంటే.. దర్శనం, విడిది నుంచి ప్రతీ సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచుతూ వస్తుంది టీటీడీ.. ఇప్పుడు అక్టోబర్ నెలకు సంబంధించిన లక్కి డిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.. రేపటి నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కిడిఫ్ విధానంలో భక్తులు నమోదు చేసుకునే సౌలభ్యం ఉంటుంది.. మరోవైపు.. ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. మరోవైపు ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది టీటీడీ.

సీఐ అంజూయాదవ్‌పై ఎస్పీకి పవన్‌ కల్యాణ్‌ ఫిర్యాదు.. లేఖలో ఏముందంటే..
సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి.. ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను.. ఎవరికి ఇబ్బంది లేకుండా.. ఆయుధాలు లేకుండా శాంతియుత నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు.. సాయి శాంతియుతంగా నిరసన చేపట్టారు.. కానీ, సీఐ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేతలు చాలా క్రమశిక్షణతో ఉంటారు.. పోలీసులకు ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉంటుంది.. దానిని ఒకస్థాయి వరకు అర్థం చేసుకుంటాం.. కానీ, ఇలా ప్రవర్తించడం మాత్రం సరికాదన్నారు.. ఇక, సుమోటోగా కేసు తీసుకున్న మానవ హక్కల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ, జనసైనికులు క్రమశిక్షతో ఉంటారు.. పోలీసులు అంత డిసిప్లెన్‌ లా అండ్ ఆర్డర్ ని కాపాడాలి.. హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ఇక, తిరుపతి పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు పవన్‌ కల్యాణ్‌..

కేసీఆర్ కుటుంబంపై ఉచ్చు బిగిస్తున్నాం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబంపై ఉచ్చు బిగిస్తున్నామని, స్వయంగా మోడీని ఈ మాట చెప్పాక మేం బీ టీమ్ ఎలా అవుతామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లకుండా గ్యారంటీ ఇస్తారా అని ఆయన అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా బీఆర్‌ఎస్‌లో చేరరని, 2014, 2018 లో మూడో వంతు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ లో చేరలేదా అని ఆయన ప్రశ్నించారు. జైలుకు బావతో వెళ్లాలని అక్క (కవిత) కోరుకుంటున్నట్లు ఉందన్నారు ఎంపీ అర్వింద్‌. అయితే.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మార్పు అధిష్టానం నిర్ణయమన్నారు. పసుపు బోర్డ్ కంటే నేను ఎక్కువే సాధించానని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నిన్న ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖలో 5221 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నాలుగేళ్లలో డబుల్ బిల్లింగ్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులను నొక్కేశారని ఆయన మండిపడ్డారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 318 కోట్ల స్కామ్ జరిగిందని, 51 పనుల్లో 33 పనులు తన సొంత సెగ్మెంట్ బాల్కొండ లోనే చేపట్టారు మంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే పనికి రెండు రకాల నిధులు వినియోగించారని, తప్పుడు నివేదికలు సమర్పించారన్నారు. జరిగిన పనుల్లోనూ 25 శాతం కమిషన్ లు తీసుకున్నారని, తెలంగాణకు ప్రధాని మోడీ ఇచ్చిన నిధులను, కేసీఆర్ కుటుంబానికి మళ్లిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అవినీతి పై విచారణ జరిపించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు.

కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్ నిషేధం
సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం కోసం ఇటీవల ఒక యూట్యూబర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో తన లవ్ ప్రపోజ్ చేయడంతో ఆలయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. దీంతో టెంపుల్ లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ కఠిన చర్యలకు అమలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, గత కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంకు చెందిన ఫల్స్ నుంగే అనే ఒక యూట్యూబర్ తన ఫాలోవర్ల కోసం ఉత్రాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయంలో మోకరించి తన బాయ్ ఫ్రెండుకు లవ్ ప్రపోజ్ చేసింది.. ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అభిమానుల మెప్పు పొందడం కంటే వారి నుంచి దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పవిత్రమైన ఆలయంలో పిచ్చి పనులేంటని నెటిజన్స్ కామెంట్లు చేశారు. ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని ఆమెపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది వారాలకే శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ ఓ మీటింగ్ ఏర్పాటు చేసి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుడదని కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు పేర్కొనింది.

పిడుగుల ఎఫెక్ట్‌.. 2600కి పైగా విమానాలు రద్దు, 8 వేల విమానాలు ఆలస్యం..
ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు పిడుగుల హెచ్చరికలతో ఏకంగా వేలలో విమానాలు రద్దు చేయాల్సిన పరిస్థితి అగ్ర రాజ్యానికి వచ్చింది.. అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురుస్తోంది. పిడుగులు కూడా పడుతున్నాయి.. దీంతో.. అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాలు రద్దు చేశారు అధికారులు.. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వీటిలో చాలా వరకు రద్దు చేయబడిన, ఆలస్యం అయిన విమానాలు ఈశాన్య ప్రాంతానికి చెందినవి. ఈశాన్య ప్రాంతం నుండి 1,320 విమానాలు సహా దేశవ్యాప్తంగా మొత్తం 2,600 విమానాలు రద్దు చేయబడ్డాయి. వాటిలో 350 విమానాలు న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయాయి. అయితే, ఈ వర్షం ప్రభావం ముఖ్యంగా జాన్ ఎఫ్ కెన్నెడీ మరియు లా గార్డియన్ విమానాశ్రయాలలో ఎక్కువగా ఉంటుంది. అమెరికా FlightAware డేటా ప్రకారం,జాన్ ఫిట్జ్‌గెరాల్డ్ కెన్నెడీ విమానాశ్రయంలో 318 విమానాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. మరో 426 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. లాగ్వార్డియా విమానాశ్రయంలో 270 విమానాలు రద్దు చేయబడ్డాయి. మరో 292 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా, బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 259 విమానాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. మరో 459 విమానాలు ఆలస్యమయ్యాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాలు రద్దయ్యాయి. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వీటిలో చాలా వరకు ఈశాన్య ప్రాంతానికి చెందిన విమానాలే ఉన్నాయి.. ఈశాన్య ప్రాంతం నుండి 1,320 విమానాలు సహా దేశవ్యాప్తంగా మొత్తం 2,600 విమానాలు రద్దు చేయబడ్డాయి. వాటిలో 350 విమానాలు న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయాయి.

పెళ్లిళ్లే ఆరోగ్య రహస్యం.. ఐదో మ్యారేజ్‌ తర్వాత హనీమూన్‌కి 90 ఏళ్ల తాతయ్య.. మళ్లీ మళ్లీ చేసుకుంటా..!
90 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లి చేసుకున్న ఓ తాతయ్య.. పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం అంటున్నాడు.. ఐదో పెళ్లి తర్వత హనీమూన్‌లో ఉన్న ఆయన ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.. అంతే కాదండోయ్.. ఇక్కడితో ఆగేది లేది.. మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటాను అంటున్నాడు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఆ తాతయ్య వ్యవహారానికి వస్తే.. సౌదీ అరేబియాలో, ఒక వృద్ధుడి ఐదో పెళ్లి గురించి సోషల్ మీడియా ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది.. అది స్థానిక మీడియాకు చేరడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.. ఐదో పెళ్లి చేసుకుని హనీమూన్ జరుపుకుంటున్నాడు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువత.. తమ మతాన్ని కాపాడుకోవడానికి పెళ్లి చేసుకోక తప్పదని సూచించాడు.

వీటిని రోజు తింటే యవ్వనంగా, మరింత అందంగా కనిపిస్తారు..!
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం కాలుష్యం అవ్వడం వల్ల చాలా మంది తక్కువ వయస్సులోనే ముసలివాళ్లుగా కనిపిస్తారు.. యవ్వనంగా, మరింత అందంగా కనిపించాలంటే కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్షించడంలో ఆహారాల పాత్ర ఎనలేనిది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కూరగాయలు మన చర్మాన్ని రక్షిస్తాయి. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఇందుకోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. ఆకుకూరలు మన శరీరానికి చాలా మంచివి.. పాలకూర జ్యూస్ లో విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటుగా ఇతర సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చర్మం అందంగా మెరవడానికి సహాయపడతాయి. దీనిలో ఉండే విటమిన్ సి చర్మ నష్టం, వృద్ధాప్యం, మంట నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. బీటా కెరోటిన్లు క్యారెట్లకు నారింజ రంగును ఇస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల చర్మానికి మెరిసే లక్షణాలు లభిస్తాయని, చర్మ ఛాయ మెరుగుపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి..

ఫారెన్ వీధుల్లో పొట్టి షాట్‌లో పరేషాన్ చేస్తున్న యాంకర్ వర్షిణి..
బుల్లితెర యాంకర్ వర్షిణి గత కొంతకాలంగా వేకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.. పొట్టి పొట్టి దుస్తులేసుకుని ఎంజాయ్‌ చేస్తుంది. తన అందాల తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా డ్రెస్సులు వేసుకొని తెగ రచ్చ రచ్చ చేస్తుంది.. అమెరికాని ఓ రౌండ్‌ చుట్టేస్తుంది. ఆమె ప్రస్తుతం సినిమాలకు అడ్డా అయిన యూనివర్సల్‌ స్టూడియో (హాలీవుడ్‌) వద్ద ఉంది. పొట్టి షాట్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. థండర్‌ థైస్‌ చూపిస్తూ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిందీ ఈ బ్యూటీ.. ఆ ఫోటోల ను అభిమానుల తో పంచుకుంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోలలో వర్షినితో పాటు ఫారెన్‌ అమ్మాయిలు సైతం పొట్టి షాట్‌ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుండగా, వారిని డామినేట్‌ చేస్తుందీ భామ. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేస్తూ, బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ ని పొందుతున్నట్టు చెప్పింది.. ఏదేమైనా ప్రస్తుతం ఆ ఫోటోలు మాత్రం తెగ హంగామా చేస్తున్నాయి. ఈ అమ్మడు ఒకప్పుడు యాంకర్‌గా పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు నటిగా టర్న్ తీసుకుంది. ఆమె `ఢీ` వంటి పలు షోస్‌కి యాంకర్‌గా చేసింది. కామెడీ స్టార్‌కి మెరిసింది. `ఢీ` బుజ్‌ షోకి చేసింది. ఇప్పుడు నటిగా టర్న్ తీసుకుంటుంది. సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెరుస్తుంది. ఇటీవల `శాకుంతలం`లో దేవ కన్యలా మెరిసింది. మరోవైపు `భాగ్‌ సాలే` చిత్రంలో నటించింది. సత్య కి జోడీగా చేసి మెప్పించింది. గ్లామర్‌ బ్యూటీగా ఆకట్టుకుంది. దీంతోపాటు `భూతద్దం భాస్కర్‌ నారాయణ` సినిమాలో నటిస్తుంది.. నెమ్మదిగా సినిమా ఆఫర్స్ ను అందుకుంటుంది.. గ్లామర్‌ ఫోటోల తో నెటిజన్ల ని అలరిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ ఇస్తుందీ సెక్సీ భామ.. ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న ఫోటోలు గ్లామర్ డోస్ ఎక్కువ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..

ఈ వారం థియేటర్‌/ఓటీటీలలో సందడి చేయనున్న సినిమాలివే!
ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కు లేక పోవడంతో ప్రతి శుక్రవారం లాగే ఈ వారం కూడా చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ వారం ఏకంగా పది సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయని అంటున్నారు అవేమిటో ఒక లుక్ వేసేద్దాం పదండి. ఈ వారం పది దాకా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నా ఆ జాబితాలో కాస్త ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమాలుగా హిడింబ, హర్, ‘హత్య’ సినిమాలు కనిపిస్తున్నాయి. వాటిలో హత్య విషయానికి వస్తే విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన రితిక సింగ్ – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. బాలాజీ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను, తెలుగు ప్రేక్షకుల ముందుకు సురేష్ ప్రొడక్షన్స్ తీసుకు వస్తోంది. ఇక అశ్విన్‌బాబు, నందిత శ్వేత హీరోహీరోయిన్లుగా నటించిన ‘హిడింబ’ సినిమాకు అనిల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా జులై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత చైతన్యరావు – లావణ్య జంటగా నటించిన ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ సినిమాకి, చందు ముద్దు దర్శకత్వం వహించాడు. బిగ్ బెన్ సినిమా నిర్మించిన ఈ సినిమా, జంధ్యాల మార్కు సినిమాగా .. ఆ కాలం నాటి నేపథ్యంలో రానుందని అంటున్నారు. ఇక అదే సమయంలో రుహానీ శర్మ కీలక పాత్రలో శ్రీధర్‌ స్వరాఘవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హెచ్‌.ఇ.ఆర్‌ కూడా రిలీజ్ అవుతోంది. రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఈ నెల 21న రిలీజ్ చేస్తోంది. ఇక ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ మూవీ ఒప్పెన్‌ హైమర్‌ కూడా రిలీజ్ అవుతోంది. స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా జులై 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఇవి కాక అలా ఇలా ఎలా, నాగద్వీపం, కాజల్ కార్తీక, జిలేబీ, నాతో నేను సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏది ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుంది అనేది శుక్రవారం నాడు తేలనుంది.

చిన్న పాప కోసం పోస్టరా? ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మైక్!
విక్టరీ వెంకటేష్ మంచి జోష్ మీదున్నారు. ఆయన తన 75వ ల్యాండ్‌మార్క్ సినిమాగా ‘సైంధవ్‌’ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఇప్పటికే ఆయన లుక్ ఒకదాన్ని సినిమా నుంచి రిలీజ్ చేయగా ఇప్పుడు ఆయన ఎమోషన్స్ ను పరిచయామ్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అసలు విషయం ఏమిటంటే సినిమాలో సారా అనే పాత్ర పోషిస్తున్న సారా అనే పాపతో వెంకటేష్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. బేబీ సారా హార్ట్ ఆఫ్ సైంధవ్ అని అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌ లో పాప వెంకటేష్‌ ను కౌగిలించుకోవడం కనిపిస్తుండగా ఆయనకు గాయాలయినట్టు కూడా కనిపిస్తోంది. అయితే ఇంత చిన్న పాప కోసం పోస్టరా? ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మైక్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ‘HIT’ ఫ్రాంచైజ్ తో వరుస విజయాలు అందుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వెంకటేష్ కెరియర్లో ది బెస్ట్ హై-ఆక్టేన్ యాక్షన్‌ థ్రిల్లర్ గా సైంధవ్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ వికాస్ మాలిక్ క్యారెక్టర్ లో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో హీరోయిన్ గా నటిస్తుండగా, డాక్టర్ రేణుగా రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ సెన్సేషన్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీగా సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు సహా హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

Exit mobile version