NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు.. సీఎం జగన్‌ ఆదేశాలు
ఉన్నత విద్యపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమావేశం నిర్వహించారు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు.. విద్యా రంగంలో కీలక మార్పులపై చర్చించారు. బోధన, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనుసంధానంపై సీఎం కీలకంగా దృష్టి పెట్టారు. ఏఐ, వర్చువల్‌ రియాల్టీ, అగ్‌మెంటేషన్‌ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై సమాలోచనలు చేశారు.. అదే సమయంలో ఈ రంగాల్లో క్రియేటర్లుగా విద్యార్థులను తయారు చేయడంపై ఫోకస్‌ చేశారు. మొత్తంగా పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులకు సీఎం అడుగులు వేస్తున్నారు.. సమావేశానికి విద్యా శాఖ మంత్రి బొత్స, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి.. ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకుని రావాలని సీఎం జగన్ మిమ్మల్ని ఆదేశించారని తెలిపారు. ఉన్నత విద్య పై ముఖ్యమంత్రికి ఉన్న లోతైన అవగాహన చూసి వీసీలు ఆశ్చర్యపోయారు.. అంతర్జాతీయ యూనివర్సిటీల్లో పరీక్షా విధానంలోనే చాలా మార్పులు ఉంటాయి.. అంతర్జాతీయ పరీక్షా విధానాన్ని ఇక్కడ అమల్లోకి పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారని తెలిపారు. మనం అనుసరించే విధంగా ప్రపంచ పోటీలో మనమే సృష్టికర్తలు కావాలని అన్నారని పేర్కొన్నారు. ఒక్కో వైస్ ఛాన్సలర్‌లతో ప్రత్యేకంగా సీఎం జగన్‌ వన్ టు వన్ మాట్లాడారు.. విశ్వవిద్యాలయాల అంశం పై ముఖ్యమంత్రి నాలుగు గంటల పాటు చర్చించారు. వైస్ ఛాన్సులర్స్ కేవలం ఒక యూనివర్సిటీకే పరిమితం కాకుండా మిగిలిన యూనివర్సిటీలతో కలిసి సమన్వయం చేసుకోవాలని సీఎం చెప్పారని వెల్లడించారు హేమచంద్రారెడ్డి.

ఏపీలో ఎన్నికల పొత్తులు ఖరారు..! స్పష్టం చేసిన మాజీ మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై ఎప్పటి నుంచే చర్చ సాగుతూనే ఉంది.. టీడీపీ, జనసేన కలిసి పనిచేయడం ఖాయమనే సంకేతాలు వచ్చినా.. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ముందుకు సాగుతాయా? అనే అంశంపై ఉత్కంఠ సాగుతూ వచ్చింది.. అయితే, ఎన్నికల్లో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై ఉత్కంఠ నెలకొన్ని వేళ.. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు ఆదినారాయణరెడ్డి. ఈ మూడు పార్టీలు కలుస్తాయని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సంకేతాలను ఇచ్చిందన్న ఆయన.. కేంద్రం సంకేతాలు లేకుంటే తాను ఎందుకు మాట్లాడతాము అని ఎదురుప్రశ్నించారు. పొత్తుల విషయంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలుస్తాయి.. ముందుగానే చెబుతున్నారు.. వైసీపీని ఓడించి తీరుతామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆదినారాయణరెడ్డి.. సీఎం వైఎస్‌ జగన్‌ ఓ కలుపు మొక్కగా పేర్కొన్న ఆయన.. జగన్‌ను బీజేపీ కలుపుకునే ప్రసక్తే లేదన్నారు.. మా పార్టీ.. ఈ ప్రభుత్వంపై సీరియస్ గానే ఉంది.. మడకశిరలో మా నాయకుడు, కేంద్ర మంత్రి నారాయణ స్వామి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.. ఇక, జేపీ నడ్డా , అమిత్ షా.. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌కు బీజేపీ అండలేదు.. దండ లేదని వ్యాఖ్యానించారు. వైఎస్‌ వివేకా కేసులో మా పై ఆరోపణలు చేశారు.. సీబీఐ తేల్చేసింది.. వారి శీలం ఏమిటో తెలిపిందని చెప్పుకొచ్చారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.

ఒకరు ఉంటే భార్య.. నలుగురు, ఐదుగురు ఉంటే పెళ్లాలే అంటారు..!
సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశిస్తూ.. పెళ్లాలు ఏంటి..? భార్య, సతీమణి, సహధర్మచారి లాంటి పదాలు వాడొచ్చు కదా? అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.. అయితే, పవన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒకరు ఉంటే భార్య అంటారు.. నలుగురు, ఐదుగురు ఉంటే పెళ్లాలే అంటూరు అంటూ సెటైర్లు శారు.. నమస్కారానికి కూడా సంస్కారం లేని వ్యక్తి పవన్ కల్యాణ్‌ అని మండిపడ్డ ఆయన.. వాలంటీర్లు ఉద్యమిస్తే ఎలా ఉంటుందో పవన్ రుచి చూశాడన్నారు. నిఘా వర్గాలు సమాచారం ఇవ్వటానికి పవన్ రాజ్యాంగేతర శక్తా? అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌కు ఎంత మంది పిల్లలు ఉన్నారు? అని ప్రశ్నించారు.. ఒకరు ఉంటే భార్య అంటారు.. నలుగురు, ఐదుగురు ఉంటే పెళ్ళాలు అనే అంటారని కౌంటర్‌ ఎటాక్‌ చే శారు. నీ రెండో సహధర్మచారి రేణూ దేశాయ్ నే స్వయంగా చెప్పారు మీడియా ఇంటర్వ్యూలో అన్నారు ఎంపీ భరత్.. ఒక భార్య ఉండగా ఇంకో అమ్మాయితో భర్త పిల్లలను కంటే ఎలా ఉంటుందో మీరే ఆ స్థానంలో ఉండి ఆలోచించండి అని చెప్పిన విషయాన్ని రాష్ట్రం అంతా చూసిందన్న ఆయన.. ఒట్టి కుండ శబ్ధం చేస్తుంది.. నిండు కుండ తొణకదన్నారు. ఇక, పవన్ కల్యాణ్‌ ఎక్కడ విప్లవం చేశాడు? ఏం విప్లవం చేశాడు? అని ప్రశ్నించారు. సినిమాల్లో చాలా చేయవచ్చు.. ఏదో సినిమాలో ఒక ప్యాంటు పై మరో సగం ప్యాంటు వేశాడు.. బయట కూడా అలా వేస్తాడా? అని ఎద్దేవా చేశారు.

ఈ ప్రభుత్వంలో ఇదే చివరి అమ్మఒడి.. ఇక ఎన్నికల తర్వాతే..
వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ ప్రభుత్వంలో ఇదే చివరి అమ్మఒడి అని స్పష్టం చేశారు రాజంపేట, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. అన్నమయ్య జిల్లా మదనపల్లి మసీదు కాంప్లెక్స్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 41.32 కోట్ల రూపాయల అమ్మఒడి నిధుల చెక్కును అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు చేసింది ఏమిలేదు అని మండిపడ్డారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని తెలిపారు.

బొత్సకు మంత్రి శ్రీనివాస్ సవాల్.. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారు. బొత్స కాపీ కొట్టి పరీక్షలు రాశారు కాబట్టే అలాంటి కామెంట్స్ చేశారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే.. అక్కడసుతో బొత్స ఆ మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. ఏపీ నాయకులందరూ తమ మూతి తాము కడుక్కుంటే మంచిదని సూచించారు. పోటీ పరీక్షల్లో ఏపీ రాజధాని ఏంటి? అని అడిగితే.. సమాధానం రాయలేని పరిస్థితి ఆ రాష్ట్రానిదని ఎద్దేవా చేశారు. తెలంగాణ విద్యార్థులు, ఏపీ విద్యార్థుల మధ్య పోటీ పరీక్షలు పడితే.. అసలు ట్యాలెంట్ బయటపడుతుందని వ్యాఖ్యానించారు. APPSCలో ఆనాడు స్కామ్స్ చేసిన చరిత్ర వాళ్ళదని, డబ్బుల కట్టలతో లాడ్జీలన్నీ నిండేవని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇంజినీరింగ్ కాలేజీలకు తాళాలు వేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిదని చెప్పారు.

చంద్రయాన్-3 విషయంలో ఆ తప్పు రిపీట్ కానివ్వం.. ఇస్రో చీఫ్
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 మిషన్ చేపట్టబోతోంది. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. ఇదిలా ఉంటే ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు చంద్రయాన్-3ని మిషన్ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎల్వీఎం-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. చంద్రుడిపై ఉపరితలాన్ని అణ్వేషించడానికి రోవర్ ని పంపడం మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. చంద్రుడిపై రోవర్ ని విజయవంతంగా దించితే ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన భారత్ నిలుస్తుందని.. ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా మాత్రమే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-2లో జరిగిన ఆ తప్పులను రిపీట్ కానివ్వమని ఆయన అన్నారు. నాలుగు ఏళ్ల ముందు 2019లో చంద్రయాన్-2 ప్రయోగంలో ప్రజ్ఞాన్ రోవర్ దాని ల్యాండర్ విక్రమ్‌ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలాయి. చివరి నిమిషాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అనుకున్న మార్గం నుంచి ల్యాండర్ విక్రమ్ పక్కకు జరిగింది. చివరి నిమిషాల్లో ల్యాండింగ్ కు ముందు చంద్రుడిపై కూలిపోయింది. కానీ ఈ సారి కొన్ని అంశాల్లో విఫలమైనప్పటికీ.. విజయవంతంగా ల్యాండ్ అయ్యేలా కొత్త మిషన్ రూపొందించామని సోమనాథ్ వివరించారు. ఇంజన్ ఫెయిల్యూర్, సెన్సార్ ఫెయిల్యూర్, కాలిక్యులేషన్ ఫెయిల్యూర్, అల్గారిథమ్ ఫెయిల్యూర్ వంటి వైఫల్యాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు.

ఇండియాకు రాబోతున్న టెస్లా.. ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చలు.. రూ. 20 లక్షలకే కార్..
ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం టెస్లా భారత్ వచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత మార్కెట్ లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ ఏర్పడింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత మార్కెట్ ని వదిలేందుకు ఏ సంస్థ సిద్ధపడటం లేదు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు కంపెనీలు భారత బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టా కూడా భారత్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై చర్చలు జరుపుతోంది. టెస్లా వస్తే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పోటీ పెరుగుతుంది. దీంతో వినియోగదారుడికి మెరుగైన ఉత్పత్తులు, సేవలు అందించే వీలు కలుగుతుంది. గతంలో చైనాలో తయారైన కార్లను ఇండియాలో అమ్మాలని ఎలాన్ మస్క్ భావించాడు. అయితే కేంద్రం మేకిన్ ఇండియా ప్రోగ్రాంకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ దేశంలో తయారైతేనే అమ్మకాలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల అమెరికా వెళ్లిన సందర్భంలో ప్రధాని నరేంద్రమోడీ, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తో చర్చలు జరిపారు. దీని తర్వాత ప్రస్తుతం ఈ సమాచారం బయటకు వచ్చింది.

ఈ చీర ఖరీదు అక్షరాలా రూ.21.9 లక్షలు.ఎందుకో తెలుసా?
ఓ చీర ఖరీదు మహా అయితే ఎంత ఉంటుంది.. లక్ష బాగా డబ్బులు ఉన్న వాళ్ళు.. ఇంకా ఎక్కువలో కావాలంటే కాస్త ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా చేయిస్తారు.. అయితే మామూలు షాప్ లలో లక్షల విలువ చేసే చీర ఉండటం ఎప్పుడైనా చూసారా? ఈ చీర ధర పెడితే ఓ సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కొనుక్కోవచ్చు. సోషల్ మీడియాలో ఈ చీర ధర నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఎందుకంటే ఆ చీర ధర అక్షరాలా రూ.21 లక్షలు..ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రూ.21.9 లక్షలు.. అంత ఖరీదు పెట్టే చీర ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ బట్టల షాపులో అమ్మకానికి పెట్టిన ఈ చీర మార్కెట్ ను షేక్ చేస్తోంది. శ్వేతవర్ణంలో అందంగా మెరిసిపోతున్న ఈ చీర షాపులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చీరకు వినియోగించిన వస్త్రం, తయారీ విధానం, కుట్లు వంటివి ఈ చీరకు ఈ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. పైగా ఈ చీర తయారీకి రెండేళ్లు పట్టిందట..యూపీలో చికన్ వర్క్ వస్త్రాలకు మంచి డిమాండ్ఉంటుంది. మరి ముఖ్యంగా కాన్పూర్, లక్నోలలో ఈ చికన్ వర్క్ కు ప్రసిద్ది చెందాయి. ఇక్కడ అమ్మే ప్రతీ వస్త్రం దాదాపు చికన్ వర్క్ తో తయారు చేసినవే ఉంటాయి. అక్కడ మహిళలు ఈ చికన్ వర్క్ కుట్టటంలో మంచి ఎకస్పెర్ట్స్..

ఎమోషనల్ స్పీచ్ ను కాస్తా.. కామెడీ స్పీచ్ అయ్యేలా చేసావ్ కదయ్యా
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం బేబీ. మాస్ మూవీస్ బ్యానర్ పై SKN ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేసిన మేకర్స్.. గతరాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెల్సిందే. ఇక ఈ వేడుకలో వైష్ణవి చైతన్య తన గతాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. ఒక యూట్యూబర్ గా, ఇన్ఫ్లూయెన్సెర్ గా ఆమె పడిన కష్టాలను చెప్పుకొచ్చి కంటనీరు పెట్టుకుంది. ఇన్నాళ్లకు తాను మెయిన్ లీడ్ గా చేసే అవకాశం వచ్చిందని, అందుకు కారణం డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత SKN అని ఆమె చెప్పుకొచ్చింది. అసలు మొదట్లో ఇలాంటి ఒక అవకాశం తనకు వస్తుంది అని అనుకోలేదని, తన మీద తనకే నమ్మకం లేని రోజుల్లో డైరెక్టర్ సాయి రాజేష్ తనను నమ్మాడని, తనలో బేబీ కనిపించిందని, ఈ పాత్రకు తాను అయితేనే సెట్ అవుతుందని చెప్పి దైర్యం ఇచ్చాడని తెలిపింది. ఇక మొదట్లో ఒక సినిమాలో అరనిమిషం పాటు కనిపించినప్పుడే.. నా అంకున్నవారందరికి టికెట్ కొని మరీ వారికి చూపించాను.. ఇప్పుడు సినిమా మొత్తం నేనే ఉన్నాను.. ఇదంతా అవ్వడానికి కారణం సాయి రాజేష్ మరియు SKN అని చెప్పి ఎమోషనల్ స్పీచ్ ఇస్తుండగా.. అంతలోనే SKN టిష్యుస్ తీసుకువెళ్లి.. వైష్ణవి చేతికి ఇవ్వకుండా.. ఆమె కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఉన్న అభిమానులందరూ వైష్ణవి ఎమోషనల్ స్పీచ్ ను వదిలేసి SKN… SKN కమాన్ అంటూ అరవడం మొదలుపెట్టారు.

దీపికా ఏడాది సంపాదన ఎంతో తెలుసా..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది ఈ భామ.అలాగే బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది.ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ గా ఉంది.అలాగే సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానుల తో నిత్యం ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి హాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ భామ. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించి బాగానే సంపాదిస్తోంది ఈ భామ.. అయితే ప్రస్తుతం ఫుల్ బిజీ గా గడుపుతున్న దీపిక ఏడాదికి ఎంత సంపాదిస్తున్నారు అనే విషయం సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది.. కేవలం సినిమాలు మరియు కమర్షియల్ యాడ్స్ మాత్రమే కాకుండా ఈమె బిజినెస్ రంగం లో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా దీపికా ఏడాదికి 40 కోట్లు సంపాదిస్తోందని సమాచారం. ఈ భామ ప్రతి సినిమాకు 15 కోట్లు అలాగే ఎండోర్స్ మెంట్స్ కి ఏడు నుంచి పది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా విడుదల అయ్యి భారీ విజయాన్ని సాధించింది.. ప్రస్తుతం దీపికా ప్రభాస్ హీరో గా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా లో హీరోయిన్ నటిస్తుంది.. ఈ మూవిలో దీపిక పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా లో ప్రభాస్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. ఊహ కి అందని విజువల్స్ తో ప్రాజెక్ట్ కె ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతుంది..

ఆగస్టు 18న వచ్చేస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’
‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ వరుస సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆయన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాతో వచ్చి ఆకట్టుకున్నాడు. ఇక సోహైల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనుండడం హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగు తెరపై ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు, ఈ క్రమంలో ఇదొక కొత్త తరహా ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. సినిమా ఔట్ పుట్ విషయంలో చిత్రబృందం సంతృప్తిగా ఉన్నారని, అందుకే రిలీజ్ కు కూడా ఆగస్టు 18 మంచి డేట్ గా భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సక్సెస్ సాధిస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమాలో సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ అందిస్తుండగా మైక్ మూవీస్ బ్యానర్పై నిర్మాతలు అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు.