NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ముగిసిన ఏపీ కేబినెట్‌.. కీలక అంశాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది.. దాదాపు మూడున్నర గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్‌.. 55 అంశాలతో కేబినెట్‌ సమావేశం జరిగింది.. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.. ఏపీ సీఆర్‌డీఏ (APCRDA)లో 47 వేల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్‌.. అసైన్డ్, లంక భూములపై హక్కులు కల్పించేలా ఆమోదం తెలిపింది మంత్రి మండలి.. ఇక, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన 22(A) లో ఉన్న భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగింపుకు ఆమోద ముద్ర పడింది.. యూనివర్సిటీల్లో శాశ్వత అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ ఆమోద ముద్ర వేసింది మంత్రి మండలి.. మరోవైపు.. SIPB ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

కేబినెట్‌ భేటీలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలకు సిద్ధంకండి..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్ష­తన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. సచివాల­యం మొదటి బ్లాకులోని సమావేశ మం­దిరంలో జరిగిన ఈ సమావేశంలో.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పలు కీలకమైన అంశాలకు ఆమోద ముద్ర కూడా లభించింది.. మూడున్నర గంటలపాటు 55 అంశాలపై ఈ భేటీ కొనసాగగా.. ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులకు రాష్ట కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. అలాగే.. అసైన్‌మెంట్‌ ల్యాండ్‌ విషయంలో, నిరుపేదలకు ఇచ్చిన ల్యాండ్‌ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.. మరోవైపు కేబినెట్‌ సమావేశం అనంతరం మంత్రులతో కీలక అంశాలను ప్రస్తావించారు సీఎం వైఎస్‌ జగన్. కేబినెట్‌ భేటీలో అజెండాలోని అంశాలపై చర్చ తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఎన్నికలకు సిద్ధంకండి అంటూ మంత్రులకు సూచించారు.. మరో 9 నెలల్లో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన.. జగనన్న సురక్షా క్యాంపైన్ ను మంత్రులు పర్యవేక్షించాలని తెలిపారు.. ఈ కార్యక్రమం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి.. గడప గడపకు మన ప్రభుత్వంపై కూడా మీ పర్యవేక్షణ ఉండాలి.. మంత్రులు మరింత బాధ్యతగా వ్యవహరించాలి.. సొంత జిల్లాల్లోనే కాకుండా ఇంఛార్జ్ జిల్లాల్లోనూ మంత్రుల పర్యటనలు, పర్యవేక్షణ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

అసలు వాలంటీర్లకు సంబంధం ఏంటి..?
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.. పవన్‌ వ్యాఖ్యలను తప్పుబడుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాలంటీర్లు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహించారు.. పవన్‌ కల్యాణ్‌ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేశారు.. ఇక, ప్రతిగా కొన్ని ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు పవన్‌ ఫొటోలకు పాలాభిషేకాలు చేశారు. మరోవైపు మంత్రులు, వైసీపీ నేతలు కూడా పవన్‌ ను టార్గెట్‌ చేస్తున్నారు.. అయితే, వాలంటీర్ల వ్యవహారంలో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ పధకాలు తీసుకొని వాళ్ల వివరాలు, ఫోటోలు, ఆధార్ కార్డులు, చిన్న పిల్లల వివరాలను.. వాలంటీర్స్ ఎందుకు తీసుకుంటున్నారు..? అని నిలదీశారు. ప్రభుత్వంతో అసలు వాలంటీర్లకు సంబంధం ఏంటి? అని నిలదీశారు నాదెండ్ల మనోహర్‌.. ప్రభుత్వం తరపున వాలంటీర్లు పని చేస్తే అధికారులు మాట్లాడకుండా వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు..? అని ప్రశ్నించారు. వాలంటీర్స్ ద్వారా ప్రజలను మభ్య పెట్టి.. వచ్చే ఎన్నికలో లబ్ధి పొందాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందని విరుచుకుపడ్డారు. ఆడపిల్లల భద్రత కోసం పవన్ కల్యాణ్‌ మాట్లాడుతుంటే.. వ్యక్తిగతంగా ఎందుకు విమర్శలు చేస్తున్నారు..? రాజకీయ లబ్ధి కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ గురించి ఏమిటా మాటాలు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, ప్రభుత్వం మారాలనే ఆకాంక్షతో ప్రజలు వారాహి యాత్రకు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారని అన్నారు.. పవన్ కల్యాణ్‌ సమస్యలపైన విమర్శిస్తున్నరు.. కానీ, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదని స్పష్టం చేశారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.

చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. మూన్ మిషన్ స్పెషల్‌ రిపోర్ట్..
భారతదేశ అంతరిక్ష పరిశోధణ సంస్థ (ఇస్రో) చంద్రునిపైకి తన తాజా మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగించనుంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి భారతదేశం లాంచ్ వెహికల్ మార్క్ -3 (LVM3) రాకెట్‌లో లిఫ్ట్ ఆఫ్ అవుతుంది. అయితే.. ఈ నేపథ్యంలో శ్రీహరికోటలో ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్ సమావేశం నిర్వహించారు.. చంద్రయాన్-3 ప్రయోగంపై శాస్రవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ప్రయోగ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.. రాకెట్‌లోని అన్ని భాగాలు సవ్యంగా పనిచేస్తున్నట్టు నివేదిక అందింది.

వ్యాగన్ రిపేర్ యూనిట్‌కు మోడీ శంకుస్థాపన చేయడం ఆశ్చర్యకరం
వ్యాగన్ రిపేర్ యూనిట్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం ఆశ్చర్యకరమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి బీజేపీ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసిందని అన్నారు. ఇటీవల అయోధ్యపురంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. ఈ బృందంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు ఉన్నారు. ఈ పరిశ్రమని పరిశీలించిన అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ ఎన్నో రోజులుగా పోరాడుతోందని అన్నారు. ఆ ఫ్యాక్టరీ కోసం ప్రధానిని బీఆర్ఎస్ ప్రశ్నించిందని అన్నారు. అయితే.. కాజీపేటకు రావాల్సిన ఆ కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్ అమృతాలకు తరలించారని వినోద్ కుమార్ మండిపడ్డారు. రైల్వే శాఖ మంత్రిగా ఎవరుంటే, వాళ్లు తరలించుకుపోయారని అన్నారు. తెలంగాణలో ఎన్నికల వస్తున్న తరుణంలో.. వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారని తాను అనుకున్నానన్నారు. పార్లమెంట్‌లో బీఆర్ఎస్ పోరాటం చేయడం వల్లే.. విభజన చట్టంలో హమీలను చేర్చారన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కేవలం కాజీపేటకే పరిమితం కాదని.. ఇది యావత్ తెలంగాణ ప్రజల డిమాండ్ అని చెప్పారు. బీఆర్ఎస్ పోరాటంతో.. కాజీపేట POH నుండి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సాధించామన్నారు. విజన్‌తో పనిచేసే ఏకైక సీఎం కేసీఆర్ అని, తెలంగాణ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలన్నారు.

ఐటీకి ఏమైంది..? ఆఫర్ లెటర్స్ ఇచ్చినా ఆన్‌బోర్డింగ్ లేదు.
ఐటీ సంస్థలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థికమాంద్యం భయాల కారణంగా, ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ వంటి సంస్థలు వేలాదిగా ఉద్యోగులను తొలగించాయి. అయితే ఈ పరిణామాలు ఇండియాపై పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే ప్రస్తుత పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిన్ తన ఉద్యోగులకు వేతన పెంపును వాయిదా వేసినట్లు అనధికార వార్తలు వినిపిస్తున్నాయి. ఐటీ రంగంలో కోవిడ్-19, ఆర్థిక మాంద్యం పరిస్థితులు గందరగోళానికి కారణం అవుతున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా, జాయినింగ్ లెటర్లు ఇవ్వడానికి సతమతం అవుతున్నాయి. ఒక వేళ ఆఫర్ లెటర్లు ఇచ్చినా, కంపెనీ ప్రాజెక్టుల్లో పనిచేయించుకోవడం లేదు. ఇదిలా ఉంటే మరో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ లేటరల్ హైరింగ్ పేరుతో నియమించుకున్న ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో 200 మంది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. జాయినింగ్ లెటర్లు ఇచ్చి, సంస్థలోకి ఆహ్వానించింది, ఇప్పుడు ఆ ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..
ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ దుమ్ములేపాడు. ఇంగ్లండ్ తో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో రాణిస్తున్న ఈ ఎడమచేతివాటం బ్యాటర్ నంబర్ 1 స్థానానికి గురిపెట్టాడు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా రిలీజ్ చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్.. కేన్ విలియమ్సన్ తొలి స్థానంలో నిలబెట్టుకున్నాడు. ఇక, టీమిండియా తరపున కేవలం ఒకే ఒక్క బ్యాటర్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.. అతడే రిషబ్ పంత్.. నిలకడగా కొనసాగుతున్నాడు. మరోవైపు.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక స్థానం దిగజారి 13వ ర్యాంకులో కొనసాగుతుండగా.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్ల 14వ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో టీమిండియా నుంచి పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా(9), స్పిన్‌ బౌలర్‌ రవీంద్ర జడేజా(10) ఒక్కో స్థానం దిగజార్చుకుని టాప్‌-10లో కొనసాగుతున్నారు.

పవన్ కన్నా ముందు OG నేనే అంటున్న స్టార్ హీరో
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. గత కొన్నేళ్లుగా అయన సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణను అందుకుంటున్నాయి. గతేడాది వేద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివన్న.. ఈ ఏడాది ఘోస్ట్ గా రానున్నాడు. శ్రీనీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు శివన్న బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ డాడీ వీడియోను రిలీజ్ చేశారు. ఘోస్ట్.. పేరుకు తగ్గట్టే శివన్న ఘోస్ట్ లా కనిపించాడు. ఒక పాడుబడ్డ డెన్ లో స్టైల్ గా కుర్చీలో కూర్చొని.. పానీపూరీని మందులో ముంచుకొని తింటూ కనిపించాడు. అంతలోనే రౌడీలు ఆయనను గన్ లతో చుట్టుముట్టగా.. ఆయన వెనుక పెద్ద మిలటరీ యుద్ధ ట్యాంకర్ ను చూపిస్తాడు. దీంతో ఆ రౌడీలా ఫేస్ లు మాడిపోతాయి. ” మీరు గన్ తో ఎంతమందిని భయపెట్టారు.. అంతకంటే ఎక్కువ మందిని నా కళ్లుతో భయపెట్టాను. వాళ్లు నన్ను OG అని పిలిచేవారు.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్” అని శివన్న చెప్పిన డైలాగ్ తో వీడియో ముగుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తెలుగులో పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబోలో వస్తున్న చిత్రం OG. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. ప్రస్తుతం ఈ సినిమాను, ఆ డైలాగ్ ను కలిపి అభిమానులు మీమ్స్ వేస్తున్నారు. పవన్ కన్నా ముందు OG నేనే అంటున్న శివన్న.. ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

అయ్యో పాపం సుమకు ఎంత కష్టమొచ్చిందో..!
యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. యాంకరింగ్ పదానికి సుమ పేరు సరిపోతుంది.. ఈ మధ్య సుమ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటుగా.. తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి..ఫోటో షూట్స్, కామెడీ రీల్స్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. తాజాగా రెస్టారెంట్ లో ఫ్యామిలీతో ఫుడ్ తింటున్న వీడియో షేర్ చేశారు.. కాగా, సుమ ఈ మధ్య షోలు తగ్గించారు. ప్రస్తుతం సుమ అడ్డా పేరుతో ఒక షో చేస్తున్నారు. గతంలో సుమ ఎప్పుడూ అరడజనుకు పైగా షోలతో బిజీగా ఉండేవారు. ఆమెకు కూడా యాంకరింగ్ ఒకింత బోర్ కొట్టేసింది. అందుకే కొంచెం ఫ్రీ అయ్యారు. అలాగే ఆమె పిల్లల కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు. సుమకు ఒక కొడుకు, కూతురు. కొడుకు పేరు రోషన్ కనకాల. అతన్ని హీరోగా చెయ్యాలనే ఆలోచనలో ఉన్న విషయం అందరికి తెలుసు..నటిగా. హీరోయిన్ గా కూడా అడపాదడపా చిత్రాలు చేశారు. ఈ మలయాళీ అమ్మాయి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ మధ్య మనస్పర్థలు తలెత్తాయి విడాకుల వరకూ వ్యవహారం వెళ్లిందని కామెంట్స్ వినిపించాయి.. అవి కేవలం రూమర్స్ అని తేల్చి చెప్పారు..

డబుల్ ఇసార్ట్ కూడా ముంబైలోనే మొదలెట్టిన పూరీ
ఇప్పట్లో ముంబైని పూరి జగన్నాథ్ వదిలేట్టు కనిపించడం లేదు. ఆయన లైగర్ సినిమా షూటింగ్ అంతా దాదాపు ముంబైలోనే పూర్తి చేయగా ఇప్పుడు తన తరువాతి సినిమా షూట్ కోసం కూడా అక్కడికి వెళ్లారు. ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్‌’ లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో తన పాత్ర కోసం రామ్ మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ట్రాన్స్ ఫర్మేషన్ చూపించే వీడియోలో సూపర్ స్మార్ట్ గా కూడా కనిపించారు రామ్ పోతినేని. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్ పై పూరీ జగన్నాధ్, ఛార్మి కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా విషు రెడ్డి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ సినిమా కోసం నిర్మించిన భారీ సెట్‌ లో రామ్, ఫైటర్స్‌పై ఒక భారీ సీక్వెన్స్‌ తో టీమ్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించింది. తాజాగా రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్‌లో రామ్, చేతిలో ఫైర్ వర్క్స్ పట్టుకుని ట్రక్కులో కూర్చొని కనిపించగా పూరి, కేచ, జియానీలు కూడా చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఇక ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోందని, ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ తెలియజేస్తారని అంటున్నారు.