NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం నుంచి పోటీ.. స్వామి పరిపూర్ణానంద ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్ది.. ఆశావహులు తాము పోటీ చేయదల్చిన స్థానాలను బయటపెడుతున్నారు.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పలు స్థానాలకు ఇంఛార్జ్‌లను ఖరారు చేసింది.. పలువురు సిట్టింగ్‌లకు మొండిచేయి ఇచ్చింది. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తోంది.. మరోవైపు.. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం నుంచి నేను పోటీకి రెడీ.. తనను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని ఆదేశిస్తే పోటీ చేస్తాను అని ప్రకటించారు శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీపరిపూర్ణానంద స్వామి.. హిందూపురంలో ఉన్న పరిచయాలతో నా భావాలను అధిష్టానానికి తెలిపాను. ఇక్కడ వారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కోరడంతో హిందూపురంలో అందర్నీ కలుస్తున్నాను అని వెల్లడించారు. ఇక, నాకు అభ్యర్థిగా అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను.. హిందూపురంలో అభివృద్ధి దిశగా, పురాతన కట్టడాల పరిరక్షణకు మాన్యాల పరిరక్షణకు తోడ్పాటు అందిస్తాను అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానానికి కూడా తెలియజేయనున్నట్ట పేర్కొన్నారు శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీపరిపూర్ణానంద స్వామి.

నేను రాజకీయాల నుంచి వీఆర్‌ఎస్‌ తీసుకున్నా..
సీనియర్‌ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.. తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు.. విజయవాడలో జరిగిన మూడు దారులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, దేవులపల్లి అమర్, ఆర్.వి.రామారావు తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురు గనుక రాజమండ్రి వచ్చి వైఎస్‌ షర్మిల మా ఇంటికి వచ్చిందన్నారు.. బీజేపీకి షర్మిల చెప్పిన నిర్వచనం బాబు, జగన్, పవన్.. బాగుందన్నారు. అయితే, నేను రాజకీయం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్ఎస్‌) తీసుకున్నానని ప్రకటించారు.. ఇక, యాంటీ మోడీ ఓటింగ్ ఇండియా కూటమి కి ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెబుతున్న సమస్య పెద్ద విబేధం ఏం చూపదన్నారు.. నేనేమీ పెద్ద కష్టాలు చూస్తాను అనుకోవడం లేదని చమత్కరించారు ఉండవల్లి.. ఇక, వైఎస్‌ రాజశేఖరరెడ్డి చాలా జాగ్రత్తగా ఉండేవారు.. మనవాళ్లు అనే భావన అందరికి ఇచ్చారు రాజశేఖరరెడ్డి అని గుర్తుచేసుకున్నారు ఉండవల్లి.. రాజకీయంలోకి రావడానికి కారణం వేరు.. ఇక్కడికొచ్చాక మారిపోతున్నాయి అన్నారు. స్వార్ధం లేని వాడు కూడా రాజకీయాల్లో స్వార్ధ పూరితంగా మారిపోతారని వ్యాఖ్యానించారు.. రాజకీయ నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు లాగా ఉండాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 1952 ముందు రాజకీయాల్లో సంపాదించుకున్న వాళ్లు లేరు.. 1952 ముందు రాజకీయం ఒక వ్యసనంగా పేర్కొన్నారు. ఎదుటి వ్యక్తి చూసే చూపులో ఆశ్చర్యం కోసం రాజకీయాల్లోకి వచ్చేవారని తెలిపారు. దేవులపల్లి అమర్ కి రాజశేఖరరెడ్డి అంటే లవ్వు.. జగన్ అంటే పిచ్చ.. అందుకే చంద్రబాబు అంటే పడదు అని చెప్పుకొచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.

ఆయనకే గ్యారెంటీ లేదు.. ఆయన ఇచ్చే గ్యారెంటీలను ఎవరు నమ్ముతారు..?
చంద్రబాబుకే గ్యారెంటీ లేదు.. ఇక, ఆయన ఇచ్చే గ్యారెంటీని ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.. వచ్చే నెల 3న అనంతపురంలో జరిగే సిద్ధం కార్యక్రమ పోస్టర్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సమావేశంలో సత్యవేడు నియోజకవర్గ కోఆర్డినేటర్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సమాయత్తం అవ్వాలని పిలుపునిచ్చారు. గురుమూర్తి ఉప ఎన్నికలో విజయం సాధించారు.. రానున్న ఎన్నికల్లో సత్యవేడు అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్నారు.. సత్యవేడు నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో గురు మూర్తి విజయానికి కృషి చేయాలని సూచించారు.

సిద్ధం అయ్యాం.. సైన్యమై సమరానికి ముందుకు కదులుదాం..
సిద్ధం అయ్యాం.. సైన్యమై.. సమరానికి ముందుకు కదులుదాం అని పిలుపునిచ్చారు మంత్రి సీదిరి అప్పలరాజు.. విశాఖపట్నంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఉత్తరాంధ్ర చరిత్రలోనే సిద్ధం సభ ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. కోట్లాది మంది పేదల కోసం వైసీపీ కార్యకర్తలు సిద్దం కావాలి. ప్రజలు జన్మభూమి కమిటీల నుంచి బయట పడాలంటే మేం సిద్దం కావాలి.. సిద్ధం అయ్యాం.. సైన్యమై, సమరమై ముందుకు కదులుతాం అని పేర్కొన్నారు. భయపడేవాడు తొడు కావాలి, సహాయం కావాలి అని ఎదురు చుస్తున్నారు. పొత్తుల కోసం వెంపర్లాడి వేచి చూస్తున్నవారు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కానీ, వైసీపీలో భయానికి తావులేదు.. సింగిల్ గా వెళ్లి అత్యధిక స్థానాలు గెలుచుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ షర్మిల కామెంట్లపై, ఆమె తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి అప్పలరాఉ.. సమాధానం చెప్పడం చాలా తేలిక.. వైఎస్ కటుంబాన్ని కాంగ్రెస్ ఏవిధంగా టీడీపీతో కలసి ఇబ్బంది పెట్టిందో తెలుసు. అన్ని మర్చిపోయి అలా కాంగ్రెస్ పార్టీతో వెళ్లడం ఏ లబ్ధికోసమో మాకు తెలియదన్నారు. తెంగాణలో పార్టీ పెట్టినప్పుడు నాకు జగనన్నతో ఎలాంటి విభేదాలు లేవని వైఎస్‌ షర్మిల చెప్పారని గుర్తుచేశారు. ఇక, పలాసలో బస్సు ఒక్కేముందు ఒక్క పదినిమిషాలు మాకు అవకాశం ఇస్తే చేసిన అభివృద్ధి చూపించేవాళ్లమని సవాల్‌ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.

తవ్వేకొద్దీ బయటపడుతున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ అక్రమాస్తులు..
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులపై విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఇంట్లో దొరికిన ఎలక్ట్రానిక్ వస్తువులను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. హైటెక్ హంగులతో తన ఇంటిని డెకరేట్ చేశారు బాలకృష్ణ. అంతేకాకుండా.. అత్యంత ఖరీదైన 200 పైగా పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు.. అత్యంత ఖరీదైన అంతర్జాతీయ బ్రాండెడ్ కు చెందిన 120 వాచీలు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్, సిల్వర్, ప్లాటినం వాచ్ లను ఏసీబీ సీజ్ చేసింది. ట్యాగ్ హ్యూయర్, రొలెక్స్, రాడో, ఫాసిల్, టిసాట్ బ్రాండెట్ హ్యాండ్ వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు. కాగా..
120 వాచ్ ల విలువ దాదాపు రూ. 32లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వాటితో పాటు.. 30కి పైగా ఆపిల్ ఫోన్స్, 31 ఆపిల్ ట్యాబ్స్ స్వాధీనం చేసుకున్నారు. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. తీగలాగితే డొంక కదులుతోంది. పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌజ్, సోమాజిగూడ లెజెండ్ తులిప్స్ లో ఫ్లాట్, శేరిలింగంపల్లిలో అధితలో ఫ్లాట్, మల్కాజిగిరి, చేవెళ్లలో ప్లాట్స్, నాగరకర్నూల్ లో 12.13ఎకరాలు, చేవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్ లో భూములు, ప్లాట్స్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అంతేకాకుండా.. 90 ఎకరాల ల్యాండ్ పత్రాలు సీజ్ చేశారు అధికారులు.

పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులను నియమించిన బీజేపీ..
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జ్ సహా ఇంఛార్జిలను నియమించింది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్‌గా వ్యవహరించిన ప్రకాశ్ జవదేకర్‌ను కేరళ ఇంఛార్జ్‌గా నియమించింది. అండమాన్ నికోబార్‌కు సత్యకుమార్, అరుణాచల్ ప్రదేశ్‌కు ‍‌అశోక్ సింఘాల్, చండీగఢ్‌కు విజయభాయ్ రూపానీ, గోవాకు ఆషిశ్ సూద్, డయ్యూ డామన్‌కు పూర్ణేశ్ మోదీ, హర్యానాకు బిప్లవ్ కుమార్ దేవ్, హిమాచల్ ప్రదేశ్‌కు శ్రీకాంత్ శర్మలను నియమించింది బీజేపీ హైకమాండ్. అంతేాకాకుండా.. జమ్ము కాశ్మీర్‌, లడ్డక్ ఎన్నికల ఇంఛార్జిగా తరుణ్ చుగ్, ఝార్ఖండ్‌కు లక్ష్మీకాంత్ బాజ్ పేయి, కర్ణాటకకు రాధామోహన్ దాస్ అగర్వాల్, లక్షద్వీప్‌కు అర్వింద్ మీనన్, మధ్యప్రదేశ్‌కు మహేంద్ర కుమార్ సింఘ్ ను నియమించారు. ఒడిశాకు విజయ్ పాల్ సింఘ్ తోమర్, పుదుచ్చేరికి నిర్మల్ కుమార్, పంజాబ్‌కు విజయ్ భాయ్ రూపానీ, సిక్కింకు దిలీప్ జైశ్వాల్, తమిళనాడుకు అరవింద్ మీనన్‌ను, ఉత్తర ప్రదేశ్‌కు వైజయంత్ జై పాండా, ఉత్తరాఖండ్‌కు దుశ్యంత్ కుమార్, వెస్ట్ బెంగాల్‌కు మంగల్ పాండేలను నియమించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికల సహా ఇంఛార్జిగా పొంగులేటి సుధాకర్ రెడ్డిని నియమించింది బీజేపీ.

నితీష్‌కు కూటమి నేతల ఫోన్లు.. అటువైపు నుంచి ఆన్సర్ ఇదే..!
బీహార్ పరిణామాలతో ఇండియా కూటమిలో గందరగోళం నెలకొంది. అసలేం జరుగుతుందో అర్థం కాక నేతలు సతమతమవుతున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు సింగిల్‌గానే లోక్‌సభ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా జేడీయూ కూడా ఇండియా కూటమికి రాంరాం చెప్పబోతున్నట్లు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. ఈ అనిశ్చితితో కూటమి నేతలు కన్‌ఫ్యూజ్‌తో తలలు పట్టుకుంటున్నారు. క్షణక్షణం రాజకీయాలు చకచక మారిపోతున్నాయి. లేటెస్ట్‌గా నితీష్ ఇస్తు్న్న ట్విస్టుతో నేతలంతా అయోమయానికి గురయ్యారు. ఇదిలా ఉంటే బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఇండియా కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మాత్రం వారికి అందుబాటులోకి రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈనెల 30న బీహార్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొవాలని నితీష్‌కు గతంలోనే కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు స్వయంగా సోనియాగాంధీ ఫోన్ చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే నితీష్‌కుమార్ ఇలా చేశారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

రాహుల్ గాంధీ పోటీ చేసేది అక్కడి నుంచే..క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత..
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో దేశంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అన్ని పార్టీలు తన ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే దీనికి ఆ పార్టీ నేత, ఎంపీ కే మురళీధరన్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తారని చెప్పారు. కేరళలో ఒక్క కన్నూర్ మినహా సిట్టింగ్ ఎంపీలంతా సిట్టింగ్ స్థానాలను నుంచే పోటీ చేస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తారని, దాంట్లో ఎలాంటి మార్పు లేదని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ అమేథీ నుంచి కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. అయేథీలో బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. వయనాడ్‌లో అఖండ మెజారిటీలో గెలిచారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఇండియా కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాడుతున్నామని చెప్పారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ గురించి మాట్లాడుతూ.. ఆయన కూటమిలో ఉంటే ఉండొచ్చని లేకుంటే ఆయన ఇష్టప్రకారం వెళ్లొచ్చని, కూటమిని అతడిని బయటకు వెళ్లాలని ఫోర్స్ చేయదని అన్నారు. మమతా బెనర్జీతో పొత్తులపై చర్చలు కొనసాగుతున్నయని మురళీధరన్ అన్నారు. కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్యే పోటీ ఉంటుందని, అక్కడి బీజేపీకి ఎలాంటి బలం లేదని ఆయన చెప్పారు.

నా కూతురు అతడికి పుట్టలేదు.. హాట్ టాపిక్ గా హీరో ఎఫైర్
కన్నడ స్టార్ హీరో దర్శన్ ఎఫైర్ ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. హీరోయిన్ పవిత్ర గౌడతో దర్శన్ పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకొని కలిసి ఉంటున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మధ్యే పవిత్ర ఒక పోస్ట్ పెట్టింది. పదేళ్లు వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ ను వీడియో రూపంలో పెట్టి.. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక అది చూసిన దర్శన్ భార్య విజయలక్ష్మీ రచ్చ చేయడం మొదలుపెట్టింది. పవిత్ర సెట్ కు వెళ్లి ఆమెను చెడామడా తిట్టేసి వచ్చేసినట్లు, తన భర్తను వదిలేయమని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తరువాత పవిత్రను సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. పచ్చని కాపురంలో నిప్పులు పోసావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పవిత్ర కు పుట్టిన కూతురు కూడా దర్శన్ వలనే అని చెప్పుకొచ్చారు. ఇక దీంతో పవిత్ర తన ఆవేదనను మొత్తం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ” నా పేరు పవిత్ర గౌడ. దర్శన్, నేను పదేళ్లుగా రిలేషన్ లో ఉన్నాం. ఈ విషయం అతని భార్య విజయలక్ష్మీకి కూడా తెలుసు.. మేము ఫోన్ లలో కూడా మాట్లాడుకొనేవాళ్ళం. మేమిద్దరం కలిసి ఉంటున్నందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. సరైన సమయం వచ్చినప్పుడు అందుకు తగిన ఆధారాలు చూపిస్తాను. ఇక నాకు ముందే సంజయ్ అనే వ్యక్తితో పెళ్లి అయ్యింది. మాకు పుట్టిన పాపనే ఖుషి. మా ఇద్దరి మధ్య విబేధాల వలన మేము విడిపోయాము. నా మొదటి పెళ్లికి సంబంధించిన విడాకుల పత్రాలు కూడా చూపిస్తాను. నా గురించి విజయలక్ష్మీ చాలా తప్పుగా మాట్లాడుతుంది.. నన్ను, నా కూతురిని తప్పు పడుతున్నారు. నన్ను ప్రేమిస్తున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరైనా నన్ను ఇబ్బందులకు గురిచేస్తే కోర్టుకు వెళ్లడానికి కూడా వెనుకాడను” అంటూ చెప్పుకొచ్చింది. మరి వీరి వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

ఆంజనేయ స్వామి కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు.. ఎందుకంటే?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. మొదటి తెలుగు సూపర్ హీరో సినిమాగా ముందు నుంచి దీన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. మొదటి అటు నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ రోజుకి 250 కోట్ల రూపాయలు గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు సినిమా యూనిట్ ప్రకటించి ఒక గ్రాటిట్యూడ్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ గ్రాటిట్యూడ్ మీట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ ఒకానొక సమయంలో హనుమంతుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ రామాయణంలోని సుందర కాండలో ఈ విషయం పేర్కొన్నారని ఆయన చెప్పుకొచ్చారు. లంకకు వెళ్లి సీతాదేవిని వెతుకుతున్న సమయంలో ఆమె కనిపించకపోవడంతో నిరాశ చెంది హనుమంతుడు చనిపోవాలని భావించాడని ఆయన అన్నారు. ఒకవేళ ఇంత కష్టపడి ఇక్కడికి ఎగిరి వచ్చి ఆమె కనిపించక మళ్ళీ వెనక్కి వెళ్లి రాములవారికి చెబితే ఆయన పరిస్థితి ఏమిటి? వానర సైన్యం పరిస్థితి ఏమిటి? అయోధ్య వాసుల పరిస్థితి ఏమిటి? మిధిలా వాసుల పరిస్థితి ఏమిటి? వాళ్ళందరూ ప్రాణత్యాగానికి సైతం వెనుకాడరు, అంతమంది ప్రాణత్యాగం చేయడం కంటే నేను నా ప్రాణం త్యాగం చేస్తే మంచిది కదా అని భావించినట్లు రంగరాజన్ వెల్లడించారు. ఎలా చేసుకోవాలి అనేది కూడా ఆయన ఆలోచించారని కూడా ఆయన పేర్కొన్నారు. చెట్టుకి ఉరేసుకోవాలి లేదా నిప్పుల్లో దూకాలి లేదా సముద్రంలో పడిపోతాను అదీ కుదరకపోతే ఆహారమే స్వీకరించుకుండా అలా పడుకుంటాను ఏదో ఒక క్షుద్ర జంతువు వచ్చి నన్ను తినేస్తుంది అని ఆలోచించిన తరువాత మళ్లీ ఆయన స్వయంగా తనకు తాను సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకొని సీతమ్మవారిని వెతకడానికి బయలుదేరి వెళ్లాడని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

చిరంజీవికి పద్మ పురస్కారం.. సంతోషంగా ఉన్నట్లు నటిస్తాను
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదం లేకపోతే వర్మకు నిద్రపట్టదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మధ్య సినిమాలను పక్కన పెట్టి.. ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. అందరికి నచ్చిన ఏ పని వర్మకు నచ్చదు. ఇక నిన్నటికి నిన్న మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇండస్ట్రీ మొత్తం చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చిరుకు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. అయితే అందులో కూడా చిరును తప్పుగా ట్యాగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ” శ్రీ పద్మా సుబ్రహ్మణ్యం లేదా శ్రీ బిందేశ్వర్ పాఠక్ గురించి నేను ఎప్పుడూ వినలేదు మరియు వారిని మెగా స్టార్‌తో సమానమైన స్థితిలో ఉంచడానికి, నేను అవార్డుతో థ్రిల్‌గా లేను, అయితే చిరంజీవి గారికి సంతోషంగా ఉంది అంటే నేను కూడా సంతోషంగా నటిస్తాను” అని రాసుకొచ్చాడు. ఇక చిరు ట్విట్టర్ @kchirutweets కి బదులు @chirutweets అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే వర్మ ప్రస్తుతం జగన్ బయోపిక్ వ్యూహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో వర్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.