NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

అదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా..! పవన్‌ కల్యాణ్‌కు పేర్నినాని కౌంటర్‌..
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. రాజోలు, రాజానగరం స్థానాలకు పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థులను ప్రకటించడంపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. రాజకీయ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని.. ఇప్పటికే వీళ్ల డ్రామాలకు ప్రజలు నవ్వుకుంటున్నారు.. తాజాగా మరో కొత్త డ్రామా తెరపైకి తీసుకుని వచ్చారని దుయ్యబట్టారు. గడచిన నాలుగున్నరేళ్లుగా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీకి ఇంఛార్జిలే లేరని.. ఆ రెండు నియోజకవర్గాలను చంద్రబాబు.. జనసేనకే వదిలేశాడన్న ఆయన.. తనకు కేటాయించిన సీట్లనే పవన్ కల్యాణ్‌ ఈ రోజు ప్రకటించాడు.. కానీ, తనపై జనసైనికుల్లో, పార్టీ నేతల్లో వస్తున్న వ్యతిరేకత చల్లార్చెందుకే ఈ అభ్యర్థుల ప్రకటన డ్రామా..! అని ఎద్దేవా చేశారు. తనని తిడుతున్న పార్టీ కార్యకర్తలను జోకొట్టడానికి ఇదో డ్రామా మాత్రమే.. నిజంగా పవన్ కల్యాణ్‌కు పౌరుషం నికార్సు అయినది అయితే.. కీలక స్థానాలను ప్రకటించే వాడన్నారు. ఇక, వన్‌కు అంత పౌరుషం ఉంటే వైజాగ్, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదు..? అని నిలదీశారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాగా అభివర్ణించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.

ఢిల్లీకి పవన్ కళ్యాణ్..? పొత్తులపై త్వరలో రానున్న క్లారిటీ..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అందులో భాగంగా త్వరలోనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు.. పొత్తుల విషయంలో బీజేపీతో క్లారిటీ తీసుకోనున్నారు. పొత్తులపై బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరపనున్నారు.. ఇక, పవన్‌ కల్యాణ్‌తో భేటీ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఏదేమైనా వీలైనంత త్వరలోనే పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు.. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.. అయితే, ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా పొత్తులపై క్లారిటీకి వచ్చేయాలని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారట. కాగా, ఏపీలో బీజేపీ-జనసేన పొత్తులో ఉండగా.. ఆ మధ్యే తెలుగుదేశం పార్టీతో జత కట్టాలని జనసేన నిర్ణయానికి వచ్చింది. కానీ, టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. ఇదే సమయంలో.. జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉందని ఇరు పార్టీల నేతలు చెబుతూ వస్తున్నారు.. కానీ, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై క్లారిటీ లేదు.. ఇక, ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. మూడు పార్టీల పొత్తుపై ఓ నిర్ణయానికి వచ్చే దశగా చర్చలు సాగుతున్నాయి.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్‌ డెడ్‌లైన్‌.. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాల్సిందే..!
వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ ఎమ్మెల్యేలను విచారణకు రావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుందని.. ఈ రోజు ఉదయం పూట విచారణకు రావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం సమయంలో విచారణకు రావాల్సిందిగా టీడీపీ రెబెల్స్‌కు నోటీసులు జారీ చేసింది స్పీకర్‌ కార్యాలయం.. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ ఆదేశాలు జారీ చేసింది. కాగా, వివరణ ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని ఇప్పటికే స్పీకర్‌కు వైసీపీ రెబెల్స్ లేఖ రాసిన విషయం విదితమే. కాగా, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు లేఖ రాసిన విషయం విదితమే.. తమకు అందిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి.. స్పీకర్ కార్యాలయానికి విడివిడిగా లేఖలు పంపారు. ఇక, తాము అందుకున్న నోటీసులను పరిశీలించాల్సిన అవసరం ఉంది.. తమపై ఫిర్యాదు చేసిన వారు సమర్పించిన ఆధారాలను అందించాలని.. వాటిని పరిశీలించేందుకు 4 వారాల గడువు కూడా ఇవ్వాలంటూ స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. సహజ న్యాయ సూత్రాల ప్రకారం రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. నోటీసులతో పాటు పంపిన పేపర్, వీడియో క్లిప్పింగ్‌లు అసలైనవో.. మార్ఫింగ్ చేసినవో నిర్ధారించుకోవాలి కదా? అని ప్రశ్నించారు.. మరోవైపు.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్‌, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు.. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ రెబల్స్‌కు కూడా స్పీకర్‌ కార్యాలయంలో నోటీసు ఇవ్వడంతో.. ఈ నెల 29వ తేదీన ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.

చందనవెల్లి భూ బాధితులకు డిప్యూటీ సీఎం భరోసా..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చందనవెల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సంద్భంగా.. చందనవెల్లి భూ బాధితులు ఆయనను కలిశారు. అనంతరం వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 190లోని భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. ఎంజాయ్ మెంట్ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను భూ సేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తూ ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా అప్పుడు కూడా భూ భాధితులు తన దృష్టికి తీసుకువచ్చారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అవకతవకలతో భూసేకరణ జరిగిందని, భూసేకరణ పరిహారం అర్హులకు రాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారని దీనిపై విచారణ చేయాలని భూ బాధితులు కోరారని భట్టి విక్రమార్క తెలిపారు. భూ భాధితుల విజ్ఞప్తి మేరకు నిజమైన లబ్ధిదారులకు పరిహారం ఇప్పించేందుకు సమగ్ర విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. నిజమైన లబ్ధిదారులకు రావలసిన పరిహారం డబ్బులను కొల్లగొట్టిన దళారులపై విచారణ చేయించి.. వాస్తవాలు బయటికి తీసుకు వస్తామని అన్నారు. భూ బాధితులకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటానన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పరిశ్రమలు అన్యాయం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

ఖైదీలకు గుడ్‌న్యూస్.. జైలు నుంచి ఎంతమంది విడుదలయ్యారంటే..!
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కొంత మంది ఖైదీలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. జీవిత ఖైదు అనుభవిస్తూ అనారోగ్యం, వృద్ధాప్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఖైదీల శిక్షాకాలాన్ని తగ్గిస్తూ క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జైళ్లలో మంచి ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలు ఎంపికయ్యారు. జీవితకాల ఖైదీలు 212 మంది, జీవితేతర ఖైదీలు 19 మందిని అధికారులు విడుదల చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఖైదీల కుటుంబాల్లో సంతోషం వెల్లువిరుస్తోంది. ఇక ఎంతో కాలంగా కుటుంబాలకు దూరమైన ఖైదీలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం రెండు విడతల్లో 400 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. తాజాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక ఒకేసారి ఏకంగా 231 మంది ఖైదీల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

అధికారం కోసం లాలూ విశ్వప్రయత్నాలు.. మద్దతు కోసం డిప్యూటీ సీఎం పదవులు ఆఫర్..
బీహార్ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. నితీష్ కుమార్ జేడీయూ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో బంధం విచ్ఛిన్నమైంది. ఇరు పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. దీంతో మరోసారి నితీష్ కుమార్ తన పాత స్నేహితుడైన బీజేపీ సాయంతో అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే లాలూ కూడా అధికారం కోసం పావులు కుదుపుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 122 మార్కును చేరుకోవాలి. అయితే ప్రస్తుతం ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలన్నింటికి కలిపి మరో 8 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. దీంతో ఇతర పార్టీలు, స్వతంత్రులకు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మాజీ బీహార్ సీఎం జితన్ రామ్ మాంఝీ కుమారులు తమ మహాఘటబంధన్ లో చేరితో లోక్‌సభ స్థానాలతో పాటు ఉపముఖ్యమంత్రి పదవికి కూడా లాలూ ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఆయన ఇండియా కూటమిలో ఉండి ఉంటే ప్రధాని అయ్యేవారు..
బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి, బీహార్ లోని మహాఘటబంధన్ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో సమాజ్‌వాదీ(ఎస్పీ) నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ ఇండియా కూటమిలో ఉండి ఉంటే ఆయన ప్రధాని యఅ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓ జాతీయ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో ఎవరైనా ప్రధాని పోస్టుకి పరిగణించవచ్చు, నితీష్ కుమార్ సరైన మద్దతుతో పోటీదారుగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. మళ్లీ బీజేపీతో నితీష్ కుమార్ కలుస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీతో జేడీయూ బంధం విచ్ఛిన్నమైందనే వార్తల నేపథ్యంలో జనవరి 28న బీజేపీ మద్దతుతో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ ఇండియా కూటమిలోనే ఉండాలని అఖిలేష్ యాదవ్ కోరారు. టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు అసంతృప్తితో ఉన్నసమయంలో కాంగ్రెస్ చొరవ చూపించాల్సి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ప్రధాని పదవి కోసం పోటీ పడటం లేదని, ప్రాంతీయ పార్టీలు తమకు ఎక్కువ బలం ఉన్న చోట ప్రాధాన్యత ఇవ్వాలని అఖిలేష్ యాదవ్ కోరారు.

అంగారకుడిపై నాసా “హెలికాప్టర్” ఇక పనిచేయదు.. పలుచటి వాతావరణంలో అద్భుతం సృ‌ష్టించింది..
అంగారకుడిపై చరిత్ర సృష్టించిన నాసా ‘ఇన్‌జెన్యూనిటీ’ హెలికాప్టర్ తన ప్రస్థానాన్ని ముగించింది. రోబోట్ హెలికాప్టర్ లోని ఒక రోటర్ విరిగిపోవడంతో ఇక అది పైకి ఎగరలేదని నాసా తెలిపింది. జనవరి 18న చివరిసారిగా తన 72వ ఫ్లైట్ తర్వాత పాడైపోయింది. దీనిని నాసా జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీ రూపొందించింది. అనుకున్న దానికన్నా ఎక్కువ సార్లు, విజయవంతంగా అంగారకుడి వాతావరణంలో ఇది అద్భుతంగా పనిచేసింది. మొత్తంగా 2 గంటల 8 నిమిషాల పాటు 72 సార్లు నింగిలోకి వెళ్లింది. 17 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. గరిష్టంగా 24 మీటర్ల ఎత్తు వరకు పైకి వెళ్లింది. 4-పౌండ్ (1.8-కిలోల) రోటర్ క్రాఫ్ట్ ఏప్రిల్ 19, 2021న ఇది మార్స్ పైకి చేరింది. మూడేళ్ల క్రితం నాసా పంపిన ‘పర్సువరెన్స్’ రోవర్‌తో పాటు ఇన్‌జెన్యూనిటీ హెలికాప్టర్ మార్స్ మీదికి చేరింది. ఇది అంగారకుడి భూభాగంలోని జెరెజో బిలం వద్ద పనిచేసింది. భూమితో పోలిస్తే అత్యంత పలుచటి వాతావరణంలో హెలికాప్టర్ పనిచేస్తుందా.? లేదా? అనే సందేహాల నడుమ ఇది అద్భుతాన్ని సృ‌ష్టించింది. భవిష్యత్తులో మానవ ఆవాసాలకు ఆస్కారం ఉన్న మార్స్‌పై శాస్త్రవేత్తల ఆశల్ని ఇన్‌జెన్యూనిటీ మరింతగా పెంచింది. అంగాకరకుడిపై భూమి కన్నా తక్కువ గురుత్వాకర్షణ ఉండటంతో పాటు, భూమితో పోలిస్తే వాతావరణ కేవలం 1 శాతం మాత్రమే దట్టంగా ఉంటుంది. దీంతో ఏరో డైనమిక్ లిఫ్ట్ పొందడం కష్టతరంగా మారుతుంది. అయినప్పటికీ ఇన్‌జెన్యూనిటీ మాత్రం శాస్త్రవేత్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పలుచని, తేలికైన వాతావరణంలో, ఉష్ణోగ్రతల వత్యాసం అధ్యధికంగా ఉన్నప్పటికీ ఇది అన్నింటిని తట్టుకుని పనిచేసింది.

టాటా-ఎయిర్‌బస్ కీలక ఒప్పందం.. సంయుక్తంగా హెలికాప్టర్ల తయారీ..
భారత గణతంత్ర వేడుకులకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మక్రాన్ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జైపూర్ నగరంలో ఆయనను ఆప్యాయంగా ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడేందుకు ఈ పర్యటన దోహదం చేసింది. ఇప్పటికే భారత్ ఫ్రాన్స్ నుంచి రాఫేల్ వంటి బిగ్ డీల్స్ చేసుకుంది. ముఖ్యంగా వైమానిక, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడనున్నాయి. తాజాగా టాటా-ఎయిర్ బస్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రెండు సంస్థలు కలిసి ఎయిర్ బస్ సివిల్ హెలికాప్టర్లను తయారు చేయనున్నాయి. భారత్ లోనే స్థానికీకరణను ప్రోత్సహించే చర్యల్లో భాగంగానే ఈ ఒప్పందంపై సంతకం చేశామని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా శుక్రవారం తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ భారత్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆయన తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డుపై అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటో తెలుసా?
రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందించింది.. సినీ, రాజకీయా రంగాలతో పాటుగా అనేక రంగాల్లో తమ ఎనలేని సేవలను అందించిన ప్రముఖులు ఎందరో ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు.. అందులో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ రాజకీయ వేత్త మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు.. మెగాస్టార్ చిరంజీవికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. మెగా కోడలు ఉపాసన కూడా మామయ్యకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.. రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.. తాజాగా మేనల్లుడు అల్లు అర్జున్ కూడా తన మామకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. పద్మ విభూషణ్ పురస్కారానికి ఈ ఏడాది చిరంజీవి పేరు ప్రకటించడంపై అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు.. అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డు కు ఎంపికైనందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. కుటుంబం, అభిమానులతోపాటు యావత్ తెలుగు వారికి ఇది ఎంతో గర్వకారణం. ఈ విజయంపై సంతోషంగా ఉన్నాను. మేము గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

నా క్యారెక్ట‌ర్ ని త‌ప్పుబ‌ట్టారు.. భర్తతో విడాకులపై మొదటిసారి స్పందించిన నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారిక. ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆలోపే చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహాన్ని పెద్దలు నిశ్చయించడంతో 2020 లో వీరి వివాహం జైపూర్ లో గ్రాండ్ గా జరిగింది. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్ధం చేసుకోని బతకడం. అది ఈ జంట వలన కాలేకపోయింది. విబేధాల వలన ఈ జంట గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తరువాత నిహారిక.. కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఫుడ్, ట్రావెల్, ఫిట్ నెస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తూ తన గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నటిగా, నిర్మాతగా కొత్త అవతారాలు ఎత్తుతూ సక్సెస్ కోసం కష్టపడుతుంది. ఇప్పటివరకు విడాకుల గురించి మాట్లాడని నిహారిక ఒక పాడ్ కాస్ట్ లో భర్తతో విడాకులపై మొదటిసారి నోరు విప్పింది. ” పెళ్లి తరువాత నటనను వదిలేస్తారా.. ? అని అడుగుతారు. ఈ మధ్య మా వదిన లావణ్యను కూడా అదే అడిగారు. పెళ్లి తరువాత నటనను ఎందుకు వదిలేస్తాం. అదే మా వృత్తి. ఖచ్చితంగా నటిస్తాం. నిర్మాతగా మారడం వలన నటనకు కొద్దిగా గ్యాప్ ఇచ్చాను. అయితే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునేముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి. అది జరుగకపోతే మనకు సెట్‌ అవని వ్యక్తిపై ఆధారపడకూడదు. ఎందుకంటే వాళ్లు మన ఇంట్లో అమ్మానాన్నలా ఉండరు కదా.. ముఖ్యంగా అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరు. అందుకే ఎవరి మీదా ఆధారపడకుండా ఒంటరిగా ఉండడం నేర్చుకున్నాను. నాది పెద్ద‌లు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్న స‌మ‌యంలో నన్ను చాలా మాటలు అన్నారు.ఆ బాధ తట్టుకోలేక ఎంతో ఏడ్చాను. అలాంటి వాటిని భ‌రించ‌డం అంత ఈజీ కాదు. ఎవ‌రైనా జీవితంలో క‌లిసి ఉండాల‌నే పెళ్లి చేసుకుంటారు.

హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరో… భార్య సంచలనం?
కన్నడ అభిమానులందరూ డి బాస్ అని పిలుచుకునే దర్శన్ ఇప్పుడు అనూహ్యంగా వార్తలోకి ఎక్కాడు. నిజానికి దర్శన్ హీరోగా నటించిన కాటేరా సినిమా సలార్ రిలీజ్ అయిన వారం రోజులకు రిలీజ్ అయి దాదాపు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఆయనకు ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లు ఇప్పుడు కన్నడ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా దర్శన్ ఇంట్లో గొడవలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. దానికి కారణం కూడా ఒక హీరోయిన్ అని అంటున్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, పవిత్ర గౌడ అనే హీరోయిన్ తో గొడవ పెట్టుకున్నట్లుగా శాండల్ వుడ్ లో వార్తలు వస్తున్నాయి. నిజానికి దర్శన్ పవిత్ర గౌడ మధ్య ఏదో ఎఫైర్ ఉందని ఎప్పటినుంచో వార్తలు ఉన్నాయి. దానికి మరింత బలం చేకూర్చే విధంగా ఇటీవల పవిత్ర గౌడ తన సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తుంది. తాను దర్శన్ తో కలిసి ఉన్న ఫోటోలన్నింటిని ఒక వీడియోగా చేసి అందులో షేర్ చేసి మా రిలేషన్ పూర్తయి 10 సంవత్సరాలు దాటిందని రాసుకొచ్చింది. దీంతో ఆ పోస్టు చూసి నడిచెను షాక్ కి గురయ్యారు. ఇక ఈ పోస్ట్ చేసిన తర్వాత విజయలక్ష్మి పవిత్ర గౌడ్ తో గొడవ పెట్టుకుందని వర్షంతో కనిపించోద్దని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు శాండల్ వుడ్ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని ఆమె హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి అనేది క్లారిటీ లేదు.