గ్రూప్-1 అభ్యర్థులకు ఊరట.. 28 వరకు అవకాశం..
రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ.. గత నెలలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే.. 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ.. ఈ ఏడాది మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఆఫ్‌లైన్ మోడ్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.. డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించబోయే మెయిన్ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు.. ఇక, ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం.. గ్రూప్-1 పోస్టులకు జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించారు.. డిప్యూటీ కలెక్టర్ 9, డీఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. తాజాగా, గ్రూప్-1 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ ఊరట కలిగించే వార్త చెప్పింది. గ్రూప్-1 కు ప్రిపేరై సమయంలోపు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోయినవారికి ఏపీపీఎస్సీ ఊరట కలిగించే న్యూస్ చెప్పింది.. గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంచింది.. ఈ నెల 21వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసిపోగా.. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ .. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఈ నిర్ణయం తీసుకుంది.. కాగా, మార్చి నెల 17వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు.. గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18, డీఎస్పీ (సివిల్) 26, రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ 6, కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2, జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనుంది ఏపీపీఎస్సీ.
పార్టీని బతికించటం కాదు.. అధికారంలోకి తీసుకొద్దాం..
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎష్ షర్మిల.. శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆమె.. బస్సులో తోటి ప్రయాణికులతో మాట్లాడారు.. ఇక, పీసీసీ చీఫ్ హోదాలో మొదటిసారి ఆమె శ్రీకాకులంలో పర్యటించారు.. ఈ సందర్భంగా బస్సులోనే మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ను షర్మిల స్వీకరించారు. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడటానికి తాను సిద్ధంగా ఉన్నానని.. డేట్, టైమ్ మీరు చెప్పినా.. మమ్మల్ని చెప్పమన్నా సరే.. ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించండి అంటూ సవాల్ విసిరారు.. మరోవైపు.. నాలుగేళ్ల పాలన చూసి జగన్ రెడ్డిని విమర్శిస్తుంటే.. వైసీపీ నేతలు ఫీలవుతున్నారని ఎద్దేవా చేసిన ఆమె.. సరే జగన్ రెడ్డి అంటే మీకు ఇబ్బందిగా ఉంటే.. ఇక నుంచి జగనన్న గారు అని పిలుస్తాను కౌంటర్ కౌంటర్ ఎటాక్‌కు దిగారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం ఈనాటికీ తగ్గలేదు.. ఇప్పుడున్నది రాజశేఖర్ రెడ్డి కొడుకే.. కానీ, రాజేఖర రెడ్డి పాలన అయితే లేదని దుయ్యబట్టారు. రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం తప్పించేవారు.. రాజశేఖర్ రెడ్డి ప్రాణం పెట్టింది రచ్చబండ కార్యక్రమం కోసం.. ఏ ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం చేయలేదు, రాచ్చబండ కార్యక్రమంకి వెళ్లలేదన్నారు. ఏపీ నుండి బీజేపీకి ఒక్క ఎంపీని ప్రజలు గెలిపించలేదు.. కానీ, ప్రభుత్వం మొత్తం బీజేపీ గుప్పెట్లో ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలైపోయారు.. ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయింది అని హాట్ కామెంట్లు చేశారు.
గ్రామీణ స్కీమ్‌లకు 80 శాతం కేంద్రం నిధులే..
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కేపీ సింగ్ బాఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బాఘేల్ విస్తృతంగా పర్యటించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రరభుత్వం కొత్త పథకాలను గ్రామీణ స్థాయిలో తీసుకువెళ్తుందని వెల్లడించారు. ఇక, గ్రామీణ పథకాలకు 80 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులే.. 20 శాతం నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలియజేశారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మన్ పథకం అందరికీ ఉపయోగపడుతుందన్నారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి.. అన్ని పీహెచ్‌సీ హెల్త్ ఎండ్ వెల్నెస్ సెంటర్స్ కి మేం 60 శాతం ఫండ్ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు ఎస్పీ సింగ్ బాఘేల్.. మాకంటూ ఒక పార్టీ, మాకంటూ ఒక ఐడియాజీతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందుకు వెళ్తుందని వెల్లడించారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బాఘేల్.
ఆయన పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు.. టీడీపీ కౌంటర్ ఎటాక్
రాష్ట్రంలో చంద్రబాబు కోసమే స్టార్ కాంపెయినర్లు ఎంట్రీ ఇస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై కౌంటర్ ఎటాక్‌కు దిగింది టీడీపీ.. ఉరవకొండ పర్యటనలో సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేయగా.. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. సీఎం జగన్ అసరా సమావేశంలో నిధులు విడుదల చేసినట్లు గొప్పగా ప్రకటించారు. ఐదేళ్లలో జిల్లాకు ఎం చేశారో చెబుతాడు అనుకున్నాం. కానీ, చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఓ రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి అంత బలహీనంగా.. తనకు మీడియా లేదు అన్నట్లు సానుభూతి కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పతనం తప్పదు అని తెలిసే బెలగా మాట్లాడుతున్నాడు.. సీఎం నిన్నటి వరకు ప్రతిపక్షాలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో చూశాం.. సీఎం వైఎస్ జగన్ పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న జనమే మా స్టార్ క్యాంపెయినర్లు అన్నారు పయ్యావుల కేశవ్.. రాయలసీమలో చుక్క నీటి కోసం ఆందోళన చేసిన ప్రతి రైతు స్టార్ క్యాంపెయినరే.. రాష్ట్రంలో 27 పథకాల రద్దుతో నష్టపోయిన రైతులు, 37 పథకాల రద్దుతో నష్టపోయిన బీసీ సోదరులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన మా స్టార్ క్యాంపెయినర్లే అని పేర్కొన్నారు. మోసపోయిన అంగన్వాడీ లు, ప్రభుత్వ ఉద్యోగులు, నష్టపోయిన పోలీసులు కూడా మా స్టార్ క్యాంపెయినర్లే అని తెలిపారు. ఇక, మీ స్టార్ క్యాంపైనర్లంతా దోపిడీలు చేస్తున్న వర్గమే అని దుయ్యబట్టారు. ఉరవకొండకు ఏమైనా చేసింది చెబుతాడా అని అనుకున్నాం.. 80 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అని చెప్పిన సీఎం.. 8 ఎకరాలకు నీళ్లు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. హంద్రీ నీవాలో తట్టెడు మట్టి తీయలేదు.. బీటీ, పేరూరు ప్రాజెక్ట్ లు, హంద్రీ నీవా 36 ప్యాకేజీ ఏమి చేశారో చూస్తున్నాం అని మండిపడ్డారు.
ఫిబ్రవరి 3 నుంచి బీఆర్‌ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు
లోక్‌సభ సెగ్మెంట్ల సన్నాహక సమావేశాల తర్వాత, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించనుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే పరాజయం పాలైనట్లు పార్టీ భావించింది. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు మాట్లాడుతూ.. జనవరి 3న ఆదిలాబాద్‌తో ప్రారంభమైన సమావేశాలు సోమవారం నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంతో ముగుస్తున్నాయన్నారు. “గత 16 సమావేశాల తీరు చూస్తుంటే పార్టీ శ్రేణులు పార్టీకి ధైర్యం చెప్పారు. నల్గొండలో ఎన్నికల ప్రచారం మాకు అనుకూలంగా ఉందని, ఎక్కడా ఓటమిపై అనుమానం లేదని, కానీ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉన్నాయని, సూర్యాపేటలో మాత్రమే పార్టీ గెలిచిందని రావు అన్నారు. బీఆర్‌ఎస్ నాయకుడు పార్టీ ఓటమికి అనేక కారణాలను ఉదహరించారు, అసత్యాలను వ్యాప్తి చేసే సోషల్ మీడియా ప్రచారాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యాన్ని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు మరియు వారి ప్రస్తుత చర్యల గురించి పార్టీ సభ్యులు ఉదాసీనత విడిచిపెట్టి ప్రజలకు తెలియజేయాలని రామారావు కోరారు. నల్గొండ మునిసిపాలిటీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా వెల్లడైన కాంగ్రెస్, బీజేపీల మధ్య బంధుత్వమని ఆరోపించిన ఆయన, రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీ పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మైనార్టీ వర్గాలకు కాంగ్రెస్, బీజేపీ బంధాన్ని బట్టబయలు చేయాలని రామారావు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సీనియర్ నేత టీ హరీశ్‌రావు పార్టీ నేతలను కోరారు. ఎవరన్నా అని ఆయన అన్నారు అది కావచ్చు, చాలా ఆలస్యం కాకముందే తప్పులను సరిదిద్దాలి.
అభివృద్ధి లేదు కానీ.. హిందు ఓట్ల మీదనే బీజేపీకి ప్రేమ
రాముడిని ఆయుధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు. భద్రాచలం రాముడికి ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదని, రాహుల్ గాంధీకి వస్తున్న ఇమేజ్ ని చూసి ఓర్వలేక బీజేపీ అడ్డుపడే పనిలో ఉందన్నారు. అభివృద్ధి లేదు కానీ.. హిందు ఓట్ల మీదనే బీజేపీకి ప్రేమ అని ఆయన మండిపడ్డారు. రాముడు మీ ఒక్కడికే దేవుడా . ! . మోడీ అన్ని దేవాలయాలు తిరగవచ్చు.. కానీ రాహుల్ గాంధీ వెళ్ళాలి అంటే అనుమతి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నువ్వు పిలిచినప్పుడే గుడికి పోవాలా అని ఆయన ప్రశ్నించారు. అయోధ్యలోనే రాముడు ఉన్నాడా.. భద్రాచలంలో లేడా అని హనుమంత రావు వ్యాఖ్యానించారు. నాకంటే ఎక్కువ రామ భక్తులు ఉన్నాడా..? అస్సాం సీఎం హేమంత్ బిశ్వ రాహుల్ గాంధీ ని రావణుడు అనడాని తీవ్రంగా ఖండిస్తున్నా అని అన్నారు. నీవు అసలు సీఎం వేనా.. మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన అన్నారు. మోడీ రాముడా .. రాహుల్ గాంధీ రావణుడా .. ఇది ఏం న్యాయం అని ఆయన మండిపడ్డారు. మణిపూర్‌లో వందల మంది మహిళలు చనిపోతే మోడీ వెళ్ళారా.. పార్లమెంట్ ఎన్నికల కోసం రాముడిని ఆయుధంగా వాడుకుంటున్నారని వీహెచ్ ధ్వజమెత్తారు.
అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత.. రాహుల్ పై కేసు నమోదుకు సీఎం ఆదేశం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ అస్సాంలో కొనసాగుతుంది. కాగా.. ఈ యాత్రను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో గుహవాటి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 500 మంది కార్యకర్తలతో కలిసి మంగళవారం ఉదయం గుహవాటి నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కాగా.. కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి.. నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, బారికేడ్లను దాటుకుని రావడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ అక్కడే ఉన్నారు. అయితే ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఘర్షణలు జరిగేలా కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు కేసు ఫైల్ చేయాలని తెలిపారు. కాంగ్రెస్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా.. గుహవాటి రోడ్లపై కాంగ్రెస్ యాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పింది. వర్కింగ్ డే రోజు కావడంతో కీలక నగరమైన రహదారులపై యాత్రను అనుమతించడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిపింది. ఈ రోడ్డులో బదులు అస్సాం దిశగా జాతీయ రహదారి మార్గంలో చేపట్టాలని సూచించింది.
‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్’ అంటూ చైనా ఆర్మీ నినాదాలు.. వీడియో వైరల్
ఎన్నో ఏళ్ల కల అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమైంది. సోమవారం ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా ప్రాణప్రతిష్ట చేశారు. కాగా.. ఈ మహోత్సవాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వేయి కళ్లతో ఎదురుచూశారు. అంతేకాకుండా.. ప్రాణప్రతిష్ట జరగగానే రామభక్తులు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు ‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికులతో పాటు చైనా సైనికులు కూడా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఓ టేబుల్ డ్రింక్స్, స్నాక్స్ ఉండగా రెండు దేశాల ఆర్మీ నిలబడి ఉన్నారు. ఇండియన్ ఆర్మీ.. ‘జై శ్రీరామ్’ నినాదాన్ని ఎలా పలకాలో చైనా భద్రతా దళాలకు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. భారత సైనికులు పలికినట్లుగా చైనా సైనికులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియదు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే ఓ మాజీ సైనికుడు దీన్ని ‘ఎక్స్’లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000.. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాస్..
స్టాక్ మార్కెట్ ఈరోజు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల కారణంగా.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయింది, నిఫ్టీ కూడా 329 పాయింట్లకు చేరుకుని నష్టాల్లో ముగిసింది. ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రూ.8 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ఈ క్షీణతలో రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎక్కువగా నష్టపోయాయి. అంతేకాకుండా.. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అమ్మకాలపై ఎక్కువ ప్రభావం చూపాయి. సుమారు మూడు శాతం పడిపోయాయి. అంతేకాకుండా.. దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లకు రూ.8 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలో లిస్టెడ్ షేర్ల మార్కెట్ క్యాప్ రూ.366 లక్షల కోట్లకు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లు పెరిగినప్పటికీ, దేశీయ మార్కెట్‌లో మాత్రం క్షీణత నెలకొంది. ఫార్మా, ఐటీ షేర్లలో కొనుగోళ్లు కనిపించగా.. బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ షేర్లు నష్టపోయాయి. కాగా.. ఈ పతనానికి పశ్చిమాసియా, ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత నెలకొనడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొందని నిపుణులు చెబుతున్నారు. కాగా.. NSEలో సిప్లా, సన్ ఫార్మా, ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ముగిశాయి.
ప్రభాస్ జాతకం కన్నతల్లికి తప్ప ఎవరికీ తెలియదు.. వేణు స్వామి వ్యాఖ్యలపై పెద్దమ్మ ఆవేదన
ప్రభాస్ జాతకం గురించి ఆయన ఆరోగ్యం గురించి వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి అనేకసార్లు అనేక ఇంటర్వ్యూలలో ప్రస్తావిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఇక హిట్ అనేది దక్కదు అని అనేక ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టిన తర్వాత సలార్ సినిమా హిట్ కావడంతో ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని సైతం టార్గెట్ చేశారు. అయితే ఆ సంగతి అలా ఉంచితే తాజాగా కృష్ణంరాజు భార్య ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి జ్యోతిష్యుడు వేణు స్వామి వ్యాఖ్యల మీద స్పందించారు. తాను పెద్దగా సోషల్ మీడియా ఫాలో అవ్వను కానీ ప్రభాస్ జాతకం గురించి ఇలా చెబుతున్నారని తెలిసిన వాళ్ళు నాకు ఆ వీడియోలు చూపించారు. ఆ వీడియోలు చూసిన తర్వాత నాకు చాలా బాధనిపించింది. ఎందుకంటే ప్రభాస్ జాతకం ఏమిటి? అనే విషయం ప్రభాస్ కన్నతల్లికి తప్ప మాకు కూడా తెలియదు. అలాంటి ప్రభాస్ జాతకం గురించి ఆ జ్యోతిష్యుడికి ఎలా తెలిసింది? ఆయన చెప్పేవన్నీ పుకార్లు తప్ప అందులో ఎలాంటి నిజాలు లేవు. ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానుల సైతం నా దృష్టికి తీసుకువచ్చారు. అమ్మ, మీరు ఈ విషయంలో ఖండించాలి లేకపోతే ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి అంటే ఇందులో నేను ఖండించేదేముంది పుకారు అని మీరే చెబుతున్నారు కదా అని తోసిపుచ్చాను, అని ఆమె అన్నారు. నిజానికి ప్రభాస్ జాతకం ఎలాంటిది? ఆయన పుట్టిన ఘడియలు ఏమిటి అనే విషయం తనకు కూడా తెలియవని, అవన్నీ ప్రభాస్ కన్న తల్లికి మాత్రమే తెలుసని ఈ సందర్భంగా శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా శ్యామలాదేవి, ప్రసీద, ప్రభాస్ తదితరులు కృష్ణంరాజు సొంత గ్రామం అయిన మొగల్తూరులో ఒక మెగా షుగర్ క్యాంపు నిర్వహించారు. అయితే ప్రభాస్ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా శ్యామలాదేవి, ప్రసీద మాత్రం అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు.
‘హనుమాన్’లో ఆ పాత్ర రిషబ్ శెట్టి మిస్సయ్యాడు.. చేసి ఉంటేనా, అరాచకం అంతే!!
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. మొదలైనప్పుడు చిన్న సినిమా గానే మొదలైనా రిలీజ్ అయిన తర్వాత మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడమే కాదు రికార్డు స్థాయి కలెక్షన్స్ కూడా రాబడుతోంది హనుమాన్. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి పది రోజులు పూర్తవుతున్నా సరే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు దూసుకు వెళుతోంది. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. నిన్న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతకు ముందు వరకు ప్రమోషన్స్ లోనే ఉన్న ప్రశాంతర్మ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేమిటంటే ఈ సినిమాలో విభీషణుడి పాత్రలో తమిళ స్టార్ యాక్టర్ సముద్రఖని నటించారు. అయితే ఈ పాత్రకు తాను ముందు అనుకున్న వ్యక్తి కన్నడ నటుడు రిషబ్ శెట్టి అని అయితే అప్పటికే ఆయన కాంతార చేసే పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. కాంతార మన దగ్గర రిలీజ్ కాకముందే విభీషణుడి పాత్రకి ఆయన అయితే కరెక్ట్ గా ఉంటాడని నాకనిపించింది. కానీ స్వయంగా దర్శకత్వం వహిస్తూ చేస్తున్న కాంతార సినిమాని పక్కనపెట్టి హనుమాన్ చేయలేకపోతున్నానని ఆయన బాధపడ్డారని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతున్న పది సినిమాలలో ఏదో ఒక సినిమా ఖచ్చితంగా చేస్తానని మాత్రం ఆయన అప్పుడే మాటిచ్చినట్లుగా ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.
‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ సాంగ్ లాంచ్ చేసిన ఆర్జీవీ..
తెలుగులో చాలా మంది హీరోలు వెబ్ సిరీస్ ల ద్వారా ఫెమస్ అయ్యి, సినిమాల్లోకి వచ్చిన వాళ్లే ఉన్నారు.. అందులో తాజాగా 30 వెడ్స్ 21 సిరీస్ తో ఫేమస్ అయిన చైతన్య రావు కూడా ఉన్నారు.. ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.. చైతన్య హీరోగా హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాతో రాబోతున్నాడు.. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా హనీమూన్ ఎక్స్‌ప్రెస్. తనికెళ్ల భరణి, సుహాసిని ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.. ఇక ఈ సినిమాను బాల రాజశేఖరుని తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమా పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను రిలీజ్ చేశారు.. నిజమా.. నిజమా.. ఇది కనులు కలగాలి సాధ్యమా.. అంటూ సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటని కళ్యాణి మాలిక్ సంగీతంలో సింగర్ సునీతతో కలిసి ఆయన కూడా పాడారు. ఈ పాటని సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ రిలీజ్ చేశారు. పాట మెలోడిగా ఉంటూనే రొమాంటిక్ గా కూడా ఉంది. లిరికల్ సాంగ్ రిలీజ్ చేసినా ఇందులో చైతన్య, హెబ్బా మధ్య జరిగే రొమాంటిక్ సీన్స్ ను చూపించారు.. అనంతరం ఆర్జీవీ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాలోని నిజమా సాంగ్ విన్నాను. చాలా మెలోడీగా ఉంది. చిత్రీకరణ, లొకేషన్స్ కూడా బాగున్నాయి. ఈ పాటను నేను విడుదల చేయడం సంతోషంగా ఉంది.. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నాడు.. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ సినిమా. ఆర్జీవీ నా సినిమాలోని సాంగ్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు.. ఒకసారి ఆ సాంగ్ చూసేయ్యండి..
