*భారీ అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
విజయవాడ స్వరాజ్య మైదానంలో ఎల్లుండి భారీ అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రారంభించనున్నారు. 81 అడుగుల వేదికపై 125 అడుగులతో రూ. 400 కోట్లు నిధులతో దీన్ని నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఇక ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. జనవరి 20 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. పర్యాటకులను ఆకట్టుకునేలా లోపల ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం ఏర్పాటు చేశారు. తొలి రోజు 1.20 లక్షల మంది తరలివస్తారని ప్రభుత్వం భావిస్తోంది. విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవం నేపథ్యంలో వైసీపీ పలు కార్యక్రమాలు చేపట్టింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించనుంది. థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు పట్టుకుని అంబేడ్కర్ విగ్రహం వరకు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నాయి. ఇదిలా ఉండగా.. వైసీపీ నాల్గవ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నాలుగవ లిస్ట్‌ను విడుదల చేయడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈరోజు లేదా రేపు 4వ లిస్ట్ ను విడుదల చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 15 నుంచి 20 స్థానాలతో 4వ లిస్టు విడుదల చేయొచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా లిస్ట్ గురించి చర్చించేందుకు ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయానికి కొంతమంది ఎమ్మెల్యేలు,ఎంపీలు రానున్నారని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ కారణంతో.. మూడు రోజులపాటు అభ్యర్థుల మార్పులు-చేర్పుల కసరత్తుకి బ్రేక్ పడింది. తిరిగి ఇవాళ మళ్లీ ఆ చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.
*ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం
నల్లగొండ పట్టణంలో మున్సిపల్ రోడ్ల నిర్మాణంకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపాలిటీనీ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. UPSC తరహాలో గ్రూప్స్ పరీక్షలని నిర్వహిస్తామని, నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సంక్షేమ పథకాల కోసం ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందిస్తామని ఆయన వెల్లడించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారంపై అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి శివాజీనగర్ సెంటర్ నుంచి పానగల్ రోడ్డు వరకు 90 లక్షల రూపాయల NCAP నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు, NG కళాశాల నుంచి రామగిరి వరకు కోటి 30 లక్షల రూపాయల నిధులతో విస్తరిస్తున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ సెంటర్ ని పరిశీలించిన మంత్రి చేపట్టాల్సిన మార్పుల గురించి కలెక్టర్ కి పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో 244 మంది లబ్దిదారులకి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి చేసి మాట్లాడారునల్గొండ ప్రజలు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నాపై పెద్ద బాధ్యత పెట్టారన్నారు మంత్రి. రాబోయే రోజుల్లో నల్గొండ నలువైపులా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. పాత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినట్టు .. కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారులకి సంక్షేమ ఫలాలను అందిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీని ఇప్పటికే 10 లక్షల రూపాయలకి పెంచామని.. మిగతా గ్యారంటీలను 100 శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు.
*శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి(గురువారం) నుంచి ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీడీడీ తెలిపింది. రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ విధానంలో పొందే ఆర్జిత సేవలకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. 23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి సేవా కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
*చంద్రబాబు కేసులో ట్విస్ట్… ఇవాళ విచారణకు రాని ఫైబర్ నెట్ కేసు
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం నాడు విచారణ జరగలేదు. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ బేలా త్రివేది అందుబాటులో లేరు. దీంతో సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ ఇవాళ కూర్చోవడం లేదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ద బోస్ చెప్పారు. విచారణకు మరో తేదిని కేటాయిస్తామని సుప్రీంకోర్టు జడ్డి అనిరుద్ద బోస్ వెల్లడించారు. సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసును విచారించాల్సిన ప్రత్యేక ధర్మాసనం కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణకు మరో తేదీని తెలుపుతామన్నారు. ఈ కేసులో చంద్రబాబు తరపున వాదించడానికి సిద్దార్ధ లూథ్రా కోర్టుకు హాజరయ్యారు. కానీ స్పెషల్ బెంచ్ కూర్చోవడం లేదని జడ్జి చెప్పడంతో మరో తేదీ కోసం ఇరు వర్గాల తరపు న్యాయవాదులు ఎదురు చూస్తున్నారు.
*రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెలాఖరులోగా రైతుబంధు
నిజామాబాద్ ఆంధ్రానగర్‌లో ఎన్.టి.అర్. విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ కానుందని ఆయన వెల్లడించారు. రైతాంగ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆంధ్ర నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు మంత్రి తుమ్మల. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరని, ఎన్టీఆర్ నేటికీ తరానికి ఆదర్శ ప్రాయుడని ఆయన కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన మహా నేత ఎన్టీఆర్ అని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. రెండు లక్షల రైతుల రుణమాఫీని దశలవారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. మైనింగ్ మాఫియాను అరికట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో జరిగిన అక్రమ గ్రావెల్, బెరైటీస్ తవ్వకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అక్కడ జరుగుతున్న మైనింగ్ మాఫియాను అరికట్టాలని, ఎవరినీ వదిలి పెట్టొద్దని హెచ్చరించారు. యాసంగి సీజన్‌లో యూరియా కొరత లేకుండా చూడాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.ఇటీవల నిర్మల్ జిల్లాలో యూరియా కొరతకు సంబంధించి మంత్రి వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నించారు. ఇటీవల జరిగిన లారీల సమ్మె కారణంగానే యూరియా రవాణా సమస్య ఎదురై కొరత ఏర్పడిందని, సమ్మె విరమణ తర్వాత సరిపడా నిల్వలు చేర్చామని అధికారులు మంత్రికి వివరించారు. మార్కెట్లలో మిర్చి ధరలు, పంటలకు తెగుళ్ల నియంత్రణ చర్యలపై మంత్రి సమీక్షించారు. పంటల వైవిధ్యంతో రైతుల ఆదాయం పెంచుకోవడంపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
*మరోసారి చంద్రబాబును అరెస్టు చేయడం ఖాయం
చంద్రబాబుపై కేసు నమోదు, విచారణ, రిమాండ్, అరెస్టు అన్నీ సక్రమమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కానీ కొందరు చంద్రబాబుకు భారీ ఊరటని చెబుతున్నారని, కోర్టు దోషి అని చెప్పినా ఊరట అని వీళ్ళు అంటున్నారని మంత్రి అన్నారు. కేసును క్వాష్ చేయడానికి సుప్రీం కోర్టు అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాథమికంగా చంద్రబాబు దోషి అని తేల్చిందని మంత్రి వెల్లడించారు. 17ఏ కింద అనుమతి తీసుకొని ఉంటే బాగుండేదని మాత్రమే ఒక జడ్జి అభిప్రాయపడ్డారని.. ఇప్పుడైనా తీసుకోమని చెప్పారన్నారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోలేరని మంత్రి కాకాని పేర్కొన్నారు. చంద్రబాబు జీవిత చరమాంకంలో జైలు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. మరోసారి చంద్రబాబును అరెస్టు చేయడం ఖాయమని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని కోరారు.. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.. 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. విస్తృత ధర్మాసనానికి ఈ కేసు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తి చేసింది ద్విసభ్య ధర్మాసనం.. దీంతో, చంద్రబాబు పిటిషన్‌పై సీజేఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది.
*తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు.. రూ.12,400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్
తెలంగాణలో రూ. 12,400 కోట్లు భారీ పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. బహుళ ప్రయోజనాలతో ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు చర్చించి నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. చందనవెల్లిలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. రూ. 1400 కోట్ల పెట్టుబడితో, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 6.0 MTPA సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్ వద్ద కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ మరియు క్షిపణి అభివృద్ధి కేంద్రాలు రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నెల ప్రారంభంలో పోర్ట్స్-సెజ్ సీఈవో, గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరో స్పేస్ సీఈవో ఆశిష్ రాజ్ వంశీ సచివాలయంలో సీఏ రేవంత్ రెడ్డిని కలిశారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు తగిన సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తోందని తెలిపారు. ఇప్పటికే ప్రారంభించిన పాత ప్రాజెక్టులనే కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలో ఏరో స్పేస్ పార్క్‌తో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూప్ సీఎం రేవంత్‌తో చర్చలు జరిపింది. వీటి పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎం రేవంత్‌ను కలిశారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో 12,400 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రకటించారు. దావోస్‌లో సీఎం రేవంత్ మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అయ్యారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, టాటాసన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌లతో ఆయన సమావేశమయ్యారు. JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్ VRLDC ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. రేవంత్ వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఉన్నారు.
*పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. ఒప్పుకోకపోవడంతో భర్తను చంపి పరార్..
ఫిలింనగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏకంగా వివాహతను ప్రేమించి ఇబ్బందులకు గురిచేశాడు. వివాహితను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు. వివాహిత ఇంటికెళ్లి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. వివాహిత భర్త అడ్డం రావడంతో అతన్ని చంపి పారిపోయాడు. లండన్ లో ఫిలింనగర్ లో ఉంటున్న వివాహిత, అద్నాన్ కలిసి చదువుకున్నారు. వారిద్దరి మధ్య వున్న స్నేహం ప్రేమగా మార్చుకున్నాడు అద్నాన్. అయితే ఆమె మాత్రం అద్నాన్ కు తనకు పెళ్ళైందని, తన భర్త అనుమతితోనే లండన్ కు చదువుకునేందుకు వచ్చానని, భర్తను వదిలే ప్రసక్తే లేదని అద్నాన్ తో చేప్పేది. తన ముందు సరే ఇద్దరం స్నేహితుల్లాగే ఉందామని ఒప్పుకున్నట్లు నటించాడు అద్నాన్. దీంతో ఆమె కూడా అతన్ని నమ్మింది. తనతో సాన్నిహిత్యం ఉండటం మొదలు పెట్టింది. ఇద్దరు మధ్య ఉన్న సానిహిత్యంతో తీసుకున్న ఫోటోలు తీసుకున్నారు. అయితే ఇదే సరైన సమయమని భావించిన అద్నాన్ తనని పెళ్లి చేసుకోవాలని, భర్తను వదిలేయాలని కోరాడు. తనను వివాహం చేసుకోకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. అయినా దానికి వివాహిత భయపడకుండా.. తన భర్తను వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. చదువు పూర్తి అయిన తర్వాత హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కు వచ్చింది. లండన్ లో జరిగిన విషయాలన్నీ తన భర్త గౌస్ కు వివరించగా భయపడాల్సిన పనిలేదని భార్యకు ధైర్యం చెప్పాడు. అద్నాన్ వివాహితను మరచిపోలేక పోయాడు.. ఆమెను కిడ్నాప్ చేసి పెళ్ళి చేసుకోవాలని ప్లాన్ వేశాడు. వివాహిత ఇంటికి వచ్చాడు అద్నాన్.. ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. వివాహితన కేకలు వేయడంతో గౌస్ అడ్డు పడ్డాడు. ఇద్దరు మధ్య గొడవ మొదలైంది. అయితే అద్నాన్ తన వద్ద వున్న కత్తితో గౌస్ పై దాడి చేశాడు. కిరాతంగా చంపి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రేమోన్మాది అద్నాన్ తో పాటు మరొకరికి అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గౌస్ ను విగతజీవిగా చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇన్ని రోజులు భర్తకు దూరంగా లండన్ ఉండి, తనతో ఆనందగా గడిపేందుకు హైదరాబాద్ వచ్చిన వివాహితకు కన్నీల్లే తోడయ్యాయి. భర్త హత్యను కల్లారా చూసి భార్య విగతజీవిగా మిగిలిపోయింది. అద్నాన్ కఠినంగా శిక్షించాలని వివాహిత కోరింది.
*మోడీకి భయపడేదే లేదు.. భయపడేది కేవలం అల్లాకు మాత్రమే : ఓవైసీ
తాను అల్లాకు తప్ప ఎవరికీ భయపడనని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇతర ప్రజలకు కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయినా లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయినా వారికి భయపడవద్దని సూచించారు. వారు పైన ఉన్న అల్లాకు మాత్రమే భయపడాలన్నారు. ఏఐఎంఐఎం చీఫ్ బుధవారం ఈ మేరకు 36సెకన్ల ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన వీడియో క్లిప్‌లో మాట్లాడుతూ – ‘భూమిని, ఆకాశాన్ని సృష్టించినవాడికి మాత్రమే మేము భయపడతాము (అల్లాను ఉద్దేశించి). మిగిలిన వారు ఎవరికీ భయపడరు. నేనేమిటో, నా ప్రభువుకు తెలుసు.. నేను అల్లాకు మాత్రమే భయపడుతున్నాను.. మోడీకి భయపడవద్దు, షాకు భయపడవద్దు అని కూడా చెప్పడానికి వచ్చాను. ప్రభుత్వానికి భయపడవద్దు..ఎవరికీ భయపడవద్దు. అల్లాహ్‌కు మాత్రమే భయపడండి.’ అంటూ పేర్కొన్నారు. దేశంలో రాముడి పేరుతో రాజకీయాలు జరుగుతున్న తరుణంలో అసదుద్దీన్ ఒవైసీ ఈ ప్రకటన చేశారు. యూపీలోని అయోధ్యలో జనవరి 22, 2024న రామ్ లల్లా దీక్షకు ముందు రాజకీయ నాయకులు, సాధువుల మధ్య మాటల యుద్ధం జరిగింది.
*మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది..
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంకు సంబంధించి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాగా.. జనవరి 22న ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు రామమందిర సముదాయంలో హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.. కాగా.. ఆ రోజున తమ తమ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడపనున్నట్లు తెలిపారు. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు పంపారు. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు సీనియర్ ప్రతిపక్ష నేతలకు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అయితే వారెవరూ అయోధ్యకు వెళ్లమని ప్రకటించారు. ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ కార్యక్రమంపై ఇండియా కూటమి సమావేశంలో చర్చించారు. మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. మతం వ్యక్తిగత విషయం అని కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించింది. కాగా.. మంగళవారం ఎంపీ రాహుల్ గాంధీ ఈ వేడుకను ‘నరేంద్ర మోదీ వేడుక’గా అభివర్ణించారు. మరోవైపు.. మమతా బెనర్జీ కూడా విమర్శించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే కూడా ఆహ్వానాన్ని తిరస్కరించారు. నిర్మాణంలో ఉన్న రామమందిరం సహాయంతో బీజేపీ తమ ఓటు బ్యాంకును బలోపేతం చేస్తోందని ఆరోపించారు. ‘ప్రాణ ప్రతిష్ఠ’ లేదా రామమందిరాన్ని పూర్తిగా విస్మరించలేమని ప్రతిపక్షాలకు కూడా బాగా తెలుసు. వారు ఇలా చేస్తే, చాలా మంది ఓటర్లు వారికి దూరంగా ఉంటారు. అంతేకాకుండా.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి కూటమి చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే జనవరి 22న కాంగ్రెస్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు తమ సొంత కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
*పంజాబ్‌లో ఆప్ 13 సీట్లు గెలుస్తుంది.. సీఎం కీలక వ్యాఖ్యలు..
పంజాబ్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి విజయం నమోదు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన తర్వాత పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తుపై సందేహం నెలకొంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ప్రతిపాదనను కాంగ్రెస్ రాష్ట్ర విభాగం నిరంతరం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో.. పంజాబ్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఆప్‌తో పొత్తుకు అనుకూలంగా లేరు. కాగా.. పొత్తుపై పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి సందేశం రాలేదని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వాడింగ్ తెలిపారు. అంతేకాకుండా.. పంజాబ్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని రాజా వాడింగ్ చెప్పారు. వచ్చే 3-4 నెలల్లో అభ్యర్థులు, ఎన్నికల్లో పోటీ చేసే వ్యూహంపై చర్చిస్తామని చెప్పారు. మరోవైపు.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తమ పార్టీ పంజాబ్‌లోని 13 స్థానాల్లో పోటీ చేసి గెలుస్తుందని పలు సందర్భాల్లో చెప్పారు. బటిండాలో జరిగిన బహిరంగ సభలో అరవింద్ కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 13 స్థానాల్లో అధికార ఆప్‌కి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు భారత కూటమి మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో సీట్లను పంచుకునే అవకాశం లేదని సూచించారు.
*పతనమైన షేర్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1600, నిఫ్టీ 460 పాయింట్లు నష్టం
గ్లోబల్ మార్కెట్ బలహీన ధోరణి కారణంగా ఈరోజు స్టాక్ మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయి 72000 దిగువకు చేరుకుంది. నిఫ్టీ 21650 దిగువన ప్రారంభం కాగా… ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,628 పాయింట్లు నష్టపోయి 71,500కి పడిపోయింది. నిఫ్టీ 460 పాయింట్లు కోల్పోయి 21,571కి దిగజారింది. ఇటీవల కాలంలో వరుసగా రికార్డు స్థాయిలో సాక్ట్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ షేర్లలో భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టిపిసి, ఐటిసి టాప్ గెయినర్‌లలో ఉండగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో భారీ నష్టాలను చవిచూశాయి. వీటితో పాటు యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టాల్లో బాటలోనే కొనసాగాయి. ఈ క్షీణత కారణంగా, నిఫ్టీ బ్యాంక్ ప్రారంభ ట్రేడ్‌లో 1,202.4 పాయింట్లు లేదా 2.50% నష్టంతో ట్రేడవుతోంది. ఇక ఇతర రంగాల గురించి మాట్లాడితే, క్యాపిటల్ గూడ్స్, ఐటీ కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.
