Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*రేపు సీఎం జగన్ శ్రీసత్య సాయి జిల్లా పర్యటన
రేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్‌ బయలుదేరనున్నారు. పన్నెండున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.15కు సీఎం జగన్‌ గోరంట్ల మండలం పాలసముద్రం చేరుకోనున్నారు. మూడు గంటల 10 నిమిషాలకు ప్రధానమంత్రికి సీఎం ఘన స్వాగతం పలకనున్నారు. ప్రధాని, గవర్నర్‌తో కలిసి నాసిన్ – నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సాయంత్రం ఏడున్నరకు తిరిగి తాడేపల్లికి సీఎం జగన్ చేరుకోనున్నారు.
ప్రధాన పర్యటన షెడ్యూల్‌..
రేపు(జనవరి 16) ప్రధాని నరేంద్ర మోడీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి చేరుకుంటారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ సెంటర్‌ను సందర్శిస్తారు. ఇక్కడి కొనసాగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ డిటెక్షన్‌ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగిస్తారు ప్రధాని మోడీ. అనంతరం ఢిల్లీకి ప్రయాణమవుతారు. ప్రధాని మోడీ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి శనివారం జిల్లా అధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని సూచించారు.

 

*నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.
దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్లు సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చడం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై ధర్నా చేస్తున్న సమయంలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పులివర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు. చంద్రగిరిలో దొంగ ఓట్ల అంశాన్ని ఈసీ కేస్‌ స్టడీగా తీసుకోవాలని ఆయన కోరారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. పుంగనూరు, నగరి, తిరుపతి, చంద్రగిరి సహా పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. చంద్రగిరిలో 28 వేల ఓట్లను కొత్తగా చేర్చారని.. 13 వేలకు పైగా ఓట్లు ఒకే ఫోటోతో ఉన్నాయన్నారు. తిరుపతికి చెందిన వ్యక్తిని చంద్రగిరిలో రెండు ఓట్లుగా చేర్చారని ఆయన ఆరోపించారు. ఈసీ కూడా గత తిరుపతి ఉపఎన్నికల విషయంలో సీరియస్‌గా రియాక్టు అయ్యిందని గుర్తు చేశారు. పులివర్తి నాని ఆరునెలలుగా పోరాటం చేశారని.. అలా పోరాటం చేస్తూ నాని ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా భూకబ్జాలు, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. అ డబ్బులతో గెలవాలని చూస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో తప్పులు చేయలేదు .. కానీ వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా దొంగ ఓట్లపై దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. పోలీస్ వ్యవస్థ భృష్టు పట్టిందని, ఈసీ సీరియస్‌గా ఉండటంతో ఇప్పుడు పోలీసుల్లో భయం వచ్చిందన్నారు. తప్పుచేసిన ఆర్వోను అరెస్టు చేయాలన్నారు. అరెస్టు చేస్తే విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.

 

*ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల!
ఏపీ కాంగ్రెస్‌లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన తరుణంలో ఆ స్థానంలో వైఎస్‌ షర్మిలను నియమించే అవకాశాలున్నాయని సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై వైఎస్‌ షర్మిలకు మల్లికార్జున ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుండగా.. హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్టుగా సమాచారం. గిడుగు రుద్రరాజుతో రాజీనామా చేయించి షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం లైన్‌ క్లియర్‌ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను రేస్‌లోకి తీసుకొచ్చేందుకు అధిష్ఠానం వ్యూహాలను రచిస్తోంది. దానిలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జన ఖర్గే రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్‌ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చి ఆమెకు కాంగ్రెస్‌ కండువా కప్పారనే ప్రచారం సాగింది.. ఇప్పటి వరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజు రాజీనామ చేయడంతో.. త్వరలోనే వైఎస్‌ షర్మిల ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పగ్గాలు చేపడతారనే ప్రచారం సాగుతోంది. అయితే, తన కుమారుడి పెళ్లి ఏర్పాట్లలో ప్రస్తుతం బిజీగా ఉన్న షర్మిల.. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఇతర ప్రముఖులను కలుస్తూ.. తన కుమారుడి పెళ్లికి ఆహ్వానిస్తున్న విషయం విదితమే.

 

*కేటీఆర్‌ వల్ల పండుగరోజు ప్రెస్‌ మీట్‌ పెట్టాల్సి వచ్చింది : జూపల్లి
పండుగ రోజున ప్రెస్ మీట్ పెట్టల్సిన పరిస్థితి మాజీ మంత్రి కేటీఆర్ కల్పించారని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. డిసెంబర్ లో కొల్లాపూర్ లో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి తన బంధువుల చేతిలో హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. వ్యక్తిగత కారణాల వలన, భూ తగాదాలతో హత్య జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు అయ్యాక ఇప్పుడు తెర మీదికి ఆ హత్యను ఎందుకు తీసుకు వచ్చారు? ప్రశ్నిచారు. హంతకులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కొందరు ఆల్రెడీ పోలీస్ ల అదుపులో ఉన్నారని అన్నారు. 1999 నుండి ఇప్పటి వరకు ఎన్నికల్లో నా మెజార్టీ పెరుగుతూ వస్తుందని, తన విలువలుతో కూడిన రాజకీయాలు చేస్తానని అన్నారు. మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి బీజేపీ సానుభూతి పరుడని అన్నారు. కానీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారని తెలిపారు. ఎన్నికల కోసం కేటీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ సర్పంచ్… బీఆర్ఎస్ పార్టీ లో చేరడం లేదని కాంగ్రెస్ సర్పంచ్ ను హత్య చేశారని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో జెట్పీటీసీ హనుమంత్ నాయక్, సర్పంచ్ ల పై అక్రమ కేస్ లు, మర్డర్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేవారు. తన నియోజక వర్గంలో బీఆర్ఎస్ పాలనలో చాలా మందిని హత్యలు చేశారని గుర్తుచేశారు. చేయని వాటికి చేశానని తనపై బురద చల్లుతున్నారు… నా ప్రతిష్టకు భంగం కలిగించే లాగా మాట్లాడుతున్నారని.. రాజకీయాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మా నియోజక వర్గంలో జరిగిన ప్రతి హత్య పై సాక్ష్యదారాలతో సహా గతంలో డీజీపీకి పిర్యాదు చేసిన అప్పుడు ఎవరు పట్టించుకోలేదని అన్నారు. అప్పుడు జరిగిన హత్యల గురించి ఆనాడు ప్రగతి భవన్ లో ఉన్న పెద్దలకు చెప్పిన ఎవరు పట్టించుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మీరు జనాలను పట్టించుకోలేదు కాబట్టి మిమ్ములను జనాలు ఓడగొట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. కొండగట్టులో 60 మంది చనిపోతే మీరు వెళ్ళలేదు కానీ వ్యక్తిగత కారణాలు, భూ వివాదాల వలన చనిపోయిన వ్యక్తి చావుతో శవ రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. గతంలో జరిగిన అన్యాయ ,అక్రమాల పై విచారణ చేపడతామన్నారు. మల్లేష్ యాదవ్ ఘటన పై విచారణ చేపిస్తున్నాము. సూత్రధారులను అరెస్ట్ చేస్తామన్నారు. మీ ప్రభుత్వంలో వామన రావు కుటుంబ సభ్యుల హత్య, అక్రమ కేస్ లు, మరియమ్మ ఘటన, దిశ ఘటన, ఎఫ్ఆర్ఓ శ్రీనివాస రావు,మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంభం అగాయిత్యలు, తమ్మినేని కృష్ణ హత్యలు జరగలేదా? అని ప్రశ్నించారు. మా పాలనలో రాజకీయ కక్ష పూరితమైన కేస్ లు, అరెస్ట్ లు ఉండవన్నారు. దొంగలను వెనుకకు వేసుకుని వచ్చింది ఎవరు..గత ప్రభుత్వంలో మీరు కాదా? అని ప్రశ్నించారు. రాజకీయ హత్యలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. తను తప్పులు చేస్తే జనాలు 7 సార్లు గెలిపిస్తారా? అని తెలిపారు. ఎన్ని సార్లు చెప్పిన మీ పద్దతి మారడం లేదని మిమ్మల్ని జనాలు ఒడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

*ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు శ్రేయస్కరం కాదు
రెండు వారాల క్రితం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంత్రావుపల్లి గ్రామంలో హత్యకు గురైన రిటైర్డ్ జవాన్, బీఆర్‌ఎస్‌ కార్యకర్త సిహెచ్ మల్లేష్ కుటుంబాన్ని ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పరామర్శించారు. మల్లేష్ హత్య రాజకీయ ప్రేరేపితమని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ వాదనను కొట్టిపారేసిన పోలీసులు కుటుంబ ఆస్తి తగాదాల కారణంగానే మల్లేష్‌ను హత్య చేసినట్లు చెబుతున్నారు. ఈ హత్యలో మల్లేష్ బంధువుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లేష్ హత్యను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో రాజకీయ హింస పెరిగిపోతోందని, ఇలాంటి నేరాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేటీఆర్ ఆరోపించారు. మల్లేష్‌ దారుణ హత్యపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లిన ఆయన రాజకీయ హింసను బీఆర్‌ఎస్ ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏ ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్తపై ఇలాంటి ఘటన జరగలేదు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్ ఇలాంటి విద్వేషాలను రగిలించాలని చూస్తుంటే పరిస్థితి మరోలా ఉండేది. రాజకీయ హత్యగా తేలిన కేసు అయినప్పటికీ భూ సంబంధిత అంశాలను ఆపాదించి దానికి భిన్నంగా రంగులు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్షుణ్ణంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని రామారావు కోరారు.

 

*ముప్పై రోజుల పాలన ప్రజారంజకంగా సాగింది…
మణిపూర్ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి దశ భారత్ జోడో యాత్ర ద్వారా భారత్ దేశాన్ని ఏక తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. దేశంలోని ముఖ్య సమస్యలు, మణిపూర్ లో జరిగిన అల్లర్లపై సమాధానం కోరిన ప్రతిపక్షాలను సభ నుండి సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేసుకున్నారన్నారు మల్లు రవి. అంతేకాకుండా.. ప్రజా సమస్యలను అడగకుండా, ప్రశ్నించకుండా అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలను ఈయాత్ర ద్వారా ప్రజలలోకి తీసుకెళతున్నారని ఆయన తెలిపారు. పెట్టుబడులను మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లారని, ముప్పై రోజుల పాలన ప్రజారాంజకంగా సాగిందన్నారు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి సిద్దంగా ఉందని, బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఓటమి ని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కొల్లాపూర్ లో కేటీఆర్ తప్పుడు సమాచారం తో అబద్దాలు మాట్లాడిండని, వ్యక్తిగత గొడవల వల్ల జరిగిన హత్యను కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తుండ్రు అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ పార్లమెంటు ఎన్నికల తర్వాత కూలిపోతుందని ప్రచారం చేస్తుండ్రు అని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలువనుందని ఇలాంటి ప్రచారం చేస్తుండ్రు అని ఆయన తెలిపారు. రామ మందిరం బీజేపీ పార్టీ కార్యక్రమంలాగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని, రాముడు అందరివాడు.. కాంగ్రెస్ రామరాజ్యం లక్ష్యం గా పని చేస్తుందన్నారు. గాంధీ, ఇందిరా నుండి నేటి వరకు కాంగ్రెస్ ఆలోచనా విధానంతో ముందుకెళ్తుందని, రామ మందిర ప్రారంభం ఆహ్వానం ఉన్నా ట్రస్ట్ తో సంబంధం లేకుండా బిజెపి తన పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తున్నందునే వెళ్లలేక పోతున్నామని, రామ మందిరాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

 

*కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట విషాదం..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమిత్ షా అక్క రాజుబెన్ సోమవారం ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని నెలల క్రితం ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెకు లంగ్స్ మార్పిడి జరిగింది. ఈ సర్జరీ తర్వాత ఆమె కోలుకునే దశలో ఉన్నారు. ఈలోపే ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించారు. ఈ వార్త తెలిసిన వెంటనే గుజరాత్‌లో వర్చువల్‌గా జరగాల్సిన రెండు సమావేశాలను అమిత్ షా రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమిత్ షా అక్క మరణం కారణంగా మంత్రి తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. అంతకుముందు గుజరాత్ లో రెండు కార్యక్రమాల్లో షా పాల్గొనాల్సి ఉంది. బనస్కాంత జిల్లాలోని దేవదర్ లోని బనాస్ డెయిరీ ప్రారంభం, గాంధీనగర్ లోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం కార్యక్రమాల్లో పాల్గొన్నాల్సి ఉంది. బనస్కాంత కార్యక్రమానికి హాజరైన గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ పటేల్ మాట్లాడుతూ.. అమిత్ షా అక్కగారు చనిపోవడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని.. వారికి నివాళులు అర్పించారు.

 

*శివసేన పార్టీపై సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ ఠాక్రే..
మహారాష్ట్రలో శివసేన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజమైన శివసేన తమదే అంటూ ఇటు ఉద్ధవ్ ఠాక్రే, అటు సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇటీవల స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. నిజమైన శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గమే అని తీర్పు చెప్పారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ.. ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జనవరి 10న స్పీకర నార్వేకర్ ఏక్‌నాథ్ షిండే వర్గానికి అనుకూలంగా తీర్పు చెప్పారు. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున నిజమైన శివసేన ఏక్‌నాథ్ షిండేదని చెప్పాడు. ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని రెండు వర్గాల సభ్యులను అనర్హులుగా ప్రకటించేందుకు కూడా స్పీకర్ నిరాకరించారు. అయితే స్పీకర్ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్దారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను అవమానించడమని, ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు. స్పీకర్ తన బాధ్యతలను సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. రాష్ట్రప్రజలు ఈ నిర్ణయాన్ని అంగీకరించరని వెల్లడించారు. దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్పారు. జూన్ 2022లో శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన ప్రభుత్వంపై వ్యతిరేకతతో 40 మంది ఎమ్యెల్యేలు అసమ్మతి వర్గంగా ఏర్పడటంతో అక్కడి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీతో కలిసి ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నిజమైన శివసేన కోసం ఇరు వర్గాల మధ్య పోరాటం సాగుతోంది.

 

*భారత్‌తో వివాదం నేపథ్యంలో చైనా, జిన్‌పింగ్‌పై మాల్దీవ్స్ అధ్యక్షుడి ప్రశంసలు..
భారత్-మాల్దీవుల మధ్య వివాదం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా, ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. చైనాతో తమ దేశ సంబంధాల గురించి గొప్పగా చెప్పారు. రెండు దేశాలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నాయని.. మాల్దీవ్స్ సార్వభౌమాధికారానికి పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. 1972లో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నప్పటి నుండి మాల్దీవుల అభివృద్ధికి చైనా సహాయం అందించిందని ప్రశంసలు కురిపించాడు. గతేడాది నవంబర్‌లో అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇండియా వ్యతిరేక వైఖరి అవలంభించి ముయిజ్జూ గెలుపొందాడు. అప్పటి నుంచి భారత్‌కి వ్యతిరేకంగా, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ఇండియా, మాల్దీవ్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ దేశ మంత్రులు ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ సమస్య మరింత పెద్దదిగా మారింది. భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ముగ్గురు మంత్రుల్ని మాల్దీవ్స్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన ముయిజ్జూ పలు ఒప్పందాలు చేసుకున్నాడు. మాల్దీవ్స్ తిరిగిరాగానే చైనాను పొగుడుతూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వైపాక్షిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లిందని ఆయన అన్నారు. చైనా మాల్దీవ్స్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే దేశం కాదని.. అందుకే రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని చైనా ప్రభుత్వ మీడియా సీజీటీఎన్ ఛానెల్‌కి ఇచ్చి ఇంటర్వ్యూలో ముయిజ్జూ చెప్పాడు. భవిష్యత్తులో చైనా-మాల్దీవ్స్ బంధం మరింత దృఢమవుతుందని అన్నారు. జి జిన్‌పింగ్ పౌరుల ప్రయోజనాలకు మొదటిస్థానం ఇస్తున్నారని, ఆయన నాయకత్వంలో చైనా ఆర్థిక వ్యవస్థ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవులు తన లక్ష్యాలను సాధించేందుకు చైనా ప్రభుత్వం సాయం చేస్తుందని, ఈమేరకు జిన్ పింగ్ హామీ ఇచ్చినట్లు ముయిజ్జు తెలిపారు. మార్చి 15లోగా మాల్దీవుల్లో ఉన్న 88 మంది భారత సైనిక సిబ్బంది వెళ్లిపోవాలని మరోసారి ఆ దేశం చెప్పింది. శనివారం మీడియాతో మాట్లాడుతూ, పరోక్షంగా భారత్ ని ఉద్దేశించి ముయిజ్జూ విమర్శలు చేశారు. మేము చిన్నవాళ్లం కావచ్చు, కానీ మమ్మల్ని బెదిరించే లైసెన్స్ మీకు ఇవ్వలేదని అన్నారు. ఆహార వస్తువులు, ఔషధాలు, ఇతర దిగుమతులపై భారత్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ముయిజ్జూ కొత్త ప్రణాళికను ప్రకటించారు.

Exit mobile version