Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*రెండున్నరేళ్లు పవన్‌కళ్యాణ్‌ సీఎంగా ఉండాలి.. హరిరామజోగయ్య లేఖ
మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. జనసేన-టీడీపీ- బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్ కళ్యాణ్‌తో చర్చించడం జరిగిందని ఆయన వెల్లడించారు. 40 నుంచి 60 సీట్లు జనసేన దక్కించుకోవలసి ఉందని చెప్పగా.. 40 సీట్ల వరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పవన్ తెలిపారన్నారు. పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని జనసైనికులు భావిస్తున్న విషయాన్ని వివరించానని.. కనీసం రెండున్నర ఏళ్లయినా పవన్ ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. జనసేన గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా ఉంటుందని పవన్ ఆశిస్తున్నారని, జనసేన టీడీపీ కూటమిలో త్వరలో బీజేపీ చేరే అవకాశం ఉందని పవన్ తనకు తెలిపినట్లు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. ఈ మేరకు శనివారం హరిరామజోగయ్య ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా 40 నుంచి 60 సీట్లు కోరాలని పవన్‌కు సూచించానని తెలిపారు. గతంలోనూ హరిరామ జోగయ్య ఇదే విధంగా బహిరంగ లేఖ విడుదల చేయడం గమనార్హం.

 

*పది రోజులు సీఎం రేవంత్ బిజీ.. ఢిల్లీ టు దావోస్ వయా మణిపూర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిరోజుల పాటు బిజీ బిజీగా ఉండనున్నారు. ఢిల్లీ వెళ్లిన అనంతరం పార్టీ సమావేశంలో పాల్గొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం మణిపూర్ వెళ్లి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటారు. నాలుగైదు రోజులు అక్కడే ఉండి మరో మూడు రోజులు లండన్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతుంది. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, బహుళజాతి కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతున్నారు. ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదానీ… వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు భారత్ నుంచి క్రమం తప్పకుండా హాజరవుతారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు దావోస్‌లో పర్యటించనున్నారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు, లండన్ పర్యటనలో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎంవో కార్యదర్శులు, ఓఎస్డీ తదితరులు దావోస్ వెళ్తున్నారు. పది రోజుల తర్వాత సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం ఈ నెల 23న హైదరాబాద్‌కు రానుంది. ఆయన ముఖ్యమంత్రిగా పాలన చేపట్టి నెల రోజులు కావస్తోంది. హడావిడి షెడ్యూల్ తో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి పెట్టుబడుల విషయంలో తెలంగాణను నిర్లక్ష్యం చేయకూడదని భావించారు. దావోస్ అంతర్జాతీయ పెట్టుబడి సదస్సులో తెలంగాణ ప్రతినిధులు ప్రతిసారీ పాల్గొంటారు. ఈసారి మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో వెళ్లాలన్నారు. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటికీ.. పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.

 

*ప్రజాయుద్ధంలో ఎవరూ జగన్‌ను ఓడించలేరు.. 20 ఏళ్లు జగన్‌ పాలనే..!
ప్రజాయుద్ధంలో ఎవరూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఓడించలేరు.. మరో 20 ఏళ్లు ఆంధ్రప్రదేశ్లో జగన్‌ పాలనే ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్‌.. తాజాగా, వైసీపీ అధిష్టానం ఆయన్ని పెనమలూరు ఇంఛార్జ్‌గా నియమించడంతో.. ఆ నియోజకవర్గంపై దృష్టి సారించారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పడమట సురేష్ నా తమ్ముడు.. నాతోనే వస్తాడు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, రాజశేఖరరెడ్డి అనుచరులు అందరూ మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే పట్టుదలతో ఉన్నారు.. వైసీపీ క్యాడర్ అంతా ఏకతాటి పైకి వచ్చి పని చేస్తారు.. పార్థసారథి (సిట్టింగ్‌ ఎమ్మెల్యే) కూడా మనసులో జోగి రమేష్ గెలవాలనే కోరుకుంటాడు అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పెనమలూరులో వైసీపీ జెండా ఎగరటం ఖాయం అన్నారు జోగి రమేష్.. ఇక, వైఎస్‌ షర్మిల.. చంద్రబాబును కలవటంలో తప్పేమీ లేదు అన్నారు. శుభకార్యానికి ఎవరినైనా పిలవచ్చు.. అందులో భాగంగానే చంద్రబాబును కలిసి తన కుమారుడి వివాహానికి రావాలని షర్మిల ఆహ్వానించారని పేర్కొన్నారు. మా నాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బలంగా ఉన్నాడు కనుకే అందరూ కలిసికట్టుగా వస్తున్నారు.. ప్రజా యుద్ధంలో ఎవరూ వైఎస్‌ జగన్ ను ఓడించ లేరు.. 20 ఏళ్ల పాటు జగన్ ఈ రాష్ట్రాన్ని పాలిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్. కాగా, పెడన సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్‌ని వైసీపీ అధిష్టానం పెనమలూరు ఇంచార్జ్‌గా నియమించిన విషయం విదితమే.. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఎమ్మెల్యే పార్థసారథి.. నియోజకవర్గ ప్రజల మీదే నేను ఆధారపడి ఉన్నాను.. నా భవిష్యత్ కార్యాచరణను పెనమలూరు నియోజకవర్గ ప్రజలే తేలుస్తారు అంటున్నారు. ఇక, వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతోన్న విషయం విదితమే.

 

*పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడని పార్టీలోకి ఆహ్వానిస్తారు..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి వెళ్లారు. ముద్రగడ, బొలిశెట్టి ఇద్దరే అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. ముద్రగడను బొల్లిశెట్టి కలవడం ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ ముద్రగడను కలిశారు. ఆ తరువాత రెండు గంటలకే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడను కలిశారు. ఈ క్రమంలోనే ముద్రగడ జనసేనలో చేరడం ఖరారైంది. పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడని పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. ఈనెల 20 లేదా 23న పవన్ ముద్రగడ దగ్గరకివస్తారని, ఆయనతో సమావేశమవుతారని తెలిపారు. ఉద్యమ నాయకుడిని నేను వచ్చే ఆహ్వానిస్తే గౌరవంగా ఉంటుందని పవన్ చెప్పారన్నారు. జనసేనలో చేరడానికి ముద్రగడ పద్మనాభం అంగీకరించారన్నారు. ముద్రగడ వైసీపీలోకి వెళ్లనని క్లారిటీగా చెప్పారన్నారు. ఇప్పుడు ముద్రగడ జనసేనలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతి తరువాత పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారని కూడా సమాచారం. ముద్రగడ ఏ పార్టీలోకి చేరతారనేది సంక్రాంతి తరువాతే క్లారిటీ రానుంది.

 

 

*వేసవిలో రాష్ట్రంలో చెరువుల పూడిక.. వానాకాలం లోపు పూర్తవ్వాలి..
రాబోయే వేసవి కాలంలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలని నీటి పారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జలసౌధపై ఇవాళ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్త ఆయకట్టు కు సాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఏడాది చివర నాటికి కొత్తగా 4.5 నుంచి ఐదు లక్షల ఎకరాలకు నీరందించే విదంగా ప్రాజెక్టుల పనులు వేగవంతం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. నీటి పారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కవ చేశారు. అందుకు తగిన ఫలితం రాలేదన్నారు. ఇప్పుడు అవసరమైన నిధులు వ్యయం చేసి కొత్త ఆయకట్టు సృష్టించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. కొత్తగా ప్రాజెక్టులలో నీరందించే విషయంలో అడ్డంకులన్నీ అధిగమించి సకాలంలో నీరందించాలని సూచించారు. రాబోయే జూన్ నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులు, ఏడాది చివర నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టు లపై పనులు వేగవంతం చేయాలన్నారు. కృష్ణ, గోదావరి బేసిన్ లలో సుమారు 18 ప్రాజెక్టులలో పలు ప్యాకేజల కింద ఈ ఏడాది చివర నాటికి నీరందిస్తామన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఏ ప్రాజెక్టులలో కొత్త ఆయకట్టు ఎంత ఇస్తున్నామో సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చే విషయంలో ఉన్న ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. కొత్త ఆయకట్టు కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంథని నియోజక వర్గానికి నీరందించే పనులు చేపట్టాలన్నారు. రాబోయే వేసవి కాలంలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వర్షాకాలం లోపు అన్ని చెరువుల పనులు పూర్తవ్వాలని కోరారు. ఐడిసి పరిడిలో ఉన్న అన్ని చిన్న ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో పని చేసే విదంగా చర్యలు చేపట్టాలన్నారు. గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేసిన తప్పిదాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ ప్రారంభమైందన్నారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ పైన విచారణ కోసం హైకోర్టు చీఫ్ జడ్జి గారికి లేఖ రాయడం జరిగింది. సిట్టింగ్ జడ్జి విచారణ కోసం జోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు కోయిన ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీ నీరు మనకు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. మహారాష్ట్ర కు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్ ఉత్పత్తి కి సంబందించిన వ్యయం అందిస్తామని సూచించామని తెలిపారు.

 

*13 ఏళ్ల బాలికపై 26 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. అది ప్రేమ అని హైకోర్టు తీర్పు..
13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టైన మహారాష్ట్ర వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక సంబంధం ప్రేమ వ్యవహారంతో జరిగిందని, అది కామం వల్ల కాదని కోర్టు అభిప్రాయపడింది. బాలిక మైనర్ అని.. అయితే ఆమె తన ఇష్టంతోనే ఇంటిని వదిలేసి నిందితుడు నితిన్ ధబేరావ్‌తో కలిసి వెళ్లిందని, ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పినట్లు జస్టిస్ ఊర్మిళ జోషి-ఫాల్కే గమనించారు. 26 ఏళ్ల నిందితుడు, 13 ఏళ్ల బాలిక మధ్య ప్రేమ వ్యవహారంతోనే వీరద్దరు కలిసి ఉన్నట్లు జస్టిస్ జోషి-ఫాల్కే తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లైంగిక సంబంధం ఆరోపణలో ఇద్దరి మధ్య ఆకర్షణ బయటపడిందని, నిందితుడు బాలికను కామంతో లైంగిక వేధింపులకు గురిచేసిన సందర్భం లేవని కోర్టు వెల్లడించింది. ఆగస్టు 2020లో బాలిక తండ్రి మిస్సింగ్ ఫిర్యాదు దాఖలు చేశారు. తన 13 ఏళ్ల కుమార్తె పుస్తకాలు తీసుకువస్తాననే సాకుతో ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, ఆమె తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక ఆచూకీ తెలుసుకుని విచారించిన తర్వాత.. ఈ కేసులో బాలిక తన ఇష్టపూర్వకంగానే ఇళ్లు వదిలి వెళ్లినట్లు పోలీసులకు చెప్పింది. నిందితుడు తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని అందుకే ఇంట్లోని ఆభరణాలు, నగదుతో దభేరావుతో వద్దకు వెళ్లినట్లు పోలీసులకు బాలిక తెలిపింది.

 

*ఇండియా కూటమి ఛైర్మన్ గా మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవం
ఇవాళ ఇండియా కూటమి నేతల వర్చువల్ సమావేశంలో పాల్గొనింది. ఈ మీటింగ్ లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను కూటమి ఛైర్మన్ గా నియమించింది. అదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్‌ను కూటమికి సమన్వయకర్తగా ఎన్నిక అయ్యారు. దాదాపుగా కూటమిలోని అన్ని పార్టీల నేతలు ఆయన పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. దీంతో పాటు సీట్ల పంపకంలో ఎదురవుతున్న సవాళ్ల పైనా ప్రధానంగా చర్చించారు. అయితే, కోఆర్డినేటర్‌ పదవి ప్రతిపాదనపై నితీష్‌ కుమార్‌ మొదట మాట్లాడుతూ.. నాకు ఏ పదవి పైనా కోరిక లేదన్నారు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి పదవికి మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతి పాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారు. ఇక, ఈ సమావేశానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి టీఎంసి అధినేత్రి మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరు కాలేదు.

 

*ఎన్ఆర్ఐ అని మోసపోకండి.. భార్యల్ని వదిలేస్తున్న కేసుల్లో పెరుగుదల..
ఇటీవల కాలంలో తల్లిదండ్రులకు వారి అమ్మాయిలను అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి ఫారన్ కంట్రీల్లో ఉంటున్న అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కట్నం ఎంతైనా కానీ మాకు ఎన్ఆర్ఐ అల్లుడు కావాలని కోరుకుంటున్నారు. ఇక అమ్మాయిలు కూడా తాము కూడా విదేశాల్లో సెటిల్ కావడానికే మొగ్గు చూపుతున్నారు. ఇది నాణానికి ఒకవైపు, మరో వైపు ఇలా ఎన్ఆర్ఐల్లో కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత భారతీయ మహిళల్ని విడిచిపెడుతున్న కేసులు ఇటీవల కాలంలో పెరిగాయి. ఎన్ఆర్ఐలు పెళ్లి చేసుకున్న తర్వాత వారు తమ భార్యలను విడిచిపెడుతున్నారు. జనవరి 1, 2020 నుంచి అక్టోబర్ 31, 2023 మధ్య ఇలాంటి సంఘటనల్లో మొత్తం 5339 మంది ఫిర్యాదులు మంత్రిత్వశాఖకు అందాయి. సగటున రోజుకు నాలుగు ఫిర్యాదులు నమోదవుతుండగా.. 2015తో పోలిస్తే 2023లో ఎన్నారై భర్తలు, భార్యలను విడిచిపెట్టిన కేసులు ఎక్కువ అయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023లో, జనవరి మరియు అక్టోబర్ 2023 మధ్య, స్వీకరించిన ఫిర్యాదుల సంఖ్య 1,187గా ఉంది. 2015 క్యాలెండర్ ఇయర్‌లో ఇలాంటి ఫిర్యాదులు 796 వచ్చాయి. 2022లో మాత్రం అత్యధికంగా 1669 కంప్లైంట్స్ నమోదయ్యాయి. 2015తో పోలిస్తే ఇది మూడింతలు. అయితే, ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ఆర్ఐ వివాహ నమోదు బిల్లు పెండింగ్‌లో ఉంది. 2019లో అప్పటి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, ప్రవాస భారతీయలు వివాహ రిజిస్ట్రేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఎన్నారైల మోసపూరిత వివాహాల్లో మహిళలు ఇరుక్కొవద్దనేది ఈ బిల్లు ఉద్దేశం. చాలా వరకు ఇలాంటి సంబంధాల్లో మా అమ్మాయి విదేశాలకు వెళ్తుందని తల్లిదండ్రులు చూస్తున్నారు, తప్పితే అబ్బాయి ఎలాంటి వాడనేదానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో కొంతమంది ఎన్నారైలు మోసపూరితంగా వివాహాలు చేసుకుంటున్నారు. వివాహం చేసుకున్న తర్వాత భార్యలను ఇక్కడే ఉంచుతున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లు ప్రకారం.. వివాహం జరిగిన తేదీ నుంచి 30 రోజుల్లో భారతదేశం లేదా భారతదేశంలో వివాహం జరిగితే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కుటుంబ చట్టాల ప్రకారం విడిచిపెట్టిన భార్యకు హక్కులను మరింత మెరుగ్గా అమలు చేయడం కోసం వివాహాన్ని తప్పకుండా నమోదు చేసుకునేలా చట్టాన్ని తీసుకురావాలని, ఈ బిల్లు పేర్కొంటోంది. ఒక వేళ 30 రోజుల్లో వివాహాన్ని రిజస్ట్రేషన్ చేయని పక్షంలో ఎన్ఆర్ఐ పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలను స్వాధీనం చేసుకోవడం లేదా రద్దు చేయడానికి పాస్‌పోర్టు అథారిటీకి అధికారం ఇచ్చే పాస్‌పోర్టు చట్టం-1967కి సవరణలను బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎన్నారైలు ఇలా భార్యలను విడిచిపెడుతున్న ఫిర్యాదులు పెరుగుతున్న క్రమంలో మరోసారి ఈ బిల్లు చర్చనీయాంశంగా మారింది.

 

*ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐదేళ్లకు పెళ్లి చేసుకున్న న్యూజిలాండ్ మాజీ ప్రధాని
న్యూజిలాండ్ మాజీ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐదు సంత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంది. చాలా కాలం నుంచి జీవిత భాగ‌స్వామిగా ఉన్న క్లార్క్ గేఫోర్డ్‌ను ఆమె మ్యారేజ్ చేసుకుంది. క‌రోనా వైర‌స్ టైంలో న్యూజిలాండ్‌లో అతి క‌ఠిన‌మైన ఆంక్షలను జెసిండా విధించారు.. త‌న పెళ్లిని కూడా క‌రోనా వ‌ల్లే ఆమె వాయిదా వేసుకుంది. వెల్లింగ్టన్ కు 325 కిలో మీటర్ల దూరంలో ఉన్న హాక్ బే ఏరియాలో ఉన్న ఓ విలాసవంతమైన తోటలో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. అయితే, పెళ్లి వేళ కొంద‌రు నిరసనకారులు వేదిక బయటవ వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా పోస్టర్లతో ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, 2014 నుంచి జెసిండా ఆర్డెర్న్, గేఫోర్డ్ డేటింగ్‌లో ఉన్నారు. ఇక, ఐదేళ్ల త‌ర్వాత వాళ్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.. కానీ, కరోనా ఆంక్షల వల్ల 2022లో వాళ్ల పెళ్లికి అవాంత‌రాలు వచ్చాయి. 2017లో న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ త‌ర్వాత 2018లో ఆమె ఓ పాప‌కు జన్మనిచ్చి తల్లి కూడా అయింది. న్యూయార్క్‌లో జ‌రిగిన యూఎన్ మీటింగ్‌కు కూడా ఆ పాప‌ను జెసిండా తీసుకెళ్లారు. అయితే, 2023 జ‌న‌వ‌రిలో ఆమె అక‌స్మాత్తుగా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జెసిండా ఆర్డార్న్, క్లార్క్ గేఫోర్డ్‌ పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version