*మూడు రైళ్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
గుంటూరు రైల్వేస్టేషన్‌లో మూడు రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. నరసాపురం నుంచి హుబ్లీకి, గుంటూరు నుంచి విశాఖకు, రేణిగుంట నుంచి నంద్యాలకు మూడు రైళ్లను కేంద్రమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు రైళ్లను ప్రారంభించామని, నంద్యాల నుంచి రేణిగుంట రైలు తిరుమల భక్తులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని తెలిపారు. ఏపీలో అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ దాదాపు పూర్తయిందన్నారు. గతంలో 2014లో 886 కోట్లుగా ఉన్న ఏపీ రైల్వే బడ్జెట్ నేడు 8 వేల కోట్ల బడ్జెట్‌గా మారిందన్నారు. ప్రధాని మోడీ ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించారని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రపంచం రైల్వే నెట్ వర్క్‌లలో భారత్ నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ఉన్న దేశమని ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు లో ఉండే ప్రయాణం రైల్వే అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. భారత దేశంలో ప్రతి రోజూ 1200 రైళ్లు రెండు కోట్ల మందికి సేవలు అందిస్తున్నాయన్నారు. ప్రతి టిక్కెట్‌పై యాభై మూడు శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. రైల్వే శాఖకు నిధుల కొరత లేకుండా ప్రధాని మోడీ చర్యలు చేపట్టారన్నారు. దేశంలో ప్రతి రోజూ 16 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అమృత్ భారత్ కింద హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏపీలో 5 వందే భారత్ రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. గడిచిన పదేళ్లలో ఐదు లక్షల మందికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఆర్యూబీ ,ఆర్‌వోబీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సాంప్రదాయ ఉత్పత్తులు తయారు చేసే వారు అమ్మకాలకు వీలుగా రైల్వేలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రైల్వే స్టేషన్‌లో హై స్పీడ్ ఇంటర్ నెట్, వైఫై సౌకర్యం ఏర్పాటు చేశామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. భారతదేశంలో ఏ ప్రధాని సాధించలేని అభివృద్ధి నరేంద్ర మోడీ సాధించారన్నారు. రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ చరిత్రలో నిలవనున్నారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభించాం… అన్ని వర్గాలు మోడీకి మద్దతు గా నిలవనున్నాయి.. మరోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం వస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించిందన్నారు. దేశంలో ఏ గ్రామం వెళ్లినా ఏ పట్టణం వెళ్లిన మోడీ పేరు వినపడుతుందని.. గత తొమ్మిదేళ్లుగా అవినీతి రహిత పాలన సాగుతుందని తెలిపారు. మౌలిక వసతులు కల్పనలు మోడీ ప్రయత్నించారని.. సుస్థిర పాలన మోడీ నాయకత్వంలో సాగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
*సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ..
సచివాలయంలోని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఆరు గ్యారెంటీల అమలు, మార్గదర్శకాలపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ నెల చివరి నాటికి అభయ హస్తం దరఖాస్తులు ఆన్లైన్లో ఎంట్రీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంత మంది లబ్దిదారులన్న దానిపై క్లారిటీ రానుంది. ఈ నెల చివరిన లేదా వచ్చే నెలలో గ్యారెంటీ అమలు నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం.
*మూడు లిస్టులు రిలీజ్ చేశాం.. త్వరలో మరో జాబితా..
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి సమస్య లేదని, బాలినేని జిల్లాకు వైసీపీలో అత్యంత విలువైన నాయకుడని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత తగ్గదని.. ఆయన స్థానం ఆయనకు ఉంటుందన్నారు. మూడు లిస్టులు ఇప్పటికే రిలీజ్ చేశాం.. త్వరలో మరో లిస్ట్ ఉంటుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు అన్న తర్వాత పరస్పర ఆరోపణలు సహజమని, ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. మా నాయకుడ్ని టీడీపీ నేతలు విమర్శిస్తే తిప్పికొట్టడం మా బాధ్యత అంటూ ఆయన పేర్కొన్నారు. ఆ బాధ్యతను ప్రతీ ఒక్కరూ నిర్వర్తించాలన్నారు. అంతే తప్ప తిట్టడం అనే పదాన్ని వాడకూడదన్నారు. కావాలనే టీడీపీ వాళ్లు తిట్టమన్నారని ఎందుకు ఆరోపణలు వారే చెప్పాలని, తిట్టమని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. మేము అలా చెప్పమన్నారు. మా నేతను విమర్శిస్తే మేమే సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ మరణంపై గతంలోనే విచారణ జరిగింది.. రిపోర్టును అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారన్నారు. టీడీపీ దొంగ ఓట్ల వ్యవహారంపై సీఈసీకి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు దొంగ ఓట్లతో ఎలా గెలిచారో అన్నీ రుజువులు అప్పగించామన్నారు. ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.
*సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది.. కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదు..!
సినిమా స్టార్ట్ కావడం ఎన్నో రోజులు పట్టదు, ఫిబ్రవరి నుండే స్టార్ట్ అవుతుందని.. 5 యేండ్లు పాటు మనం కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో నాయకులకు , కార్యకర్తలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. 10 యేండ్లలో చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే… కళ్ళు లేని కబోదిలా కాంగ్రెస్ పార్టీ వ్యహారిస్తుందని మండిపడ్డారు. ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయింది, కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీకి సినిమా స్టార్ట్ అవుతుందని అన్నారు. సినిమా స్టార్ట్ కావడం ఎన్నో రోజులు పట్టదు, ఫిబ్రవరి నుండే స్టార్ట్ అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేంత వరకు ప్రజల తరుపున పోరాటం చెయ్యాలన్నారు. 5 యేండ్లు పాటు మనం కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల పుస్తకంను బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగ చదవి అవి అమలు చేసేంత వరకు వదలొద్దని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఒక్క నెల మాసంలోని ప్రజల వ్యతిరేకతను ముటగట్టుకున్న ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, గెలుపులు సహజమన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంను కాంగ్రెస్ పార్టీ కరపత్రంలా మాట్లాడించారని తెలిపారు. కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేయించారని తెలిపారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ లో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం పై విచారణ చేసుకోండి స్వాగతిస్తున్నమని అన్నారు. తప్పు తేలితే శిక్ష పడుతుందని అన్నారు. కాళేశ్వరంను పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు ? అని ప్రశ్నించారు. నిర్మాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని, నిర్మాణ సంస్థ బాధ్యత తీసుకుంటుందని అన్నారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ లలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ కు సూచిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి విడుదలపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. యాసంగి పంట దిగుబడి తగ్గుతుంది అని అంటున్నారని తెలిపారు. రైతులు పంట పండించుకునే అవకాశం ఇవ్వడం…నీటిని విడుదల చేయండని అన్నారు. మహారాష్ట్ర నుంచి నీటిని తీసుకురావాలన్న కాంగ్రెస్ సర్కార్ ఆలోచన అనాలోచితం అని తెలిపారు.
*ప్రకాశం జిల్లా వైసీపీలో అనిశ్చితి..! గుంటూరు కారం థియేటర్‌లో బాలినేని..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది.. దీంతో.. సినీ, రాజకీయ ప్రముఖులు థియేటర్లలో సందడి చేశారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో.. మరీ ముఖ్యంగా తన జిల్లా ప్రకాశంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయిన వేళ.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. గుంటూరు కారం సినిమా చూస్తూ రిలక్స్ అవుతున్నారు.. ఆ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. గురువారం రోజు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో లిస్ట్‌ను ప్రకటించింది.. ఆ లిస్ట్‌లోనూ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ఖరారు కాలేదు.. దీంతో.. మరోసారి ప్రకాశం జిల్లా వైసీపీలో అనిశ్చితి నెలకొన్నట్టు అయ్యింది.. మాగుంట కోసం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని పట్టుబట్టారు.. ఆ మధ్యే సీఎంవోకు వెళ్లి.. ఆ తర్వాత ఐప్యాక్ టీమ్‌ను కలిసి కూడా చర్చించారు. ఆ తర్వాత మాగుంటకు సీటు ఫైనల్ అని ప్రచారం సాగినా.. వైసీపీ అధిష్టానం ఇప్పటికీ ఆయన పేరు ప్రకటించలేదు. మరోవైపు.. ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరణ చేసిన భూములకు నగదు బదిలీ వ్యవహారం కూడా కొలిక్కిరాలేదు. గత కొద్ది నెలలుగా భూములకు నగదు వేయాలంటూ సీఎంవో అధికారుల చుట్టూ తిరిగిన బాలినేని.. చివరకు సీఎం వైఎస్ జగన్ వద్ద కూడా ఈ వ్యవహారాన్ని ప్రస్తావించారు. మరోవైపు వైసీపీ థర్డ్ లిస్ట్ లో మార్కాపురం ఇంచార్జీగా మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పేరు కూడా కనిపించలేదు.. దీంతో.. బాలినేని మరోసారి అలకబూమినట్టు ప్రచారం సాగుతోంది.. బాలినేనితో సంప్రదింపుల కోసం అధిష్టానం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ రోజు కొండేపిలో నూతన వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గా మంత్రి ఆదిములపు సురేష్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు.. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ ఇంఛార్జ్ మాదాసి వెంకయ్య కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో.. హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో కొందరు తన సహచరులతో కలిసి గుంటూరు కారం సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు బాలినేని.. గుర్తుతెలియని వ్యక్తి ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో వదలడంలో.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. మొత్తంగా జిల్లాలో పొలిటికల్ హీట్ కొనసాగుతుండగా. మాజీ మంత్రి బాలినేని మాత్రం.. పాప్ కార్న్ తింటూ గుంటూరు కారం సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
*చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రి రోజా
టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా.. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. చంద్ర బాబు పొద్దున్నే జనసేన, మధ్యాహ్నం కాంగ్రెస్, రాత్రికి బీజేపీతో ఉంటాడు అని విరుచుకుపడ్డారు.. రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబేనని ఆరోపించిన ఆమె.. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఉంది చంద్రబాబు వైఖరి అన్నారు. డబ్బులకు టికెట్లను అమ్ముకునే వ్యక్తి ఆయన అంటూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఇక, సర్వేల తర్వాత వైసీపీ అభ్యర్థుల మార్పు జరిగింది.. మరి సంక్రాంతిలోపు టికెట్లు ప్రకటిస్తానన్న చంద్రబాబు ఎందుకు చేయలేదు? అభ్యర్థులు లేకే పొత్తులు పెట్టుకొని చంద్రబాబు వెళ్తున్నాడి విమర్శించారు. కుప్పంలో గెలిచే అవకాశం లేదని చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు.. పవన్ కల్యాణ్, లోకేష్ కూడా రెండు చోట్ల పోటీకి సిద్ధం అవుతున్నారని విమర్శించారు మంత్రి రోజా.. అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు వచ్చినా సీఎం వైఎస్ జగన్ ను ఏమీ చేయలేరన్నారు. ఏపీలో లేని నాయకులు అంతా ఏకమై వస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను ప్రజలు రెండు చోట్ల ఒడించినప్పుడే పవన్ పరిస్థితి అర్థం అయ్యిందని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు రాజకీయం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.. బీజేపీతో కలిసి పోటీ చేయనని చెప్పి 2014లో పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు పొద్దున్నే జనసేన, మధ్యాహ్నం కాంగ్రెస్, రాత్రికి బీజేపీతో ఉంటాడు అని సెటైర్లు వేశారు. సొంత జెండా ఎజెండా చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు. అభ్యర్థులను మారుస్తా అని సీఎం వైఎస్ జగన్ పదే పదే చెప్పారు.. సర్వేలు ఆధారంగా టికెట్లు ఇస్తాను అని ముందే చెప్పారని గుర్తుచేశారు మంత్రి ఆర్కే రోజా..
*రేపటి నుంచి ఐనవోలు మల్లన్న జాతర.. ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభం
హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతరకు సమయం రానే వచ్చింది. రేపు (13న) ధ్వజారోహణంతో మల్లన్న ఉత్సవాలు ప్రారంభం కానున్నారు. ఎల్లుండి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో. ఉత్తర తెలంగాణ ప్రజలు కొంగుబంగారంగా కొలిచే అయిలోని మల్లన్న ఉత్సవాలకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి దాదాపు 10 లక్షల మంది తరలివస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఐనవోలో మల్లన్న ఉత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేయాల్సి ఉంది. దీనికి అధికారులతో పాటు ఆలయ కమిటీ కూడా బాధ్యత వహించాల్సి ఉంది. అయితే మల్లన్న ఆలయ కమిటీలో గందరగోళం నడుస్తోంది. ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సంక్రాంతి నుంచి ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతాయి. అధికారులతో పాటు ఆలయ కమిటీ కూడా భక్తుల రాకపోకలకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం చాలా కీలకం. అయితే జాతర దగ్గర పడుతున్నా మల్లన్న ఆలయ కమిటీపై స్పష్టత లేదు. ఎండోమెంట్ అధికారులు ఆలయ ట్రస్ట్ బోర్డు యొక్క రాజ్యాంగం కోసం నోటిఫికేషన్ జారీ చేయాలి, సభ్యుల నియామకం కోసం ఆసక్తిగల వారి నుండి దరఖాస్తులను స్వీకరించాలి. అర్హులను ఎంపిక చేసి దేవాదాయ శాఖ కమిషనర్ సభ్యులను ఫైనల్ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. జాతర సందర్భంగా అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేష్ సూచన మేరకు తమ పార్టీకి చెందిన మజ్జిగ జయపాల్ అనే వ్యక్తితో సహా 14 మందితో ఆలయ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ జయపాల్ ఆలయంలో వాటాదారు. ఎండోమెంట్ నిబంధనల ప్రకారం, ఆలయంలో వాటాదారుగా ఉన్న వ్యక్తికి ట్రస్ట్ బోర్డులో స్థానం ఇవ్వకూడదు. అయితే ట్రస్టుబోర్డు సభ్యుడిగా జయపాల్‌కు అవకాశం కల్పించాలని, కమిటీ వేయాలని హనుమకొండకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కమిటీ నియామకాన్ని రద్దు చేసింది. దీనివల్ల బీఆర్‌ఎస్ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. 2023 జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రస్టుబోర్డు నియామకాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కమిటీ ఏర్పాటుపై స్పష్టత రాలేదు. ఈ క్రమంలో గత అక్టోబర్‌లో హైకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిందని, ఈసారి తమ పాలకవర్గం కొనసాగుతుందని అప్పటి కమిటీ సభ్యులు చెబుతూ వచ్చారు. నిజానికి ఈ వివాదం హైకోర్టులో పరిష్కారమైతే అక్కడి నుంచి పన్నుల శాఖ అధికారుల ఆదేశాలు అందాల్సి ఉంది. అయితే హైకోర్టులో కేసు వేసిన తర్వాత తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, ఈ నేపథ్యంలో పాత కమిటీకి ఎలాంటి అధికారాలు లేవని ఆలయ అధికారులు చెబుతున్నారు. దీంతో గతేడాది జాతర నుంచి ఆలయ కమిటీపై స్పష్టత రాలేదు.
*ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ సెంటర్.. జాబ్ మేళా ప్రారంభించిన రాష్ట్ర ఐటీ మంత్రి
యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపడుతున్నామని, ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని వివరించారు. జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ కార్యాలయం లో యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ప్రిన్సిపల్ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, సెట్విన్ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు. 5 వేల ఉద్యోగాల కల్పనకు నిర్వహించిన జాబ్ మేళాలో 80 కంపెనీలు పాల్గొనగా… 6500 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. స్వామి వివేకానంద ఆలోచనలు, వారి మార్గం యువతకి ఆదర్శమని తెలిపారు. యువ వయసులో మంచి విద్య , ఉద్యోగం అవసరమని అన్నారు. యువత సమస్యలను పరిష్కరించాలన్న భావతతో ఉద్యోగ కల్పన గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని స్పషఖటం చేశారు. గత పదేళ్లలో ఒక దశాదిశ లేకుండా రాష్ట్రం నడిచిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. యువత కూడా ఒక లక్ష్యం తో ముందుకు వెళ్లాలని, వివేకానంద స్ఫూర్తి తో లక్ష్య సాధన లో విజయం సాధించాలని ఆశిస్తున్నానన్నారు. గ్రామీణ ప్రాంతంలో యువత పెడదారిపట్టే దారులునున్నాయని, కాబట్టి మాదక ద్రవ్యాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ అనే మాటవినిపిం చొద్దు అని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ దిశగా ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగ భర్తీ పట్ల నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ప్రైవేట్ రంగంలోని మరిన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన లో ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రం లో స్కిల్ సెంటర్ , స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమల స్థాపన, వాటికి కావాల్సిన నైపుణ్యాన్ని వెలికతీసేందుకు స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో మానవ వనరుల రంగంలో తెలంగాణ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండబోతుందని తేల్చిచెప్పారు. “మాది ప్రజల ప్రభుత్వం. భాష విషయంలో బాధ పదద్దు. స్కిల్ యూనివర్సిటీస్ ద్వారా మీకు అందులో ప్రావీణ్యం లభిస్తుంది. మీ ప్రతిభ బయటకు వస్తుంది .. మేము మీ కోసమే పని చేస్తున్నం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత ను మోటివెట్ చేసి ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ప్రత్యేక నిధులు ఏర్పాటు తో వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాము”అని యువతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆర్టిఫషియల్ ఇంటెలిజెన్స్ లో డిగ్రీ చదువుకన్న వారికి సైతం ఒక ప్రత్యేక కోర్సు అందుబాటులోకి తెబోతున్నమమని, ఆ రంగం లో కూడా యువతకి ఉపాధి తో పాటు రాష్ట్ర అభివృద్ది చెందుతుందని అభిప్రాయపడ్డారు. సానుకూల దృక్పథంతో యువత ముందుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్ లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా జాబ్ మేళ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కాగా35 వేల మందికి ఇప్పటికే పలు జాబ్ మేళ ద్వారా ఉద్యోగాలు అందించినట్టు యూత్ సర్వీస్ విభాగం అధికారులు మంత్రికి తెలియజేశారు. మేళ లో ఉద్యోగం కోసం వచ్చిన యువతతో మంత్రి ప్రత్యేకంగా కలిసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
*ముంబై దాడి కుట్రదారు, లష్కరే కీలక ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవి మృతి
ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ అబ్దుల్ సలామ్ బుట్టవీ చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ధ్రువీకరించింది. భుట్టవి గత ఏడాది మేలో పంజాబ్ ప్రావిన్స్ లో ప్రభుత్వ కస్టడీలో ఉండగా.. గుండెపోటుతో మరణించాడు. ఇతను లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్‌కి డిప్యూటీగా ఉన్నాడు. యూఎన్ఎస్‌సీ ప్రకారం.. భుట్టవి 29 మే 2023న పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిడ్కేలో గుండెపోటుతో మరణించాడు. పాక్ ప్రభుత్వం హఫీస్ సయీద్‌ని రెండు సార్లు నిర్భంధించినప్పుడు లష్కరేతోయిబా/ జామాత్ ఉద్ దావాకు తాత్కాలిక చీఫ్‌గా పనిచేశాడు. ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు భుట్టవి శిక్షణ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంబై దాడుల అనంతరం 2008లో హఫీస్ సయీద్‌ని అరెస్ట్ చేశారు. అంతకు ముందు 2002లో కూడా అక్కడి ప్రభుత్వం నిర్భందంలోకి తీసుకుని తర్వాత విడుదల చేసింది. ఈ రెండు సందర్భాల్లో లష్కర్ ఉగ్ర సంస్థకు భుట్టవీ కీలకంగా వ్యవహరించాడు. 2002లో పాక్ నగరం లాహోర్‌లో లష్కర్ ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో ఇతను కీలకంగా ఉన్నాడు. N భద్రతా మండలి 2012లో భుట్టవీని టెర్రరిస్టుగా గుర్తించింది. కొన్నాళ్ల తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం అతడిని అరెస్టు చేసి, ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ బావ అబ్దుల్ రహ్మాన్ మక్కీతో పాటు టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణలపై ఆగస్టు 2020లో అతడికి శిక్ష విధించింది. అతనికి పాక్ 16.5 ఏళ్లు శిక్ష విధించింది.
