పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ.. ఇప్పుడు వాటిపై..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇప్పటికే వివిధ అంశాలపై లేఖలు రాస్తూ వచ్చిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య.. ఇప్పుడు పవన్‌కు బహిరంగ లేఖ రాశారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్ కల్యాణ్ వెంట నడవడం లేదన్న ఆయన.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుండి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని సూచించారు. అధికారంలోకి వస్తే రెండున్నర ఏళ్లు.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే జరిగే నష్టానికి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు చేగొండి హరిరామ జోగయ్య.
మైలవరం పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు.. అక్కడి నుంచే పోటీ.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే..
మైలవరం పాలిటిక్స్‌లో కొన్ని రోజులుగా కొనసాగుతోన్న సస్పెన్స్‌కు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి రావటం దురదృష్టకరమన్నారు. ఐతవరం నుంచి మైలవరం వచ్చి ఆరేళ్లు పనిచేశానన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిన్నరగా ఇబ్బందులు పడుతున్న కారణంగా స్లో అయ్యానని ఆయన అన్నారు. మైలవరం ఇంఛార్జి ఇచ్చిన దగ్గర నుంచి పార్టీ కోసం పని చేశానన్నారు. ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. మైలవరం నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. గతంలో నందిగామ ఎస్సీ రిజర్వు చేయటంతో మైలవరానికి వచ్చాను గుర్తుచేసుకున్నారు.. గత ఆరేళ్లుగా మైలవరం నుంచే పనిచేస్తున్నా, ఇక్కడే ఉంటాను అని స్పష్టం చేశారు. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడం పక్కా అనే సంకేతాలు ఇచ్చారు.. కానీ, నిద్ధిష్టమైన నిర్ణయం త్వరలోనే చెబుతాను అన్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను పార్టీలో చేరాలని అడిగారు.. దానిపై త్వరలోనే నా నిర్ణయం ఉంటుందన్నారు. మరోవైపు, మంత్రి జోగి రమేష్ వల్ల పార్టీలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాను అని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ ఓడి పోవటానికి జోగి రమేష్ తమ్ముడికి టికెట్ ఇవ్వక పోవటమే కారణంగా చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి వెన్నుపోట్లు చేస్తుంటే వచ్చే ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఎలా పోటీ చేస్తాను..? అని నిలదీశారు. ఎన్నికల ముందు అధిష్టానం ఎన్ని హామీలు ఇచ్చినా అది ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకున్నట్టే అవుతుందని హాట్ కామెంట్లు చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
బాబు ‘కోవర్టు ఆపరేషన్’ స్టార్ట్..! పవన్ మేల్కొంటే మంచిది..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి మార్గాని భరత్ రామ్.. వెన్నపోట్లు పొడవడం తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలవాటేనని.. ఈ 2024 ఎన్నికలలో పవన్ కల్యాణ్ దొరికేసినట్లేనని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు వెన్నుపోటు పోడవడం వెన్నతో పెట్టిన విద్యే అన్నారు. అధికారంలో ఉన్న పార్టీలోకి తమ మనుషులను పంపి రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీలోకి టీడీపీ ఎంపీలు వెళ్లడం చంద్రబాబు డైరెక్షనే అని ఆరోపించారు. ప్రస్తుతం 2024 ఎన్నికలకు టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు ట్రాప్ లో కచ్చితంగా పవన్ పడతారని జోస్యం చెప్పారు. ఇక, టిక్కెట్లు కోసం టీడీపీ వాళ్లనే చంద్రబాబు.. జనసేనలోకి పంపి.. గెలిచిన తర్వాత టీడీపీలోకి రప్పించుకోవడం ఖాయం అన్నారు ఎంపీ భరత్.. అంటే ‘కోవర్టు ఆపరేషన్’ స్టార్ట్ అయిందని.. ఎన్నికల ఫలితాల అనంతరం అసలు రహస్యం, చంద్రబాబు మోసాన్ని జనసేనాని పవన్ గ్రహించేసరికి పుణ్యకాలం ముగిసిపోతుందని అన్నారు. చంద్రబాబు రాజకీయ జిమ్మిక్కులు గత మూడు దశాబ్దాలకు పైగా ఈ రాష్ట్ర ప్రజలు చూసి చూసి విసుగెత్తిపోయారన్నారు. ఇక చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించే పరిస్థితుల్లో జనం లేరని ఎంపీ భరత్ అన్నారు. సీట్ల సర్దుబాటు తదనంతర రాజకీయ పరిణామాలను ఇప్పటికైనా జనసేనాని గ్రహించి మేల్కొంటే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు, పవన్ అజెండా జగన్ ను అధికారంలో నుంచి దింపడమే తప్పిస్తే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన, ప్రజాధనాన్ని అడ్డంగా లూటీ చేసిన టీడీపీకి ఎందుకు ఓటేయాలని ఎంపీ భరత్ ప్రశ్నించారు. గతంలో పెన్షన్ మంజూరు కావాలన్నా, నెలనెలా పెన్షన్ అందుకోవాలన్నా లబ్ధిదారుల అవస్థలు వర్ణనాతీతం అని.. ఈ రోజు ఇంటికే నేరుగా లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తుంటే ఆ అవ్వాతాతల ముఖాలలో ఎంతో ఆనందం కనిపిస్తోందని అన్నారు. ప్రజలకు జగనన్న పాలనపై పూర్తి సంతృప్తి ఉందని.. మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు ఎంపీ మార్గాని భరత్ రామ్.
2 నెలల నుంచి ఇసుక రవాణా.. రోజుకు రూ.25 లక్షల వరకు అవినీతి..!
చోడవరం ఇసుక క్వారీపై అధికారులకు ఫిర్యాదు చేశారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ బోడె ప్రసాద్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి చోడవరంలో ఇసుక క్వారీలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్నారు.. మంత్రి జోగి రమేష్ నియోజకవర్గ అభ్యర్థిగా వచ్చిన దగ్గరి నుంచి ఇసుక క్వారీని స్వాధీనం చేసుకుని అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు.. ప్రభుత్వం జేసీ, కేసీ సంస్థకు టెండరు ఇవ్వగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని విమర్శించారు.. అయితే, మేం అక్కడికి వెళ్లడంతో పొక్లెయినర్‌లు వదిలేసి వారు, అక్కడ సిబ్బంది పారిపోయారని తెలిపారు బోడె ప్రసాద్.. ఎమ్మెల్యే వెహికిల్స్ అని ఇక్కడ నోట్ చేసుకుని అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.. రోజుకు 20 నుంచి 25 లక్షల వరకు ఈ అవినీతి మంత్రికి ఆదాయంగా వస్తుందని విమర్శించారు.. మైలవరంలో తన్నితే పెడన.. అక్కడ తన్నితే.. పెనమలూరు వచ్చారంటూ.. పెనమలూరు వైసీపీ ఇంఛార్జ్‌గా మంత్రి జోగి రమేష్‌ను నియమించడంపై సెటైర్లు వేశారు.. వీళ్లకు ప్రజల అభివృద్ధి పట్టదు.. కేవలం దోచుకోవడం, దాచుకోవడం.. ముఖ్యమంత్రికి కప్పం కట్టడం మాత్రమే తెలుసన్నారు. అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేద్దాము అన్న ఒక్క అధికారి కూడా స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, నారా లోకేష్ ఎలా ఎర్ర బుక్ మైంటైన్ చేస్తున్నారో.. అలాగే, పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని అధికారులపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు.. ఎమ్మెల్యేలకు, మంత్రులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు మాజీ ఎమ్మెల్యే, పెనమలూరు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ బోడె ప్రసాద్.
ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి
సీఎం రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఖాళీ అయ్యి పెంక కుండలు ఉన్నాయని అంటున్నారని అన్నారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 13 వేల కోట్ల బడ్జెట్ తో మోడీ విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టారని, ఎన్నికల కారణంగా అమలు కాస్త ఆలస్యమైందని ఆయన తెలిపారు. అయినా ఇప్పటి వరకు 1.20 లక్షల మందిని విశ్వకర్మ యోజనలో చేర్పించామని ఆయన పేర్కొన్నారు. కానీ దీనికి సంబంధించి ఎంపిక చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలని, కానీ ఇప్పటి వరకు చేయలేదని ఆయన విమర్శించారు. కనీసం 4 వేల మందికి సంబంధించిన వివరాలు కూడా వెరిఫై చేయలేదన్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులను అదేశించి వెరైఫికేషన్ చేయించండని, ఇప్పటికే గ్రాంట్ కూడా బ్యాంకుల్లో డిపాజిట్ అయిందన్నారు. వెరైఫికేషన్ కంప్లిట్ చేస్తే లబ్ధిదారులకు నిధులు అందుతాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఎన్నికల కోడ్ పడే అవకాశం ఉందని, నల్లగొండలో ఎస్ఎల్ పీసీ ప్రాజెక్టుకు 500 లేదా 600 కోట్లు ఇవ్వడానికి కేసీఆర్ కు చేతులు రాలేదన్నారు బూర నర్సయ్య గౌడ్. ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పోటీ పడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఎన్నో లింకులు కాంగ్రెస్ పెట్టిందన్నారు. కానీ కృష్ణా జల వివాదంపై బీజేపీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని, బీఆర్ఎస్ కు ఓటు వేసి శూన్యమన్నారు బూర నర్సయ్య. ఆ పార్టీ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదని, బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం లంకె బిందెలు ఇవ్వడానికి రెడీగా ఉందని ఆయన తెలిపారు.
బీఆర్‌ఎస్ సర్కార్ ఎప్పుడు ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకోలేదు
రేవంత్ రెడ్డి మితి మీరిన అహంకారంతో మాట్లాడారని, వితండ వాదం చేశారని మండిపడ్డారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీచమైన పద్ధతి లో కేసీఅర్ పై వ్యక్తిగత దూషణలు చేశారు రేవంత్ అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం మేము KRMBకి ప్రాజెక్ట్ లు అప్పజెప్పామని రంకెలు వేస్తుందని, KRMB మీటింగ్ లో ప్రాజెక్ట్ లు అప్పగించేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందన్నారు హరీష్ రావు. రెండు రాష్ట్రాలు ఒక నెల రోజుల్లో 15 ప్రాజెక్టు లు అప్పగిస్తరని KRMB మీటింగ్ మినట్స్ లో ఉందని, ఫిబ్రవరి 1న జరిగిన సమావేశంలో KRMB మీటింగ్ మినిట్స్ లొ తెలంగాణ ప్రాజెక్ట్ లు అప్పగించడానికి అభ్యంతరం చెప్పలేదు అని ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా..’రెండు రాష్ట్రాల ENC లు ప్రాజెక్టు అప్పగించడానికి KRMB మీటింగ్ లో ఒప్పుకున్నారు. ఢిల్లీ కి ప్రాజెక్ట్ లు అప్పగించి తెలంగాణ ను అడుక్కునే పరిస్థితి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను నష్టం కలిగించేలా రేవంత్ రెడ్డి వ్యవహరించవద్దు. BRS సర్కార్ ఎప్పుడు ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకోలేదు. ఇదే విషయం KRMB మీటింగ్ మినిట్స్ లొ ఉంది. 17 KRMB మీటింగ్ లో ప్రాజెక్ట్ ల అప్పగింత అంశంను అపెక్స్ కౌన్సిల్ కు రెఫెర్ చేయాలని BRS ప్రభుత్వ ప్రతినిధి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి దగుల్ బాజీ మాటలు మాట్లాడుతున్నారు. పోతిరెడ్డీపాడు కు పొక్క పెద్దగా చేసినప్పుడు నాటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ ఇతరలు పెదవులు మూసుకున్నారు…మేం కాదు. మేము నాటి వైయస్ మంత్రివర్గం నుంచి మంత్రులుగా రాజీనామా చేసిన తరవాత పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. పదవుల కోసం పార్టీల మారిన చరిత్ర రేవంత్ రెడ్డి ది…ఆయన పక్కన ఉన్న నేతలు పెదవులు మూసుకున్నారు. మా తో పాటు గొంతు కలిపింది…కేవలం ఒక్క కాంగ్రెస్ నేత పీజేఆర్ మాత్రమే. పోతిరెడ్డీపాడు పై నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో 40 రోజుల పాటు పోరాటం చేశాం. రేవంత్ తీరు ఒల్ట్ చోర్ కొత్వాల్ కూ మారా అన్నట్టు ఉంది. రాయలసీమ లిఫ్ట్ గురించి కొట్లడిందే BRS సర్కార్. 2 వ అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేసీఅర్ రాయలసీమ లిఫ్ట్ ను అడ్డుకున్నారు. ఇప్పుడు ఎవరినీ జనం చెప్పులతో కొట్టాలి రేవంత్ రెడ్డి?.’ అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాల్‌ప్రాక్టీస్‌పై కేంద్రం ఉక్కుపాదం.. లోక్‌సభలో బిల్లు
పోటీ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. నిరుద్యోగుల బలహీనతలను కొందరు ఆసరాగా చేసుకుని మాఫీయాలు రెచ్చిపోతుంటాయి. అక్రమార్గాల్లో విద్యార్థులను తప్పుదోవపట్టిస్తుంటాయి. ఇంకొందరైతే ఒకరి స్థానంలో మరొకరితో పరీక్ష రాయించి గట్టెక్కిస్తుంటారు. ఇలా రకరకాలుగా పోటీ పరీక్షల్లో అక్రమంగా ఉద్యోగాలు సంపాదిస్తుంటారు. అర్హులు కాకుండా అనర్హులు ఉద్యోగాలు సంపాదిస్తుంటారు. ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకుంటూ.. ఉద్యోగమే లక్ష్యంగా చదువుకున్న వాళ్లు మాత్రం అన్యాయానికి గురవుతుంటారు. వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్‌లో బిల్లు తీసుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో కేంద్రం ప్రవేశపెట్టింది. నేరం గనుక రుజువైతే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధించనుంది.
లక్నో జైలులో 63కు చేరిన హెచ్ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య..
లక్నో జైలులో హెచ్ఐవీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. జైలులో మొదటగా 47 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా.. తాజాగా ఆ సంఖ్య 63కు చేరుకుంది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన రోగులందరికీ లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 2023లో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ కేసులు బయటపడ్డాయి. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్ఐవీ సోకిన ఖైదీలలో చాలా మంది డ్రగ్స్ కు బానిసైన వారే ఉన్నారని పేర్కొన్నారు. వాటిని శరీరంలోకి ఎక్కించుకునే క్రమంలో ఒకరు ఉపయోగించిన సిరంజిల కారణంగానే ఖైదీలకు ఈ వైరస్ సోకినట్లు జైలు యాజమాన్యం పేర్కొంది. వీరందరికీ ముందే హెచ్ఐవీ ఉందని.. జైలుకు వచ్చిన తర్వాత ఏ ఖైదీకి హెచ్‌ఐవీ సోకలేదని తెలిపింది.
ట్యాక్సీ సర్వీస్‌లపై కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
ట్యాక్సీ సర్వీస్ ధరలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇష్టమొచ్చినట్లు ఛార్జీలు వసూలు చేయకుండా ధరలకు సర్కార్ కళ్లెం వేసింది. ఓలా, ఉబర్ వంటి సంస్థలతో పాటు ఇతర ట్యాక్సీ సర్వీస్‌లకు (Taxi Services) ఫిక్స్‌డ్ ఛార్జీలను అమలు చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రభుత్వం (Siddaramaiah Government) ప్రకటించింది. ఇందుకోసం ‘ఫిక్స్‌డ్ ఫేర్ రూల్’ పేరుతో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఆయా క్యాబ్ సంస్థలు వినియోగదారుల నుంచి ఇష్టానుసారంగా ధరలను వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది (Karnataka). తక్షణం ఈ ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం వాహనం ఖరీదు ఆధారంగా క్యాబ్ సర్వీస్‌లను మూడు భాగాలుగా విభజించింది. ఇక యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీస్‌ను అందించే సంస్థలు ఐదు శాతం జీఎస్టీతోపాటు, టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతించింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య క్యాబ్ సర్వీస్‌లను అందించే సంస్థలు సాధారణ ధరలకు అదనంగా పది శాతం వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
పెళ్లిపుస్తకం రాసేశాం.. ఇక ఇప్పుడు లగ్గం!
సుభిశి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న లగ్గం సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బేవార్స్, భీమదేవరపల్లి బ్రాంచి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రోనక్, గనవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యిన సందర్భంగా డా . రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మర్చిపోలేని పాత్ర పోషిస్తున్నాను. నా కెరీర్ లో పెళ్లిపుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈ కథ కథనాలు కనెక్ట్ అవుతాయి, “లగ్గం విందు భోజనం” లాంటి సినిమా అన్నారు. ఇక దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ “పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు!! రెండు మనసులు కలవడం.” అంటూ గట్టి దావత్ ఇవ్వబోతున్నామన్నారు. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్ గా బేబీ కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిబ్రవరి 5నుండి పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్ ప్రతి ఒక్కరికి వాళ్ళ లగ్గాన్ని గుర్తుచేస్తుందని, పెళ్ళి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది అని హీరో సాయి రోనక్ అన్నారు. రోహిణి,సప్తగిరి, ఎల్ బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను, సంధ్య, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, సత్తన్న , తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘గుంటూరు కారం’ సినిమా అందుకే తేడాకొట్టింది!.. ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్
దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి గతంలో చేసిన ఎన్నో సినిమాలు మాంచి హిట్స్‌గా నిలిచాయి. అయితే తరువాత కొన్ని వరుస డిజాస్టర్లు ఎదురు కావడంతో దర్శకత్వానికి దూరమయ్యారు. ఈ మధ్యనే ఆయన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తన తాజా ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి తన ఫ్లాపుల గురించి మాట్లాడుతూ మొన్న సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం గురించి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టాప్ హీరో సినిమాను ఉదహరిస్తూ ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో, అప్పుడే తేడా కొడుతుందని అప్పటి టాప్ హీరో అయినా ఇప్పుడు వచ్చిన గుంటూరు కారం అయినా అదే అవుతుందని అన్నారు. మహేష్ బాబు స్టార్డంకు తగ్గట్టుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ కిందా మీదా పడిపోయారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదని అన్నారు. కథను బేస్ చేసుకుని సినిమాలు తీయాలి కానీ హీరోల స్టార్ డంను నమ్ముకుంటే ఇబ్బందే అన్నారు. యమలీల అందుకే పెద్ద హిట్ అయిందని మిగతా సినిమాలు ఇబ్బంది పడ్డాయని అన్నారు. ఇక త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఇక జనవరి 12న రీలీజైన ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్నీ ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది.
