పశ్చిమ టికెట్..! టీడీపీ – జనసేన మధ్య ముసలం
విజయవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ – జనసేన మధ్య ముసలం మొదలైంది.. టీడీపీ నేతలు బాద్దా వెంకన్న, జలీల్ ఖాన్‌పై జనసేన పశ్చిమ ఇంఛార్జ్ పోతిని మహేష్ విమర్శలు గుప్పించారు. ఐదేళ్లు వీరంతా ఎక్కడున్నారు? అంటూ ఫైర్ అయ్యారు. గాలిబ్ షా ఆస్తులు , జుమ్మా మసీదు ఆస్తులు కొట్టేసింది ఎవరు? అని ప్రశ్నించారు. కులాలు, మతాల ముసుగులో రాజకీయాలు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకే టికెట్ కావాలని బల ప్రదర్శనకు దిగిన బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ టార్గెట్ గా విమర్శలు చేశారు జనసేన పశ్చిమ ఇంఛార్జి పోతిన మహేష్.. పశ్చిమలో కొంత మంది నాయకులు వ్యక్తిగత స్వార్థం కోసం కులాన్ని, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఐదేళ్ల నుంచి వీళ్లంతా ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు. చాక్లెట్ కొనివ్వని ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే టికెట్ కావాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. కూతురుకి టికెట్ ఇచ్చి ఓడిపోతే ఎవరూ ఇక్కడ సూసైడ్ చేసుకోలేదు ఎందుకు? చివరకు నేను కూడా సూసైడ్ చేసుకోలేదు అంటూ జలీల్ ఖాన్ పై విమర్శలు గుప్పించారు. గాలిబ్ షా ఆస్తులు , జుమ్మా మసీదు ఆస్తులు కొట్టేసింది ఎవరు? అని నిలదీశారు. కులాలు, మతాల ముసుగులో రాజకీయాలు చేస్తే ప్రజలు ఆ ట్రాప్ లో పడరు అని హితవు పలికారు జనసేన విజయవాడ పశ్చిమ ఇంఛార్జి పోతిన మహేష్.
ఆ మంత్రి వైసీపీలోనే కొనసాగుతారు..! క్లారిటీ ఇచ్చిన రీజినల్ ఇంఛార్జ్
వైసీపీ అధిష్టానంపై మంత్రి గుమ్మనూరు జయరాం అలిగారని.. కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం సాగింది.. తన సీటు మార్చడంపై వైసీపీ అధిష్టానంతో అసంతృప్తితో ఉన్నారనే మాటలు వినిపించాయి.. ఆ తర్వాత ఆయన కేబినెట్ సమావేశానికి హాజరు అయ్యారు.. దీంతో, ఆ ప్రచారానికి కొంత వరకు తెరపడినట్టు అయ్యింది.. మరోవైపు.. మంత్రి జయరాం.. వైసీపీలోనే కొనసాగుతారు అని స్పష్టం చేశారు వైసీపీ రీజినల్ ఇంచార్జి రామసుబ్బారెడ్డి.. ఆలూరులో వైసీపీ ఇంచార్జ్ బుసిని విరుపాక్షి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో కోఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి, మేయర్ బివై రామయ్య ఇతర నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. మంత్రి జయరాంకు గౌరవంగా ఎంపీ స్థానం అధిష్టానం కేటాయించిందన్న ఆయన.. జయరాంకు కార్యకర్తల సమావేశం సమాచారం ఇచ్చాం.. కానీ, సొంత పనిపై వెళ్తున్నానని, హాజరు కాలేకపోతున్నానని చెప్పారని వెల్లడించారు.. మంత్రి జయరాంకు పెద్ద హోదా కల్పించారు.. మంత్రి దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ
ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్.. ఘటన జరిగిన గంటల 14 గంటల వ్యవధిలో నిందితుడిని గుర్తించాం.. ఎమ్మార్వో హత్య కేసుకు ల్యాండ్ ఇష్యు నే కారణంగా పేర్కొన్నారు. నగరానికి చెందిన ఓ రియల్టర్ ఎమ్మార్వో హత్యకు పాల్పడ్డట్టు ఆధారాలు లభ్యమయ్యాయి.. అయితే, రియల్టర్, ఎమ్మార్వో మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ కావాల్సి ఉందన్నారు. హంతకుడు ప్రి ప్లాన్డ్ గానే ఫ్లైట్ టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాడు.. త్వరలో నిందితుడిని పట్టుకుని మరిన్ని వివరాలు అందిస్తాం అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. రాత్రి 10 గంటల సమయంలో అగంతకుడు.. రాడ్డుతో రమణయ్యపై దాడి చేశారు.. మాకు డయల్ 112కి కాల్ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాం.. మర్డర్ చేసిన తర్వాత సదరు వ్యక్తి ఫ్లైట్ ఎక్కి వెళ్లినట్టు గుర్తించాం అన్నారు. అగంతకుడు చాలా సార్లు ఎమ్మార్వో రమణయ్య ఆఫీస్ లోకి వెళ్లి వచ్చినట్టు సీసీటీవీ ద్వారా గుర్తించాం అన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్.. వైజాగ్ లోని ఓ ల్యాండ్ కు సంబంధించి ఈ గొడవ జరిగింది.. నిందితుడు ఒక్కడే ఈ దాడి హత్యలో పాల్గొన్నాడు.. నిందితుడు పేరు, వివరాలు తెలిశాయి. కానీ, విచారణ కారణంతో నిందితుడి వివరాలు వెల్లడి చేయడం లేదన్నారు.. ఇద్దరు ఏసీపీలను, 10 బృందాలను ఏర్పాటు చేశాం.. కేస్ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. నిందితుడు ఒక బ్యాంక్ లోన్ వ్యవహారంలో డిఫాల్టర్ గా ఉన్నాడని గుర్తించాం.. పూర్తి వివరాలు నిందితుడు పట్టుబడ్డాక తెలియజేస్తాం అని తెలిపారు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్.. ఇంకా సీపీ మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిన్ చేయండి..
మీరు కృష్ణుడు.. నేను అర్జునుడు.. నా పథకాలు అస్త్రాలు..
మీరు కృష్ణుడు అయితే.. నేను అర్జనుడిలా పోరాటం చేస్తాను అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలో ఆయన మాట్లాడుతూ హాట్ కామెంట్లు చేశారు.. వేదిక పై ఉన్న మూడు జిల్లాల నాయకులను పేరుపేరునా పలకరించిన జగన్.. వాక్ వే పై నడిచి కార్యకర్తలు కు అభివాదం చేశారు.. సిద్ధమా.. అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. మరో చారిత్రాత్మక విజయానికి సిద్ధమా..? పేదల భవిష్యత్తుని, పేదలను కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి సిద్ధమా? అంటూ సభలో ఉన్న కార్యకర్తలను ప్రశ్నించి సమాధానం రాబట్టారు.. ఇక, రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అంతా మన రాష్ట్రంలో ఉన్నారు.. దత్తపుత్రుడు, ఇతర పార్టీల్లో ఉన్న కోవర్టులు అంతా ఏకం అవుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక, ఈ సీన్ చూస్తే జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు..? అని ప్రశ్నించిన ఆయన.. నిజమేమిటో అంటే కనిపిస్తున్నది నిజం, లక్షల హృదయాల్లో ఉన్నాడు అనేది నిజం.. జగన్ ఏ నాడు ఒంటరి కాదన్నారు. నాకు ఉన్న తోడు, నా దైర్యం, నా బలం పైనున్న దేవుడు, ఎదురుగా ఉన్న జనమే అన్నారు జగన్. నిజమైన నాయకుడు అంటే ఎంత ప్రేమ ఉంటుందో ఇక్కడ చూస్తే అర్దం అవుతుందన్నారు జగన్.. చరిత్రలో ఎప్పుడు లేని అభివృద్ధితో 175 కి 175 , 25 ఎంపీలకు 25 స్థానాలను గెలవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే మీ అందరితో నా మనసు పంచుకుంటున్నా.. ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన మంచి పనుల గురించి అడగండి.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మీ ఇంటికి, మీ ఊరికి, మీ సామాజిక వర్గానికి ఏం చేశాడు అని అడగండి.. అదే ప్రతి పేద కుటుంబాన్ని అడగండి గత పదేళ్లలో వారి బ్యాంకు అకౌంట్ వివరాలను చూడమని చెప్పండి.. జగన్ పాలనలో జరిగిన మంచి ఎంటి అమలు చేసిన స్కీములు బట్టి తెలుస్తుంది.. ఒక్క రూపాయి అయిన చంద్రబాబు అక్కచెల్లెళ్ళ ఖాతాలో వేశారా అని అడగండి.. 57 నెలలు మీ బిడ్డ పాలనలో ఏం చేశాడో ప్రతి ఇంట్లో వివరించండి అని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత.
బీఆర్‌ఎస్‌కు తాటికొండ రాజయ్య రాజీనామా..
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య శనివారం పార్టీకి రాజీనామా సమర్పించారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాజయ్య, పార్టీ అధిష్టానం నుండి స్పందన లేకపోవడం పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి కారణమని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బీఆర్‌ఎస్ అధినేత వైదొలగడం ఆ పార్టీకి చుక్కెదురైంది. ఈ పరిణామం పార్టీ ఎన్నికల సన్నద్ధతపైనా, మున్ముందు జరగబోయే ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపైనా చెప్పుకోదగ్గ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తితో స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే వైదొలిగారు. పార్టీ తనను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నందున ఆయన అసంతృప్తితో ఉన్నారు. అయితే.. ఈ మేరకు శనివారం రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. బీఆర్‌ఎస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి చేస్తున్న రాజీనామాను ఆమోదించాలని కోరారు. త్వరలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని, ఇప్పటికే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించడానికే సీఎంను కలిశామని వీరు చెపుతున్నప్పటికీ.. వీరి కలయిక పలు అనుమానాలకు తావిస్తోంది.
చిరంజీవిని సత్కరించనున్న తెలంగాణ సీఎం
ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందుగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ అంతా ఇప్పుడు పెద్దగా భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయనతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన వెంకయ్య నాయుడుకు సైతం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలువురు సినీ-రాజకీయ రంగాలకు చెందిన వారు ఇరువురిని కలిసి వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేసి సత్కరించి తమ శుభాకాంక్షలు తెలియజేసి వచ్చారు. ఇక ఇప్పుడు వీరిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించడానికి రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో పద్మ అవార్డులు అందుకోబోతున్న అందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించబోతోంది. పద్మ విభూషణ్ గ్రహీతలు వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి సహా తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులను అందుకోబోతున్న మరో ఆరుగురు పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించబోతోంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరందరినీ స్వయంగా సత్కరించబోతున్నారు. ఇక ఏటా గణతంత్ర దినోత్సవం నాడు పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తారు. కళ, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, వైద్యం, ప్రజాసేవ, విజ్ఞానశాస్త్రం, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలు అందిస్తారు.
కవిత నిజామాబాద్‌లో పోటీ చేసి గెలవాలి.. కొండ సురేఖ సవాల్
హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ లో పలు అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు దేవాదాయ,పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆమెతో పాటు వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సవాల్ విసిరారు. మళ్ళీ నిజామాబాద్ లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు కొండా సురేఖ. నిన్న కవిత మాట్లాడుతూ ప్రభుత్వం పై చాలా మాటలు మాట్లాడారని, ఇంద్రవెల్లి సభ పై కవిత ప్రభుత్వం డబ్బులు వినియోగించారాని మాట్లాడుతుందన్నారు కొండా సురేఖ. మలిదశ ఉద్యమకారులకు ఏమి చేస్తారు అని మాట్లాడుతుందని, ప్రియాంక గాంధీ తో రెండు గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారు అని అంటుందన్నారు. హిమన్ష్ ఏ హోదా తో రాములవారికి పట్టు వస్త్రలు సమర్పించారని, గతంలో అమెరికాలో అంట్లు తోముకునే మీరు మాట్లాడుతారా…? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ రాణి నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుతారంటూ ఆమె హెద్దెవ చేశారు. మమ్ములను విమర్శించే ముందు మీ విపులను చూసుకోవాలని, మమ్ములను విమర్శించే అర్హత మీకు లేదన్నారు కొండా సురేఖ. కవిత దమ్ముంటే నిజామాబాదు లో మళ్ళీ పోటీ చేసి గెలువాలని, జ్యోతి రావు పూలె మీద మాట్లాడుతుందన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలనుండి లేని ప్రేమ ఇప్పుడే వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యే లు కబ్జాలకు, రౌడీయిజం కే పరిమితం అయ్యారని, గతంలో ఎం పనులు జరిగినాయో ఎమ్మెల్యే నిధులులను కూడా వాడుకోలేక పోయారు, సిఎంఎఫ్, సీడీఫ్ ఫండ్ లను వాడుకోలేకపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్ పై సవతి తల్లి ప్రేమ చూపెట్టిందని, వరంగల్ ఎమ్మెల్యే 3కోట్ల నిధులు కూడా వాడుకోలేదన్నారు కొండా సురేఖ. వరంగల్ ను రెండో అతి పెద్ద సిటీగా తయారు చేస్తామని, వర్దన్నపేట లో నూతనంగా గ్రౌండ్ ను నిర్మిస్తామన్నారు. వరంగల్ బస్టాండ్ ను నూతనంగా నిర్మిస్తామని, ఆరు గ్యారెంటీ లు అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
పంజాబ్ గవర్నర్ షాకింగ్ నిర్ణయం
పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ (Banwarilal Purohit) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. 83 ఏళ్ల బన్వరీలాల్.. వ్యక్తిగత కారణాల చేత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాజీనామా లేఖను పంపించారు. పంజాబ్ గవర్నర్ (Punjab Governor) మరియు చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ అయిన బన్వరీలాల్ పురోహిత్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారమే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మరుసటి రోజే ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. బన్వరీలాల్‌కు ప్రస్తుతం 83 ఏళ్లు. వ్యక్తిగత కారణాలు మరియు కొన్ని ఇతర కట్టుబాట్లతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పురోహిత్ గతంలో తమిళనాడు, అసోం రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. అలాగే మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. రెండు సార్లు బీజేపీ నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు వెళ్లారు. ప్రస్తుతం పురోహిత్ సెప్టెంబర్ 9, 2021 నుంచి పంజాబ్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు.
హేమంత్ సోరెన్‌కు కోర్టులో ఊరట.. బలపరీక్షకు వచ్చేస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు (Hemant Soren) కోర్టులో ఊరట లభించింది. సోమవారం అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు హాజరయ్యేందుకు రాంచీ ప్రత్యేక కోర్టు హేమంత్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన శాసనసభలో జరిగే బలపరీక్షకు హాజరుకానున్నారు. శుక్రవారం చంపయ్ సోరెన్ (Champai Soren) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్.. చంపయ్‌తో ప్రమాణం చేయించారు. అనంతరం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని 10 రోజులు చంపయ్‌కు గవర్నర్ గడువు ఇచ్చారు. కానీ అంతకంటే ముందుగానే ఈ కార్యక్రమం ముగించేయాలని చంపయ్ సోరెన్ సిద్ధపడ్డారు. సోమవారం నుంచి రెండ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఫిబ్రవరి 5నే (సోమవారం) అసెంబ్లీలో బలపరీక్షకు సంకీర్ణ ప్రభుత్వం సిద్ధపడింది. ఇదిలా ఉంటే జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఉంచితేనే సేఫ్ అని భావించడంతో భాగ్యనగరానికి తరలించారు. సోమవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను తరలించనున్నారు. కూటమికి మొత్తం 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. బలపరీక్షలో ఓటు వేసేందుకు కోర్టు అనుమతి కోరగా.. తాజాగా న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
‘‘నాకు మాత్రమే కాదు, నా ఆదర్శాలకు గౌరవం’’.. భారతరత్నపై ఎల్‌కే అద్వానీ..
బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి ఈరోజు భారత ప్రభుత్వం అత్యున్నత అవార్డు భారతరత్నను ప్రదానం చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక వ్యక్తిగా నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, నా జీవితాంత నా శక్తి మేరకు సేవ చేయడానికి నేను ప్రయత్నించిన ఆదర్శాలు, సూత్రాలకు కూడా గౌరమని అన్నారు. 96 ఏళ్ల అద్వానీ తాను 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్‌లో చేరి సమయాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీ సిద్ధాంత గురువు ఆర్ఎస్ఎస్ అప్పగించిన ఏ పనిలోనైనా, నా ప్రియమైన దేశానికి అంకితభావంతో, నిస్వార్థంగా సేవ చేశానన్నారు. ‘‘ఇదం-నా-మమ’’ అనే నినాదం నా జీవితాన్ని ప్రేరేపించిందని, ఈ జీవితం నాది కాదు, నా జీవితం నా దేశం కోసమే అని ఎల్‌కే అద్వానీ సంస్కృత మంత్రం ద్వారా వెల్లడించారు. తనకు భారతరత్న ప్రదానం చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు నేను అత్యంత సన్నిహితంగా మెలిగిన ఇద్దరు వ్యక్తులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ మరియు భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి కృతజ్ఞతతో గుర్తుంచుకుంటానని అద్వానీ అన్నారు. పార్టీ కార్యకర్తలు, స్వయం సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఎల్‌కే అద్వానీకి భారతరత్న అవార్డును ప్రకటించారు. ఇది తన జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణం అని పేర్కొన్నారు.
ఆర్థిక పరిమితికి మించి భార్య కోరికలు కోరడం.. భర్తను మానసిక ఒత్తిడికి గురిచేయడమే..
భర్త ఆర్థిక పరిమితికి మించి కోరికలు, కలలని నెరవేర్చాలని భార్య ఒత్తిడి చేయడం నిరంతర అసంతృప్తికి కారణమవుతుందని, చివరకు వైవాహిక జీవితంలో సంతోషం, సామరస్యానికి భంగం కలుగుతుందని, ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్య క్రూరత్వం కారణంగా ఓ జంట విడాకుల కేసులో, విడాకులను సమర్థిస్తూ.. జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి ఆర్థిక పరిమితులను భార్య నిరంతరం గుర్తు చేయొద్దని, అవసరాలు, కోరికలకు మధ్య జాగ్రత్తగా నడుచుకోవాలని న్యాయమూర్తులు చెప్పారు. భార్య క్రూరత్వానికి సంబంధించి భర్తకు విడాకులు మంజూరు చేసిన కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ అతని భార్య హైకోర్టును ఆశ్రయించింది. అయితే, భార్య వేసిన పిటిషన్‌ని హైకోర్ట్ డివిజన్ బెంచ్ కొట్టిసింది. ‘‘ ఈ సంఘటన పెద్దగా హానికరమైనవి, చిన్నవిగా కనిపించినప్పటికీ.. కొంత కాలం తర్వాత అటువంటి ప్రవర్తన ఒక మానసిక ఒత్తిడికి దారి తీయెచ్చు. దీని వల్ల భార్యభర్తలు తమ వైవాహిక మనుగడ సాగించడం అసాధ్యం.’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. విడాకులను సమర్థించింది. భార్య ప్రవర్తన పట్ల భర్త చెప్పి విభిన్న సంఘటనలు, అతనితో విభేదాలు పరిష్కరించుకునే పరిపక్వత లేని భార్య ‘సర్దుబాటు లేని వైఖరి’ ఫలితంగా విడాకులకు దారి తీసిందని బెంచ్ పేర్కొంది. భార్య వైఖరి అతనికి ఆందోళన కలిగించడమే కాకుండా.. మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 (ఎ) (ii) ప్రకారం జంట విడాకులను బెంచ్ సమర్థించింది. సెక్షన్ 9 ప్రకారం ఒక ఏడాదితో దాంపత్య హక్కుల పునరుద్ధరణ జరగకపోతే వివాహ రద్దును ఏ పక్షం అయినా కోరవచ్చని చెప్పింది.
గాలోడు.. గోట్ తో హిట్ కొట్టేలానే ఉన్నాడు
సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం గోట్.. గ్రేటెస్ట్ ఆల్ ది టైమ్. ఇక ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ నేడు మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అయ్యో పాపం సారూ..ఎట్టా బుక్కయ్యారు. లారీ గుద్దిన ఆటోలా దెబ్బయ్యి పోయారు. అయ్యో పాపం సారూ.. ఇట్టా లాక్ అయ్యారు.. 3D లో చూస్తున్నారు హర్రర్ పిక్చరూ అంటూ సాగిన లిరిక్స్ ఎంతో క్యాచీగా ఉన్నాయి. ఇక వీడియోలో ఆ వీధిలో రౌడీగా అందరిని భయపెట్టే కుర్రాడు.. ఒక అమ్మాయి వలలో పడి ఆమె చెప్పినట్లు చేస్తున్నట్లు చూపించారు. దివ్యభారతి షాపింగ్ బ్యాగ్ లు మోయడం.. ఆమె చున్నీని ఉతకడం లాంటివి చూపించగా .. పక్కన ఆంటీలు వీడికి తిక్క కుదిరింది అన్నట్లు చూడడం ఆకట్టుకుంటుంది. ఇక అలా ఆ అమ్మాయి ప్రేమలో పడిన సుధీర్ ఎలా మారాడు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సురేష్ బనిశెట్టి అందించిన లిరిక్స్ కు లియోన్ జేమ్స్ సంగీతం చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది. ఇక సీన్ రోల్డాన్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. మొదటిసాంగ్ తోనే సినిమాపై హైప్ పెంచేశారు. ఈ ఒక్క సాంగ్ తో గాలోడు తరువాత సుధీర్ మరో హిట్ ని అందుకునేలా ఉన్నాడు. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
బిగ్ బాస్ హోస్ట్ సినిమాలకే దిక్కు లేదు.. కంటెస్టెంట్ సినిమాలు చూడాలంట..?
ఇండస్ట్రీ అంతకుముందులా లేదు. ఫ్యాన్స్ ఉన్నారు కానీ, అంతకుముందులా గుడ్డిగా థియేటర్స్ కు వెళ్లడం లేదు. సినిమా బాగోలేకపోయినా.. సూపర్ అని డప్పు కొట్టడం లేదు. కథ నచ్చితేనే ఎంకరేజ్ చేస్తున్నారు నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. స్టార్ హీరోలు, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు.. రియాలిటీ షోకు వెళ్ళినప్పుడు ఆదరించారు.. ఇవన్నీ ఈ కాలం జనరేషన్ లో కుదరడం లేదు. పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా.. కథ బావుంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. బిగ్ బాస్ కు వెళ్లి బిగా పేరు తెచ్చుకోని బయటకు వచ్చిన ఒక నటుడు .. హీరోగా సినిమా చేస్తే ప్రేక్షకులు ఎందుకు ఆదరించడం లేదని ప్రశ్నించాడు. అతడే సోహైల్. అతను నటించిన బూట్ కట్ బాలరాజూ సినిమా నేడు రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. దీంతో మొదటి షో అభిమానులతో చూసి బయటకు వచ్చిన సోహైల్ కెమెరా ముందు కంటనీరు పెట్టుకున్నాడు. “అరె.. కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమా ఇది! క్యూట్ సినిమా తీశావని కొందరు మెచ్చుకుంటున్నారు. నిజంగానే బూట్‌కట్ బాలరాజు బానే ఉంది కదా.. ఏం చేస్తున్నారు మరి? ఎప్పుడూ స్నేహితులతోనే కాదు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడండి. నా సినిమాకు వెళ్లండన్నా.. బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు నాకు మద్దతుగా వేల కామెంట్లు పెట్టారు కదా.. ఇప్పుడేమైందన్నా?” అంటూ ఏడ్చాడు. ఇక సోహైల్ ప్రవర్తనపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. సానుభూతి కావాలని డ్రామాలు చేయకు.. బిగ్ బాస్ వేరు, సినిమా వేరు.. ఇప్పుడు ప్రేక్షకులు అందరూ కథ నచ్చితేనే చూస్తారు. నువ్వేమి ఇంత అడగనవసరం లేదు. కథలో దమ్ముంటే ప్రేక్షకులు వాళ్ళే వస్తారు. బిగ్ బాస్ హోస్ట్ చేసిన అక్కినేని నాగార్జున తీసిన సినిమాలే కథ బాగోకపోతే ఎవరు చూడలేదు. ఆఫీసర్, ఘోస్ట్ వంటి సినిమా నాగ్ హోస్ట్ చేస్తున్నప్పుడు రిలీజ్ అయ్యాయి. వాటి రిజల్ట్స్ చూడలేదా.. ? నాని.. బిగ్ బాస్ చేసేటప్పుడు కూడా అతడి సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అది కనిపించలేదా.. ? బిగ్ బాస్ హోస్ట్ సినిమాలకే దిక్కు లేదు.. కంటెస్టెంట్ సినిమాలు చూడాలంట..?అని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా సక్సెస్ రావడానికి సమయం పడుతుంది.. ఓపిగ్గా చేసుకుంటూ పోవాలి. ఇలా ఎమోషనల్ అయితే ఏం వస్తుంది బ్రో అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
